|

సంకల్ప శిల్పి

By: శ్రీ నెల్లుట్ల ప్రహ్లాద్‌

‘‘హైదరాబాద్‌కు వన్నె తెచ్చిన శిల్పారామం వంటి వాటికి సృష్టికర్త, గొప్ప కళాతపస్వి, తెలంగాణ బిడ్డ, రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌ జి.కిషన్‌రావు నిజాయితీకి మారు పేరైనటువంటి ఉన్నతాధికారి. ఒక సంకల్పం తీసుకుంటే దాన్ని దిగ్విజయం చేయగలిగే శక్తి సామర్థ్యం ఉన్నటువంటి కిషన్‌రావుని.. నేనే స్వయంగా అభ్యర్థించి మరీ.. యాదాద్రి పునర్నిర్మాణ పాలనా బాధ్యతను పూర్తిగా వారికి అప్పగిస్తూ.. యాదాద్రి పునర్నిర్మాణ కార్యభారాన్ని తీసుకోవాలని కోరినపుడు.. సంతోషంగా బాధ్యతను స్వీకరించి చక్కగా నిర్వర్తించారు.’’ అని ఆధునీకరణతో కూడిన అభివృద్ధికి చిరునామాగా నిలచిన కిషన్‌రావు గురించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ మీడియా ముఖంగా తెలిపిన విషయాలివి. కిషన్‌ రావుకి యాదాద్రి బాధ్యతను అప్పగించడానికి గల ప్రత్యేక కారణం.. ముఖ్యమంత్రే స్వయంగా ఇలా చెప్పారంటే.. కిషన్‌రావు విలువైన సేవల ఔన్నత్యం సుస్పష్టమౌతోంది.

ఏదైనా ఉన్నతమైన సంకల్పాన్ని సంకల్పిస్తే.. ఆ సంకల్పాన్ని సమర్థ వంతంగా పూర్తి చేయగల జ్ఞాన సంపన్నులను ఎంచుకుని.. వారికి సర్వాధికారాలిచ్చి కార్యసిద్ధి కలిగేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు నడిపిం చడం.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనా సంవిధానంలో కొనియాడదగిన ప్రధాన అంశాల్లో ఒక అంశం.. అలా తమ సంకల్పాన్ని నిజాయితీగా నిబద్ధతతో నిలబెట్టగలిగే సామర్థ్యం వున్న వ్యక్తులకు స్వేచ్ఛాయుతమైన వాతావరణాన్ని కల్పించడం వివేకవంతుడైన పాలనాదక్షునికుండే సహజ సద్గుణం. అటువంటి పాలనా యుక్త సద్గుణవంతులు మన ముఖ్యమంత్రి. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంవత్సరంలోపే.. ముఖ్యమంత్రే స్వయంగా యాదగిరిగుట్ట డెవలప్‌మెంట్‌ అథారిటీని ఏర్పరచి.. దానికి వారే ఛైర్మన్‌గా ఉంటూ.. కిషన్‌రావుకి యాదాద్రి పునర్నిర్మాణ మహత్కార్యానికి సంబంధించిన సర్వాధికారాలను ఇస్తూ.. వైస్‌ ఛైర్మన్‌ మరియు సి.ఇ.ఓగా బాధ్యతలప్పగించారు.

నైపుణ్యం కలిగిన చిత్రకారుడు.. తాను ఊహించిన చిత్రాన్ని కాగితంపై మాత్రమే చిత్ర రూపం ఇవ్వగలడు. అదే చిత్రాన్ని.. అందునా తన మదిలో సృజించిన చిత్రానికి కాకుండా.. ఇంకొకరి మదిలో సృజింపబడిన ఊహా చిత్రానికి కాగితంపై కాకుండా.. బాహ్య ప్రపంచంలో దర్శనీయ దృశ్య లావణ్యమైన భౌతిక రూపంలా తీర్చిదిద్దగలగడం సామాన్యమైన విషయం కాదు.. అది కేవలం సంకల్ప శిల్పికి మాత్రమే సాధ్యమయ్యే అరుదైన సృజనశీల శక్తి. అటువంటి సంకల్ప శిల్పిలా కిషన్‌రావు తమకు ముఖ్యమంత్రి అప్పగించిన బాధ్యతను నిర్వర్తించే ముందు.. ముఖ్యమంత్రి యాదాద్రిని ఏ విధంగా చూడాలనుకుంటున్నారో.. ఆ విధంగా వారి అంతరంగాన్ని గ్రహించి.. వారి అంతరంగ తెరపై ఏవిధంగానైతే నూతన యాదాద్రి రూపు రేఖలున్నాయో.. అదే విధంగా ఒక నిర్మాణాత్మక రెప్లికా ఆర్టిస్ట్‌ లా కార్యరూపంలోకి తెచ్చి.. యాదాద్రి విషయంలో ముఖ్యమంత్రి మనో సంకల్పాన్ని వాస్తవం చేసి బాధ్యతాసిద్ధిని సాధించారు కిషన్‌రావు. ఇలా కిషన్‌రావు అంతరంగ సామర్థ్యాన్ని విశ్లేషిస్తూ పోతే.. ముగింపు వాక్యం ఎక్కడ వ్రాయాలో తెలియని ఊహాతీత విషయ మౌతుందనడంలో అతిశయోక్తి లేదు. అటువంటి కార్యదీక్షా పరులైన జి.కిషన్‌రావు మాటల్లో యాదాద్రి పునర్నిర్మాణ ప్రధాన విషయాల ఆవిష్కరణగా వుండేలా.. తెలంగాణ మాస పత్రిక ఇంటర్వ్యూ. ఆ విశేషాలు మీ కోసం యధాతథంగా..

కిషన్‌రావు గారూ, ముందుగా మీకు హార్థిక శుభాకాంక్షలు..

యాదాద్రి పునర్నిర్మాణం వంటి మహత్కార్యాన్ని అద్వితీయంగా పూర్తిచేశారు.. ఎలా భావిస్తున్నారు?
ధన్యవాదాలండి..! చాలా సంతోషంగా వుంది. నేను కేవలం నిమిత్తమాత్రుణ్ణి మాత్రమే. ఇటువంటి దైవకార్యాలకు భగవంతుని దయ తప్పకుండా వుండాలి. ఆ సంకల్పం ముఖ్యమంత్రి గారి రూపంలో వచ్చి నాకు అండగా నిలబడి విజయవంతం చేసిందని భావిస్తున్నాను.

యాదాద్రి పునర్నిర్మాణ కార్యక్రమం చేపట్టవలసిన ఆవశ్యకత ఏమిటి?
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి పూర్వం నుండే యాదాద్రి సుప్రసిద్ధ క్షేత్రం. గతంలో వేలాదిగా భక్తులు యాదాద్రి వాసుని దర్శనానికై తరలివచ్చేవారు. ఎందరో ప్రముఖులు గతంలో సైతం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్న సందర్భాలున్నాయి. కానీ అందుకు తగ్గ వసతులు గాని.. ఆ స్థాయి అభివృద్ది గాని అక్కడ జరగలేదు. తెలంగాణ ఆవిర్భావానికి పూర్వం నుండే కేసీఆర్‌ తమ మనసులో యాదాద్రిని అభివృద్ధి చేయాల్సిన అవసరం వుందని అభిప్రాయపడేవారట. భగవంతుని అనుగ్రహం, కేసీఆర్‌ కృషి వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం.. ప్రజల దీవెనల వల్ల కేసీఆర్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో.. వారి సంకల్పానికి కార్యరూపం ఏర్పడిరది. అయితే, ఏ ప్రభుత్వానికైనా సరే.. తమకున్న అనేకానేక బాధ్యతల్లో.. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కూడా ఒకటి. అగ్రికల్చర్‌ టూరిజం, ఫారెస్ట్‌ టూరిజం, హెరిటేజ్‌ టూరిజం వలె టెంపుల్‌ టూరిజం కూడా పర్యాటక రంగంలో అంతర్భాగం. కాబట్టి ఏ కోణంలో ఆలోచించినా యాదాద్రి పునర్నిర్మాణ అభివృద్ధి ఆవశ్యకమే..! అందుకే ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని ఒక దీక్షలా భావించి కార్యరూపం ఇచ్చేలా మమ్మల్ని ముందుకు నడిపించారు.

