|

పిల్లలు పాఠాలు ‘చూస్తున్నారు’…

By:- యం. రాము

చదివిన దాని కన్నా చూసిందే ఎక్కువగా గుర్తుంటుంది. అంతకు మించి బాగా అర్థమవుతుంది. ఈ కాలంలో 2డీ, 3డీ యానిమేషన్‌ దృశ్యరూప విద్యా బోధన ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో 3డీ యానిమేషన్‌ లో కళ్ళ ముందు కదిలే పదవ తరగతి పాఠ్యాంశాలు వచ్చాయి. వీటిని సిద్ధిపేట జిల్లా సర్కారు బడుల్లోని పదవ తరగతి విద్యార్థులకు అందించాలని సంకల్పించారు. మెరుగైన ఫలితాలు సాధించాలనే లక్ష్యాన్ని పెట్టుకుని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు ప్రత్యేక చొరవ-సొంత ఖర్చులతో ‘‘కేసీఆర్‌ డిజిటల్‌ కంటెంట్‌’’ పేరిట పదవ తరగతి విద్యార్థులకు పుస్తకాలు అందించారు.

విద్యార్థులు దృశ్య సహితంగా(యానిమేటెడ్‌ పాఠాలు) అభ్యసించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించొచ్చు. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి హరీశ్‌ రావు సిద్ధిపేట జిల్లాలో వినూత్న కార్యక్రమాన్ని తలపెట్టారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి విద్యార్థులకు ‘‘కేసీఆర్‌ డిజిటల్‌ కంటెంట్‌’’ను అందుబాటులోకి తెచ్చారు. 2021-22లో పదవ తరగతిలో 97.85 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో సిద్ధిపేట ప్రథమ స్థానంలో నిలిచింది. అదే స్ఫూర్తిని కొనసాగించే లక్ష్యంగా రాష్ట్ర మంత్రి హరీశ్‌ రావు అభ్యసనలో సరికొత్త ఒరవడి తెచ్చారు. సాంకేతికతతో కూడిన స్టడీ మెటీిరియల్స్‌ను హైదరాబాదుకు చెందిన ‘‘5 మంత్ర లెర్నింగ్‌ అకాడమీ’’ సహకారంతో సిద్ధిపేట జిల్లాలో ప్రవేశ పెట్టారు. ఈమేరకు సిద్ధిపేట పట్టణంలోని ఇందిరానగర్‌ ప్రాథమిక పాఠశాలలో ఆవిష్కరించి పదవ తరగతి విద్యార్థులకు డిజిటల్‌ పుస్తకాలు పంపిణీ చేశారు.

గణితం, భౌతిక-రసాయన, జీవ శాస్త్రం, సాంఘిక శాస్త్రం సబ్జెక్టుల్లో ప్రతి పాఠంలో ముఖ్యమైన అంశాలు యానిమేటెడ్‌-3 డీ వీడియోలుగా రూపొందించారు. వాటిని క్యూఆర్‌ కోడ్‌ రూపంలో నిక్షిప్తం చేశారు. పాఠ్యాంశాలకు సంబంధించి ప్రాథమిక స్థాయి ముఖ్య సమాచారం, దాని కిందనే క్యూఆర్‌ కోడ్‌ ముద్రించారు. ఫోన్‌ ద్వారా స్కాన్‌ చేయగానే అంశానికి సంబంధించిన యానిమేటెడ్‌ వీడియో అందుబాటులోకి వస్తున్నది. ఒక్కో అంశాన్ని 30 సెకన్ల నుంచి 5 నిమిషాల వరకూ నిడివితో రూపొందించారు.

సిద్ధిపేట జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే దాదాపు 11 వేల మంది విద్యార్థులకు స్టడీ మెటిరియల్స్‌ అందుబాటులోకి తెచ్చి ప్రతి పాఠశాలకు చేరే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం రూ. 20 లక్షల వరకు మంత్రి సొంత డబ్బులు వెచ్చించి తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో వీటిని రూపొందించారు.

తల్లిదండ్రులకు మంత్రి హరీశ్‌ లేఖ..

మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రభుత్వ పాఠశాలల ద్వారా నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. విద్యార్థుల జీవితంలో పదవ తరగతి చాలా కీలకమైనది. వారి భవిష్యత్తుకు పునాది వేసే వార్షిక పరీక్షలు సమీపిస్తున్నాయి. టీవీలకు, వినోదాలకు దూరంగా ఉంచండి. పిల్లలు ఇంటి దగ్గర చదువుకునేలా ప్రోత్సహించండి. అంటూ పదవ తరగతి విద్యార్థినీ, విద్యార్థుల తల్లిదండ్రులకు మంత్రి హరీశ్‌ రావు లేఖలు రాశారు.

బట్టీ పట్టకుండా నేర్చుకుంటున్నాం.

మా పాఠశాలలో ఇప్పటికే అన్ని సబ్జెక్టుల సిలబస్‌ పూర్తయ్యింది. ఇప్పుడు రివిజన్‌ క్లాసులు జరుగుతున్నాయి. స్టడీ మెటిరియల్స్‌ లోని క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ తో 3డీ యానిమేటెడ్‌ ద్వారా పాఠ్యాంశాలు వచ్చాయి. వాటితో ఇంకా బాగా అర్థమవుతున్నాయి. బట్టీ పట్టకుండా బాగా నేర్చుకుంటున్నాం.

  • అక్షయ, పదవ తరగతి విద్యార్థిని
    ఇందిరానగర్‌ హైస్కూల్‌

పిల్లలు ఇష్టంగా చదవాలి.. సిద్ధిపేటకు పేరు తేవాలి.!

2021-22 విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో రాష్ట్రంలో సిద్ధిపేట ప్రథమ స్థానంలో నిలిచింది. ఆ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు, విద్యార్థులు మంచి మార్కులు సాధించేందుకు ఉచితంగా డిజిటల్‌ పాఠాలు అందిస్తున్నాం. అలా వివిధ రూపాల్లో విద్యార్థులకు సహకారం అందిస్తున్నాం. పిల్లలు ఇంటికి వెళ్ళగానే సమయం వృథా చేయకుండా ఫోనులో పాఠ్యాంశాలను దృశ్య సహితంగా అభ్యసించడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉంటాయి. తల్లిదండ్రుల ఫోనులలో ఉదయం, రాత్రివేళ్ళలో డిజిటల్‌ పాఠాలు వింటూ మెళుకువలు నేర్చుకోవాలి. దీంతో ఇష్టంగా చదివే ఆస్కారం కలుగుతుంది. బాగా చదివి తల్లిదండ్రులకు, సిద్ధిపేట జిల్లాకు మంచిపేరు తేవాలి. ఈ విద్యా సంవత్సరం సిద్ధిపేట జిల్లా పదవ తరగతిలో అగ్రస్థానంలో నిలవాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం.

  • హరీశ్‌ రావు
    రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి