|

అపర బృహస్పతి, అక్షర వాచస్పతి దాశరథి రంగాచార్య

అపర-బృహస్పతి,-అక్షర-వాచస్పతి-దాశరథి-రంగాచార్య లోలోపల సుత్తె కొడవలి పట్టి, పైనేమో తిరుమణికాపు పెట్టి, ఉట్టిపడే మట్టివాసన కొట్టే రచనతో తెలుగు భాషీయుల హృదయపీఠం తట్టిన అపర బృహస్పతి, అక్షర వాచస్పతి – దాశరథి రంగాచార్య.

గిన్నిస్‌బుక్‌ సంపాదకులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే – మూడు కావ్యేతిహాసాలను – శ్రీమద్రామాయణము, శ్రీమదాంధ్ర మహాభారతము, శ్రీమద్భాగవతము, నాలుగింటికి ఐదు వేదాలు – ఋగ్వేదము, కృష్ణ యజుర్వేదము, శుక్ల యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము ఒక్క చేతిమీదుగా సంస్కృతం నుంచి వ్యాఖ్యాన సహితంగా ప్రతికృతి చేసిన ఏకైక రచయిత దాశరథి రంగాచార్య కృషిని గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కించవసిందే. ఇదే జరిగితే గిన్నిస్‌బుక్‌ ప్రచురించినంత కాలం దాశరథి రంగాచార్య పేరు ఆ గ్రంథంలో ఉండి పోగలదు. ఆయనను ఎవరు మించిపోగలరు?

ఎందుచేతనంటే – ఒక్క రామాయణ మహా కావ్యాన్ని ఒక్క వాల్మీకి మహర్షి వ్రాశాడు. కాని వ్యాసప్రణీతమైన శ్రీమదాంధ్ర మహాభారతాన్ని ముగ్గురు మహాకవులు తెనిగించారు. వాస్తవానికి తొలు దొలుత నన్నయ్య భారతాన్ని అనువదించడానికి వెనుకాడాడు. దాన్ని పూర్తి చేయకుండానే కన్నుమూశాడు. తర్వాత తిక్కన్న భగవద్గీత వద్ద మడికట్టుకున్నాడు. ఎఱ్ఱాప్రగడ దాన్ని పూర్తి చేశాడు. శ్రీమద్భాగవతం పోతన వంతైంది. అయితే ఈ మూడు కావ్యేతిహాసాలను సరళమైన తెలుగు వచనంలోకి దాశరథి రంగాచార్య తెచ్చారు.

అంతేకాదు, ఆయన తెంగాణా జీవితానికి అద్దంపడుతూ అపూర్వమైన ‘చిల్లరదేవుళ్ళు’, ‘మోదుగుపూలు’, ‘జనపదం’ ‘రానున్నది ఏది నిజం’ లాంటి ఎన్నో నవలలు వ్రాసిన సృజనశీలి. పరకాయ ప్రవేశానికి అనువుగా, కళాత్మకంగా, ఉన్నదున్నట్టుగా ‘జీవనయానం’ ఆత్మకథ వ్రాసిన అపురూప రచయిత ఆయన.

ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో, లోగడ వరంగల్‌ జిల్లాలో ఉన్న చిన్నగూడూరులో 1928 ఆగస్టు 24వ తేదీన విద్వాన్‌ వెంకటాచార్య – శ్రీమతి వెంకటమ్మ దంపతులకు ముద్దుబిడ్డగా ఈయన జన్మించారు. వీరి అన్నగారే నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కవితాఖడ్గం ధరించి తిమిరంతో సమరం జరిపిన మహాకవి – దాశరథి కృష్ణమాచార్యులు.

అన్నలాగే ఈ చిన్నారి రంగాచార్య ఆరవ తరగతి చదువుతున్నప్పుడే తోటి విద్యార్థులను కూడగట్టి నిజాంకు వ్యతిరేకంగా సమ్మె చేశారు. నిజాం రాజ్యం ఆచంద్రార్కం నిలిచి ఉండాలని పాఠశాలల్లో చేసే ప్రార్థన, తాను చేయడానికి రంగాచార్య నిరాకరించి, నిబంధన మేరకు వారి లాగే కుచ్చు రూమీ టోపీ ధరించడానికి తిరస్కరించి బడి నుండి బర్తరఫ్‌ అయ్యారు. ఎక్కడా ఈయన చేరకుండా నిజాం ప్రభుత్వం ఫర్మానా జారీ చేసింది.

ఇలా పాఠశాల చదువు అర్థాంతరంగా ఆగిపోవడంతో తన చుట్టూ ఉన్న జనజీవితం చదవడం ఆరంభించారు. తెలంగాణ ప్రాంతంలోని దొరలు, వారి గడీలు, ఆ గడీలలో ఆడపాపల దుర్భర జీవితాలు చూసి రంగాచార్య చలించిపోయారు. 17 సంవత్సరాల వయస్సు వచ్చే సరికి కట్టలు తెంచుకున్న ఉద్రేకంతో నిజాం వ్యతిరేక పోరాటాల కెరటాలపై తేలిపోయి వచ్చి (తుపానులా) అభ్యుదయ సాహిత్య తీరంలో తన ఉనికిని ప్రదర్శించాడు. పోలీసు నిర్బంధం, చిత్రహింసల నుంచి తప్పించుకుని అజ్ఞాతంలోకి వెళ్ళి నిజాం వ్యతిరేక పోరాటం క్రియాశీలంగా జరిపారు. తర్వాత నిజాం ప్రభుత్వం వారంటు జారీ చేసినా, రంగాచార్య జాడ కనుక్కోలేకపోయింది.

1948లో పోలీసుచర్యతో రంగాచార్య మనసు కుదుటపడింది. ఇక చదువు ఆపకూడదని స్వయంకృషితో విద్యాభ్యాసం చేసి పట్టా పొందారు. కొంత కాలం అధ్యాపకుడుగా, ఆ తర్వాత సికిందరాబాద్‌ నగర పాలక సంస్థలో సహాయ కమీషనర్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. ఆయన వృత్తిరీత్యా ఎక్కడ ఏ పనిచేసినా ప్రవృత్తిరీత్యా రచయితగా తనదైన మార్గంలో పురోగమించి సత్తా చూపించారు. వీరు కేవలం నవలా రచయిత, అనుసృజనశీలి, జీవితచరిత్రకారుడు మాత్రమే కాదు. తెలుగు, సంస్కృతం, ద్రావిడం, హిందీ, ఉర్దూ, ఇంగ్లీషు భాషలలో గొప్ప పండితుడు, కవి, విమర్శకుడు, నాటకకర్త. వీటన్నింటిని మించి మహావక్త. ఏ అంశాన్నైనా అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టు చెప్పగలిగిన వ్యాఖ్యాత. వీరి వచన రచనలు చదువుతుంటే చలనచిత్రం చూస్తున్న అనుభూతి కలుగుతుంది.