దేవాలయ నిర్మాణాలకు, సాధారణ నిర్మాణాలకు వ్యత్యాసముంటుంది. యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణ ప్రణాళికకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణానికి సంబంధించిన ప్రణాళిక రూప కల్పనకు.. దాదాపు సంవత్సరకాలం సమయం పట్టింది. యాదాద్రి పునర్నిర్మాణం ఆగమ, వాస్తు శాస్త్రాల ప్రకారం వుండేలా నిర్మాణపరమైన శాస్త్రోక్త విషయ పరిశీలనకుగాను నిష్ణాతులైన స్తపతులను, సాంకేతికపరమైన నిర్మాణ పరిశీలనకుగాను నిపుణులైన ఇంజనీరింగ్‌ చీఫ్‌ల సహకారం తీసుకున్నాం. ఆలయ సౌందర్య వైభవ రూపకల్పనకు ప్రత్యేకంగా ఆర్ట్‌ డైరెక్టర్‌ సహకారం కూడా తీసుకున్నాం. ఆ ముగ్గురి సమన్వయ సలహాలు సూచనలతో యాదాద్రి పర్వతప్రాంత సామర్థ్య స్థితిని పరిగణనలోకి తీసుకుని అన్ని రకాల జాగ్రత్తలతో.. ఆలయ నిర్మాణ ప్లాన్‌ రూపొందించి ముఖ్యమంత్రికి చూపించాం. ముఖ్యమంత్రి దాన్ని పరిశీలించిన తర్వాత.. వారి సూచనతో.. ముఖ్యమంత్రితో కలసి ఆనాటి గవర్నర్‌ ఇ.ఎస్‌.ఎల్‌ నరసింహన్‌ వద్దకు వెళ్లి.. వారికి ఆ ప్లాన్‌ చూపించి.. వారి ఆశీస్సులు తీసుకున్నాక.. పునర్నిర్మాణ పనులను ప్రారంభించవచ్చని ముఖ్యమంత్రి అనుమతించారు. ఇలా పూర్తిస్థాయి ప్రణాళికాయుతమైన జాగ్రత్తలు తీసుకుని పునర్నిర్మాణ పనులను ప్రారంభించాం.

దాదాపు ఇరవయ్యేళ్లకుపైగా సమయం తీసుకునే పునర్నిర్మాణ పనులను.. ఇంత త్వరగా ఎలా పూర్తి చేయగలిగారు?
ముఖ్యమంత్రి యాదగిరిగుట్ట టెంపుల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీకి సంబంధించిన సర్వాధికారాలు నా వద్దే కేంద్రీకృతం చేయడంవల్ల.. నేను పనులన్నీ వేగవంతంగా పూర్తి చేయగలిగాను. దానికి తోడు భగవంతుని ఆశీస్సులు.. ముఖ్యమంత్రి పట్టుదల.. వారు నాకందించిన ప్రోత్సాహంతో పాటుగా.. మేము ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న టెక్నికల్‌ కమిటీ సభ్యులు, ఎగ్జిక్యూటివ్‌ అండ్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ సభ్యుల అమూల్యమైన సహకారం.. ఇంకా ఈ కార్యక్రమం కోసం నేను ఎవరెవరి తోడ్పాటు నైతే తీసుకున్నానో వారందరూ నాకు తమ సహకారాలను అందివ్వడం.. ఇలా అన్నీ కలసిరావడం వల్ల కూడా సంకల్పం ఇంత త్వరగా నెరవేరింది. అన్నిటికంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి చొరవదీసుకుని ప్రత్యేకంగా యాదాద్రిపై దృష్టిసారించకపోతే.. ఈ విజయాన్ని సాధించడం మాత్రం కష్టమయ్యేది. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌్‌ గారికి సదా ఋణపడి ఉన్నాను.


