దివ్వెల ఉత్సవం

ఆశ్వీజ మాసంలో వచ్చే మరో విశిష్టమైన పండుగ దీపావళి. ఇది ఐదు రోజుల పండుగగా కనిపిస్తుంది. ధన త్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి అమావాస్య, బలిపాడ్యమి, యమ ద్వితీయగా జరుపుకుంటారు. ఆశ్వీజ మాసంలో చివరగా, కార్తీక మాసంలో మొదటగా వచ్చే ఈ పండుగలను కూడా ఆనందంగా జరుపుకుంటారు భారతీయులు.

అయనం మార్పు ద్వారా భూమిపైకి నూతన వెలుగులు తెచ్చుకున్న విషయాన్ని గుర్తు చేసుకోవడం ఈ దీపావళి పండుగల ముఖ్య ఉద్దేశం.దీపావళి నుండి మొదలైన దీపోత్స వం ఒక మాసం చేస్తూ ఉంటాం. దీప దర్శనం వల్ల జీవితంలో వెలుగులు వస్తాయి. వెలుగువైపు జీవితాన్ని కొనసాగించాలనే భావన ఏర్పడటం వల్ల నూతన ఉత్సాహం వస్తుంది. తమసోమా జ్యోతిర్గమయ అనే భావనలోని అర్ధం అదే. చీకటి ఉన్న చోట దీపం పెట్టి ఆనందంగా ఉంటున్నట్లు, ప్రత్యక్షదైవమైన సూర్యుని వెలుగు, వేడిమి చుట్టూ మనసును కేంద్రీకరించడం వల్ల మనలో నెలకొన్న ఎన్నో దోషాలు, వ్యతిరేకతలు తొలగిపోతాయి. ఈ భూమి మీద కూడా క్రమంగా చలి వ్యాపనం అయ్యే సమయం, పగటి కాలం తగ్గే సమయం కావడం వల్ల దీపోత్సవాలు జరగాల్సిన అంశం భారతీయ వైజ్ఞానిక విధానానికి సంకేతం.

మన భూమి ప్రస్తుతం ధృవ నక్షత్రం ఆధారంగా తిరుగుతుంది. ఈ ధ్రువుడు ఎప్పుడూ ఈ భూమి ఉత్తర ధృవానికి ఆధారం కాదు. 26 వేల సంవత్సరాలకు ఒకసారి ఈ నక్షత్ర వ్యవహారాల్లో మార్పులు వస్తాయి. ఇవన్నీ పరిధ్రువ తారలు అవుతాయి. ప్రస్తుతం ఉన్న ధ్రువునిది జ్యోతిషపురం అయితే, ఇంతకు ముందు ఉన్న ధ్రువునిది ప్రాక్‌జ్యోతిషపురం అవుతుంది. కాలం గడుస్తున్నప్పుడు ఈ భూమి యొక్క వ్యవహారాల్లో మార్పులు వస్తుంటాయి. అయనాలు మారుతాయి, ఋతువులు కూడా మారుతుంటాయి. మన జీవన విధానాన్ని ఈ కాలానికి అనుకూలంగా మార్చుకుంటూ ఉండాల్సిందే. భూమి మరో పరిధ్రువతార ఎదురుగా మారినప్పుడు ఇంతకు ముందు ఉన్న తార వెనుకకు వెళ్తుంటుంది. అటువంటి తారనే నరకాసురుడు. అయనాల మార్పు అదితి కుండలాల అపహరణగా చూపించారు. ఋతువుల మార్పును వరుణుని ఛత్రాన్ని దొంగిలించినట్లు పురాణ కథనం. ప్రస్తుత ధ్రువతార, గత ధ్రవతారగా మారినప్పుడు ఆ మార్పు పొందుతున్న కాలంలో ప్రకృతిలోని ఇబ్బందిని రికార్డ్‌ చేసిన భారతీయ వైదిక, పురాణ సాహిత్యం వేరు వేరు కథలను మనకు అందించింది. నరకుని కథనం అంతా అటువంటిదే. జీవన విధానం ప్రకృతికి అనుగుణంగా ఉండాలని చెప్పే విధానమే నరక చతుర్దశి విధానం. అభ్యంగన స్నానాదులు, హారతులు, దీపాదుల ద్వారా చీకట్లలో వెలుగును నింపే ప్రయత్నం. శరీరాన్ని శుద్ధి చేసుకొని రోగనిరోధక శక్తిని పెంచుకునే భావన.

వెలుగును దైవంగా భావించిన సంస్కృతి భారతీయం. క్షీరసాగర మథనం నుండి పుట్టిన మహాలక్ష్మికి దీపావళి నాడు వెలుగు రూపంగా చేసే అర్చన కూడా ఈ కోవకే చెందుతుంది. వెలుగులు భూమి మీద తగ్గబోతున్న సమయంలో వెలుగు, జ్ఞాన రూపమైన లక్ష్మీ ఆరాధన, చీకటి, అజ్ఞాన రూపమైన అలక్ష్మీ నిస్సరణ దీపావళి ప్రత్యేకతలు. లక్ష్మీ రూప దీపోత్సవం ఈ రోజునుండే ప్రారంభం అవుతుంది. ఇంకా కేదార గౌరీ వ్రతాలన్నీ భూమికి చేసే అర్చనలే. భూదేవతా శక్తికి చేసే అర్చన, చెప్పే కృతజ్ఞతలీ వ్రతాలు. దీపావళి సందర్భంలోని అన్ని అంశాలు వెలుగుల చుట్టే తిరుగుతాయి. బలి పాడ్యమి, యమ ద్వితీయలు కూడా చీకటి ఈ భూమిని ఇబ్బంది పెట్టకుండా, ఈ శరీరాలపై వ్యతిరేకతలకు గురిచేయకుండా చేసే ప్రయత్నాలే.

ఈ విధంగా మన పండుగలు, దైవ పూజలు, అలంకారాల వెనుక అన్నీ వైజ్ఞానిక కోణాలే ఉంటాయి. వెతుక్కునే వారికి వెతుక్కున్నంత సమాచారం మన సాహిత్యంలోనూ, ఈ ప్రకృతిలోనూ దొరుకుతుంది. ఈ వైజ్ఞానిక భావనలు అర్ధం చేసుకుని ఇంకా ఇనుమడించిన భక్తి శ్రద్దలతో ఈ ప్రకృతి శక్తి స్వరూపాలకు నమస్కరిద్దాం. ఆనందమయ జీవనాన్ని పొందుదాం.