నదీ జలాల పంపిణీ… జాతీయ, అంతర్జాతీయ న్యాయ సూత్రాలు

1966 హెల్సింకి రూల్స్‌ నుండి మొదలుకొని నేడు అమలులో ఉన్న యునైటెడ్‌ నేషన్స్‌ వాటర్‌ కోర్సెస్‌ కన్వెన్షన్‌ (UNWC), 1997 వరకు నీటి వినియోగాల్లో బేసిన్లోని ప్రాంతాలకు సమన్యాయం మరియు సహేతుకత (equitable and reasonable) ఆధారంగా నీటి కేటాయింపులు ఉండాలని నిర్ధేశిస్తున్నాయి. కానీ, క్రిష్ణా నదీ జలాలను ఏ విధమైన సహజ న్యాయసూత్రాలు గానీ, అంతర్జాతీయ న్యాయ సూత్రాలు గానీ పట్టించు కోకుండా, భిన్న వాదాలతో కేవలం ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల ప్రయోజనాలే ప్రాధాన్యంగా పరిగణించి నాటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో తీవ్ర వివక్ష చూపించాయి.

తెలంగాణ రెండు రకాలైన సమస్యలు ఎదుర్కొంటున్నది. ఒకటి, ఇప్పటికే ఉన్న వినియోగాలు అట్లాగే ఉంచాలనే వాదన. మరొకటి, బేసిన్‌ ఆవలకు మరల్చుకొనేందుకు తమకు బేసిన్‌ లోని ఆయకట్టుతో సమాన ప్రతిపత్తి
ఉంది అనే వాదన. ఈ రెండిరటిని జాతీయ అంతర్జాతీయ న్యాయ సూత్రాల పరంగా, నెలకొన్న పరిస్థితుల పరంగా విశ్లేషించడమే ఈ వ్యాసం లక్ష్యం.

వినియోగాల రక్షణలు (protection of existing uses):
తెలంగాణ పరంగా చూస్తే, 1948లో హైదరాబాదు రాజ్యం భారతదేశంలో కలిసినాక 1956 లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా హైదరాబాదు రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి తెలంగాణను ఆంధ్ర రాష్ట్రంతో విలీనం చేయడం తెలంగాణకు ఒక దురదృష్టకర పరిణామం. 1956 లో అంతర్రాష్ట్ర నదీ జలాలకు సంబంధించి పార్లమెంటు చేసిన రెండు చట్టాల్లో, రివర్‌ బోర్డుల చట్టం కంటే అంతర్రాష్ట నదీ జల వివాదాల చట్టానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వలన నదులకున్న సహజ మైన హైడ్రోలాజికల్‌ నదీ బేసిన్‌ ఏకత్వం దెబ్బ తిన్నది. అంతర్రాష్ట నదీ జల వివాదాల చట్టం, 1956 ప్రకారం కేవలం రాష్ట్రాలే జల వివాదాలను కేంద్రానికి ఫిర్యాదు చేయగలవు తప్ప, రాష్ట్రాల్లోని ప్రాంతాలు గానీ, ప్రజా సమూహాలు గానీ చేయడానికి వీలులేదు. అంత ర్రాష్ట నదీ జల వివాదాల చట్టం, 1956 ప్రకారం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల ఫిర్యాదుపై ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేసి పరిష్కరించాల్సిన అంశాలను నివేదిస్తుంది.

ఒక నది బేసిన్‌ అనేది ఒక నిర్ధిష్టమైన ఎల్లలు కలిగి ఆ బేసిన్‌ పరివాహక ప్రాంతంలో పడిన వర్షపాతం భూ ఉపరితలంపై పారుతూ నేరుగా గాని, ఉపనదుల ద్వారా గానీ ఆ నదిని చేరుతుంది. రాజ్యాల, రాష్ట్రాల సరిహద్దులు మారవచ్చు గాని నది బేసిన్‌ సరిహద్దులు ఎప్పుడూ మారవు. దేశంలో భిన్న చారిత్రక, రాజకీయ, భాషా సాంస్కృతిక కారణాల వల్ల రాష్ట్రాల సరిహద్దులేర్పడ్డాయి. ఆ సరిహద్దులు అనేక కారణాల వల్ల మార్పులు చేర్పులకు లోనయ్యాయి. నదీ బేసిన్‌ అథారిటీలను ఏర్పాటు చేయాలని 1950 వ దశకం నుండి ప్రయత్నాలు జరుగుతున్నా సాధ్యం కాలేదు. ఇప్పుడు భాషా ప్రయుక్త రాష్ట్రాలేర్పడి, బేసిన్ల ప్రాతిపదికన కాకుండా రాష్ట్రాల ప్రాతిపదికన నదీ జల వివాదాల ట్రిబ్యునళ్ళు ఏర్పడి నదీ జలాల కేటాయింపులు జరిపినాక నేడు నదీ బేసిన్‌ అథారిటీలు తెస్తే కూడా తెలంగాణ లాంటి రాష్ట్రాలకు ఒనగూడేదేమీ లేదు. ఏ అథారిటీలయినా ట్రిబ్యునళ్ళ కేటాయింపులకు లోబడే నడుచుకోవాల్సి వస్తుంది.

