దేవాదుల ఎత్తిపోతల పథకం

దేవాదుల ఎత్తిపోతల పథకం 2004 లో లబ్ధి పొందడానికి చేపట్టిన పథకం అని అందరికీ తెలిసిందే. సరి అయిన అధ్యయనం జరపకుండా హడావుడిగా రూపకల్పన చేసిన ప్రాజెక్టు. తెలంగాణా ప్రాంతాలలోని కరువు పీడిత మెట్ట ప్రాంతాలైన జిల్లాలు వరంగల్‌(రూ), వరంగల్‌(అ), జయశంకర్‌ భూపాలపల్లి, కరీంనగర్‌, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి, సూర్యాపేటలోని 34 మండలాలకు చెందిన 6.21 లక్షల ఎకరాలకు సాగునీరు అందించుటకు 1541 ఆడుగుల ఎత్తునకు, 190 కి.మీల పరిధిలో, ఎత్తిపోతల ద్వారా ఆయకట్టును అభివృద్ధి చేయడానికి ఈ ప్రాజెక్టు ఉద్దేశింపబడింది. గోదావరి నదిపై ఏటూరునాగారం మండలంలోని గంగారం గ్రామం వద్ద జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని 2004లో చేపట్టినారు. ఈ పథకాన్ని మూడు దశలలో పూర్తిచేయాలని నిర్ణయించినారు.

మూడు స్టేజీల్లో గంగారం వద్ద గోదావరి నుండి 38.182 టిఎంసిల నీటిని ఎత్తిపోసి 6.21 లక్షల ఎకరాలకు (ఇందులో 77,750 ఎకరాలు రీ జనరేటెడ్‌ నీటితో సాగులోనికి వస్తాయని పేర్కొన్నారు) సాగునీరు అందిచాలని లక్ష్యంగా ప్రాజెక్టు రూపకల్పన జరిగింది. అంటే నికరంగా దేవాదుల ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందే భూమి 5,43,250 ఎకరాలే. ఒక టిఎంసికి 15,360 ఎకరాలని సాగు చెయ్యవచ్చునన్న లెక్కలతో ప్రాజెక్టుకు 38.182 టిఎంసిల నీటిని కెటాయించింది ఉమ్మడి ప్రభుత్వం. అందులో 2.842 టిఎంసిలు తాగునీటికి కేటాయించారు. నికరంగా వ్యవసాయానికి అందేవి 35.34 టిఎంసిలు మాత్రమే. 170 రోజులు గోదావరి నుండి ఎత్తిపోయాలని తలపెట్టారు. గంగారం గ్రామానికి ఎగువన బ్యారేజీ లేకపోవడంతో గోదావరిలో 170 రోజులు ఎత్తిపోతలు సాధ్యం కావడం లేదు. గోదావరిలో నీటి మట్టం 71 మీటర్లకు చేరితే తప్ప దేవాదుల పంపులను తిప్పడం సాధ్యం కాదు. 71 మీటర్ల ఎత్తు నుండి ధర్మసాగర్‌ తర్వాత 581 మీటర్ల ఎత్తు వరకు ఆయకట్టుకు నీరందించవలసిన అవసరం ఉన్నది.

పంపింగ్‌ కాలాన్ని 170 రోజులు పెట్టినా అత్యధికంగా 110 రోజులకు మించి పంపులు నడపడం సాధ్యం కావడం లేదు. 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టుకు నీటి నిల్వ కోసం బ్యారేజి లేకపోవడం ఒక పెద్ద సాంకేతిక లోపం (తర్వాత కాలంలో తెలంగాణా ఉద్యమానికి జడిసి కాంతనపల్లి బ్యారేజికి ఉమ్మడి ప్రభుత్వం శాంక్షన్‌ ఇవ్వక తప్పలేదు) . 110 రోజులు పంపింగ్‌ ద్వారా 27 టిఎంసిలు మాత్రమే ఎత్తిపోయగలం. 170 రోజుల పంపింగ్‌ కాలం వ్యవసాయ పనులు సాగే కాలానికి పొంతన కుదరదు. అసలు ఒక టిఎంసికి 10 వేల ఎకరాలకే అతి కష్టం మీద సాగు చెయ్యవచ్చు. దేవాదుల ప్రాజెక్టులో మాత్రం ఉమ్మడి ప్రభుత్వం 15 వేలుగా లెక్కగట్టింది. గోదావరి నీటిని వాడుకోకుండా చేయడానికే కుట్ర జరిగిందని అప్పట్లో అందరూ భావించారు. ఉద్యమ సమయంలో ఈ అంశంపై చాలా చర్చ జరిగింది. గోదావరి నుంచి ధర్మసాగర్‌ దాకా ప్రాజెక్టులో ఆయకట్టు లేకపోవడం మరొక పెద్ద లోపం. తమ కండ్ల ముందు నుంచి పైప్‌లైన్‌ పోతున్నా చుక్క నీరు నోచుకోని ములుగు, భూపాలపల్లి, నర్సంపేట నియోజకవర్గంలోని ఎగువ ప్రాంతాలు గోదావరి నీటి కోసం అల్లాడుతున్నాయి. ఈ సాంకేతిక సమస్యల పరిష్కారానికి, లోపాల సవరణకు దేవాదుల ప్రాజెక్టు రీ ఇంజనీరింగ్‌ తప్పనిసరి అవసరమని ప్రభుత్వం భావించింది.

దేవాదుల రీ ఇంజనీరింగ్‌ తర్వాత ప్రతిపాదనలు ఈ విధంగా ఉన్నాయి.

  •  దేవాదుల ప్రాజెక్టుకి నీటి కేటాయింపులు 60 టిఎంసిలకు పెంచడం జరిగింది. దాంతో ఒక టిఎంసికి 10,000 ఎకరాలు సాగులోకి వస్తాయి.
  • దేవాదుల ప్రాజెక్టుకు 170 రోజుల పాటు నీటిని పంపు చేయడానికి వీలుగా గంగారంకి దిగువన ప్రతిపాదించిన కాంతనపల్లి బ్యారేజీని ఆదివాసీ గ్రామాలు, భూములు ముంపు బారిన పడకుండా కాంతనపల్లికి కొద్దిగా ఎగువన తుపాకుల గూడెం వద్దకు మార్చడం జరిగింది.
  • ములుగు, భూపాలపల్లి, నర్సంపేట నియోజక వర్గాల్లో ఉన్న గ్యాప్‌ ఆయకట్టుని ప్రాజెక్టు పరిధిలోనికి తీసుకురావడం
  • రామప్ప , పాకాల, లక్నవరం మధ్యతరహా ప్రాజెక్టుల కింద ఉన్న ఆయకట్టును స్థిరీకరించడం.
  • 303 మీ మట్టానికి దిగువన ఎర్రయ్య-రంగయ్య, ధర్మసాగర్‌, నష్కల్‌, పాలకుర్తి చెరువుల కింద ఆయకట్టును స్థిరీకరించడం.
  • 415 మీ మట్టానికి ఎగువన ఉన్న స్టేషన్‌ ఘణ్‌పూర్‌, చెన్నూర్‌, నవాబ్‌పేట్‌, అశ్వరావుపల్లి, గండిరామారం జలాశయాల కింద ఉన్న ఆయకట్టుకు ఎస్సారెస్పి వరద కాలువ పథకంలో నిర్మాణం అవుతున్న గౌరవెల్లి జలాశయం నుండి నీటిని సరఫరా చేయడం.
  • కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మాణం అవుతున్న మల్లన్న సాగర్‌ జలాశయం నుండి 556 మీ మట్టానికి ఎగువన ఉన్న బొమ్మకూరు, వెల్దండ, లద్దూనూర్‌, కన్నబోయినగూడెం, తపాస్‌ పల్లి చెరువుల కింద ఉన్న ఆయకట్టుకు నీటిని సరఫరా చేయడం.

పైన వివరించిన ప్రతిపాదనలతో నీటి వసతి లేని వరంగల్‌ జిల్లాలోని కరువు పీడిత ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు అందుతుంది.

