యాదాద్రి ఆరంభానికి సుముహూర్తం
మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ స్వస్తిశ్రీ ప్లవనామ సంవత్సర ఫాల్గుణ బహుళ ఏకాదశి సోమవారం శ్రవణా నక్షత్రయుక్త మిధున లగ్నంలో…

తెలంగాణ ప్రజలతోపాటు, దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శ్రీ లక్ష్మీనారసింహుని దివ్య క్షేత్రం యాదాద్రి అన్నిహంగులను పూర్తిచేసుకొని భక్తుల దర్శనానికి సిద్ధమైంది. యాదాద్రి మహాకుంభ సంప్రోక్షణకు ముహూర్తం ఖరారయింది. వచ్చే ఏడాది మార్చి 28న ఈ మహాకుంభ సంప్రోక్షణకు త్రిదండి చినజీయర్ స్వామి ముహూర్తం ఖరారు చేసినట్టు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు స్వయంగా యాదాద్రిపై స్వామి సన్నిధిలో ప్రకటించారు. ఆలయ పునర్నిర్మాణం జరిగినందున మహాకుంభ సంప్రోక్షణకు ఎనిమిది రోజుల ముందు మార్చి 21న 1008 కుండాలతో మహాసుదర్శన యాగం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా గల వివిధ పీఠాధిపతులను, విదేశాలలో ఉన్న పండితులను సయితం ఆహ్వానించనున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు.
యాదాద్రి ఆలయ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి కె.సి.ఆర్ అడుగడుగునా నిశితంగా పరిశీలించి, పలు సూచనలను చేశారు. అనంతరం మీడియావారితో మాట్లాడుతూ, మహాకుంభ సంప్రోక్షణ, తదితర కార్యక్రమాల వివరాలను వెల్లడించారు.
విమాన గోపురానికి స్వర్ణతాపడం
యాదాద్రి గర్భాలయ విమాన గోపురానికి అద్భుతంగా బంగారు తాపడం చేయిస్తున్నామని, ఇందుకు 125 కిలోల బంగారం అవసరమని అంచనా వేసినట్టు ముఖ్యమంత్రి తెలిపారు. ఈ బంగారం సమకూర్చడం ప్రభుత్వానికి పెద్ద సమస్యకాదని, కానీ, ఈ ధర్మకార్యంలో ప్రజలను కూడా భాగస్వాములను చేయాలని భావిస్తున్నామని, వారినుంచి కూడా విరాళాలు స్వీకరిస్తామని ఆయన చెప్పారు. ప్రతి గ్రామాన్ని, ప్రతి నియోజకవర్గాన్ని భాగస్వాములను చేస్తామని, ఇందుకు తమ కుటుంబం నుంచి ముందుగా ఒక కిలో 16 తులాల బంగారం విరాళంగా అందచేయనున్నట్టు ముఖ్యమంత్రి కె.సి.ఆర్ ప్రకటించారు. సీ.ఎం స్ఫూర్తితో ఈ సందర్భంగా అనేక మంది దాతలు భూరి విరాళాలను అందించేందుకు ముందుకు వస్తున్నారు.
యాదాద్రిలో అద్భుతమైన కట్టడాలు ఎన్నో రానున్నాయని, లక్షల సంఖ్యలో భక్తులు విశేషంగా తరలి వస్తారని, దీనికి తగినట్టుగా ఇక్కడ డ్రైనేజి వ్యవస్థకూడా అవసరమని ముఖ్యమంత్రి చెప్పారు. జలమండలి అధికారులు త్వరలో వచ్చి పరిశీలిస్తారని, ఇక్కడ రెండు రకాల అండర్ డ్రైనేజీ వ్యవస్థలు అవసరమని ముఖ్యమంత్రి చెప్పారు.
యాదాద్రి సమీపంలోని బస్వాపూర్ రిజర్వాయర్ ప్రాంతాన్ని అంతర్జాతీయ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని సీ.ఎం చెప్పారు. రిజర్వాయర్ వద్ద 450 ఎకరాల భూమిని టూరిజం కార్పొరేషన్‌కు ఇవ్వబోతున్నామని, అక్కడ అద్భుతమైన అంతర్జాతీయ ప్రమాణాలతో, మైసూర్ బృందావన్ గార్డెన్ తరహాలో సౌందర్యభరితమైన పార్కులు, మ్యూజికల్ ఫౌంటెన్‌లు ఏర్పాటు చేయబోతున్నట్టు, ఈ ప్రాంతం సినిమా షూటింగ్‌లు జరిగే స్థాయికి ఎదగబోతున్నట్టు కె.సి.ఆర్ తెలిపారు. హైదరాబాద్ నగరానికి, శంషాబాద్ విమానాశ్రయానికి, ఔటర్ రింగ్ రోడ్డుకు దగ్గరలో ఉన్న ఈ ప్రాంతానికి ఎంతో భవిష్యత్తు ఉన్నదని ఆయన అన్నారు.
