దశ-దిశ

ప్రజాభ్యున్నతికి పథకాల రూపకల్పన చేసేది పాలకులైనా, క్షేత్రస్థాయిలో వాటిని అమలుచేసే యంత్రాంగం మాత్రం అధికారులే. పాలకులు ఎంత సమున్నత పథకాలను రూపొందించినా, అధికార యంత్రాంగం వాటి అమలులో చిత్తశుద్ధి చూపకపోతే ఆ పథకాల లక్ష్యం నెరవేరదు. లబ్దిదారులకు ఆశించిన ఫలితాలు చేరువ కావు.

ఈ విషయం గ్రహించిన ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ఏప్రిల్‌ 17, 18 తేదీలలో హైదరాబాద్‌ లో జిల్లా కలెక్టర్ల సమావేశం నిర్వహించి క్షేత్రస్థాయిలో వివిధ పథకాల అమలు తీరుతెన్నులపై సమీక్షించారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు, వివిధ పథకాలు, కార్యక్రమాల లక్ష్యాలను కలెక్టర్లకు సమగ్రంగా వివరించిన ముఖ్యమంత్రి అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై జిల్లా కలెక్టర్లకు, అధికార యంత్రాంగానికి దశ, దిశ నిర్దేశనం చేశారు.

ఈ సదస్సును కూడా ఏదో నామమాత్రంగా జరపకుండా, రెండు రోజులపాటు నిర్విరామంగా నిర్వహించి, అన్ని విషయాలపైనా ముఖ్యమంత్రి స్వయంగా కలెక్టర్లతో ముఖాముఖీ మాట్లాడారు. క్షేత్రస్థాయిలో వివిధ పథకాల అమలుకు ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై ముఖ్యమంత్రి ఈ సదస్సులో సుదీర్ఘంగా ప్రసంగించడమేగాక, అక్కడికక్కడే పలు నిర్ణయాలు కూడా తీసుకున్నారు.

జిల్లా కలెక్టర్లకు వివిధ కార్యక్రమాల అమలుపై ఆదేశాలు జారీచేసిన ముఖ్యమంత్రి, అంతటితో ఆగకుండా, జిల్లా పాలనాధికారులైన కలెక్టర్లకు దైనందిన పాలనా వ్యవహారాలలో ఎదురవుతున్న సమస్యలను కూడా తెలుసుకొన్నారు. అత్యవసర, ముఖ్యమైన పనుల కోసం వ్యయపరచడానికి కలెక్టర్ల వద్ద నిధులు వుండటంలేదన్న విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి తక్షణం ఒక్కో జిల్లా కలెక్టరుకు 10 కోట్ల రూపాయల నిధులను కేటాయిస్తున్నట్టు అక్కడికక్కడే ప్రకటించారు. ముఖ్యమంత్రి ప్రకటించినదే తడవుగా, 2015- 16 సంవత్సరానికి మొత్తం 10 జిల్లాల కలెక్టర్లకు 100 కోట్ల రూపాయల నిధులను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీచేసింది. ఇకపై ప్రతీ ఏడాది ఇలాగే నిధులు మంజూరు చేస్తామని కూడా ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు.

ఇంతకాలం వివిధ పథకాల క్రింద వచ్చిన నిధులనే జిల్లా కలెక్టర్లు వ్యయపరిచేవారు. తమకంటూ ప్రత్యేకంగా నిధులు ఏవీ అందుబాటులో వుండేవికాదు. ఇప్పుడు ఒక్కో జిల్లా కలెక్టరుకు 10 కోట్ల రూపాయల నిధులు కేటాయించడం దేశంలోనే ప్రథమం.

ప్రభుత్వం అందిస్తున్న ఈ విధమైన ప్రోత్సాహం అధికారుల పనితీరుపై తప్పక ప్రభావం చూపుతుంది. ఇటు ప్రభుత్వం, అటు అధికార యంత్రాంగం చేయిచేయి కలిపి పనిచేస్తే సాధించలేనిది ఏముంటుంది?