| |

మైదాన ప్రాంతాలకు దీటుగా… గిరిజన ప్రాంతాల అభివృద్ధి

By: మార్గం లక్ష్మీనారాయణ

ఆదివాసీ, గిరిజనుల సామాజిక-ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా దేశంలో సమగ్ర గిరిజనాభివృద్ధి ఏజెన్సీలు ఏర్పాటయ్యాయి. ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు వారిని గిరిజనేతర దోపిడీ నుంచి కాపాడటం, వారికి రక్షణ, భద్రత కల్పించడం కూడా ఐ.టి.డి.ఎ.ల ముఖ్యఉద్దేశ్యం. వారికి రిజర్వేషన్లు సక్రమంగా అమలయ్యేలా చూడటంతోపాటు, విద్యా, వైద్యం, జీవనోపాధి, ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతూ, వారి జీవన ప్రమాణాలను పెంచడం ప్రభుత్వాల విధి.

భారత రాజ్యాంగం 5వ షెడ్యూల్‌ ప్రకారం ఐ.టి.డి.ఎ.లను ఏర్పాటు చేశారు. దేశంలో మొత్తం 193 ఐ.టి.డి.ఎ. (Integrated Tribal Development Agency)లు ఉన్నాయి. తెలంగాణలో భద్రాచలం, ఏటూరునాగారం, ఉట్నూరులలో ఐ.టి.డి.ఎ.లు పని చేస్తున్నాయి. చెంచుల కోసం ప్రత్యేకంగా మన్ననూరులో మరో ఐ.టి.డి.ఎ. ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని 9 షెడ్యూల్డ్‌ ప్రాంత జిల్లాలైన ఆదిలాబాద్‌, మంచిర్యాల, ఆసీఫాబాద్‌, నాగర్‌ కర్నూలు, వరంగల్‌, మహబూబాబాద్‌, ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని 1,180 గ్రామాలు, 1,229 గ్రామ పంచాయతీలు, 3,765 ఆవాసాలలో 13,924.46 చ.కి.మీ.ల మేర షెడ్యూల్‌ ప్రాంతాలు విస్తరించి ఉన్నాయి.

2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో గిరిజన జనాభా 31.78లక్షలు. రాష్ట్ర జనాభాలో గిరిజనులు 9.08శాతం. రాష్ట్రంలోని మొత్తం జనాభాలో ఐ.టి.డి.ఎ. జిల్లాల్లో 52.96శాతంగా ఉన్నారు. మిగతా 47.04శాతం గిరిజనులు మైదాన ప్రాంతాల్లో నివసిస్తున్నారు. రాష్ట్ర జాబితాలోని మొత్తం 32 గిరిజన తెగల్లోని 12 ప్రధాన తెగలు ఉండగా, ఇందులో 4 ఆదిమ జాతి తెగలు కూడా ఉన్నాయి.

స్వాతంత్య్రానికి పూర్వమే… 

నిజాం స్టేట్‌లో గిరిజనుల కోసం ప్రత్యేక శాఖ

స్వాతంత్య్రానికి పూర్వమే హైదరాబాద్‌ నిజాం స్టేట్‌లో గిరిజన సంక్షేమ, అభివృద్ధికి పునాదులు పడ్డాయి. అప్పటి నిజాం, ప్రఖ్యాత మానవ విజ్ఞాన శాస్త్రవేత్త హైమన్‌ డార్ఫ్‌ని ఇక్కడకు రప్పించి, గిరిజన సమస్యలపై అధ్యయనం చేసి, సమ్రగ నివేదిక ఇవ్వాలని కోరాడు. ఆదివాసీ, గిరిజన, వెనుకబడిన తరగతుల విషయంలో నిజాం స్టేట్‌కి డార్ఫ్‌ని సలహాదారుగా నియమించారు. డార్ఫ్‌ ఆదిలాబాద్‌, వరంగల్‌, మహబూబ్‌ నగర్‌ జిల్లాల్లోని ఆదివాసీ గోండు, నాయకపోడు, చెంచులు, లంబాడా తదితర గిరిజనులతో వారి గూడాల్లో నివసించారు. 

