యాసంగిలో వరి ఎందుకు వద్దంటే..

తెలంగాణ రైతాంగానికి వ్యవసాయ శాఖ మంత్రి లేఖ

రాష్ట్ర రైతాంగం సంతోషంగా పంటలు పండిరచుకొని ఆర్థికంగా స్థిరపడాలని తెలంగాణ ప్రభుత్వం కోరుకొంటోంది. వ్యవసాయం ‘దండగ’ కాదు, ‘పండగ’ అని భావించే విధంగా రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకొంటూ వస్తోంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతాంగ విధానాల కారణంగా ‘తెలంగాణ రైతాంగం నష్టపోకూడదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు అనుగుణంగానే యాసంగిలో వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు సాగు చేయాలని సూచిస్తోంది.

తెలంగాణ ఉద్యమం మొదలయిందే ముఖ్యంగా నీళ్ల కోసం. సమైక్య రాష్ట్రంలో దాదాపు 22 లక్షల బోర్ల మీద ఆధారపడి వ్యవసాయం కొనసాగిస్తున్న పరిస్థితులలో వానలు రాక, కరంటు లేక, సాగు నీరు అందక నిత్యం యుద్ధం చేస్తున్న పరిస్థితి. అలాంటి పరిస్థితులలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే సమస్యల పరిష్కారానికి మార్గమని నమ్మి ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2001లో మలి దశ తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టారు. అనేక ఒడిదుడుకుల అనంతరం 14 ఏండ్ల సుదీర్ఘ ఉద్యమం, అనేక మంది అమరుల త్యాగాలు, ప్రజల అండదండలతో కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి, ప్రజాస్వామ్యబద్ధంగా పార్లమెంటును ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు.

సాగునీటి సదుపాయం

సుమారు ఆరు దశాబ్దాల పాటు సమైక్య పాలకుల వివక్ష మూలంగా తెలంగాణ రైతాంగం ఎంత నష్టపోయిందన్న విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కి స్పష్టమయిన అవగాహన ఉంది. వ్యవసాయమే వృత్తిగా దాదాపు 60 శాతం మంది జనాభా ఆధారపడిన ఈ రంగాన్ని బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో.. తెలంగాణ రాష్ట్ర ఫలాలు వీరికే మొదట అందాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన వెంటనే పెండిరగ్‌ ప్రాజెక్టుల మీద దృష్టిసారించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని మొదలుపెట్టి మూడున్నరేళ్లలో పూర్తి చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు ప్రస్తుతం 70 శాతం పైగా పూర్తయ్యాయి. సీతారామ సాగర్‌ ఎత్తిపోతల పథకం నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉంది.

వ్యవసాయ అనుకూల విధానాలు

ఆకలిచావులు, ఆత్మహత్యలు, వలసలతో సమైక్య రాష్ట్రంలో ఆత్మవిశ్వాసం కోల్పోయి వ్యవసాయానికి దూరమయిన రైతాంగానికి సాగునీరు అందించడం ఒక్కటే, సమస్య పరిష్కారానికి మార్గం కాదని కేసీఆర్‌ భావించారు. రైతులకు ఆత్మస్థయిర్యం కల్పించి ధైర్యంగా వ్యవసాయం చేసేందుకు దేశంలో, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా వినూత్న పథకాలకు శ్రీకారం చుట్టారు.