కృష్ణ శిలతో పునర్నిర్మాణం చేపట్టారు. కృష్ణ శిలను ఎంచుకోవడానికి గల ప్రత్యేక కారణం?
యాదాద్రి పునర్నిర్మాణ వైభవం కనీసం వెయ్యి సంవత్సరాల వరకు వుండాలనేది ముఖ్యమంత్రి సంకల్పం. మట్టి ఇటుకలతో నిర్మిస్తే.. ఆ స్థాయి నాణ్యత రాదు. అవి యాభై ఏళ్లు, మహా అయితే ఎనభై ఏళ్లు ఉండవచ్చునేమో.. అంతకు మించి కష్టం. అదే కృష్ణ శిల అయితే.. దాని సామర్థ్యం కనీసం వెయ్యేళ్ళు లేదా అంతకుమించి కూడా ఉండే అవకాశముంటుంది. అందుకే కృష్ణ శిలను ఎంచుకునే నిర్ణయం తీసుకోవడం జరిగింది.

వెయ్యేళ్లపాటు కృష్ణరాతి ఇటుకలను నిలబెట్టగలిగేలా బాండేజ్‌ కోసం మీరేమైనా ప్రత్యేక పద్ధతిని అనుసరించారా?
సిమెంట్‌ బాండేజ్‌ సమర్థవంతంగా కృష్ణరాతి ఇటుకలను నిలబెట్టలేవు. వెయ్యేళ్లపాటు కృష్ణరాతి ఇటుకల బాండేజ్‌ నిలబెట్టగలిగే విషయమై మొదట్లో పూర్తిస్థాయి రీసెర్చ్‌ చేశాము. పూర్వం కాకతీయులు, చాళుక్యుల కాలంలోని ఆలయ రాతి నిర్మాణాలు పటిష్టంగా ఉండడానికి గల కారణాలను అధ్యయనం చేశాము. సంప్రదాయ కట్టడాలకు రాతి ఇటుకలను సమర్థవంతంగా జతచేయగలిగేలా సున్నం, బెల్లం, కరక్కాయలు, కొబ్బరిపీచు మొలైనవంటివి మిశ్రమంగా చేసి.. ఆ మిశ్రమాన్ని కృష్ణరాతి ఇటుకల బాండేజ్‌ కొరకు వాడాము. ఈ సంప్రదాయ పద్ధతిలో తప్పక కృష్ణరాతి కట్టడాలు వెయ్యేళ్లు సమర్థవంతంగా నిలుస్తాయి.

యాదాద్రి పునర్నిర్మాణ సమయంలో.. దర్శనాల నిమిత్తం అటు భక్తులకు, ఇటు నిర్మాణ పనులకు ఇబ్బంది కలగకుండా తీసుకున్న జాగ్రత్తలు ఏమిటి?
ఏ దేవాలయాన్నైనా సరే.. పునర్నిర్మాణం చేపట్టే ముందు తాత్కాలిక బాలాలయం ఏర్పాటు చేస్తారు. అక్కడే దర్శనం చేసుకుంటారు భక్తులు. పునర్ని ర్మాణానంతరం తాత్కాలిక బాలాలయాన్ని పూర్తిగా తీసేసి.. ప్రధాన గర్భాలయ దర్శనాలను యధావిధిగా ప్రారంభిస్తారు. యాదాద్రికి సంబంధించి కూడా ఇదే విధానం. అయితే తాత్కాలిక బాలాలయాన్ని సాధారణంగా కాకుండా.. ప్రధాన గర్భగుడిలో వెలసిన మూలవిరాట్‌ దర్శనం చేసుకుంటున్న అనుభూతిని పొందేలా నిర్మించాం. నిర్మాణ సమయంలో ప్రధాన గర్భగుడికిగాని మూలవిరాట్‌ కి గాని ఎటువంటి ఇబ్బంది కలగకుండా పటిష్ఠమైన ఏర్పాట్లు చేశాము.

