|

కాంతి కిరణార్చనలు దసరా దీపోత్సవాలు

By:- డా॥ సాగి కమలాకర శర్మ

యా దేవీ సర్వ భూతేషు శక్తి రూపేణ సంసిశీవతా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమ:

చాంద్రమానం ప్రకారంగా ఆషాఢ శ్రావణ భాద్రపద ఆశ్వీజ మాసాలు నాలుగూ ప్రత్యేకంగా శక్తి సంబంధమైన మాసాలుగా గుర్తింపు బడినాయి. ఈ నాలుగు మాసాల్లోనే శక్తి ఆరాధనలు వేరు వేరు రూపాల్లో జరుగుతుంటాయి. ఈ విశ్వం నుండి, సూర్యుని నుండి అందే శక్తికి కృతజ్ఞతలు చెప్పడానికి ప్రత్యేక పూజలు చేస్తూ ఉండటం భారతీయ సంప్రదాయం. ఈ మాసాల్లో ఈ శక్తుల విజృంభణ అధికంగా ఉంటుంది. భూమిపైన జలశక్తి బాగా పెరుగుతుంది. దానివల్ల భూమికి ఉత్పత్తి శక్తి కలుగుతుంది. ఆ ఉత్పత్తిలో అనుకూలతలు,ప్రతికూలతలు కూడా ఉంటాయి. అనుకూలతలకు మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అదేవిధంగా ప్రతికూలతలను తట్టుకునే విధంగా శరీరాన్ని, గృహాన్ని, మనసును తయారు చేసుకోవాలి. అదీ ఒక పద్ధతి ప్రకారం కొనసాగాలి. ఆ పద్ధతులే మనం ఆచరిస్తున్న ఆచారాలు, సంప్రదాయాలు. వానిలో ఎన్నో వైజ్ఞానికాంశాలు ఉంటాయి. భారతీయ ధర్మం అంటే ప్రకృతి జ్ఞానమే. ఈ విషయాలను మనం ఇంకా కూలంకషంగా ఆశ్వీజమాసాన్ని గమనించి అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం.

ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు దసరా ఉత్సవాలు భారతదేశమంతటా జరుగుతుంటాయి. శక్తి స్వరూపమైన అమ్మవారిని వేరు వేరు రూపాల్లో ఆరాధించడం మన సంప్రదాయంగా ఉంది. సృష్టి శక్తి అనంతమైంది. దానిలో మనకు వినియోగ పడుతున్న శక్తిని ఆరాధించాలనే భావనతో రూపాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేసినవారు భారతీయులు. మన శరీరంలోని శక్తి కంటి ద్వారా చూసే శక్తిగా, చెవి నుండి వినే శక్తిగా, తింటే అరిగే శక్తిగా, రక్త ప్రసరణ శక్తిగా ఎన్నో రూపాల్లో  విస్తరించినట్లు… మూలమైన సూర్యశక్తి మన భూమి మీద వేరు వేరు శక్తుల రూపాల్లో విస్తరిస్తుంది. ఆ రూపాలకు సంబంధించిన  మూలాలను అధ్యయనం చేస్తే సూర్యకాంతిశక్తి యొక్క రూపాలను తెలుసుకోవచ్చు. 

తెలంగాణలో భాద్రపద అమావాస్య నుండి ప్రారంభించి ఆశ్వీజ శుద్ధ అష్టమి (దుర్గాష్టమి) వరకు బతుకమ్మ పండుగ పేరుతో ప్రకృతి ఉత్సవం జరుగుతుంది. ఇది కూడా శక్తి సంబంధమైన ఆరాధనే. 

