|

రేపటి తరానికి డిజిటల్‌ తెలుగు

తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభలను పురస్కరించుకుని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖ డిజిటల్‌ మాధ్యమాలలో తెలుగు వ్యాప్తిపై ఒక చర్చా గోష్ఠిని ఏర్పాటు చేసింది. శాఖ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ లాంఛనంగా ప్రారంభించిన ఈ చర్చా గోష్ఠిలో డిజిటల్‌ మాధ్యమాలలో తెలుగు భాషను వెలిగించేందుకు గత రెండు దశాబ్దాలుగా కృషిచేస్తున్న అనేక మంది సాంకేతిక నిపుణులు, భాషావేత్తలు, సృజనకారులు పాల్గొన్నారు.

తొలుత ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ మాట్లాడుతూ ”స్థానిక భాషల్లో కాంటెంటును అంతర్జాలంలోకి తీసుకొచ్చేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్‌ ఇండియాలో భాగంగా డిజిటల్‌ తెలంగాణ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. దాదాపు రూ.8 వేల కోట్ల ఖర్చుతో ‘టీ-ఫైబర్‌’ ద్వారా ఇంటింటికీ ఇంటర్నెట్‌ ప్రాజెక్టు అందించేందుకు పనులు జరుగుతున్నాయి. ప్రభుత్వ విభాగాలకు సంబంధించి ముఖ్యమైన వెబ్సైట్లన్నీ యూనికోడ్‌ లిపిలో రూపొందిస్తున్నాం, ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర పత్రికను, ప్రపంచ తెలుగు మహాసభల వెబ్సైట్‌ ను పూర్తిగా యూనికోడ్‌ తెలుగు ఫాంట్స్‌ వాడి రూపొందించాం. వ్యవసాయ సమాచారంతో కూడిన పోర్టల్ను తెలుగులో రూపొందించాం, త్వరలోనే ఆవిష్కరించనున్నాం. డిజిటల్‌ తెలుగు సమాచారాన్ని సాంకేతికతతో ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ముందుకు వచ్చే ఔత్సాహికులకు తగిన సహాయం అందిస్తాం.” అని అన్నారు.

డిజిటల్‌ మాధ్యమాలలో తెలుగు వాడుకను పెంచడానికి, సులభతరం చేయడానికి వ్యక్తిగతంగా, సంస్థాగతంగా జరుగుతున్న ప్రయత్నాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి సంఘటితంగా, సమష్టి కృషి జరగాలని, ఆ దిశగా సాగేందుకు తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ సహకారం ఉంటుందని జయేష్‌ రంజన్‌ హామీ ఇచ్చారు.

ఇదే సందర్భాన్ని పురస్కరించుకొని డిజిటల్‌ మాధ్యమాలలో తెలుగును వాడటానికి ఉపయోగపడే పనిముట్లను, అప్లికేషన్స్‌, ఇతరత్రా సాధనాలను ఒక్క చోట చేర్చిన వెబ్‌ పేజ్‌ (https://it.telangana.gov.in/digitaltelugu) డిజిటల్‌ మీడియా సంచాలకులతో కలిసి ఐటీ శాఖ కార్యదర్శి ఆవిష్కరించారు.

కార్యక్రమ సమన్వయకర్తగా వ్యవహరించిన డిజిటల్‌ మీడియా సంచాలకులు కొణతం దిలీప్‌ మాట్లాడుతూ, తెలుగు భాషను రేపటి తరం పలక మీద కాకుండా డిజిటల్‌ ఉపకరణాల మీదనే తొలిసారి నేర్చుకుంటారని అభిప్రాయపడ్డారు. అందుకే ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్న ఈ సందర్భంలో తెలుగు భాషకు సాంకేతికత జోడించి మరో వెయ్యేండ్లు అమ్మ భాషను నిలబెట్టేందుకు కృషిచేస్తున్న వారందరినీ ఒక్క వేదిక మీదికి తెచ్చేందుకు, ఈ రంగంలో జరుగుతున్న కృషిని, జరగవలసిన పనులను గుర్తించాలనే ఉద్దేశంతోనే ఈ చర్చా గోష్ఠిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

‘డిజిటల్‌ తెలుగు’ చర్చా గోష్ఠి స్థూలంగా నాలుగు అంశాలపై జరిగింది. 1. డిజిటల్‌ తెలుగు పరిణామక్రమం, నేటి వరకు జరిగిన కృషి, 2. బ్లాగులు, పత్రికలూ, వికిపీడియా, ఈ-కామర్స్‌ వంటి అన్‌-లైన్‌ వేదికలపై తెలుగు వాడకం 3. పదాలను శబ్దంగా మార్చే ప్రక్రియ (టెక్స్ట్‌ నుండి స్పీచ్‌), స్థానీకరణ (Localisation) 4. డిజిటల్‌ తెలుగు వాడుకను పెంపొందించే క్రమంలో ప్రభుత్వం, వ్యక్తులు, ఇతర సంస్థలు ఇకపై చేయవలసిన కృషి.