వేదాలను భారతీయ భాషన్నింటిలోకి అనువదించడానికి ఒక బృహత్‌ సంస్థను ఏర్పాటు చేసి, దానికి అవసరమైన కొన్ని కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించాలనే అభిప్రాయాన్ని దాశరథి రంగాచార్య పలుమార్లు వ్యక్తం చేసేవారు. ఇలాంటి కార్యాన్ని ఒక విశ్వవిద్యాలయం, ఒక ట్రస్టు, లేదా ఒక ఆలయ సంస్థ అయినా చేయాలనీ, తనలాగా ఇతర భాషలో ఎవ్వరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వేదాలను ఇతర భాషల్లోకి దిగ్విజయంగా అనువదించలేరనేవారు. ఎందుచేతనంటే – వేదాలకు, ఇతిహాసాలకు ప్రతికృతులు రచిస్తున్నప్పుడు ఎందరో తన శ్రేయోభిలాషులు ఆ పని తగదన్నారు. ఈ గ్రంథాల రచన ప్రారంభించిన వారెవ్వరూ ఎక్కువ కాలం బతకలేదనీ, మధ్యలోనే రచన అసంపూర్తిగా విడిచిపెట్టవలసిందిగా భయపెట్టేవారని, ఎన్నో ఉదాహరణలు ఇచ్చేవారు. కాని వారి మాటలే తనలో పట్టుదల పెంచాయనీ, పట్టువదలని విక్రమార్కునిలాగా పట్టిన కలం దించకుండా ఒకటి తర్వాత మరొక ఇతిహాసం పూర్తి చేశాననే వారు. చివరికి ఎందరో ఆయనను తిడుతూ కూడా లేఖలు వ్రాసేవారట. ఫోన్లు చేసేవారట. అయినా వారు వాటిని లెక్కపెట్టలేదని చెప్పేవారు. మధ్యలో ఈ రచన ఆపేసినా, రచన పూర్తి కాకుండా తాను తుది శ్వాస విడిచినా, ప్రజలలో వేదాల, ఇతిహాసాల ప్రతికృతులు చేయకూడదనే మూఢత్వం రూడీ అవుతుందనీ, ఇకముందు వాటి జోలికి ఎవ్వరూ వెళ్ళరనే పట్టుదలతో రోజుకు 18 గంటలు రంగాచార్య రచన చేశారు. తన ప్రణాళిక పూర్తి చేశారు.

వేదాలు, ఇతిహాసాల అనువాదం చేపట్టిన వారెవ్వరూ బతికిబట్టకట్టలేదనే కాకుండా, భారతదేశానికి సంబంధించినంత వరకు వేదాలు బ్రాహ్మణులే చదవాలనీ, వారిలోను స్త్రీలు చదవకూడదనే అపప్రథ ఉంది. అందుకని ఎవ్వరూ సాహసం చేయలేదు. ఈ నేపథ్యంలో వేదాలు సామాన్యుడికి సైతం అందించాలనే ఆలోచనతో ఈ బృహత్‌ కార్యాచరణకు రంగాచార్య శ్రీకారం చుట్టారు. అప్పటికి రంగాచార్య వయస్సు 70 సంవత్సరాలు. ఇంత విస్తృతసాహిత్యాన్ని సరళమైన తెలుగులోకి తేవడం, వాటి ముద్రణ, పంపిణీ, వ్యాప్తి కళ్ళారచూడడం రంగాచార్య చేసిన శ్రమఫలం, చేసుకున్న అదృష్టం. ఒక జీవితకాలంలో ఇంత చేసినవారు, ఎదిగినవారు మరొకరులేరు. ఇవ్వాళ్ళ పల్లెపట్టులోను సరళమైన తెలుగులో వేదాలు చదివిన వారు వాటి గురించి చర్చిస్తున్నారు. ఈ వేద ప్రతికృతి విడుదలైనప్పుడు – తొలిప్రతిని ఒక మహిళకు రంగాచార్య ప్రదానం చేసి తరతరాలుగా కరుడుకట్టిపోయిన దురాచారాన్ని ఛేదించారు.

వేదాలతోపాటు ఉపనిషత్తులు పదింటికి పది తెనిగించారు. వాటికి అమృత ఉపనిషత్తుని పేరు పెట్టారు. రుగ్వేదానికి రెండు బ్రాహ్మణాలు, రెండు అరణ్యకాలున్నాయి. ఇందులో ఒక బ్రాహ్మణం పూర్తి చేశారు. సాంఖ్యాయన బ్రాహ్మణం పూర్తి చేశారు. యజుర్వేదానికి, సామవేదానికి పది దాకా అరణ్యకాలు, బ్రాహ్మణాలున్నాయి. వాటిని ముట్టుకోకూడదని తొలుతనే నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఆవన్నీ చేయాంటే ఈ జీవితం చాలదనేవారు. వేదాల అనువాదం తృప్తిని మించిన ఆనందాన్నిచ్చిందనేవారు. తాను ఏ గడ్డలో పుట్టాడో దాని రుణం ఇలా తీర్చుకున్నారు.