యాదాద్రి పుణ్యక్షేత్రం పునఃప్రారంభ ముహూర్తాన్ని చినజీయర్‌స్వామి ఖరారు చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు యాదాద్రిలో పర్యటించారు. దాదాపుగా పూర్తికావస్తున్న ఆలయ పునర్నిర్మాణ పనులను, ప్రధానాలయం, గర్భగుడిని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా పరిశీలించారు. సీఎం ఏరియల్ వ్యూ ద్వారా యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులతోపాటు, పరిసరాలన్నింటినీ పరిశీలించారు. యాదాద్రి క్షేత్రం టెంపుల్ సిటీ దగ్గర ఏర్పాటు చేసిన హెలీపాడ్ వద్దకు ముఖ్యమంత్రి చేరుకున్నారు. అక్కడ మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యే సునీతా మహేందర్ రెడ్డి, శాసన మండలి మాజీ ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి, కమిషనర్ ఆఫ్ పోలీస్ మహేశ్ భగవత్, యాదాద్రి ఆలయ ఈఓ గీత, వైటీడీఏ చైర్మన్ కిషన్ రావు, సీఎంఓ అధికారి భూపాల్ రెడ్డి, దేవదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్ తదితరులు సీఎంకు తులసి మొక్కలు అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వెంట మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త, ముఖ్యమంత్రి ప్రత్యేక అధికారి దేశపతి శ్రీనివాస్ ఉన్నారు.
అనంతరం కాన్వాయ్‌లో ఘాట్ రోడ్డు ద్వారా ముఖ్యమంత్రి నేరుగా కొండపై బాలాలయానికి చేరుకున్నారు. అక్కడ దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, వేదపండితులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. బాలాలయంలో ప్రత్యేక అర్చన చేసిన ముఖ్యమంత్రికి వేద పండితులు ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అక్కడి నుంచి ముఖ్యమంత్రి వీఐపీ ప్రవేశ ద్వారం నుంచి ప్రధాన దేవాలయానికి చేరుకున్నారు. పెంబర్తి కళాకారులు తయారుచేసిన ప్రధానాలయ ద్వారాలను సీఎం ప్రత్యేకంగా పరిశీలించారు. ప్రాంగణంలోని ఆలయ ప్రాకారం వెంట ఉన్న శిల్పాల ప్రత్యేకతలను వెంట ఉన్నవారికి వివరించారు. అడుగడుగునా వ్యూ పాయింట్ల వద్ద ఆగి, అక్కడి నుంచి కనిపించే అందమైన దృశ్యాలను సీఎం తిలకించారు. గండి చెరువు, పుష్కరిణి, కల్యాణ కట్ట, దీక్షాపరుల మంటపం, సత్యనారాయణ వ్రత మంటపం తదితర నిర్మాణాల విశేషాల గురించి అధికారులతో చర్చించారు. జలాశయాలను ప్రత్యేకంగా రూపొందించిన తీరును సీఎం సహచర మంత్రులతో పంచుకున్నారు.
ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డిని ముఖ్యమంత్రి అభినందిస్తూ.. ‘‘మీరు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఇంతటి ఉజ్వలమైన దేవాలయం నిర్మించడం వల్ల సునీతమ్మా నీ జన్మ ధన్యమైంది’’ అని ప్రత్యేకంగా అభినందించారు.
అనంతరం వేంచేపు మంటపం వద్ద కొద్దిసేపు ఆగి పరిశీలించిన ముఖ్యమంత్రి ప్రధాన దేవాలయం గర్భాలయం వైపు చేరుకున్నారు. బంగారువర్ణంతో శంకు, చక్ర నామాలతో ఇండోర్‌లో తయారు చేయించిన క్యూలైన్లను, గర్భాలయ ద్వారాల బంగారు తాపడాలను సీఎం పరిశీలించారు. అక్కడ మంటపంలో ఏర్పాటు చేసిన నర్సింహస్వామి కల్యాణ ఘట్టాన్ని, చిత్రించిన తంజావూరు చిత్రపటాన్ని ప్రత్యేకంగా పరిశీలించారు. ఆలయ మంటపం చుట్టూ తాపడం చేసి ఉన్న ప్రహ్లాద చరిత్ర ఘట్టాల విశేషాలను మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులుతో పంచుకున్నారు. ఆల్వార్ మంటపం కలియ దిరుగుతూ, ఒక్కో శిల్పాన్ని సీఎం ప్రత్యేకంగా పరికించారు. ధ్వజస్థంభం ఏర్పాటు కానున్న వేదికను కూడా పరిశీ లించారు. పనుల పురోగతిని ఆలయ స్తపతి ఆనంద్ సాయి ముఖ్యమంత్రికి వివరించారు. తుది పనులపై సీఎం పలు సూచనలు చేశారు. క్యూ కాంప్లెక్స్, ఎస్కలేటర్స్, శివాలయం, విష్ణు పుష్కరిణితోపాటు, క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణాలను కూడా సీఎం పరిశీలించారు.