పుష్పాలతో ఉత్సవం చేయడంలో ఎన్నో వైజ్ఞానికాంశాలున్నాయి. ఇవి స్త్రీలకు ఎంతో అవసరం కూడా. పసుపు, ఎరుపు వర్ణాల దర్శనం వల్ల మనస్సులో, శరీరంలోని వ్యతిరేకతలు తొలగుతాయి. శరీరానికి కొత్త శక్తులు సమకూరుతాయి. నిత్యజీవితంలోనూ గడపలకు పసుపు పూసి, కుంకుమలు రాసే విధానం అదే. అమ్మవారి ప్రతిరూపాన్ని కూడా పసుపుతో చేసి కుంకుమ బొట్టు పెట్టడమూ దానికోసమే. అందుకే ఆశ్వీజమాసంలోని ప్రకృతి ఉత్సవమైన బతుకమ్మ పండుగలో పసుపు వర్ణపు తంగేడు పూలు, ఎరుపు పూలతో బతుకమ్మను పేర్చి చూస్తూ ఉండడం, చుట్టూ తిరుగుతూ తొమ్మిది రోజులు పండుగ చేసుకుంటూ తమ శరీర, మానసిక వ్యతిరేకతలను తొలగించుకోవడం, రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఈ ఉత్సవ లక్ష్యం.

సూర్యుడు కన్యారాశిలోకి చేరినపుడు ఈ నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. కన్యారాశి శక్తికి కేంద్రం. ఆ శక్తికి సంబంధించి విషయాలు ఎన్నో పురాణగాథలు తెలియజేస్తూనే ఉన్నాయి. కన్యారాశి కన్నా ముందుగా సింహరాశి ఉంటుంది. సూర్యోదయ సమయంలో ముందుగా సింహరాశి ఉదయిస్తుంది, తర్వాత కన్యారాశి. ఈ సమయంలో ఆకాశంలో ఉన్న నక్షత్రాల ఆకృతులను గమనిస్తే కన్య అయిన అమ్మవారికి సింహం ధ్వజంగా ఉన్నట్లు కనిపిస్తుంది. సూర్యాస్తమయ సమయంలో క్రిందుగా సింహరాశి, పై వైపున కనిపించే కన్యారాశిని గమనిస్తే సింహం కన్యకు వాహనంగా కనిపిస్తుంది. ఈ అంశం మాత్రమే శక్తికి వాహనం ‘సింహం’ అనే విషయాన్ని స్పష్టం చేస్తుంది. వేరు వేరు శాస్త్రాల సమన్వయంతో అమ్మవార్ల వాహన నిర్ణయాదులను, ప్రత్యేకతలను అధ్యయనం చేయాల్సి వస్తుంది.

అమ్మవారి నవరాత్రులలో తొమ్మిది రూపాల్లో అలంకరించుకోవడం సంప్రదాయం. బాలాత్రిపుర సుందరి రూప అలంకారం నుండి ప్రారంభించి రాజరాజేశ్వరీ అలంకారంతో పూర్తి చేసుకుంటూ  ఉంటారు. ఈ రూపాల వెనుక కూడా సూర్య కిరణాల సంబంధమైన ప్రత్యేక శక్తులు దాగి ఉంటాయి. వాటిని తెలుసుకుంటే మన ఆరాధనల్లో వైజ్ఞానికత తెలుస్తుంది. 

బాలా త్రిపుర సుందరి లేదా ‘బాలా’ అమ్మవారి అలంకారం మొదటి రోజున చేసుకుంటాం. ఆ అమ్మవారు ఎరుపు వర్ణంతో ఉంటుందని ధ్యాన శ్లోకం తెలియజేస్తుంది. ‘‘అరుణ కిరణ జాలైః…..’’ అనే శ్లోకం ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. సూర్యుని ఉదయం కన్నా ముందుగా అరుణోదయం జరుగుతుంది. ఈ అరుణకాంతి భూమిపైకి ఉదయించే మొదటి కిరణంగా కనిపిస్తుంది. ఆ కిరణం ద్వారా భూమిపైన జీవులకు తొలి వెలుగు కనిపిస్తుంది. లోకం ఆనందమయం అవుతుంది. ఆ తొలి కిరణాన్ని ఉపాసించడమే బాలాదేవి పూజ. కిరణం అప్పుడే పుడుతున్న స్థితి కాబట్టి ఆ కిరణ ఉపాసనా భావనే బాలా త్రిపుర సుందరి అమ్మవారి అలంకారంగా నిర్ణయించబడింది. 

