|

దయ్యంతో సోపతి

యాదికున్నకాడికి – తెలిదేవర భానుమూర్తి 

నడినాత్రి. అందరు నిద్రబోతున్నరు. కొందరు కలలు గంటున్నరు. గని నాకు గా అదృష్టం లేదు. గప్పుడు సైమం ఎంతయ్యిందో నాకెర్కలేదు. ఎట్లెర్కుంటది. గడియారం గినుంటె సైమం ఎంతయ్యిందో ఎర్కైతది. గాని నా తాన గడియారం లేదాయె. పైసలున్నోల్ల పోరగాల్ల తాన గడియారాలుంటయి. నేను బడిపంతులు కొడ్కునాయె.

నేను పండుకోలేదు. పండుకుందామనుకున్నా పండుకునేటట్లు లేదు. గట్లని నాకేం రోగం లేదు, నొప్పిలేదు. నిద్రవొస్తనే ఉన్నది. నిజం జెప్పాలంటె నిద్రలకేల్లే నేను లేసిన. గిర్ని సప్పుడుకు లేసిన. గది యాడికెల్లి వొస్తున్నదో నాకు సమజ్‌ గాలేదు. గా సప్పుడు ఎప్పుడొక తీర్గలేదు. ఒక పారి గాలిమోటర్‌ సప్పుడు తీర్గున్నది. ఇంకొక పారి గండు పిల్లులు కొట్లాడ్తున్న తీర్గ సైలెన్సర్‌ కరాబైన మోటర్‌సైకిల్‌ సప్పుడు లెక్క ఉన్నది. ఒక్క మాటల జెప్పాలంటె ‘ఏకం సప్పుడు అనేకం ఇనొచ్చుడు’. గా సప్పుడుకే నేను లేసి గూసున్న. నాకు బుగులైంది. బోన్గిరి గుట్టకు ఆన్కోని ఉన్న హన్మంతున్ని యాజ్జేసుకున్న.
‘గట్టుమీద ఆంజనేయ కరుణతోడ జూడు మయ్య
గట్టిగ నీ పాదములను బట్టినాను విడువబోను’
అని పాడుకుంట కట్క ఏసిన. కరెంటు బుగ్గ ఎల్గింది. చిన్నప్పుడు మా నాయినమ్మ జెప్పిన సంగతి యాదికొచ్చింది. ఒక పారి మా ఇంటికి మా మ్యానమామ వచ్చిండు. గాయిన ముస్లాయిన. గాయిన పక్కపొంటే నేను బన్న. గప్పుడు గాయిన తానికెల్లి గిదే తీర్గ గుర్రు సప్పుడినొచ్చింది. గా సప్పుడేందని మా నాయినమ్మను అడ్గిన. మీ మ్యానమామకు గుర్రుదయ్యం బట్టింది అని గామె నాకు జెప్పింది. గామె జెప్పిన ముచ్చట నా దమాక్ల మంచిగా గూసున్నది.
‘వామ్మో గీ అర్రల గుర్రు దయ్యమున్నట్టు గొడ్తున్నది. యాడికన్న ఉర్కుదామంటె గీ పట్నంల ఏ తొవ్వ యాడికి బోతదో ఎర్కలేదాయె. ఏం జెయ్యాలె? ముందుగాల గీన్నైతె లేవగొడ్త’ అని అనుకోని ‘‘వారీ లెవ్వురా!’’ అన్కుంట ప్రమోద్‌గాని లెవ్వగొట్టిన.

‘‘ఏమైందిరా? నువ్వింక పండలేదా? అమ్మ నాయినలను ఇడ్సి ఉండబుద్దయితలేదా?’’ అని ఆవులిచ్చుకుంట గాడు అడిగిండు.