హైమన్‌ డార్ఫ్‌ నివేదిక ప్రకారం 1946లోనే నిజాం, గిరిజన, బలహీన వర్గాల కోసం ఒక శాఖను ఏర్పాటు చేశారు. దోపిడీ నుంచి ఆదివాసీలను రక్షించడానికి ఎల్‌.టి.ఆర్‌. (ల్యాండ్‌ ట్రాన్స్‌ఫర్‌ రెగ్యులరైజేషన్‌) ను ప్రారంభించారు. 1956లో గిరిజన కోఆపరేటివ్‌ సొసైటీ (జి.సి.సి)లను ఏర్పాటు చేశారు. 1962లో గిరిజన సాంస్కృతిక పరిశోధన మరియు శిక్షణ సంస్థ (TCR&TI) ని ఏర్పాటు చేశారు. 1966లో సాంఘిక సంక్షేమ శాఖ నుండి గిరిజన సంక్షేమ శాఖను వేరు చేశారు. 1969లో ట్రైబల్‌ డెవలప్‌ మెంట్‌ బ్లాక్స్‌ ఏర్పాటయ్యాయి. 1973-74లో జిల్లా గిరిజన సంక్షేమ అధికారుల (డిటిడబ్ల్యుఓ)ను నియమించారు. 1975 నుంచి సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థలు ఏర్పాటయ్యాయి. మొదట్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో నడిచిన ఐ.టి.డి.ఎ.లకు 1986 నుంచి ప్రత్యేకంగా పి.ఓలను నియమిస్తున్నారు. ఐటిడిఎ నిధులను మాత్రమే ఖర్చు చేస్తూ అభివృద్ధి చేసే సంప్రదాయానికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెరపడిరది. తెలంగాణలోని ఐ.టి.డి.ఎ.లకు వాటి విధులతోపాటు, నిధులు పెరగడమే గాకుండా, గిరిజనేతరుల కోసం అమలవుతున్న అన్ని పథకాలు కూడా గిరిజనులకు కూడా అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఆదివాసీ, గిరిజన తండాల్లో అభివృద్ధి వేగం గుణాత్మకంగా పెరిగింది.

దండిగా నిధులు…. ఎన్నో పథకాలు

ఆదివాసీ, గిరిజనుల అభివృద్ధి కోసం సిఎం కెసిఆర్‌ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం మునుపెన్నడూ లేని విధంగా నిధులు కేటాయించి ఖర్చు చేస్తున్నది. ఇతర జనాభాతో సమానంగా ఆదివాసీ, గిరిజనులను అభివృద్ధి పరచి, వారి జీవన ప్రమాణాలను పెంచాలనేది సిఎం కెసిఆర్‌ లక్ష్యం. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని గిరిజనుల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం 2021-22 ఏడాదికి రూ.11,516.21 కోట్ల బడ్జెట్‌ని ప్రతిపాదించింది. ప్రత్యేకంగా ట్రైబల్‌ సబ్‌ ప్లాన్‌ నిధులను కూడా వెచ్చిస్తున్నది.

ప్రత్యేక అభివృద్ధి నిధి… గిరిజనులకు పెన్నిధి

2017లో షెడ్యూల్డ్‌ తెగల ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్‌.టి. ఎస్‌.డి.ఎఫ్‌) చట్టాన్ని అమలులోకి తెచ్చింది. నిధుల కేటాయింపుతోపాటు, వారికే వాటి వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ చేసిన ఈ చట్టం ప్రత్యేకత. రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఆదివాసీ, గిరిజన పరిరక్షణ ప్రమాణాలన్నింటినీ పరిరక్షిస్తూనే, రాష్ట్రం పలు సంక్షేమ, మౌలిక వసతుల అభివృద్ధి, షెడ్యూల్డ్‌ తెగల ప్రత్యేక అభివృద్ధి నిధి వంటి అనేక పథకాలను అమలు చేస్తున్నది. రాష్ట్రంలోని గిరిజనుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది.  

గిరిజన సమాజాభివృద్ధికి అనేక సంస్కరణలు

గిరిజనుల సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి, సంస్కరణలను చేపట్టింది. గిరిజన ప్రజా ప్రతినిధులకు ప్రాతినిధ్యం కల్పిస్తూ గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేసింది. ఆర్టికల్‌ 275(11) ప్రకారం శాసన సభా కమిటీని నియమించింది. గతంలో ఉన్న 675 గిరిజన గ్రామ పంచాయతీలతోపాటు కొత్తగా 1731 కొత్త పంచాయతీలు ఏర్పడ్డాయి. మొత్తం 2,406 గిరిజన గ్రామపంచాయతీలున్నాయి. పెసా (షెడ్యూల్డ్‌ ప్రాంతాలకు పొడిగింపు) చట్టం ఈ పంచాయతీలకు వర్తిస్తున్నది. దీంతో ‘మా తండాలు, గూడాల్లో మా పాలన’ అనే నినాదానికి బలం చేకూర్చడమేగాక, ఆయా గూడాలు, తండాల అభివృద్ధికి కనీసం 5 లక్షలకు తగ్గకుండా నిధులు అందేందుకు సిఎం కెసిఆర్‌ తోడ్పడుతున్నారు. ఇక జిఐఎస్‌ మ్యాపింగ్‌, తనిఖీ యాప్‌, ఎస్సీ, ఎస్టీ ఎఫ్‌ఎంఎస్‌ పోర్టల్‌, ఆన్‌లైన్‌ ద్వారా లబ్ధిదారుల పర్యవేక్షణ, నిర్వహణ వ్యవస్థ, ఆదివాసీ గ్రాంట్స్‌ మేనేజ్‌ మెంట్‌ వ్యవస్థ, డిజిటల్‌ స్టాక్‌ రిజిస్టర్‌ వంటి సంస్కరణలను పారదర్శకత కోసం ప్రభుత్వం చేపట్టింది. ఇక్రిశాట్‌తో పంటలపై శిక్షణ, ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌తో ఎంటర్‌ ప్రెన్యూర్‌ షిప్‌, నాబార్డుతో మార్కెటింగ్‌ కార్యకలాపాలు, ట్రైబల్‌ లీడర్‌ షిప్‌ని పెంచడానికి నిర్మాణ్‌ వంటి పథకాలు అమలవుతున్నాయి.  