రెండవ రోజున గాయత్రీమాతగా అమ్మవారిని అలంకరించి పూజిస్తుంటారు. గాయత్రీమాత సూర్యోదయ సమయంలోని  సూర్యకిరణం. మన శరీరానికి డి`విటమిన్‌ అందజేసేది కూడా సూర్యకిరణమే. అది ఈ సమయంలో అధికంగా ఉంటుంది. ఈ భూమికి, ఈ శరీరానికి ఆరోగ్య రీత్యా రక్షణ కలిగించే కిరణమిది. అందుకే ఈ సమయంలో సూర్యనమస్కారాలు, సూర్యుని ఎదుటగా చేసే సంప్రదాయం ఉంది.  ‘డి’ విటమిన్‌ను అందించే ఈ మాతకు చేసే ప్రార్థన వల్ల బుద్ధి ప్రేరేపించబడుతుంది. సూర్యకిరణం ప్రత్యక్షంగా శరీరంలోకి చేరే విధానంలో గాయత్రీ మాత ఉపాసన కనిపిస్తుంది. ఉపాసన అంటే ఆ తత్త్వంతో మనం కలిసి ఉండడమే. నిరంతరం దానిని గూర్చిన ధ్యానమే కాకుండా, ఆ కిరణం ఎదురుగా ఉంటూ శరీరాన్ని, మనస్సును శుద్ధం చేసుకోవడమే.

మూడవ రోజున అన్నపూర్ణ అలంకార సంప్రదాయం ఉంది. భూమి మీద ఉండే వృక్షజాతిపైన సూర్యకిరణ ప్రభావం వల్ల (కిరణ జన్య సంయోగ క్రియ) వృక్షాలలో పిండి పదార్థాలు ఏర్పడి ఫలాలు పెరుగుతుంటాయి. ఆ ఫలాలను స్వీకరించడం వల్ల సాధారణంగా మనకు ఆకలి తీరడం జరుగుతుంది. అయితే ఈ భూమిపైన జీవులకు ఆహారాన్ని అందించే కిరణాన్ని ఉపాసించడమే అన్నపూర్ణాదేవికి చేసే నమస్కారం. ఆ కిరణానికి కృతజ్ఞత చెప్పుకోవడమే నవరాత్రులలో అన్నపూర్ణ అర్చన అవుతుంది. సూర్యకిరణమే పరోక్షంగా ఆహార రూపంలో మన శరీరంలోకి చేరుతుంది. 

ఇదేవిధంగా వరుసగా వేరు వేరు రూపాల్లో అలంకారాలు మనకు కనిపిస్తుంటాయి. మహాలక్ష్మీ అలంకారాన్ని గమనిస్తే ఈ భూమి మీద ప్రత్యక్షంగా కనిపించే రూప సంపదలు, పరోక్షంగా కనిపించే సంపదలు అనేకం ఉంటాయి. శరీరంలో ఆరోగ్యం, సంతోషం, సంతృప్తి, ధైర్యం మొదలైన అంశాలన్నీ సంపదలు. ఇవి కనిపించనివి. కనిపించేవి ధన, వస్త్ర రూపాది సంపదలు. భూమి మీద కూడా సూర్యుని కిరణ ప్రభావాల వల్ల సహజ వాయువు, బొగ్గు, పెట్రోల్‌, డీజిల్‌, అనేక ఖనిజాలతో కూడుకున్న మైన్స్‌ వంటివి ఎన్నో ఏర్పడుతుంటాయి. అవన్నీ శుద్ధి చేసుకొని మనం సంపదల రూపంలో వినియోగించుకుంటున్నాం.  ఇవన్నీ లక్ష్మీ స్వరూపంగా భావించి ఆ సూర్యకిరణాల్లోని మరో కిరణానికి ఆరాధన చేసే అలంకారమే మహాలక్ష్మీ అలంకారం. 