దేవాదుల ప్రాజెక్టు పనుల పురోగతి :

మొదటి దశలో పంపు హౌజ్‌, పైపులైను పనులు 2009వ సంవత్సరంలో పూర్తి అయినాయి. కాలువ (ప్యాకేజి నెం.45 & 46) పనులు చివరి దశలో

ఉన్నవి. ఈ దశ ద్వారా 353 క్యూసెక్కుల సామర్ధ్యం తో నీటిని ఎత్తిపోయడానికి ప్రతిపాదించబడింది.. తద్వారా 10.27 టి.యం.సి. నీరు 1,22,700 ఎకరాల ఆయకట్టుకు సరఫరా అవుతుంది..

రెండవ దశలో పంపు హౌజ్‌, పైపులైను పనులు 2013 వ సంవత్సరములో పూర్తి అయినాయి. (ఆర్‌. యస్‌.ఘణపూర్‌, 4L, తపాసుపల్లి, ఆశ్వరావుపల్లి, చిట్టకోడూరు ప్రధాన కాలువల) పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ దశ ద్వారా 495 క్యూసెక్కుల సామర్ధ్యంతో నీటిని ఎత్తిపోయుటకు ప్రతిపాదించబడినది. తద్వారా 21.87 టి.యం.సి.ల నీరు 1,93,164 ఎకరాల ఆయకట్టుకు సరఫరా అవుతుంది..

మూడవ దశలోని పనులలో భాగంగా ప్యాకేజి నెం.1 పంపు హౌజ్‌, పైపులైను పనులు 2015లో పూర్తి అయినాయి. మిగిలిన 7 ప్యాకేజిల పనుల పురోగతి వివిధ దశలలో ఉన్నాయి. ఈ దశ ద్వారా 1752 క్యూసెక్కుల సామర్ధ్యంతో. నీటిని ఎత్తిపోయుటకు ప్రతిపాదించబడింది. తద్వారా 17.67 టి.యం.సిల నీరు 2,41,790 ఎకరాల ఆయకట్టుకు సరఫరా అవుతుంది.

ప్రాచీన చారిత్రక కట్టడమైన రామప్ప దేవాలయానికి ముప్పు కలగకుండా రీ-ఇంజనీరింగ్‌ లో భాగంగా మూడవ దశలోని పనులలో ప్యాకేజి నెం.2, భీం ఘణపూర్‌ నుండి రామప్ప జలాశయానికి గోదావరి నీటిని సొరంగ మార్గం ద్వారా కాకుండా పైపు లైను మార్గం ద్వారా తరలించాలని తెలంగాణ ప్రభుత్వము నిర్ణయించింది.. ఈ పని వేగవంతంగా జరుగుతోంది. సెప్టెంబర్‌ 2019 నాటికి పూర్తి చేసి పంపింగ్‌ చేయడానికి ఇంజనీర్లు ప్రయత్నం చేస్తున్నారు.

మూడవ దశలోని పనులలో భాగంగా ప్యాకేజి నెం.3 పనులను త్వరతగతిన పూర్తి చేయుటకు భూగర్భ పంపు హౌజ్‌ నిర్మాణమును ధర్మసాగర్‌ బదులుగా దేవన్నపేటలో ప్రతిపాదించబడినది. ఈ పనులు పురోగతిలో ఉన్నవి. ఈ పనులు డిసెంబర్‌ 2020 నాటికి పూర్తి అవుతాయని ఇంజనీర్లు భావిస్తున్నారు. మూడవ దశలో ఈ ప్యాకేజి పనులు కీలకమైనవి. రీ-ఇంజనీరింగ్‌లో భాగంగా మూడవ దశలోని పనులలో భాగంగా ప్యాకేజి నెం.5లో ముంపు ప్రభావం లేకుండ రంగయ్య- ఎర్రయ్య చెరువు పనులను తీసివేసి సిస్టర్న్‌ (Cistern)లను నిర్మించి నీటిని పాకాల చెరువుకు అందించాలని ప్రభుత్వం నిర్ధేశించింది. ఈ పనులు కూడా పురోగతిలో ఉన్నాయి.

రీ-ఇంజనీరింగ్‌ లో భాగంగా, తెలంగాణ ప్రభుత్వం నర్సంపేట నియోజవర్గములోని పాకాల చెరువు క్రింద ఉన్న 15,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కొరకు, 7,000 ఎకరాల గ్యాప్‌ ఆయకట్టుకు, ములుగు నియోజవర్గములోని 8,000 ఎకరాల గ్యాప్‌ ఆయకట్టుకు సాగు నీరు అందించడానికి రామప్ప నుండి పాకాల చెరువునకు పైపు లైను ద్వారా పనులు చేయడం కోసం 136 కోట్ల రూపాయలకు అనుమతులు జారిచేయటం జరిగింది. ఈ పనులు పురోగతిలో ఉన్నాయి.

