బేసిన్‌ ఆవలికి మళ్లింపులు

By: శ్రీధర్‌ రావు దేశ్‌ పాండే, సల్లా విజయ్‌ కుమార్‌

(గత సంచిక తరువాయి)

క్రిష్ణా బేసిన్‌ నీటి కొరత గల బేసిన్‌. ఈ బేసిన్‌ నుంచి మరొక బేసిన్‌ నీటిని మళ్లించడం ఏ విధంగానూ సమర్థనీయం కాదు. ‘‘ఒకవేళ నీటి అవసరాలకు కొరత ఉన్నట్లైతే నది బేసిన్‌ పరిధి ఒక ఖచ్చితమైన ప్రదేశాన్నిస్తుంది, ఆ పరిధిలో నీటిని నిర్ణీత పద్ధతిలో కేటాయింపులు చేసుకోవాలి. లేకుంటే ఆ కొరత గల నీటి గురించిన డిమాండ్స్‌కు ఒక అంతం ఉండదు.’’ అని ప్రముఖ ఇంజనీర్‌, క్రిష్ణా-గోదావరి కమీషన్‌ ఛైర్మన్‌, ఎన్‌.డి. గుల్హాటీ  స్పష్టం చేశారు. “In case of scarcity of water in relation to requirements, the watershed boundary provides a definite area within which to ration the waters; otherwise there would be no end to the claims that may be made on the scarce resource.”

ఆంధ్రప్రదేశ్‌ బేసిన్‌ ఆవలికి మళ్లించే డిమాండ్సును పరిగణలోకి తీసుకోవద్దని కర్ణాటక, మహారాష్ట్రలు గట్టిగా కోరాయి. బచావత్‌ ట్రిబ్యునల్‌ జాతీయ అంతర్జాతీయ న్యాయ సూత్రాలను, న్యాయకోవిదుల అభిప్రాయాలను విస్తృతంగా, క్షుణ్ణంగా పరిశీలించినాక  ‘‘బేసిన్‌లోని ప్రాంతాలు బేసిన్‌ ఆవలి ప్రాంతాలకంటే ఆ నీటిపై ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. బేసిన్లోని ప్రాంతాల అత్యంత ఆవశ్యక అవసరాలను పట్టించు కోకుండా వేరెక్కడో అభివృద్ధిని అనుమతిస్తే గరిష్ఠ ఆర్థిక ప్రయోజనం సాధ్యం కాదు’’ అని స్పష్టం చేసింది. అయితే, ఇప్పటికే బేసిన్‌ ఆవలి ప్రాంతాలకు నీటిని తరలిస్తూ ఉంటే, వాటిపై ఆధారపడ్డ ఆర్థిక వ్యవస్థను తేలికగా భగ్నపరచవద్దు అని అభిప్రాయపడింది. 

ఇట్లా బేసిన్‌ ఆవల ఇప్పటికే ఎన్నో సంవత్సరాలుగా ఉన్న వినియోగాల దృష్ట్యా, అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టంలోని సెక్షన్‌-3 ప్రకారం రాష్ట్రాన్ని ఒక యూనిట్‌గా పరిగణించడం, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వాల భాధ్యత లాంటి విషయాలన్నింటిని బేరీజు వేసిన బచావత్‌ ట్రిబ్యునల్‌ తుదకు తన నిర్ణయంలో, బేసిన్‌ ఆవలికి నీటిని తరలించడం చట్టపరంగా సమ్మతమే అని పేర్కొంది. కానీ, ఈ విధంగా బేసిన్‌ ఆవలికి చేసే కేటాయింపులు చట్టసమ్మతమైనా, భవిష్యత్తు వినియోగాలకు న్యాయమైన కేటాయింపులు (equitable allocation)  చేస్తున్నప్పుడు అధిక ప్రాధాన్యత బేసిన్లోని వినియోగాలకు ఇవ్వాలి అని స్పష్టం చేసింది. 