ఈ కార్యక్రమంలో వచ్చిన కింది సూచనలను ఐటీ శాఖ సూత్రప్రాయంగా అంగీకరించింది.

సదస్సులో వచ్చిన సూచనలు
1. ప్రపంచ అంతర్జాల సదస్సు ప్రతి రెండేళ్లకొకసారి నిర్వహించడం
2. డిజిటల్‌ తెలుగు రంగంలో ఉపకరణాలను అభివృద్ధి చేస్తున్న ప్రోగ్రామర్లకు ఒక పోటీని పెట్టడం ద్వారా వారిని గుర్తించడం, అదే సమయంలో తెలుగు వాడుకను పెంపొందించడం, సరళతరం చేయడం
3. కొత్త తెలుగు ఖతులను, ఉపకరణాలను, అప్లికేషన్స్‌ అభివృద్ధి చేయడంలో ఆ రంగంలో పనిచేస్తున్న వారికి అవసరమైన సహాయం అందించడం
4. ప్రభుత్వ ఉద్యోగులకు, రచయితలకు, విలేకరులకు, విద్యార్థులకు డిజిటల్‌ మాధ్యమాలలో తెలుగు వాడుకపై అవగాహనా సదస్సులను నిర్వహించడం
5. ప్రభుత్వ వెబ్‌ సైట్లలో తెలుగు వాడకాన్ని ప్రోత్సహించడం, దశల వారీగా తప్పనిసరి చేయడం
6. గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, ఫేస్‌ బుక్‌ వంటి అంతర్జాతీయ సాంకేతిక సంస్థలతో, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తలతో తెలుగును డిజిటల్‌ మాధ్యమాలలో విస్తృతంగా వినియోగంలోకి తెచ్చే ప్రయత్నాలు చేయడం

డిజిటల్‌ మీడియా విభాగం సహాయ సంచాలకులు మాధవ్‌ ముడుంబై, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ నుండి ప్రొఫెసర్‌ గారపాటి ఉమామ హేశ్వరరావు, సిలికానాంధ్ర అధ్యక్షులు కూచిబొట్ల ఆనంద్‌, తెలుగు భాషపై పనిచేస్తున్న సాంకేతిక నిపుణులు సురేష్‌ కొలిచాల, వీవెన్‌, శ్రీధర్‌ నలమోతు, క్రిస్టోఫర్‌, కృపాల్‌ కశ్యప్‌, ఫాంట్స్‌ రూపకర్తలు శ్రీధర మూర్తి, అప్పాజీ అంబరీష, పురుషోత్త్‌ కుమార్‌, ప్రముఖ బ్లాగర్లు కత్తి మహేశ్‌, జ్యోతి వలభోజు, సామాజిక మాధ్యమాలలో తెలంగాణ పదజాలం సేకరణ కోసం పనిచేస్తున్న సుధీర్‌ తాండ్ర, జిందగీ ఇమేజెస్‌ నుండి చేగొండి చంద్రశేఖర్‌ తదితరులు ఈ చర్చాగోష్ఠిలో పాల్గొన్నారు.

డిజిటల్‌ మాధ్యమాలలో తెలుగు ప్రస్థానం
డిజిటల్‌ తెలుగు చర్చా గోష్ఠిలో పాల్గొన్న వక్తలు గత రెండు దశాబ్దాల్లో అంతర్జాలంలో తెలుగు వాడుకలో వచ్చిన మార్పులను ఒకసారి నెమరువేసుకున్నారు. తొలితరం తెలుగు వెబ్‌ సైట్లు ముందు పేజ్‌ మేకర్‌ అనే డీటీపీ సాఫ్టువేర్‌ వాడి, సదరు పేజిని ఒక చిత్ర రూపంలో సేవ్‌ చేసి అప్పుడు వెబ్‌ పేజీలో పెట్టాల్సి వచ్చేది. లేకుంటే ఆ పేజ్‌ మేకర్‌ ఫైలును పిడీఎఫ్‌ ఫైలుగా మార్చి అయినా ఇంటర్నెట్‌ లో పెట్టాల్సి వచ్చేది. అప్పటికే డీటీపీ రంగంలో ప్రజాదరణ పొందిన అను ఫాంట్స్‌, శ్రీలిపి ఫాంట్స్‌ నే వెబ్‌ సైట్లకొరకు కూడా వాడేవారు. దీని వల్ల చాలా సమస్యలు ఎదురయ్యేవి. మొదటిది, ఇలా ప్రతీది చిత్ర రూపంలోనో, పీడిఎఫ్‌ లోనో పెట్టడం వల్ల ఫైలు సైజు విపరీతంగా పెరిగిపోయి పాఠకులకు ఆ పేజి చాలా ఆలస్యంగా డౌన్‌ లోడ్‌ అయ్యేది. ఒకసారి చిత్రంలా మార్చిన దానిలో మార్పులు చేర్పులు చేసే అవకాశం వుండేది కాదు. ఇక డీటీపీ సాఫ్టువేర్‌ లో కీబోర్డ్‌ కొంచెం క్లిష్టంగా వుండటం వల్ల దాంట్లో టైపు చెయ్యడం చాలమందికి కష్టమయ్యేది.

ప్రభుత్వరంగ సంస్థ అయిన ‘సి డాక్‌’ ఈ రంగంలో చాలా కృషి చేసి అన్ని భారతీయ భాషల్లోను పని చేసే ఫాంట్స్‌ తో కూడిన ఐ-లీప్‌ అనే పాకేజీని అభివృద్ది పరచింది. కాని ఎందుకో అది అంతగా ప్రాచుర్యంపొందలేదు. బహుశా ఐ-లీప్‌ సాఫ్ట్‌ వేర్‌ డబ్బులు పెట్టి కొనుక్కోవలసిరావడం ఇది అంతగా ప్రాచుర్యం పొందకపోవడానికి కారణమయి ఉంటుంది.

కొంత కాలానికి తెలుగు వార్తా పత్రికలు ఎవరికి వారు డైనమిక్‌ ఫాంట్లు అభివృద్ది పరచుకోవడం మొదలు పెట్టారు. వీటి వల్ల సమస్య కొంచెం పరిష్కారం అయినా, అందరికీ ఈ డైనమిక్‌ ఫాంట్లు వాడే వీలు లేకపోవడం, కీబోర్డ్‌ అంతగా సులువుగా లేకపోవడం వల్ల ఈ టెక్నాలజీ కొన్ని ఇంటర్నెట్‌ పత్రికల దగ్గరే ఆగిపోయింది.

ఇప్పుడు యూనికోడ్‌ టెక్నాలజీ ప్రాచుర్యంలోకి వచ్చింది. దీని గొప్పతనం ఏమిటంటే ఇది ఉపయోగించి ఏ భాషలోనైనా టైపు చెయ్యవచ్చు, దానిని ఇతర కంప్యూటర్లకు పంపించవచ్చు, వెబ్‌ పేజీలు తయారు చెయ్యవచ్చు. మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ 2000 నుంచి పూర్తిగా యూనికోడ్‌ ను సపోర్టు చెయ్యడం మొదలవటంతో ఇక ఈ రంగంలో కదలిక మొదలైంది.

ఇంటర్నెట్‌పై మాతృభాషలోనే సంభాషించుకోవాలనే ఆలోచన తెలుగువారికి పుట్టి రెండు దశాబ్దాలు దాటింది. అమెరికాలోని తెలుగు వాళ్లు వివిధ విషయాలపై చర్చించుకునేందుకు స్కిట్‌ (SKIT) అనే ఈ-మెయిల్‌ లిస్ట్‌ ను (లిస్ట్‌ సర్వ్‌) వాడటం 1990ల తొలినాళ్లలోనే మొదలైంది. ఇందులో సభ్యులందరు ఈ మెయిల్‌ ద్వారా సంభాషించుకునేవారు. వారి చర్చల్లో తరచూ తెలుగులో రాయగలిగే పరిజ్ఞానం ఏదైనా వుంటే బాగుండు అనే అభిప్రాయం వ్యక్తం అవుతూ ఉండేది. ఒకానొక దశలో అనేక వేలమంది తెలుగు వారు ఈ స్కిట్‌ లిస్ట్‌ సర్వ్‌ లో సభ్యులుగా ఉండేవారు.

