తెలంగాణ గ్రామ జీవిత చిత్రణ

ఒక మంచి రచనకు నిర్వచనం ఏమిటి? అన్న ప్రశ్నకు సమాధానం. కథ, కూర్పు సందేశం అని చెప్పుకోవచ్చును. నడుస్తున్నకాలం నుండి కథ ఎన్నుకోబడాలి. శ్రోత పాఠకుడికి ఉత్కంఠ కలిగిస్తూ ముందుకు సాగాలి. నలుగురు మెచ్చే సందేశం ఉండాలి. కవిత్వం, కథ, విమర్శ మరియు పరిశోధ నాత్మక వ్యాసాలు ప్రకటించిన యువ రచయిత నర్రా ప్రవీణ్‌రెడ్డికి ఇది తొలినవల. తెలంగాణ మలిదశ పోరాటం నాటి గ్రామాలు, మధ్య తరగతి మరియు అంతకంటే ఓ మెట్టు తక్కువ జీవితాలు, నాటి యువత స్వప్నాలు ` సాకారమైన వైనం ప్రకటిస్తుంది ఈ నవల.

తెలంగాణ భాష, యాస అన్నవి తెలుగేకాదని, నిరసించబడి నిర్లక్ష్యం చేయబడిన అర్థశతాబ్దాకాలం తరువాత 2014లో ‘వేరు తెలంగాణ’ ఏర్పడింది. సంకెలలు వదుల్చుకున్న తెలంగాణ తల్లి జూలు విదిల్చిన కంఠీరవమయింది. ఎందరో కవులు, కథకులు నవలా కారులు వ్యాసకర్తలు తమ ప్రజ్ఞా పాటవాలను ప్రపంచా నికి ప్రదర్శించారు. తెలంగాణ తనాన్ని పంచుతూ, ప్రేమ, ఉద్యమ కథాత్మకమైన నవల ‘‘పొత్తి’’ నవితాత్మక వచనం ప్రతీకలు పలుకుబడులు. సామెతలు, సందర్భో చిత జానపదుల పాటలు తెలంగాణ ప్రజల ‘ఆత్మ’నే చిత్రీకరించిన నవల ‘‘పొత్తి’’. గంగ, శంకర్‌లు ఈ నవలలోని ప్రధానపాత్రలు గంగ తల్లిదండ్రులు యాదమ్మ వీరయ్యలు. వ్యవసాయ కూలీలు కూతురుకు చదువుపై ఉన్న ఆసక్తిని గమనించి తమ సర్వశక్తులను పణంగాపెట్టి గంగను చదివిస్తారు. శంకర్‌, శారదమ్మ, మల్లారెడ్డిల సంతానం. మల్లారెడ్డి భూస్వామి, శంకర్‌ గంగలు యునివర్సిటీ చదువులో పరస్పరం పరిచయమవుతారు. ఆశలు, ఆకాంక్షలు ఒక్కటైన శంకర్‌ గంగలు ప్రేమించుకుంటారు. మొదట ప్రతి ఘటన ఎదురైనా చివరకు శంకర్‌ గంగలు ఒకటవుతారు.