బచావత్‌ ట్రిబ్యునల్‌ వెలుబుచ్చిన ఈ అభిప్రాయం ప్రకారం, ఆనాడు చారిత్రకంగా వాడుతున్న క్రిష్ణా డెల్టా సిస్టం అని చెప్పబడే ప్రకాశం బ్యారేజీ ఆయకట్టు, కేసి కెనాల్‌ ఆయకట్టుల వాస్తవ వినియోగాలు మాత్రమే ప్రధాన క్రిష్ణా నదిపై నాడున్న వినియోగాలుగా రక్షణకు అర్హమవుతాయి. మిగిలినవన్నీ, బేసిన్లోని ప్రాజెక్టులకు ప్రాధాన్యతనిచ్చి న్యాయమైన కేటాయింపులకు అర్హమౌతాయి. కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ వాదనలు ప్రధాన క్రిష్ణా నది నుండి బేసిన్‌ ఆవలి ఆయకట్టుకు ఎక్కువ కేటాయింపులుండే విధంగా సాగింది. ఆ వైఖరి వలన  తెలంగాణకు తీరని నష్టం జరిగింది.    

బచావత్‌ ట్రిబ్యునల్‌ తన రిపోర్టులో పరిగణలోకి తీసుకొన్న కొన్ని ప్రముఖ అభిప్రాయాలు చూద్దాం. ప్రముఖ అంతర్జాతీయ జలాల న్యాయ నిపుణుడు ఎల్‌.ఏ. టెక్లాఫ్‌, 1973లో,  UN ఇంటర్‌-రీజనల్‌ సెమినార్‌ ఆన్‌ కరెంట్‌ ఇష్యూస్‌ ఆఫ్‌ వాటర్‌ రిసోర్సెస్‌లో ‘‘బేసిన్‌ లోని భవిష్యత్‌ అవసరాలకు బేసిన్‌ ఆవలి ప్రస్తుత వినియోగాలకంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది’’ అని బలంగా వాదించారు.  

ప్రముఖ ఇంజనీర్‌ ఎన్‌.డి. గుల్హాటి, తన అంతర్రాష్ట్ర నదుల అభివృద్ధి, లా అండ్‌ ప్రాక్టీస్‌ అనే పుస్తకంలో ‘‘నది బేసిన్‌లోని ప్రాంతాలకు ఆ నదీ జలాలపై మొదటి యాజమాన్య హక్కు ఉంటుంది. బేసిన్‌ ఆవలి ప్రాంతాలు ఒకవేళ ఈ జలాలను మళ్లించుకోవాలంటే బేసిన్లోని ప్రాంతాల అవసరాలు పూర్తిగా తీరిన తర్వాత ఆ పైన లభించే జలాలను మాత్రమే’’ అంటూ, ‘‘ఏ సాగునీటి అవసరమైనా బేసిన్‌ అవసరాలను కాదని, బేసిన్‌ ఆవలికి పరిగణిస్తే, ఇప్పుడైనా ముందు ముందైనా అవాంఛనీయ ఉపద్రవాలకు దారితీయవచ్చు’’ అని హెచ్చరించారు. 

(పేజీ 127, KWDT-I Report) 

ఖోస్లా కమిటీ (1952), గోదావరి నుండి క్రిష్ణా నదికి జలాల మళ్లింపుపై తన అభిప్రాయం వ్యక్తం చేస్తూ, గోదావరి జలాలపై గోదావరి బేసిన్‌ ప్రాంతాలకే మొదటి యాజమాన్య హక్కులుంటాయి, గోదావరి బేసిన్‌ అవసరాల కంటే ఎక్కువున్న నీళ్ళను మాత్రమే క్రిష్ణా బేసిన్‌ కు మళ్లించడానికి అనుమతించాలి అని పేర్కొన్నారు (పేజీ 127, KWDT-I రిపోర్ట్‌). 

ఇవన్నీ పరిశీలించిన బచావత్‌ ట్రిబ్యూనల్‌ బేసిన్లోని అవసరాలు తీరినాకనే బేసిన్‌ అవలకు నీటిని మళ్లించాలని అధికతర అభిప్రాయం ఉంది అని పేర్కొంది. కృష్ణా ట్రిబ్యునళ్ళు బేసిన్‌ ఆవలి, బేసిన్‌ లోపలి వినియోగాలను ఒకే విధంగా పరిగణించాయి అని కొన్ని విశ్లేషణలు చెప్పుతున్నది సరికాదు. ‘‘ఈ ట్రిబ్యునల్‌ ఏ ప్రాంతానికైతే వినియోగం ఉద్దేశించబడిందో అది  బేసిన్‌ ఆవల ఉందా బేసిన్‌ లోపల ఉందా అన్న అంశం’’ పరిగణలోకి తీసుకున్నది అని బ్రిజేష్‌ కుమార్‌ స్పష్టంగా తెలియజేశారు.  

బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ కూడా తన రిపోర్టులో పలుమార్లు బేసిన్‌ ఆవలికి తరలించేవి కాబట్టి ఆ ప్రాజెక్టులకు కేటాయింపులు చేయలేమని ఖరాఖండిగా చెప్పింది. ‘‘బేసిన్‌ ఆవలికి కేటాయింపులు చేయడంపై నిషేదం లేదు కానీ, బేసిన్‌ లోపలి అవసరాలను పట్టించుకోకుండా ఒక పరిమితినిమించి చేయడం సరికాదు’’ అని స్పష్టం చేసింది. కేసి కెనాల్‌కు అదనంగా 29.57 టీఎంసీలు కేటాయించాలి అని నాటి ఆంధ్ర ప్రదేశ్‌ కోరినప్పుడు, వినియోగించాల్సిన ఆయకట్టు పెన్నా బేసిన్లో ఉన్నది కాబట్టి, ఇప్పటికే కేసి కెనాల్‌ కు బేసిన్‌ ఆవలి వినియోగాలకు కేటాయించబడి ఉన్నాయి కాబట్టి, ఇంకా బేసిన్‌ ఆవలి అవసరాలకు కేటాయించలేము అని తోసిపుచ్చింది. అట్లాగే, పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌కు 10 టీఎంసీ లు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్‌ కోరినప్పుడు అది క్రిష్ణా బేసిన్‌ ఆవలికి పెన్నా బేసిన్‌కు తరలించేందుకు కాబట్టి ఆ డిమాండులను సమ్మతించడం లేదు అని స్పష్టం చేసింది.

ఇప్పటికే ఉన్న వినియోగాలను సాధ్యమైనంత వరకు మార్చరాదు అని నాడున్న చారిత్రక వినియోగాల పరంగా చెప్పిన బచావత్‌ ట్రిబ్యునల్‌ పరిశీలనను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మరొకరకంగా ఉపయోగించు కుంది. మిగులు జలాలపై ఇచ్చిన స్వేచ్ఛ ఆధారంగా బేసిన్‌ ఆవలి ప్రాజెక్టులన్నీ సాధ్యమైనంత తొందరగా పూర్తి చేసుకుని మే 2000 తర్వాత ఏర్పడబోయే కొత్త ట్రిబ్యునల్‌ వద్ద ‘‘ఇప్పటికే ఉన్న వినియోగాలు’’ కాబట్టి తమ ప్రాజెక్టులకు కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని కోరేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఆ సందర్భంలోనే తెలంగాణ బేసిన్లోని ప్రాజెక్టులు పూర్తి చేయకుండా ఏదో ఒక కారణంతో వాయిదా వేస్తూ, బేసిన్‌ ఆవలి ఆంధ్ర ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు, వినియోగాలను పెంచుకునేందుకు ప్రయత్నించింది. అదేవిధంగా 2004-2013 వరకున్న బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ ఎదుట వాదించింది. అందువల్లనే, బేసిన్లోని పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్‌ స్కీం, దిండీ లిఫ్ట్‌ స్కీం,  కల్వకుర్తి లిఫ్ట్‌ స్కీం, నెట్టెంపాడు లిఫ్ట్‌ స్కీం, ఎస్‌ఎల్‌బిసి స్కీంలను ప్రక్కకు పెట్టి బేసిన్‌ ఆవలి తెలుగుగంగ, ఎస్‌ఆర్‌బిసి, హంద్రీ-నీవా, గాలేరు-నగరిలను ఉరికించింది నాటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. తెలుగుగంగకు కేటాయింపులు చేసుకోగలిగింది. కానీ, ఒకవేళ బేసిన్లోని తెలంగాణ ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ తప్పనిసరిగా వాటికి ప్రాధాన్యత ఇచ్చి నీటిని కేటాయించేది అనేది వాస్తవం.

ఈ సందర్భంగా క్రిష్ణా బోర్డు, అపెక్స్‌ కౌన్సిల్‌ల వద్ద ఆంధ్రప్రదేశ్‌ చేస్తున్న ఫిర్యాదులు చూస్తే నాటి ఆంధ్రప్రదేశ్‌ ధోరణి ఎట్లా ఉండదో, ఇప్పుడు దాన్ని ఎట్లా కొనసాగిస్తున్నదో తెలుస్తుంది. కల్వకుర్తి, నెట్టెంపాడు,  ఎస్‌ఎల్‌బిసి.. ఈ మూడు ప్రాజెక్టుల నీటి వినియోగాలను తెలంగాణ పెంచుకుంది, వాటిని బోర్డు అనుమతికి పంపలేదు అని ఫిర్యాదు చేసింది ఆంధ్రప్రదేశ్‌. నిజానికి ఈ ప్రాజెక్టులకు ఆయకట్టును మాత్రమే పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది నాటి ఉమ్మడి ప్రభుత్వం. ఆయకట్టుకు సరిపడా  నీటి వినియోగాలు మాత్రం పెంచలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఆ పెంచిన ఆయకట్టుకు సరిపోను నీటిని కేటాయించింది. కొత్తగా నీటి వినియోగం పెంచింది కాబట్టి ప్రాజెక్టు స్కోప్‌ మారింది, మా ప్రాజెక్టుల వినియోగాలకు భంగం వాటిల్లుతుంది కాబట్టి వాటిని ఆపివేయాలని కోరుతూ బోర్డుకు ఫిర్యాదు చేసింది నేటి ఆంధ్రప్రదేశ్‌. ఇదీ వారి కయ్యానికి కాలు దువ్వుతున్న ధోరణి. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి కొత్త ప్రాజెక్టులు, పాత ప్రాజెక్టులు అనే చర్చ ఒకటి ఆంధ్ర ప్రదేశ్‌ పునర్విభజన చట్టం, 2014 ఆధారంగా ముందుకు వచ్చింది. 2014 నాటికి కొనసాగుతున్న తెలంగాణ ప్రాజెక్టులను పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉమ్మడి రాష్ట్రం శాంక్షన్‌ చేసి అటకెక్కించిన ప్రాజెక్టులను తెలంగాణ అవసరాలకు అనుగుణంగా రీ ఇంజనీరింగ్‌ చేసుకొని పూర్తి చేసుకోవాల్సి ఉన్నది. ఇక అదే సమయానికి.. ఆంధ్రప్రదేశ్‌ తనకు న్యాయమైన వాటా (equitable share) కంటే చాలా ఎక్కువ నీటిని మళ్లించుకునే ప్రాజెక్టులు కట్టుకుంది, కొన్ని పూర్తయ్యే దశలో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో తెలంగాణను ఆంధ్ర ప్రదేశ్‌ ను ఒకే గాటన కట్టి, కొత్త ప్రాజెక్టులను కట్టాలంటే బోర్డు అనుమతి తప్పనిసరి అన్నట్లయితే ఎవరికి నష్టం? ఎవరికి లాభం? అసలు తెలంగాణ ప్రాజెక్టులను బోర్డులో ఆంధ్రప్రదేశ్‌ ఒప్పుకుంటుందా? బేసిన్లోని తెలంగాణ ప్రాజెక్టులకు నికర జలాల నీటి కేటాయింపులు ఇప్పుడున్న ట్రిబ్యునల్‌ తీర్పు రాకుండా సాధ్యమవుతుందా? అసలు కేంద్రం నివేదించిన రిఫరెన్సుల ద్వారా ఇప్పుడున్న ట్రిబ్యునల్‌ తెలంగాణకు న్యాయం చేయగలుగుతుందా? ఇవన్నీ సగటు తెలంగాణ నాగరికునిలో మెదుల్తున్న ప్రశ్నలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం, 1956, సెక్షన్‌ 3 ప్రకారం కృష్ణా జలాల పునః పంపిణీ కోసం ట్రిబ్యూనల్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది తెలంగాణ ప్రభుత్వం.  తెలంగాణ అభ్యర్థనను పక్కనబెట్టి  కేంద్రం ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం, 2014, సెక్షన్‌ 69 ప్రకారం బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యూనల్‌ కు నివేదించింది.    

ఈ సంవత్సరం జనవరిలో కేంద్ర ప్రభుత్వం కేంద్ర జల సంఘం అనుమతి లేని ప్రాజెక్టులన్నీ కొత్త ప్రాజెక్టులని మరొక నిర్వచనం ఇచ్చింది. ఇక దాని ప్రకారం బేసిన్లోని తెలంగాణ ప్రాజెక్టులు, బేసిన్‌ ఆవలి ఆంధ్ర ప్రాజెక్టులన్నీ ఒకే గాటన చేరాయి. దానికి తోడు ఇంతకు ముందున్నడూ ప్రతిపాదనలో లేని, మే, 2020 లో ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపాదించిన రోజుకు 6 నుండి 8 టీఎంసీలు శ్రీశైలం రిజర్వాయర్‌ నుండి మళ్లించే  ‘‘రాయలసీమ లిఫ్ట్‌ స్కీం – పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ – శ్రీశైలం కుడి ప్రధాన కాలువ-బనకచెర్ల క్రాస్‌ రెగ్యులేటర్ల’’ వ్యవస్థ కూడా జనవరిలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిర్వచనం ప్రకారం బేసిన్లోని తెలంగాణకు చెందిన పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్‌ స్కీమ్‌,  డిండి లిఫ్ట్‌ స్కీంలు (ఇవి ఉమ్మడి రాష్ట్రంలో శాంక్షన్‌ అయినవి) ఒకే గాటన చేరాయి. అసలు క్రిష్ణా బేసిన్‌ కు చెందిన ప్రాజెక్టులన్నీ క్రిష్ణా ట్రిబ్యునళ్ళ అవార్డుల ప్రకారం ఉండాలి. నేడు ట్రిబ్యునల్‌ కేటాయింపులు ఇంకా జరుగలేదు, వాదనలు నడుస్తున్నాయి. తమకు క్రిష్ణా నది జలాల్లో బేసిన్లోని తమ ప్రాజెక్టులకు న్యాయమైన వాటా కేటాయింపుల (equitable apportionment) కొరకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సెక్షన్‌-3 ఫిర్యాదు కేంద్రం వద్ద పెండింగులో ఉంది. మరి నీటి కేటాయింపులపై స్పష్టత లేకుండా ప్రాజెక్టుల నీటి కేటాయింపులను వినియోగాలను కేంద్ర జల సంఘం ఎట్లా పరిశీలించి అనుమతులిస్తుంది?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ చారిత్రక నేపథ్యం, ప్రస్తుతమున్న సాగునీటి సౌకర్యాలు, క్రిష్ణా తుంగభద్రా నదులపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులకు కుడి వైపు, ఎడమ వైపున్న నీటిని మళ్లించే కెపాసిటీలలో వ్యత్యాసం, రాష్ట్రం ఏర్పడేనాటికి ప్రాజెక్టుల ప్రతిపాదనలు ఎట్లా జరిగాయి లాంటి విషయాలన్నీ నేడు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ సంస్థలు పరిగణనలోకి తీసుకోవాలి. వాటి ఆధారంగా తెలంగాణ – ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రాల ప్రాజెక్టులను ప్రత్యేకంగా నిర్వచించి పరిశీలించాలి. మే, 5 న జరిగిన 12వ క్రిష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు మీటింగులో తెలంగాణ రాష్ట్రం ఈ విషయాలన్నీ ఏకరువు పెట్టింది. తెలంగాణ ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని కోరింది. కొత్త నిర్వచనం ఇవ్వాల్సిన అవసరం ఉంది అని నొక్కి చెప్పింది.