1995లో ఈ-గ్రూప్స్‌ అనే కొత్తరకం ఇంటర్నెట్‌ సమూహాలు ఏర్పడటం మొదలైంది. అప్పుడే ‘తెలుసా’ అనే తెలుగు వారి ఈ-గ్రూప్‌ ఏర్పాటైంది. స్కిట్‌ క్రియాశీలక సభ్యుల్లో అనేకులు ‘తెలుసా’ లో చేరిపోవడంతో క్రమంగా స్కిట్‌ కనుమరుగైంది.

 • కెనడాలో సాఫ్ట్‌వేర్‌ రంగంలో పనిచేస్తున్న పాలమూరు వాసి కృష్ణ దేసికాచారి 1984 నుంచి కృషి చేసి ‘పోతన’ అనే తెలుగు ఫాంట్‌ ను తయారుచేశారు. ఇంటర్నెట్లో ప్రవేశపెట్టిన మొదటి తెలుగు ఫాంట్‌ అదే. కన్నెగంటి రామరావు, అనంద కిషోర్‌, జువ్వాడి రమణ సంయుక్తంగా ఆర్టీఎస్‌ (RTS) అనే ట్రాన్స్‌ లిటరేషన్‌ టెక్నాలజీని అభివృద్ది చేశారు. దీని సాయంతో చాలా తేలికగా ఇంగ్లీషు అక్షరాలను ఉపయోగించి తెలుగులో టైపుచేయటం సాధ్యపడింది. (ఉదా: బాగున్నారా అని టైపు చెయ్యాలంటే, baagunnaaraa అని చేస్తే చాలు).
 • 2000 సంవత్సరం నుండి తెలుగులో ఫాంట్లు, వాటిని తేలికగా వాడేందుకు కీబోర్డులు, ఎడిటర్లు డెవలప్‌ చెయ్యడం ఊపందుకుంది. ప్రస్తుతం బెంగుళూరులో వుంటున్న ప్రసాద్‌ చోడవరపు అనే సాఫ్టు వేర్‌ మేనేజర్‌ ‘తిక్కన’ అనే తెలుగు ఫాంటు, అలాగే తెలుగులో సులభంగా టైపుచేసేందుకు ‘రంగవల్లిక’ అనే ఎడిటర్‌ ను తయారుచేశాడు. అమెరికాలో ఉంటున్న శ్రీనివాస్‌ సిరిగిన, అనురాధ కోనేరు కలిసి తెలుగు లిపి అనే ఫాంటును అభివృద్ధి పరిచారు. త్రిపురోజు నారాయణ రావు ‘పాలక’ అనే తెలుగు నోట్‌ పాడ్‌ ను తయారుచేశాడు. హైదరాబాదు కేంద్రంగా పనిచేస్తున్న ఫ్రీ సాఫ్ట్‌ వేర్‌ ఫౌండేషన్‌ వారు కిరణ్‌ చంద్ర నేతృత్వంలో సృజన అనే ఫాంట్‌ ను డెవలప్‌ చేశారు. వీటి మూలంగా 2006 నాటికి ఇంటర్నెట్‌లో తెలుగు వాడకం బాగా జోరందుకుంది.
 • ఖమ్మం జిల్లా వాస్తవ్యుడు కిరణ్‌ చావా తెలుగులో తొలి బ్లాగర్గా చరిత్రకెక్కిండు. 2005 నుండి తెలుగులో బ్లాగులు రాసే వారి సంఖ్య క్రమంగా పెరిగింది. చేయి తిరిగిన రచయితలు, జర్నలిస్టులే కాక ఎందరో తొలితరం అంతర్జాల రచయితలు కూడా బ్లాగు వేదికగా అద్భుతమైన సాహిత్యం సృష్టించారు.
 • కత్తి మహేశ్‌, వీవెన్‌, చదువరి, చరసాల ప్రసాద్‌, జ్యోతి వలభోజు, సుజాత, సిబీ రావు, దార్ల వెంకటేశ్వర రావు, ఇట్లా ఎందరో తొలితరం బ్లాగర్లు అత్యంత ప్రజాదరణ పొందిన బ్లాగులు నిర్వహించేవారు. అన్ని బ్లాగుల విశేషాలను ఒకచోట చూపెట్టే కూడలి అప్పట్లో పాఠకులకు అత్యంత ఇష్టమైన వెబ్సైట్‌.