అయినా కూడా జాతీయస్థాయి రచయితగా ఆయనను ‘చిల్లరదేవుళ్ళు’, ‘మోదుగుపూలు’ రంగాచార్యగానే గుర్తిస్తారు. ‘‘ప్రజలమనిషి’’ వట్టికోట ఆళ్వారుస్వామి, నిజాం పాలనలో అణగారిన తెలంగాణ సంస్కృతిని, చరిత్రను అక్షరబద్ధం చేయాలనే లక్ష్యంతో ప్రణాళిక వేసుకుని గొలుసు నవలు ప్రారంభించారు. దురదృష్టవశాత్తు రెండో నవల ‘‘గంగు’’ పూర్తి చేయకుండానే ఆయన కన్నుమూశారు. ఆయన సంకల్పం సిద్ధించి ఉంటే దాశరథి రంగాచార్య నవలా రచన చేపట్టి ఉండేవారు కాదు. కాని ఆయన వేసిన ప్రణాళిక వట్టిపోకుండా తెలంగాణ రుణం తీర్చుకోవడానికి, వట్టికోట వారి వారసత్వంగా ‘చిల్లరదేవుళ్ళు’ మొదలగు పది నవలలు రంగాచార్య వ్రాశారు.

అట్లా రంగాచార్య కావాలని నవలాకారుడయ్యాడు. తెలంగాణ జీవితాన్ని లోకానికి తెలియజెప్పాలనే చారిత్రక దృష్టితో, దృఢ సంక్పంతో, తెలంగాణ మీద అభిమానంతో, అందమైనశైలిలో రచనా వ్యాసంగాన్ని ఆయన సాగించారు. అందుకని నవలు ఎలా వ్రాయాలి? నవలలు ఎలా చదవాలి? అనే అంశంపైనే ఎన్నో గ్రంథాలు చదివారు. ఒక అవగాహనకు వచ్చాక, అట్లా బాగా సిద్ధమైన తర్వాతనే రచనకు ఉపక్రమించారు. అయితే ఆళ్వారుస్వామి కమ్యూనిస్టు కార్యకర్త. ఆయన రచనలో రంగాచార్య రచనల్లో కనిపించే కళ లేదు. ఇద్దరూ కమ్యూనిస్టులే అయినా రంగాచార్య రచనల్లో ఆయన దృశ్యంగా కన్పించారు. ఆళ్వారుస్వామి నేరుగా కమ్యూనిస్టుగానే ఆయన రచనల్లో సాక్షాత్కరిస్తారు. కమ్యూనిస్టు పోరాటానికి ప్రాముఖ్యత ఇచ్చారు.

రంగాచార్య రచనల్లో జీవితానికే ప్రాధాన్యత కన్పిస్తుంది. ఎవ్వరు ముట్టుకోని వస్తువును రంగాచార్య అక్షరబద్దం చేశారు. ఇంతవరకు గూడా మరెవ్వరూ ఆ పని చేయలేకపోయారు. తెలంగాణలో ఉన్న జవసత్వాలు ఇంకోచోట లేవు. ఇక్కడి జీవితం ప్రేమించదగింది. ‘చిల్లరదేవుళ్ళు’లో 1938కి పూర్వపు గ్రామీణ తెలంగాణ జీవితానికి రంగాచార్య అద్దం పట్టారు. అట్లా వ్రాసినందుకు ఆయన గర్వించేవారు. పైగా ఈ రచన తెలంగాణ వారికి మాత్రమే కాకుండా తెలుగు ప్రజలందరిని దృష్టిలో పెట్టుకుని అందరికీ చేరాలని వ్రాసినందున, వ్యవహారిక భాషలో రచన సాగుతూ పాత్రోచితంగా సంభాషణలు మాత్రం మధురమైన సొగసైన తెలంగాణ యాసలో వ్రాశారు. తెలంగాణ యాసను అపహాస్యం చేసిన పెద్దలకు ఈ రచన ఒక చెంపపెట్టు. ఇట్లాంటి రచనకు రంగాచార్య ఆద్యుడు కూడా. ఈ రచనకు 1971లో ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి అవార్డు ప్రదానం చేసింది.