నూతన యాదాద్రికి పూర్వం ఉన్న చిరు వ్యాపారులకు ప్రస్తుతం కొండపై అనుమతి లేదు. ఎందుకని?
కొండపై చాలా తక్కువ స్థలం ఉండటం.. అందునా టెంపుల్‌ టూరిజం కింద జాతీయ స్థాయి ఆథ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే క్రమంలో చిరు వ్యాపారులకే కాదు.. ఇంకెవరికీ అక్కడ ఉండేందుకు అనుమతులివ్వలేదు. కేవలం దేవాలయ ఆథ్యాత్మిక శోభ ఉట్టిపడేలా మాత్రమే కొండ ప్రాంతాన్ని పరిమితం చేశాము. నిరంతర పర్యవేక్షణ కోసం ఆలయ ఈవో ఆఫీస్‌.. దానికి అనుసంధానంగా వీఐపీలకు భద్రత పరంగా ఇబ్బందులు కలగకుండా కొన్ని గదుల నిర్మాణ ఏర్పాట్లు తప్ప ఇతరత్రావాటికి అవకాశమివ్వలేదు.

అలాగైతే ఆ చిరు వ్యాపారుల జీవనోపాధి పరిస్థితి ఏమిటి ప్రస్తుతం?
ఆ చిరు వ్యాపారులందరికీ పరిహారం కింద డబ్బుతో పాటుగా.. ఉదార హృదయంతో ముఖ్యమంత్రి కొండకు దిగువన ఆనుకుని ఉన్న జాగలో ఇళ్లు కట్టించి ఇచ్చి మరీ.. అక్కడ స్థిర నివాసంతోపాటు.. తమ జీవనోపాధిని పొందేలా ఏర్పాట్లు చేయమని తెలపడంతో తదనుగుణంగా ఏర్పాట్లు చేశాము.

జాతీయ స్థాయి ఆథ్యాత్మిక పర్యాటక కేంద్రంగా గుర్తింపు లభించేలా యాదాద్రి పునర్నిర్మాణం జరిగిందన్నారు. ఇప్పుడు గతంలోకంటే భక్తుల రాకడ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దర్శనాలు, రవాణా మరియు భద్రత విషయమై ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
ఎందరు భక్తులు వచ్చినా ఇబ్బందులు కలగకుండా పూర్తిగా అన్ని వసతులు కల్పించాం. ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి.. దర్శన క్యూలైన్లను అడుగడుగు పరిశీలించి.. వృద్దులకు, వికలాంగులకు, చిన్నపిల్లలకు, స్త్రీలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వుండేలా సౌకర్యవంతమైన ఏర్పాట్లు చేసేలా తగిన సూచనలిచ్చారు. వారి సూచనకు తగ్గట్లుగా చక్కటి ఏర్పాట్లు చేశాము. మండల దీక్షాపరులకు ప్రత్యేక మండపాలు.. స్నానాలకు ప్రత్యేక వసతితోపాటు తలనీలాల సమర్పణకు విశాలమైన కళ్యాణకట్ట, పేదవారికోసం ఉచిత వసతి సదుపాయం, అన్న ప్రసాదాలయ మండపం, ప్రత్యేక లడ్డు కౌంటర్లు.. ఇలా సమస్త సదుపాయాలను ఏర్పరచాము. రవాణా విషయంలో ఇబ్బంది కలగకుండా రోడ్లను విశాలంగా నిర్మించి ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేశాము.
భద్రత విషయంలో కూడా తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ సహకారంతో తగిన ఏర్పాట్లు చేశాము. ప్రత్యేక కమాండ్‌ కంట్రోల్‌ రూమ్స్‌ ఏర్పాటు చేసి భక్తుల దర్శనం మొదలుకొని ప్రతి కదలికపై, యాదాద్రికి వచ్చే ప్రతి వాహన రాకపోకలపై నిఘా ఉండేలా పటిష్టమైన జాగ్రత్తలు తీసుకునేలా వ్యవస్థను రూపొందించాము. ఇందుకోసం ఇసిఐఎల్‌ వారి సహకారం కూడా తీసుకున్నాం.