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఒక ప్రాంతంగా, కేవలం 33 శాతం జనాభా కలిగిన రాజకీయంగా ఒక మైనారిటీ ప్రాంతంగా తనకు నదీ జలాల పరంగా జరుగుతున్న అన్యాయాలను సరిదిద్దుకోలేని పరిస్థితి ఉండింది. కేంద్రం, ప్రభుత్వాలు, ప్లానింగ్‌ కమీషన్‌ వంటి సంస్థలు కూడా రాష్ట్రంలోని ప్రాంతాలకు జరుగుతున్న వివక్షను పట్టించు కోలేదు. అవి రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ప్రాంతాలను సమానంగా చూస్తాయనే పరిగణించాయి అని భావించాయి. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కృష్ణా నది బేసిన్లోని తెలంగాణ అవసరాల కంటే బేసిన్‌ ఆవలి ఆంధ్ర, రాయలసీమ ప్రాంత అవసరాలకు అధిక ప్రాధాన్య మీయడానికి నాడు రాష్ట్రంలో నెలకొని ఉన్న ఆధిపత్య రాజకీయాలు, రాష్ట్రానికి కేంద్రానికి మధ్య ఉన్న రాజకీయ సంబంధాలు తదితర అంశాలు ప్రభావాన్ని చూపాయి.
నదీజలాల వినియోగంలో సమన్యాయం కావాలనే ఒక ప్రధాన డిమాండ్‌ తో ఆరు దశాబ్దాల నిరంతర పోరాటం తరువాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు 2014లో జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన బిల్లును, 2014 ను పార్లమెంటులో ప్రవేశపెట్టిన Statement of Objects and Reasons ýË The creation of a separate State of Telangana for the betterment of the social, economic, political and other aspirations of the people of that region has been a long standing demand అని పేర్కొన్నది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ప్రధానంగా కృష్ణా, గోదావరి జలాల వినియోగంతో ముడిపడి ఉన్నాయి. నదీ జలాల పంపిణీ విషయంలో అంతర్జాతీయ న్యాయ సూత్రాలు ఏమి చెపుతున్నాయి, దేశంలో వివిధ సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వాలు ఏర్పర్చిన కమిటీలు, ట్రిబ్యూనళ్ళు ఏమి చెపుతున్నాయో చూద్దాము.

ఇండస్‌ కమీషన్‌ (1942)
ఇండస్‌ కమీషన్‌ సింధూ నదీ జలాలను భారత్‌, పాకిస్తాన్‌ దేశాల మధ్య పంపిణీ కోసం ఏర్పాటు చేసింది బ్రిటిష్‌ ప్రభుత్వం. ఆనాటికే దేశ విభజన ఖాయం అయ్యింది. సమన్యాయ వాటా ప్రకారం ఒకసారి కేటాయించినవి తరువాతి కాలంలో సమన్యాయ వాటాగా ఉండవు, ఉండాల్సిన అవసరం లేదు అని ఇండస్‌ కమీషన్‌ 1942 లో స్పష్టం చేసిన మాటలు ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవాలి. ఇండస్‌ కమీషన్‌ వ్యక్తం చేసిన అభిప్రాయాలను ఆ తర్వాతి కాలంలో బచావత్‌ మరియు బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యూనళ్ళు కూడా పరిగణన లోనికి తీసుకున్నాయి. మారిన పరిస్థితుల్లో ఒక ప్రాజెక్టులో అంతవరకు వినియోగించిన నీళ్ళు సర్వకాల సర్వావస్థల్లో అట్లాగే వినియోగించడం సాధ్యం కాదని ఈ రెండు కృష్ణా ట్రిబ్యునళ్ళు అభిప్రాయాలు వ్యక్తం చేశాయి.