 • కొత్తగా అందివచ్చిన ఈ సాంకేతిక ఉపకరణాలను తెలంగాణ ఉద్యమకారులు కూడా భావజాల వ్యాప్తికి బాగా వినియోగించుకున్నారు. ప్రపంచం నలుమూలల ఉన్న తెలంగాణ యువతీయువకులు అటు బ్లాగుల్లో, ఇటు సామాజిక మాధ్యమాలలో తమ వాణిని బలంగా వినిపించారు.
 • WordPress అనే కాంటెంట్‌ మేనేజ్మెంట్‌ సిస్టం సాఫ్టువేర్‌ రావడంతో 2005 నుండి తెలుగులో వెబ్‌ మ్యాగజీన్ల సంఖ్య కూడా బాగా పెరిగింది. తొలితరం వెబ్‌ మ్యాగజీన్లలో సురేశ్‌ కొలిచాల నేతృత్వంలో వెలువడుతున్న ‘ఈ-మాట’, జయప్రకాశ్‌ (తెలంగాణ) తీసుకొచ్చిన డిస్కవర్‌ తెలంగాణ, ప్రాణహిత, సాజీ గోపాల్‌ తీసుకొచ్చిన ప్రజా కళ, చదువరి స్థాపించిన పొద్దు పత్రిక కూడా ఉన్నాయి.
 • పుస్తకాల రివ్యూలతో వచ్చిన పుస్తకం.నెట్‌, సినిమా రివ్యూలతో వచ్చిన నవతరంగం వెబ్‌ మ్యాగజీన్లు కూడా అమిత ప్రజాదరణ పొందినయి.
 • వెన్న నాగార్జున కృషితో 2003 డిసెంబర్‌ 10న ఆవిర్భవించిన తెలుగు వికీపీడియా దినదిన ప్రవర్ధమాన మైంది. ఇవ్వాళ కట్టా శ్రీనివాస్‌, ప్రణయ్‌ రాజ్‌ వంగరి, పవన్‌ సంతోష్‌ వంటి స్వచ్చంద కార్యకర్తల కృషితో వేలాది వ్యాసాలతో పరిపుష్టం అయ్యింది.
 • ఇప్పుడు తెలుగు సాహిత్యాన్ని ఆన్లైన్‌ లో అమ్ముకోగలిగే విధంగా అనేక ఈ-కామర్స్‌ వెబ్సైట్లు వస్తున్నాయి.
 • 2006 మార్చి 12 న మొదటిసారి హైదరాబాదులో తెలుగు బ్లాగరులు కొందరు తొలిసారి సమావేశమయ్యారు. వికీపీడియా మరియు బ్లాగుల ద్వారా తెలుగు కాంటెంట్‌ పెంచడానికి ఏమేం చర్యలు తీసుకోవాలో ఈ బృందం చర్చించింది.
 • ఈ కార్యక్రమాలన్నిటినీ ఒక గొడుగు కిందకు చేర్చి, ఒక లాభాపేక్ష లేని సంస్థ ఆధ్వర్యంలో చేస్తే మెరుగైన ఫలితాలను సాధించవచ్చని బృందం సభ్యులు వ-తెలుగు అనే సంస్థను అధికారికంగా 2008 ఏప్రిల్లో నమోదుచేయించారు. ఇంటర్నెట్‌ లో తెలుగు వాడకం గురించి విశేష కృషి చేసిన ఈ బృందం ‘మీ కంప్యూటర్‌ కు తెలుగు నేర్పడం ఎలా’ అనే చిన్న పుస్తకాన్ని ప్రచురించింది.
 • భారతీయ భాషల్లో కంప్యూటర్‌ పరిజ్ఞానాన్ని అందించాలనే ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం రెండు దశాబ్దాల కిందటే మొదలుపెట్టింది. అటు ప్రచురణ రంగానికి ఉపయోగపడే డీటీపీలోనూ, ఇటు ఇంటర్‌ నెట్‌ పైనా ఉపయోగించడానికి ప్రభుత్వరంగ సంస్థ అయిన సీ-డాక్‌ విడుదల చేసిన ఫాంట్లు, ఉపకరణాలు వివిధ కారణాల వల్ల ప్రజాదరణ పొందలేదు.

By: కొణతం దిలీప్‌