రంగాచార్య లాంటి జీవితం చాలా తక్కువ మందికి ఉంటుంది. ఆయన జీవిత కథ ‘మోదుగుపూలు’లో ఉంటుంది. ఇది ఆయనకు ఎంతో ఇష్టమైన నవల. ఈ నవల ధారావాహికంగా ఒక వారపత్రికలో ప్రచురిస్తున్న తరుణంలోనే అందులోని పాత్రను కొందరు గుర్తించగలిగారు.

ఆ తర్వాత తెలంగాణ ప్రాంతంలో సామాజిక జీవన పరిస్థితులు, సంఘర్షణను, భాషను నమోదు చేస్తూ కళాత్మకంగా తీర్చి దిద్దిన నవల ‘‘జనపదం’’. ఇవి కాకుండా తెలంగాణ ప్రాంతంలో నానాటికి మారుతున్న పరిస్థితులను, ఆర్థిక, రాజకీయ తదితర కోణాల నుంచి చూపే వీరి నవలు  – రానున్నది ఏది నిజం? మాయజలతారు, పావని, శరతల్పం, మానవత లాంటివి.

ఇవి కాకుండా రంగాచార్య ఆత్మకథ – ‘జీవనయానం’ చదివి ప్రభావితులైన వారు కూడా ఎందరో ఉన్నారు. ధారావాహికంగా ఈ రచన ప్రచురణ జరుగుతున్నప్పుడే, వచ్చే వారం కోసం నిరీక్షించిన వారెందరో ఉన్నారు. ఇది చదువుతూ పాఠకులు ‘తమ కథ’గా చలించిపోయారు. ఇందులో రంగాచార్య జీవితాన్ని నగ్నంగా చెప్పారు. అందులో నిజాయితీ ఉంది. సంభ్రమం కలిగించే సంఘటనలు ఉన్నాయి. నవ్వు తెప్పించే సన్నివేశాలు ఉన్నాయి. ‘ఎక్స్‌పెరిమెంట్స్‌ విత్‌ ట్రూత్‌’లో మహాత్మాగాంధీ ఎంత నిజాయితీతో చెప్పారో  – ఆయన గురించి ఆయన తండ్రి గురించి అంత నిజాయితీతో చెప్పారు. రంగాచార్య నాయనగారి శిష్యులకు అది కోపం తెప్పించింది కూడా. ఇందులో కథ కంటే కథనానికి ప్రాధాన్యం ఇచ్చారు. తెలంగాణా జీవితంపై ఇలాంటి ఆత్మకథ ఇంతవరకు మరొకటి రాలేదు. దేశంలోని పుణ్యక్షేత్రాలన్నీ సందర్శించిన అనుభవంతో ‘యాత్రాచరిత్ర’ కూడా వ్రాశారు.

‘‘వామపక్ష ఆలోచనాధార ఉన్న మీరు కాల్పనిక సాహిత్య రచన ఒక వంక, ఆధ్యాత్మికపరమైన భాగవత రామాయణాలు, వేదాల అనువాదం మరోవంక చేశారు? ఈ రెండింటిని ఎలా సమన్వయించారని’’ అడిగితే – ఈ రెండింటికి పెద్ద తేడా కన్పించడం లేదనేవారు. మనిషి గురించి ఆలోచించేవాడికి తేడాలు లేవు. వాదాలను, వాదాలుగా చూసేటప్పుడు ఈ తేడాలు. వాదాలన్నీ కూడా మనిషి చుట్టే కదా తిరిగేవి! మనిషి గురించి ఆలోచించే తన నవలల్లో ఎక్కడా పార్టీ పేరుగానీ, జెండాగానీ ఉండవు. అప్పుడు జరిగిన చరిత్ర ఉంటుంది. కమ్యూనిస్టు పార్టీ గురించి ఎక్కడా వ్రాయలేదు. తనది ఒక వాదానికి సంబంధించిన సాహిత్యం కాదు. తన సాహిత్యం కేవలం జనానికి సంబంధించింది. అప్పుడు జనం వామపక్షాల వల్ల ప్రభావితులయ్యారు. అట్లాగే తాను ప్రభావితుణ్ణి అయ్యాననేవారు. తెలంగాణ జనజీవితానికి దర్పణం పడుతూ జనం కోసమే కళాత్మకమైన నవలలు వ్రాసినందుకు తనకెంతో సంతృప్తి ఉందనేవారు.