అదే విధంగా ములుగు నియోజవర్గంలోని లక్నవరం రిజర్వాయర్‌ క్రింద ఉన్న 8,700 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కొరకు రామప్ప నుండి లక్నవరం గ్రావిటి కెనాల్‌ కొరకై రూ.16.70 కోట్లకు అనుమతులు జారిచేయటం జరిగింది. ఈ పనులు పురోగతిలో ఉన్నవి. అదే విధంగా ములుగు ఘణపుర్‌ క్రింద ఉన్న సుమారు 26,000 ఎకరాల గ్యాప్‌ ఆయకట్టుకు, 4,000 ఎకరాలను స్థీరికరించుటకు, రామప్ప నుండి ములుగు ఘణపుర్‌ కాలవ పనుల కొరకు ప్రభుత్వం రూ. 17.58 కోట్లతో అనుమతులు మంజూరు చేసినది. పనులు పురోగతిలో ఉన్నాయి.

ఈ ప్రాజెక్టు ద్వారా 2600 క్యూసెక్కుల నీటిని 267 రోజులు పంపింగ్‌ ద్వారా 6,21,000 ఎకరాలకు నీటిని అందించడానికి ప్రభుత్వం అత్యంత వేగంగా పనులను పూర్తిచేయుటకు కృత నిశ్చయముతో ఉన్నది. డిసెంబర్‌ 2020 నాటికి దేవాదుల పనులు పూర్తి అయి నిర్ధేశించిన లక్ష్యాలను నెరవేరుస్తుందని ఇంజనీర్లు ఆశిస్తున్నారు.

భూసేకరణ :- ఈ పథకం క్రింద 2004 నుండి మే 2014 వరకు అనగా 10 సంవత్సరాలలో 19,447 ఎకరాలు సేకరించడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వ హయాములో ఇప్పటివరకు కేవలం 3 సంవత్సరాల వ్యవధిలో సుమారుగా 5250 ఎకరాలు భూసేకరణ జరిగింది. మిగిలిన భూసేకరణ కూడా త్వరితగతిన పూర్తిచేసి ప్రాజెక్టు పనులు 2020 డిసెంబరు నాటికి పూర్తి చేయాలన్నకృత నిశ్చయముతో ఉన్నది.

ఆయకట్టు- వివరాలు: ఈ పథకం క్రింద 5,57,654 ఎకరాలకుగాను 2004 నుండి మే 2014 నాటికి అనగా 10 సంవత్సరాలలో 47,671 ఎకరాలు మాత్రమే సాగుకి సిద్ధం చేయడం జరిగింది. జూన్‌ 2014 నుండి మార్చి 2018 నాటికి అనగా 3 సంవత్సరాలలో 1,09,052 ఎకరాల ఆయకట్టు, 2017-18లో 1,06,988 ఎకరాలు సాగుకు సిద్ధం చేయడం జరిగింది. 2018-19 లో 2,93,943 ఎకరాలను, 2019-20 లో మిగతా ఆయకట్టును కూడా సాగుకు సిద్ధం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. తుపాకులగూడెం బ్యారేజి, దేవాదుల మూడవ దశ పనులు పూర్తి అయితే దేవాదుల ప్రాజెక్టు నిర్ధేశిత ఆయకట్టుకు నీరు సఫరా అవుతుంది.

ఖర్చులు-వివరాలు : ఈ పథకము క్రింద రూ. 13445.44 కోట్లకుగాను, ఈ.పి.సి. పనులకు, భూసేకరణ, ఇతర అభివృద్ధి పనులు కలిపి మొత్తముగా మే 2014 నాటికి రూ.7,292 కోట్లు, ఆ తరువాత మార్చి 2018 నాటికి రూ. 10,800 కోట్లు, ఖర్చుచేయడం జరిగింది, అనగా తెలంగాణ ప్రభుత్వం హయాములో ఇంతవరకు సుమారుగా రూ.3644 కోట్లు ఖర్చుచేసి మిగిలిన పనుల పురోగతిని వేగవంతంగా 2020 చివరి నాటికి పూర్తిచేయడానికి తగు చర్యలు తీసుకుంటున్నది.