నూతన యాదాద్రికి సంబంధించి దిగువ ప్రాంతంలో చేసిన ఏర్పాట్లలో భాగంగా పరిసర గ్రామస్తులకు ఏమైనా అసౌకర్యం ఏర్పడిరదా?
యాదాద్రి అభివృద్ధి ఏర్పాట్లలో భాగంగా దిగువ ప్రాంతంలో సమీప గ్రామస్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగలేదు.. పైగా భూమి ధరలు అమాంతం పెరిగి చుట్టుపక్కల గ్రామాల్లోని చిన్నపాటి స్థలాలున్న స్థానిక పేదలు సైతం.. కోట్లకు పడగలెత్తేలా.. వారి దశ మారిపోయేలా.. అద్భుతమైన మార్పు వారి జీవితాల్లో వచ్చింది. యాదాద్రి అభివృద్ధికి పూర్వం పదివేలు పలికే భూములు సైతం.. ఇప్పుడు కోటి రూపాయలపైన పలికే స్థాయికి చేరుకోవడం యాదాద్రి పరిసర గ్రామ ప్రజల అదృష్టం. ఇది కూడా ఒక రకంగా ప్రజాజీవన వికాసానికి ముఖ్యమంత్రి యాదాద్రి పునర్నిర్మాణ సంకల్ప విజయమే..!

యాదాద్రి పునర్నిర్మాణానంతరం స్థానికంగా సాంస్కృతిక వికాసానికి అవకాశముంటుందా?
కోలాటాల ద్వారా.. శాస్త్రీయ నాట్య కళల ద్వారా.. శాస్త్రీయ సంగీత వాయిద్యాల ద్వారా.. కీర్తనల ద్వారా.. భక్తి భావాలను తద్వారా భగవత్‌ తత్త్వాన్ని చాటే విధంగా మన దేవాలయాలు సహజంగానే సాంస్కృతిక వికాసానికి నెలవుగా వుంటాయి. అందుకోసం ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా తప్పకుండా స్థానికంగా సాంస్కృతిక వికాసంపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రికి ఉంది. అంతేకాకుండా భక్తి యోగం ద్వారా.. ఆ తత్త్వంలోని విశేషాలను తెలిపి ప్రజలను సన్మార్గంలోకి నడిపించే విధంగా.. యాదాద్రికి వచ్చిన భక్తుల్లో కనీసం లక్షమంది భక్తులు పండితోత్తముల ప్రవచనాలను అక్కడ వినగలిగేలా తగిన అవకాశం కల్పించాం.

నూతన యాదాద్రిని పూర్తిస్థాయిలో ఎప్పటి నుండి భక్తులు సందర్శించవచ్చు?
ఈ మార్చి ఇరవై ఎనిమిదిన నూతన యాదాద్రి దేవాలయ ప్రారంభోత్సవం చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్‌ నిర్ణయించారు. మార్చి ఇరవై ఎనిమిది తరువాత పూర్తి స్థాయి నూతన యాదాద్రిని.. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని సమస్త భక్త జనులందరూ సంపూర్ణంగా దర్శించి తరించవచ్చు.

మీ అమూల్యమైన సమయం కేటాయించి.. మాతో మీ భావాలను పంచుకున్నందుకు ‘తెలంగాణ’ తరపున ధన్యవాదాలు..!

‘తెలంగాణ’ మాస పత్రిక వారు యాదాద్రి పునర్నిర్మాణ కార్యక్రమ విశేషాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో తమవంతు పాత్రను పోషిస్తున్నందుకు మా నుండి కూడా సదా ధన్యవాదాలు.