శాశ్వతంగా పోడు భూముల సమస్యల పరిష్కారం

రాష్ట్రంలో పోడు భూముల సమస్యకి శాశ్వత పరిష్కారం ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్‌ అధ్యక్షతన మంత్రులు ఇంద్ర కరణ్‌ రెడ్డి, జగదీశ్వర్‌ రెడ్డి, అజయ్‌ కుమాలర్‌తో కేబినెట్‌ సబ్‌ కమిటీ వేశారు. పర్యావరణ – పరిరక్షణ, అటవీ భూముల సంరక్షణ, ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ చట్టం అమలు, గిరిజనులు, గిరిజనేతరుల హక్కులను కాపాడటంపై ఈ కమిటీ కసరత్తు చేస్తున్నది. అయితే, ఈ కమిటీని వేసే సమయంలో సిఎం కెసిఆర్‌, రాష్ట్రంలో 87 శాతం పోడు భూముల ఆక్రమణ 12 జిల్లాల్లోనే ఉందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం, కొమురం భీం ఆసిఫాబాద్‌, మహబూబాబాద్‌, ములుగు, ఆదిలాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, కామారెడ్డి, ఖమ్మం, నిర్మల్‌, వరంగల్‌, నల్గొండ, నిజామాబాద్‌ జిల్లాల్లో మాత్రమే ఈ సమస్య ఉందనీ, దీన్ని పరిష్కరించే విషయంలో ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు.

గూడాలు, తండాల్లో అభివృద్ధి పథకాలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి, అటవీ భూముల్లో హక్కు పత్రాలున్న రైతులకు రైతు బంధు, రైతు బీమా, జీవన భృతికి ట్రైకార్‌ (Telangana Scheduled Tribes Cooperative Finance Corporation Ltd (TRICOR), ఎస్‌బిఐ (స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా) భాగస్వామ్యంతో సి.ఎం. ఎంటర్‌ ప్రెన్యూర్‌ షిప్‌ పథకం, ఉబర్‌ వేదికగా డ్రైవర్‌ ఎంపవర్‌మెంట్‌ పథకం అమలు అవుతున్నాయి. అలాగే గిరిజన ఆవాసాల్లో వ్యవసాయ ఉత్పత్తుల సరఫరాకు గ్రామీణ రవాణా పథకం అమలు చేస్తున్నారు. విద్యా రంగంలో ఇ- పాఠశాలలు, కంప్యూటర్‌ ల్యాబ్‌లు, గిరిజన గురుకులాల్లో ఐఐటీ/ నీట్‌ పరీక్షలకు శిక్షణ, ఐఐటీ ప్రవేశ పరీక్షలకు స్టార్స్‌ కార్యక్రమం అమలు అవుతున్నాయి. గిరిజన విద్యార్థులకు పోస్ట్‌ మెట్రిక్‌ ఉపకార వేతనాలు, అంబేద్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి వంటి సృజనాత్మక పథకాలు కూడా అమలవుతున్నాయి. గిరిజన మ్యూజియంల నిర్వహణతో గిరిజన సంస్కృతిని నలుదిశలా చాటి చెప్పే, పరిరక్షించే పలు పథకాలు అమలు అవుతున్నాయి. గిరిజన ఇంజనీరింగ్‌ విభాగం ద్వారా షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో మౌలిక వసతుల కోసం రహదారులు, భవనాల, జిసిసి, డిఆర్‌ డిపోలు, సామాజిక భవనాలు నిర్మిస్తున్నారు.

గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ సంస్థ (టిసిఆర్‌ అండ్‌ టిఐ) ద్వారా గిరిజన సంస్కృతిపై క్షేత్ర స్థాయి కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడంతోపాటు, ఆదివాసీ గిరిజనుల రాజ్యాంగ రక్షణల అమలు, పర్యవేక్షణ, సంక్షేమం, అభివృద్ధి పథకాల అమలు, వాటి ఫలితాల అంచనాలను ఈ సంస్థ వేస్తున్నది. గిరిజన కళలను ప్రోత్సహిస్తూ వారి సాంస్కృతిక అభ్యున్నతి కోసం పలు కార్యక్రమాలను చేపడుతున్నది. సిఎం కెసిఆర్‌ కేవలం సంకల్పంతో సరిపెట్ట లేదు. ఆదివాసీ, గిరిజనుల సంక్షేమం, సమాజ అభివృద్ధి కోసం అనేక పథకాలను రూపొందించి అమలు చేశారు. ఆ సంకల్ప శుద్ధితోనే ఈ సాఫల్యం.