కాంతనపల్లి / తుపాకుల గూడెం బ్యారేజీ :

కాంతనపల్లి బ్యారేజీని రెండు లక్ష్యాలతో ప్రతిపాదించడం జరిగింది. 1. శ్రీరాంసాగర్‌ మొదటి దశ , రెండో దశ ఆయకట్టు 7.50 లక్షల ఎకరాలను స్థిరీకరించడం 2. దేవాదుల ఎత్తిపోతల పథకానికి 170 రోజుల పంపింగ్‌ కు వీలుగా ఒక జలాశయాన్ని సృష్టించడం. అయితే కంతనపల్లి బ్యారేజీని 85మీ. ఎఫ్‌ఆర్‌ ఎల్‌తో నిర్మించడానికి డిజైన్లు తయారుచేయడం జరిగింది. ఈ మట్టం వద్ద 11,000 ఎకరాల ఆదివాసీ భూములు, 4 ఆదివాసీ గ్రామాలు ముంపు బారిన పడుతున్నాయి. ఆదివాసీ ప్రజల నుండి ముంపుకి వ్యతిరేకంగా తీవ్ర నిరసన వ్యక్తం అయ్యింది. శ్రీరాంసాగర్‌ మొదటి దశ, రెండో దశ ఆయకట్టుకి కాకతీయ కాలువను ఆధునీకరించి పూర్తి ప్రవాహా సామర్ధ్యంతో నీటిని తరలించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

శ్రీరాంసాగర్‌ పునరుజ్జీవన పథకం ద్వారా శ్రీరాంసాగర్‌ జలాశయానికి నీటి సరఫరా జరుగుతున్నందున, ఆధునీకరించిన కాకతీయ కాలువ ద్వారానే నీటిని సరఫరా చేసే పరిస్థితి ఏర్పడుతున్నందున కాంతనపల్లి నుండి ఈ ఆయకట్టుకు నీటిని ఎత్తిపోసే అవసరం లేదు. ఈ నేపథ్యంలో కంతనపల్లి రెండు లక్ష్యాల్లో కేవలం దేవాదుల ప్రాజెక్టుకు జలాశయం సృష్టించడం ఒకటే మిగిలిపోయింది. కనుక ఆదివాసీల భూములను, గ్రామాలను ముంపు నుండి బయట పడేయడానికి బ్యారేజీ స్థలాన్ని కాంతనపల్లి బ్యారేజికి 14 కి.మీ ఎగువన తుపాకులగూడెంకు మార్చాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకున్నది. ఈ బ్యారేజి పూర్తి స్థాయి నీటి మట్టం కూడా 85మీ.గానే నిర్ధారించారు.

వాప్కోస్‌ వారి సర్వేలో

తుపాకులగూడెం వద్ద బ్యారేజి నిర్మాణం వలన గోదావరి ఒడ్డున కేవలం 637 ఎకరాలు మాత్రమే ముంపునకు గురి అవుతున్నాయి. ఆదివాసీ గ్రామాలు గాని, ఇండ్లు గాని ముంపులోకి రావడం లేదని తేలింది. సుమారు 7 టిఎంసిల నిల్వ సామర్ధ్యంతో ఏర్పడే జలాశయం దేవాదులకు జీవాన్ని ప్రసాదిస్తుంది. దేవాదుల ప్రాజెక్టు ప్రతిపాదిత లక్ష్యాలను నెరవేర్చగలుగుతుంది. బ్యారేజి నిర్మాణం శరవేగంగా సాగుతున్నది. బ్యారేజి పనులు జూన్‌ 2020 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

(దేవాదుల ప్రాజెక్టు చీఫ్‌ ఇంజనీర్‌ బంగారయ్య, కాంతనపల్లి ప్రాజెక్టు చీఫ్‌ ఇంజనీర్‌ నాగేందర్‌ రావుల సౌజన్యంతో)

శ్రీధర్‌ రావు దేశ్‌ పాండే