ఈనాడు ప్రపంచంలో సాంకేతిక పురోభివృద్ధి వల్ల వందలాది మీటర్ల ఎత్తుకు నదీజలాలను ఎత్తిపోయడం సాధ్యం అవుతున్నది. సాగునీటి ప్రాజెక్టుల ఆధునికీ కరణ, నూతన నీటి సరఫరా, యాజమాన్య విధానాల అమలు, తక్కువ పంట కాలం ఉండే ఆధునిక వంగ డాల వినియోగం, నీరు ఎక్కువ అవసరమయ్యే వరి, చెరుకు వంటి పంటల నుంచి తక్కువ నీరు అవసర మయ్యే కూరగాయలు, పండ్ల తోటలు, పూల తోటలు, ఉద్యాన వన పంటలు, తృణ ధాన్యాలు, ఇతర ఆరుతడి పంటలకు మళ్లడం…తదితరాల వల్ల నదీజలాల్లో వినియోగంలో మిగులు (savings) సాధ్యం అవుతున్నది. ఈ మారిన పరిస్థితుల్లో తప్పనిసరిగా ప్రాజెక్టుల నీటి వినియోగాల్లో కూడా మార్పు చేయాల్సిన అవసరం 

ఉంది. “A river basin is a topographic entity. While political boundaries may change from time to time and the governments which exercise control over a basin may change in number or in nature, the limits of the watershed of a river remain fixed for all time. In case of scarcity of water in relation to requirements, the watershed boundary provides a definite area within which to ration the waters; otherwise there would be no end to the claims that may be made on the scarce resource.” అని ప్రముఖ ఇంజనీర్‌, ఎన్‌.డి.గుల్హాటి 1972 లోనే తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. బేసిన్లోని వ్యవసాయానికి అనుకూలమైన భూమి ఒక పంటకు సాగునీటికై అలమటిస్తుంటే, బేసిన్‌ ఆవల భూముల్లో రెండో పంటకు, మూడో పంటకు సాగునీరి వ్వాలనడం, ఎక్కడో అయిదారు వందల కిలో మీటర్ల దూరంలో ఉన్న భూములకు నీళ్ళివ్వాలనడం సరికాదు. ఈ విషయాలన్నీ స్ఫురణలో ఉంచుకొని ప్రకాశం బ్యారేజీ వినియోగాలైనా, పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యు లేటర్‌ ద్వారా వినియోగాలైనా చూడాలి. అప్పుడు మాత్రమే బేసిన్లో ఉండే తెలంగాణ  ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేయడం సాధ్యం అవుతుంది.

జాతీయ జల విధానం కూడా నది బేసిన్‌ ప్రాతి పదికగా, బేసిన్లోని అవసరాలు, నీటి లభ్యతను బట్టి పంపకాలు చేసుకోవాలి అని పేర్కొంది అని గమనించాలి. పూర్తిగా కృష్ణా బేసిన్లోనే ఉన్న కరువు పీడిత ప్రాంతాలకు నీళ్లిచ్చే తెలంగాణ ప్రాజెక్టులకు లభించవలసిన న్యాయమైన వాటాను మళ్లించుకు పోతామంటే ఊరుకునేందుకు తెలంగాణ సిద్ధంగా లేదు. అటువంటి నీటి దోపిడిని తెలంగాణ అడ్డుకుంటుంది.