‘‘యాడికెల్లో గుర్రుగుర్రుమని సప్పుడొస్తున్నదిరా’’ అని అంటె ‘‘గుర్రులేదు. బర్రులేదు. సప్పుడు జెయ్యకుంట పండుకో’’ అని గాడు వన్నడు. నేను గూడ పండుకునే తందుకు కోషిస్‌ జేసిన. జెరసేపైనంక మల్ల గుర్రు సప్పుడినొచ్చింది. పట్టిపట్టి జూస్తె ప్రమోద్‌గాని తానికెల్లి వొస్తున్నదని ఎర్కైంది. గీ అర్రల దయ్యమున్నది. గది గీన్ని బట్టుకున్నది. దయ్యం పెయ్యిమీద్కిరాంగానే గీడు గుర్రు గుర్రు మంటున్నడు. అని అనుకున్న. పండుకున్నోడినే గుర్రుదయ్యం బడ్తదని మా నాయినమ్మ జెప్పి నిండె. మా వూర్లె శానమంది దయ్యం కతలు జెప్పెటోల్లు. చెరువు కట్టకు దగ్గర్ల ఉన్న మఱ్ఱిచెట్టును, దయ్యాల మఱ్ఱి చెట్టనెటోల్లు. మాయలమంత్రాల కతలు సదివెటోన్ని. విఠలాచార్య సైన్మలు ఇడ్వకుంట సూసెటోన్ని. దేవుని లెక్కనే దయ్యాలు గూడ ఉన్నయని నమ్మెటోన్ని.
గా రాత్రి నేను నిద్రపోలేదు. గుర్రుదయ్యం జెయ్యబట్కె వారం దినాలు నిద్రనాకు దూరమైంది. దీపంతల సమురు గుంజిన తీర్గ గా దయ్యం నా నిద్రను గుంజింది. ప్రమోద్‌ గాడైతె ఎప్పటిలెక్కనే ఉన్నడు. నేను బువ్వ వొండితె గాడు శాకమొండుతున్నడు. నేను శాకమొండితె గాడు బువ్వొండుతున్నడు. ఎప్పటి తీర్గ కాలేజీకి బోయొస్తనే ఉన్నం. గని నా కండ్లు ఎర్రగైనయి. ఎర్రగవుడే గాకుంట మండబట్టినయి. నాకు బేచైన్గున్నది. ఎవ్వరేం జెప్పినా ఏం సమజైతలేదు. ఏందిరా గట్లున్నవని ఎవ్వరడిగినా ఎరుగని వూర్లె మొర్గని కుక్క తీర్గనే ఉన్న. గని ఎన్ని దినాలు గట్ల ఉంట. ఒక దినం నాకు వశం గాలే.
దయ్యం మంత్రగానికి బుగులు వడ్తది. గాడు మంత్రం సదివి తాయిత్తు గిన గడ్తె దయ్యం పరారైతది. ‘చంబల్‌ కా దేవతాకో చప్పల్‌కా పూజా’ అని పెద్దోల్లు ఊకెనే అన్లేదు. ఎవ్వరన్న మంత్రగాని తాన్కి బోవాలె. సంగతంత జెప్పాలె. ఒక తాయిత్తు దేవాలె.దయ్యంతో-సశాపతి--3

“పట్నంల నాకు ఎవ్వరెర్కలేదు. ఏం జేస్తె బాగుంటదని సోంచాయించిన. దమాక్‌ లడాయించంగ మావూరి మాదారం పటేల్‌ నాకు యాదికొచ్చిండు. గాయిన మా ఇలాకల మషూర్‌ మంత్రగాడు. ఎసువంటి దయ్యమైన గాయిన పేరు జెప్తెనే పరారైతదని అంటుంటరు. దయ్యం బట్టినోల్ల నెత్తిమీద ఎంటిక ఇస్తె సాలు. గా దాన్ని జూసే గాయిన తాయిత్తు ఇస్తడు.”
దినాం మా వూరికెల్లి పనులమీద శానమంది రేల్‌గాడిల పట్నమొస్తుంటరు. మా కాలేజీల సద్వేటి కొంతమంది పోరగాల్లు గూడ రేల్‌గాడిలనే వొచ్చి పోతుంటరు. బి.ఎ. సద్వేటి కేశవచారి గూడ గా తీర్గనే వొస్తుంటడు. మోక జూసి నేను పమ్రోద్‌ గాని నెత్తిమీద ఎంటిక బీకిన. గా దాన్ని ఒక కాయిదంల బెట్టి పొట్లం గట్టిన. గా పొట్లంను కేశవచారికిచ్చిన. మా పక్కింటి పోరగానికి దయ్యంబట్టిందని గది గుర్రుదయ్యమని జెప్పిన. మాదారం పటేల్‌ తాన్కిబోయి తాయిత్తు దెమ్మని గానికి ఒక్క తీర్గ జెప్పిన. సిన్మాలు జూసెతందుకు నేను దాసిబెట్టుకున్న పదిరూపాలు కేశవచారి గాన్కి ఇచ్చిన.
రొండు దినాలైనంక మాదారం పటేల్‌ తానికెల్లి దెచ్చిన తాయిత్తును గాడు నాకిచ్చిండు. ప్రమోద్‌గాడు పండుకున్నప్పుడు గాని దండకు తాయిత్తును గట్టిన. గుర్రు సప్పుడు జెర తక్వైనట్లనిపిచ్చింది. పొద్దుగాల లేసినంక
‘‘గిదెవరు గట్టిండ్రా’’ అని ప్రమోద్‌గాడు అడిగిండు.
‘‘నేనే గట్టినరా! గీదాన్ని గట్టుకుంటె సదువు బాగొస్తదట’’ అని అంటె`
‘‘నువ్వెందుకు గట్టుకోలేదురా?’’ అని గాడు అడిగిండు.
‘‘నా మొల్దారంకు గట్టుకున్నరా’’ అని జెప్పిన.
నేనట్ల జెప్పంగానే గాడు గూడ దండకున్న తాయిత్తును దీసి మొల్దారంకు గట్టుకుండు. గని గాడు పండుకున్నప్పుడు ఎప్పటితీర్గనే గుర్రుసప్పుడు వొస్తనే ఉన్నది. నాకిప్పుడు గుర్రు సప్పుడు లేకుంటె నిద్రొస్తలేదు.