బచావత్‌ & బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యూనల్‌ :
బచావత్‌ ట్రిబ్యునల్‌ ప్రస్తుతమున్న వినియోగాలకు ‘రక్షణ’ (preotections) ఇవ్వడాన్ని గురించి అభిప్రాయం వ్యక్తం చేస్తూ, ప్రస్తుత వినియోగాలకు రక్షణలు అట్లాగే కొనసాగించాలని గానీ, భవిష్యత్తులో మార్చకూడదన్నది గానీ మా ఉద్దేశ్యం కాదు అని స్పష్టం చేశారు.

బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ పేజీ 181లో
వెలుబుచ్చిన అభిప్రాయాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ని..“.. In determining the equitable share of the States, all the factors which create equities in favour of one State or the other have to be weighed as at the date when the current controversy is mooted. But population, engineering, economics, irrigation and other conditions constantly change and with changing conditions new demands for water continually arise. A water allocation may become inequitable when the circumstances, conditions and water needs upon which it was based are substantially altered”. (Emphasis supplied by KWDT-II). Thus KWDT-I found it prudent to make a provision for review after a lapse of certain given time i.e. after 31st May 2000.”

నేడున్న ఆంధ్రప్రదేశ్‌ ఇప్పటివరకు తాము వాడుతున్నట్లుగానే ఇక ముందు కూడా కృష్ణా నది నీటిని వినియోగించుకుంటామని, వాటిలో ఏ మార్పు చేయరాదని, ఇంకా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు నీటి అవరాలకు ఏ విధమైన భంగం వాటిల్లరాదని, ఇంకా తాము ఇబ్బడి ముబ్బడిగా పెంచుకుంటున్న వినియోగాల న్నింటికీ ప్రాధాన్యత ఇవ్వాల్సిందే అని వాదిస్తున్నది. ఇట్లా ఇప్పటికే ప్రాజెక్టులు కట్టుకొని, ఇంకా ప్రాజెక్టులు కట్టుకుంటున్న రాష్ట్రం వాటికి నీటి లభ్యత అలాగే కొన సాగాలని, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం ఏవైనా ప్రాజెక్టులు చేపడితే మా నీటి లభ్యతకు భంగం వాటిల్ల రాదని వాదించడం సరికాదని అంతర్జాతీయ నదీ జలాల న్యాయ సూత్రాలపై జరిగిన చర్చలు స్పష్టం చేస్తున్నాయి. లేకుంటే, ఇప్పటికే వినియోగాలేర్పరుచుకున్న రాష్ట్రం (early developers), ఒక కొత్త రాష్ట్రాన్ని (late developers) ఎప్పటికీ కొత్తగా ప్రాజెక్టులను కట్టుకోనివ్వదు.
అంతర్జాతీయ న్యాయసూత్రాల్లో మొదటి వినియోగదారులకు, వాళ్లకు రక్షణ అనే అంశాలను మార్చాలని అంతర్జాతీయ జలాల న్యాయ నిపుణులు కయి వేగేన్‌ రిచ్‌ మరియు ఆలివర్‌ ఒల్సోన్‌లు తమ “Late developers and the inequity of equitable utilization and the harm of do no harm” (2010) అనే వ్యాసంలో స్పష్టం చేశారు. లేనట్లైతే మొదటి వినియోగదారులు ఎల్లప్పుడూ అసమర్థంగా వ్యర్థంగా వినియోగిస్తున్నప్పటికీ అది కొనసాగుతూనే ఉంటుంది అని నిరసించారు. “Protecting the first developer within the international rules institutionalizes the inequity between riparian states, and therefore the rules are hindering late developing states from utilizing water resources and at the same time allowing the first developers to continue using the water resources (even in an inefficient or wasteful manner). Hence today, late developers have even less incentive to subscribe to these international rules. Given the international agenda on poverty reduction, the Millennium Development Goals, it is arguable that the existing recommendation on the sharing of international rivers should be revised so as not to favour the early developers but to have a more holistic perspective.”