వేదాల గురించి ప్రస్తావన వస్తే – తాను వేదాలను అనువాదం చేయలేదు. హిందీ, ఉర్దూ, ఇంగ్లీషులో నుంచి ఎన్నో రచనల అనువాదాలు చేశాను. కాని వేదాల ప్రతికృతిని చేశాననేవారు. సంస్కృతంలో మాత్రం ఎంత అందంగా ఉంటుందో, తెలుగులోనూ అంత అందం తెచ్చే ప్రయత్నం చేశాననేవారు. మొత్తం పదిహేను వేల పుటల పైగా వ్రాశానంటే కనీసం ఏభైవేల పుటలైనా చదివాను. బతకడం నేర్పిన కమ్యూనిస్టు పార్టీ, చదవడం, అదీ విచక్షణ లేకుండా చదవడం నేర్పింది. అందుకే ఆయన గ్రంథాయంలో కార్ల్‌మార్క్స్స ప్రక్కన వేదం ఉంటుంది. కాపిటల్‌, భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌ – అన్నీ ఆయన అధ్యయనం చేశారు. మనిషిని మనిషిగా చూడాలనే తాపత్రయ పడ్డారు. ఈ జన్మేకాదు బహుశా గత జన్మ నుంచి వారు మనిషిని వెతుకుతున్నట్టున్నారు. ఎందుకంటే ఇంకో నెలరోజులకు తన 87వ యేట 2015 జూన్‌ 8వ తేదీన తనువు చాలిస్తారనగా, మంచంలో పడుకుని కూడా, మనిషి కోసం వెతకడమే తన లక్ష్యమన్నారు. తాను ‘చిల్లరదేవుళ్ళు’, ‘మోదుగుపూలు’ తదితర పీరియాడికల్‌ నవలలు వ్రాసి నిజాలు చెప్పి ఉండకపోతే నరహంతకులను, చిల్లరదేవుళ్ళను నెత్తిన పెట్టుకునేవారు. చరిత్ర హీనులకు పెద్దపీట వేయకూడదనే కాల్పనిక సాహిత్యం ద్వారానైనా నిప్పులాంటి నిజాలనే వ్రాశానన్నారు.

మరింత అసాధారణమైన రచనలు చేసినా అవార్డుల విషయంలో వెనకబడిపోయారంటే, తానేనాడు అవార్డు కోసం, ఏదో కోరి సాహిత్య రచన చేయలేదన్నారు. ప్రభుత్వం ఇతర సంస్థలు గుర్తించక పోయినా ఉక్రోషం లేదు. జనం కోసం వ్రాశాను. అది జన హృదయపీఠం అలంకరించింది. అదే తనకు కొండంత బలాన్ని ఇచ్చింది. ఆత్మానందాన్ని కలిగించింది అనేవారు.

కేంద్ర ప్రభుత్వం ఫెలోషిప్‌ ఇస్తే – వారి కోసం ‘మృత్యోర్మా అమృతం గమయ’ నవల వ్రాశారు. లోగడ ఎప్పుడో కాళిదాసు ‘శాకుంతలం’ అనువాదం చేశారు. కాని, దానికి చక్కని వ్యాఖ్యానం వ్రాయాలని ఉందనేవారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా జరిగిన పరిణామాలను ‘సంహిత’గా లేదా ‘ఇతిహాసం’గా వ్రాయాలనుంది, కాని ఆరోగ్యం సహకరించడం లేదనేవారు.

సజీవమైన పాత్రతో తెలంగాణ జీవితాన్ని మానవతా వాదానికి తన కాల్పనిక సాహిత్యంలో కళాత్మక రీతిలో చోటిచ్చిన దాశరథి రంగాచార్య నిజంగానే మరొక మాక్సింగోర్కి.