ఈ భూమిమీద ప్రకృతి ఏర్పడటానికి కారణం భూమి చుట్టూ ఉన్న ఓజోన్‌ పొర. ఈ ఓజోన్‌ పొర లోపల ఉండే పాంచ భౌతిక శక్తి వల్ల ఈ భూమిమీద జీవులు ఆనందంగా ఉంటున్నాయి. జలం, వాయువు, అగ్ని, వాతావరణం అన్నీ ఒక సమతుల్యంగా ఇక్కడ ఉండటానికి ఈ ఓజోన్‌ పొర కారణం. ఆ పొర రక్షించే పొరగా గుర్తింపబడింది. సూర్యుని ప్రత్యక్ష కిరణాలు ఈ పొర లోపలికి చొచ్చుకొని రాలేవు. లోపలికి వచ్చిన కిరణాలు ఇక్కడి వాతావరణానికి వినియోగపడేవిగా ఉంటాయి. ఈ ఓజోన్‌ పొరనే శ్రీసూక్తం ‘హిరణ్య ప్రాకారం’గా అభివర్ణించింది. దానిని రక్షించడానికి మారేడు వృక్షాలను పెంచాలని కూడా సూచనలు చేసింది.  ఈ హిరణ్య ప్రాకార అంతర్గతమైన సూర్య కిరణ శక్తి స్వరూపాన్ని ‘లలితా త్రిపుర సుందరి’గా భావించి అలంకరించడం సంప్రదాయం. లలితోపాసన భారతీయులంతా వేరు వేరు రూపాల్లో చేస్తున్నదే. 

మనిషికి ఒక వస్తు జ్ఞానం కలగాలంటే దానిపైన ఒక వెలుగు పడాలి. వస్తువుపై వెలుగు పడితే దానిని మనం చూడగలుగుతాం. అదేవిధంగా ఏదైనా నూతనాంశ స్ఫురణ కలగాలంటే మన మనస్సు మీద కూడా ఒక వెలుగు ప్రసారం ఉండాలి. అప్పుడే ఆ విషయ సంబంధమైన అవగాహన మనకు ఏర్పడుతుంది. ఈ భూమి మీద సకల వస్తు, వ్యవహార జ్ఞానాలన్నింటికీ తెల్లని సూర్యకాంతి మాత్రమే ఆధారం. ఈ తెల్లని కాంతి సముచ్ఛయానికి ఏర్పరచిన రూపమే మన సరస్వతీ అలంకారం. తెల్లని వస్త్రాలు, శ్వేత పద్మం మొదలైనవన్నీ తెలుపు సూర్యకాంతికి సంకేతంగా ఉంటాయి. ఆ జ్ఞాన స్వరూప కిరణోపాసనే ‘సరస్వతీ’ రూప అలంకారం. 

ప్రకృతి శక్తులలో ఏ శక్తి కొంచెం తగ్గినా భూమిలో అంతర్గతంగా ఉన్న సూక్ష్మజీవులు బయటకి వస్తుంటాయి. ఇటీవల మనం అనుభవించిన ‘కరోనా’ లాంటిదే ఇది. శరీరంలోనూ శక్తి తగ్గితే లోపలి కొన్ని ఇబ్బందికరమైన సూక్ష్మ జీవులు ఇబ్బంది పెడుతుంటాయి. ఈ లోప నివారణకు కూడా సూర్యకాంతి ఉపాసనే కావాలి. ఒక స్థాయిలోని తీవ్రమైన సూర్యకిరణాదులను అర్చన చేసే విధానమే ‘మహిషాసుర మర్దినీ’ అలంకారం. మహిషుడు కొమ్ములున్న రాక్షసుడు. ఇటువంటి కొమ్ములున్న సూక్ష్మ జీవుల నెన్నింటినో అణిచి వేసిన సూర్యకిరణానికి చెప్పే కృతజ్ఞతనే మహిషాసుర మర్దినీ అలంకార ఉపాసన. 