1961లో ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ, పాకిస్తాన్‌ ప్రెసిడెంట్‌ అయూబ్‌ఖాన్‌కు లేఖల్లో గంగానది విషయమై (అప్పటికింకా బంగ్లాదేశ్‌ పాకిస్తాన్‌లో అంతర్భాగమే) చారిత్రక వినియోగాలను సాకుగా చూపిస్తూ రైపేరియన్‌ హక్కులున్నాయని ఏకపక్షంగా ప్రాజెక్టు వినియోగాలను పెంచుకుంటూ పోయి మా రైపేరియన్‌ హక్కులను పరిగణించకుండా మా అభివృధ్ధిని, వినియోగాలను పూర్తిగా నిరోధిస్తామంటే అది మేము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించం అని స్పష్టపరిచారు. అట్లా రైపేరియన్‌ హక్కుల మాటున భవిష్యత్తులో మరో రైపెరియన్‌ దేశం ఏ విధమైన వినియోగాలు చేపట్టకుండా నిరోధించడాన్ని ఆనాడే నెహ్రూ గుర్తించారని ప్రపంచ బ్యాంకు అంతర్జాతీయ నదీ జలాల న్యాయ సలహాదారు ఎంఏ సల్మాన్‌ తన ‘‘ది కాన్సెప్ట్‌ ఆఫ్‌ ఫోర్‌ క్లోజర్‌ ఆఫ్‌ ఫ్యూచర్‌ యుజెస్‌’’ (2010) అనే సిద్ధాంత వ్యాసంలో పేర్కొన్నారు. ఆ వ్యాసంలో ఆయన హెల్సింకి న్యాయసూత్రాల వలెనే యునైటెడ్‌ నేషన్స్‌ వాటర్‌ కోర్సెస్‌ కన్వెన్షన్‌, 1997లో కూడా సమన్యాయం మరియు సహేతుకత అనేది మూలాధార సూత్రంగా ఉందని, అదే అంతర్జాతీయ జల న్యాయంగా స్థిర పడిరది అని స్పష్టం చేశారు. (“similar to the Helsinki Rules, the principle of equitable and reasonable utilization is the fundamental and guiding principle of the UN Watercourses Convention, and consequently, of international water law.”

అంతర్జాతీయ జలాల న్యాయ కోవిదుడు, ప్రొఫెసర్‌ చార్లెస్‌ బౌర్న్‌ అదే విషయాన్ని చెపుతూ, ప్రస్తుతమున్న వినియోగాలు అనేది అనేక నదీ జలాల కేటాయింపులో పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాల్లో ఒక అంశం మాత్రమే అని స్పష్టం చేశారు. “a state is always entitled to a ‘reasonable and equitable share in the beneficial uses of the waters of an international drainage basin’ and ‘the past utilizations of the waters of the basin, including in particular existing utilization’ is only one of the many other factors to be taken into account in the determination of its share”.

అంతర్జాతీయ జలాల న్యాయ నిపుణుడు మరియు యునైటెడ్‌ నేషన్స్‌ అంతర్జాతీయ లా కమీషన్‌ మెంబర్‌గా పనిచేసిన ప్రొఫెసర్‌ ఎల్‌. కాఫ్లిష్‌ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, ఒకవేళ సమన్యాయం మరియు సహేతుకత (equitable and reasonable utilisations) అనేది నదీ జలాల వినియోగాల్లో పాటించకపోతే, కొత్త ఆర్థిక మరియు సామాజిక అభివృధ్ధి చేయాలనుకొనేవారు ఎప్పటికీ చేయలేరు, ఎల్లప్పుడూ ముందుగా విని యోగాలను చేపట్టిన వారి పక్షానే వినియోగాలుంటాయి అన్నారు. “if the no-harm rule were to prevail over the principle of equitable and reasonable utilization, it would heavily advantage lower riparians and disadvantage upstream states, and “the economic and social growth of any newcomer, in particular upstream countries, would be stunted.”

నాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలు. మొదట ఏదో విధంగా ప్రాజెక్టులను కట్టి వేసి ఆ తరువాత వాటి వినియోగాలను కొన్ని సంవత్సరాల తర్వాత ఇప్పటికే వాడుకలో ఉన్న (historical utilizations), స్థిరపడ్డ విని యోగాలు (established utilisations)గా హక్కులు అడగడం ఒక వ్యూహంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రాజెక్టుల పర్వం సాగింది. సామాన్య ప్రజానీకం ఎవరైనా అమాయ కంగా, అరే! ఇన్ని సంవత్సరాలనుండి వాడుతున్న వాళ్ళను ఎట్లా కాదంటారు? వాళ్ళకు నీటి కేటాయింపులు చేయడం సమంజసమే కదా అంటారు. కానీ క్రిష్ణా నది బేసిన్లోనే ఉన్న తెలంగాణ ప్రాంతాలకు నీరందించే ప్రాజెక్టులను కుదించి వేసి, కావాలని మొదలే పెట్టక, మొదలు పెట్టినా ఏదో ఒక సాకుతో సాగదీస్తూ, నాన్చుతూ పూర్తి చేయకపోవడం వల్ల ఎప్పటికీ ఆ ప్రాజెక్టుల కింద ఆయకట్టు వినియోగంలోకి రాక స్థిరపడ్డ వినియోగాలుగా చెప్పలేని పరిస్థితి ఏర్పడిరదనే విషయం ప్రజలకు వెంటనే అర్థంకాదు.

(మిగతా వచ్చే సంచికలో…)