ఈ సమయంలో ఆలయ అర్చకులు తమకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని కోరగా, నిర్ణయం ఎప్పుడో తీసుకున్నాం కనుక, ఇక ఎంత మాత్రం ఆలస్యం చేయక, అర్చకులకు, ఆలయ ఉద్యోగులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని మంత్రి జగదీశ్ రెడ్డిని, కలెక్టర్ పమేలా సత్పతిని సీఎం ఆదేశించారు. అదేవిధంగా రింగురోడ్డు నిర్మాణ సమయంలో షాపింగ్ స్థలాలు కోల్పోయిన వారికి కల్యాణ కట్ట సమీపంలో ప్రతి ఒక్కరికీ వేయి స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణంలో ఉచితంగా షాపులు నిర్మించి ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తరతరాలుగా క్షేత్రాన్ని ఆశ్రయించి బతుకుతున్న వారి బతుకుదెరువుకు ఎటువంటి భంగపాటు రానివ్వద్దని హెచ్చరించారు.
అనంతరం, చినజీయర్ స్వామి స్వదస్తూరితో రాసి ఇచ్చిన ముహూర్త పత్రికను స్వామివారి పాదాల చెంత ఉంచాలని ఆలయ ఈఓ గీతకు ముఖ్యమంత్రి స్వయంగా అందించారు. ఆలయ ప్రధాన అర్చకులతో సీఎం మాట్లాడుతూ.. యాదాద్రిలో పదివేల మంది రుత్విక్కులతో సుదర్శన హోమం నిర్వహిస్తామని, జీయర్ స్వామి స్వయంగా పర్యవేక్షిస్తారని వివరించారు.
‘‘మీకు పీఆర్సీ వస్తుందా?’’ అని సీఎం ఆలయ ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. పీఆర్సీ వస్తుందని వారు సమాధానమివ్వడంతో సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం యాదాద్రిలోని రామలింగేశ్వరాలయంలో అభిషేక అర్చన చేసిన ముఖ్యమంత్రి, వివిఐపీ గెస్ట్ హౌజ్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, తదితర ప్రముఖులతో కలిసి భోజనం చేశారు.
యాదాద్రి పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సాయంత్రం కొండ కింద పూర్తయిన లక్ష్మీ పుష్కరిణి, కల్యాణ కట్ట, టెంపుల్ రింగ్ రోడ్ వెంట తిరుగుతూ, గిరి ప్రదక్షిణ మెట్ల దారి, గోపురం దగ్గర నిర్మాణాలను పరిశీలించారు. తుది పనులపై పలు మార్పులు సూచించారు. అనంతరం ఇంటిగ్రేటెడ్ టెంపుల్ సిటీ నిర్మాణ పనులను సీఎం పర్యవేక్షించారు. మొత్తంగా 250 ఎకరాల్లో విస్తరించి ఉండే ఈ టెంపుల్ సిటీలో 50 ఎకరాల్లో పచ్చదనం, మిగతా 200 ఎకరాల్లో 250 కాటేజీల నిర్మాణం జరుగుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. సుమారు 800 నుంచి 1000 గజాల విస్తీర్ణంలో నిర్మించే ఒక్కో కాటేజీలో మొత్తం 4 సూట్లు ఉంటాయన్నారు. దాతల నుంచి విరాళాలు సేకరించిన ధనంతో వైటీడీఏ ఈ కాటేజీలను నిర్మిస్తుందన్నారు. దాతలు సూచించిన పేరును ఆ కాటేజీకి పెట్టుకోవచ్చన్నారు. మొత్తంగా దాదాపు వెయ్యి కుటుంబాలు బస చేసే ఈ సూట్లలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కాటేజీలకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సరిపడా నీళ్లు, నిరంతర విద్యుత్తు, అన్నిరకాల వసతులు, హంగులు సమకూర్చాలని సీఎం ఆదేశించారు. యాదాద్రి పవిత్రతను కాపాడటానికి అందరూ సహకరించాలని, టెంపుల్ సిటీ పరిధిలో మద్యపానం, ధూమపానం నిషేదాన్ని కఠినతరంగా అమలు చేయాలని ఆదేశించారు. ఇక్కడ కేవలం శాఖాహారాన్ని మాత్రమే అనుమతించాలని సీఎం సూచించారు.
యాదాద్రిలో ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ముఖ్యమంత్రులు, గవర్నర్లు వంటి వీవీఐపీలు బస చేయడానికి ప్రత్యేకంగా నిర్మించిన ప్రెసిడెన్షియల్ సూట్లను సీఎం పరిశీలించారు. వీక్షకుల లాంజ్ నుంచి.. బంగారు వర్ణంలో కాంతులీనుతున్న ఆలయ గోపురాలను ముఖ్యమంత్రి తాదాత్మ్యంతో తిలకించారు. ఆ సూట్ పై నుంచి చూస్తే.. విద్యుద్దీప కాంతులతో ధగధగ వెలిగి పోతున్న యాదాద్రి ఆలయాన్ని, నందనవనంలాగా కనిపిస్తున్న పచ్చదనం దృశ్యాలను చూసి.. సీఎంతో సహా వెంట ఉన్నవారందరూ పులకించిపోయారు. అక్కడి నుంచి మళ్లీ ఆలయం ప్రాకారం దగ్గరకు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి, లైటింగ్ ఏర్పాట్లను ప్రత్యేకంగా పరిశీలించారు. పలు సూచనలను చేశారు.