నడినెత్తి మీది సూర్యుణ్ణి చూడాలంటే అందరం తల ఎత్తాల్సిందే. ఆ తీవ్రమైన కిరణాలను ప్రత్యక్షంగా దర్శించలేక తల దించాల్సిందే. ఆ విధంగా మనని మనం తీర్చి దిద్దుకోవాలంటే కూడా ఆ సూర్యకిరణాన్ని ఉపాసించాల్సిందే. రాజ శబ్దానికి శ్రేష్టమైనది అని అర్థం. శ్రేష్టులకే శ్రేష్టమైనది రాజరాజేశ్వరీదేవి. అందుకే ఈ నడినెత్తి మీది సూర్యకిరణానికి చేసే ఉపాసన వల్ల సామాజిక ఉన్నత స్థితి కలగడమే కాకుండా, లోకానికి ఆదర్శవంతమైన స్థితి ఏర్పడుతుంది. 

ఈ విధంగా నవరాత్రులలో చేసే వేరువేరు అలంకారాలన్నీ సూర్యకిరణ శక్తులకు మనం చెప్పే కృతజ్ఞత మాత్రమే. ఆ కిరణాల శక్తులే మనని కాపాడేవి. మనకు నిరంతరం రక్షణను కలిగించే కిరణ శక్తిని సంవత్సరానికి ఒకసారి, ప్రకృతి శక్తి విస్తరించే సమయంలో రూపాలను ఆపాదింపజేసి పూజించడం భారతీయ సంప్రదాయంగా వచ్చింది. మన దసరా ఉత్సవాలలో అమ్మవారిని ఏ రూపంలో కొలిచినా, ప్రకృతిపైన ప్రభావం చూపిస్తున్న సూర్యశక్తికి చేసే ఉపాసనగానే భావించాల్సి ఉంటుంది. 

అమ్మవారి నవరాత్రులలో తొమ్మిది రూపాల్లో అలంకరించుకోవడం సంప్రదాయం. బాలాత్రిపుర సుందరి రూప అలంకారం నుండి ప్రారంభించి రాజరాజేశ్వరీ అలంకారంతో పూర్తి చేసుకుంటూ ఉంటారు. ఈ రూపాల వెనుక కూడా సూర్య కిరణాల సంబంధమైన ప్రత్యేక శక్తులు దాగి ఉంటాయి.

పుష్పాలతో ఉత్సవం చేయడంలో ఎన్నో వైజ్ఞానికాంశాలున్నాయి. ఇవి స్త్రీలకు ఎంతో అవసరం కూడా. పసుపు, ఎరుపు వర్ణాల దర్శనం వల్ల మనస్సులో, శరీరంలోని వ్యతిరేకతలు తొలగుతాయి. శరీరానికి కొత్త శక్తులు సమకూరుతాయి. 

శరీరానికి రోగనిరోధక శక్తి ఉంటే రోగమే రాదు. శక్తి తగ్గితే రోగం వస్తుంది. మనం ఎదుర్కోలేక పోయినప్పుడే ఏదైనా సమస్య అవుతుంది. శరీరానికి గాని, మనస్సుకు గాని తట్టుకునే శక్తి రావాలంటే సూర్యకిరణ శక్తి వల్ల మాత్రమే సాధ్యం అవుతుంది. దుర్గమమైన వ్యవహారాలను సుగమం చేసుకునే విధానం శక్తి వల్లనే జరుగుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుకోవడం కోసం, వ్యవహార శక్తి కోసం చేసే ఉపాసనే దుర్గోపాసన. దుర్గాదేవి అలంకారం ప్రకృతిలోని ఒక ఉన్నతమైన సూర్యశక్తికి సంకేతం. జీవితం సుగమం కావడానికి చేసే సూర్యకిరణ సంబంధ కృతజ్ఞత ఈ అలంకార ఉపాసన ద్వారా జరుగుతుంది.

ఏదైనా నూతనాంశ స్ఫురణ కలగాలంటే మన మనస్సు మీద కూడా ఒక వెలుగు ప్రసారం ఉండాలి. అప్పుడే  ఆ విషయ సంబంధమైన అవగాహన మనకు ఏర్పడుతుంది. ఈ భూమి మీద సకల వస్తు, వ్యవహార జ్ఞానాలన్నింటికీ తెల్లని సూర్యకాంతి మాత్రమే ఆధారం. ఈ తెల్లని కాంతి సముచ్ఛయానికి ఏర్పరచిన రూపమే మన సరస్వతీ అలంకారం.