పల్లె వాతావరణం యూనివర్సిటీ యువత, వేరు తెలంగాణ పోరాటం ముప్పేటలా కలిపి ముచ్చటగా అల్లబడిన కథ ‘పొత్తి’. భాషా సౌందర్యం మానవ సంబంధాలు, మనుషులనే కాదు, జంతవులను కూడా ప్రేమించటం సంఘంలోని దురాచారాలను నిరసించటం, చరిత్ర చిత్రణ ఈ వనలను ఆదర్శంగా నిలుపుతాయి. నవల అంతా తెలంగాణ యాసలో సాగుతుంది. పాత్ర మనః స్థితి ప్రకృతిలో వ్యక్తపరచటం, రచయిత యొక్క Deep Involvementను తెలుపుతుంది. పల్లెనుండి చదువుకు పట్నం పోతోన్న గంగను వర్ణిస్తూ, పల్లె గూటినుండి పావురం పట్నం తొవ్వకై ఎగిసిందట! పల్లెసిగ మీదున్న నెలవంక (గంగ) పట్నం భవంతులెనుక సూర్య బింబమై లేసిందట! (పే 82). వేర్వేరు సామాజిక స్థితిగల శంకర్‌ గంగల ప్రేమ ‘కులకంపను పల్లె పల్లె నా తొలగు తున్నట్లనిపిస్తున్నదట (పే 50). కథానాయిక గంగతల్లి యాదమ్మ (బర్రె) పేరు బంగారం యాదమ్మ దాన్నో గొడ్డులా చూడదు. బిడ్డలా గారాబం చేస్తుంది. ప్రేమతో మనిషిని తిట్టినట్లు తిడ్తుంది. ఈనే సమయాన అది పడే బాధకు యాదమ్మకు ఊపిరాడదు. ఈనినాక దిష్టి తగులకూడదని తోలు చెప్పు మెడకు కడుతుంది (పే.128). తెలంగాణ సామెతల సంపదకు రచయిత మనకందించిన తీరు ముచ్చట గొలుపుతుంది. అప్పులేని గంజి దొప్పెడైనా చాలు (పే.44) మెతుకుబోతే బతుకుబోతది (పే.64) మామిళ్ళు నరికి మోదుగులు నాటుడు, బెల్లమిసిరేసి శెయ్యి నాక్కున్నట్లు (పే.68). సమాజంలోని దురాచారాల పట్ల నిరసన ప్రకటన ఎంతో ఉదాత్తంగా ఉంది. శంకర్‌ సహధ్యాయి సూరి ద్వారా జోగిని వ్యవస్థపై రచయిత తన నిరసన వ్యక్తపరుస్తాడు.

సజీవభాష పలికించటం గమనిస్తే రచయితకున్న భాషా సంపదకు పాఠకులు ముగ్ధులవుతారు. తెలంగాణ అమరలవీరుల స్థూపం ‘నీలి మబ్బుల మధ్యన పూసిన సింగిడి స్థూపు సిగలో నెలవంకలా అతక్కు పొయ్యిందిట (పే.40). పల్లెల నుండి యూనివర్సిటీ  క్యాంపస్‌కు చేరిన విద్యార్థులు ‘వూళ్ళనుండి పట్నం చేరిన బతుకమ్మలన్నీ ఒక్కచోటికి చేరుకుని తళుక్కున మెరుస్తున్నాయట పల్లెచేతులు ఆర్ట్స్‌ కాలేజీ గుమ్మానికి సింగిడై పూసినయట! పే. 105). ఉద్యమ పోరాట కాలపు జీవితాన్ని అందంగా ఒడిసి పట్టుకున్న రచయిత నర్రా ప్రవీణ్‌రెడ్డికి ఇది తొలినవలగా తెలుస్తున్నది. అయినా ఎక్కడా ఆయన తడబడలేదు. తడుముకోలేదు. చేయితిరిగిన రచయితలా భాష, యాస కథ కల్పనల్ని వాస్తవాల్ని మన ముందుంచాడు. ఉద్యమం, ప్రేమ, కులనిరసన గ్రామంలోని దురాచారాలపై తన నిరసన ప్రకటిస్తూ, ఒక పాఠ్యపుస్తకంలా తీర్చిదిద్దటంలో ప్రావీణ్యం చూపగలిగాడు రచయిత. అంపశయ్య నవీన్‌ ఈ నవలకు ముందు మాట రాస్తూ ‘‘గ్రామీణ జీవితపు దిక్సూచి’’ అంటారు అవును. ఇది నూటికి నూరుపాళ్ళు నిజం! నవల చివర ఇచ్చిన ‘‘భాషా విశేషాలు ` అర్థాలు’’ తెలంగాణేతరులకు ఉపయుక్తంగా ఉంటుంది. 

‘పొత్తి’ నవల,
రచన : నర్రా ప్రవీణ్‌రెడ్డి
వెల రూ.150/`
కాపీలకు :
రచయిత
నార్కట్‌పల్లి
ఫోన్‌ : 9393636405
తెలంగాణ లాంగ్వేజ్‌ కల్చరల్‌ కౌన్సిల్‌ మరియు
ప్రముఖ విక్రయశాలలు.