సాగునీరు అందించడంతో పాటు వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ సరఫరా, పంట పెట్టుబడి కోసం రైతు వడ్డీ వ్యాపారుల ముందు చేయిచాచకుండా ఉండేందుకు ఎకరానికి ఏడాదికి రూ.10 వేలు అందించే రైతుబంధు పథకం, వ్యవసాయమే జీవితంగా జీవిస్తున్న రైతు ఏ కారణం చేత మరణించినా వారి కుటుంబానికి రూ.5 లక్షలు అందించేలా రైతు బీమా పథకం, పంటల రుణమాఫీ, రాష్ట్ర వ్యాప్తంగా రైతుబంధు సమితుల ఏర్పాటు, ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక క్లస్టర్‌ ఏర్పాటు చేసి 2601 రైతువేదికల నిర్మాణం, ప్రతి క్లస్టర్‌ కు ఒక వ్యవసాయ విస్తరణ అధికారి నియామకంతో పాటు సమైక్య రాష్ట్రంలో మాదిరిగా రైతులు ఎరువులు, విత్తనాల కోసం ఇబ్బందులు పడకుండా వాటిని అందుబాటులో ఉంచడం, వ్యవసాయ యాంత్రీకరణకు పెద్దపీట వేసి, గోదాముల నిర్మాణం చేసి వ్యవసాయరంగాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వ పరంగా అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. దీనిమూలంగా గత ఏడేళ్లలో తెలంగాణ వ్యవసాయరంగ ముఖచిత్రం సంపూర్ణంగా మారిపోయింది. ఏడేళ్ల క్రితం ఆకలిచావులతో అల్లాడిన తెలంగాణ అన్నపూర్ణగా మారింది. తిండిగింజలకు తండ్లాడిన తెలంగాణ ధాన్యపురాశులతో కళకళలాడుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవసాయ అనుకూల విధానాల మూలంగానే ఈ విజయం సాధ్యమయింది.

అనూహ్యంగా పెరిగిన సాగు, పంటల దిగుబడి

తెలంగాణ వచ్చేనాటికి రెండు సీజన్లు కలిపి సాగుకు యోగ్యమైన భూమి 1 కోటి 31 లక్షల ఎకరాలు. 2020-21 సంవత్సరం నాటికి అన్ని పంటలు కలిపి సాగు విస్తీర్ణమైన భూమి 2 కోట్ల 15 లక్షల ఎకరాలు. నూతనంగా 84 లక్షల ఎకరాలలో సాగు మొదలయింది. ఈ ఏడేండ్ల కాలంలో సాగువిస్తీర్ణం 50 శాతానికి పైగా పెరిగింది. అలాగే 2014-15 లో వరి సాగు విస్తీర్ణం రెండు పంటలు కలిపి 34.96 లక్షల ఎకరాలు మాత్రమే ఉండగా, 2020-21 నాటికి 198.15 శాతం పెరిగి 104.23 లక్షల ఎకరాలకు చేరుకున్నది. 2014-15 లో వరి ధాన్యం దిగుబడి 68.17 లక్షల టన్నులు మాత్రమే ఉండగా, 2020-21 నాటికి అనూహ్యంగా సుమారు 3 కోట్ల టన్నులకు చేరుకున్నది.

తెలంగాణ ఆవిర్భావం అనంతరం 2014-15 సంవత్సరంలో 24.30 లక్షల టన్నుల వరిధాన్యం సేకరించగా. 2020-21 సంవత్సరంలో (480.25 శాతం వృద్ధి) 116.70 లక్షల టన్నులు పెరిగి 141.00 లక్షల టన్నుల వరి ధాన్యం సేకరించడమైనది. 2020-21 వానాకాలం మరియు యాసంగిలో ప్రభుత్వం ప్రతి సీజన్‌ లో 6,967 కేంద్రాల ద్వారా రైతుల కల్లాల వద్దే 1.41 కోట్ల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. ముఖ్యంగా దొడ్డు వడ్లు సాగు పెరగడానికి కేంద్రం అనుసరిస్తున్న విధానాలే కావడం గమనార్హం. పారాబాయిల్డ్‌ రైస్‌ వినియోగానికి తగినట్లు ఉత్పత్తి లేనందున దేశంలో సన్న రకాల కన్నా అధిక దిగుబడులు ఇచ్చే దొడ్డు రకాలకు అధిక మద్ధతుధర ఇచ్చి, వాటిని సేకరిస్తూ వచ్చిన కేంద్రం రైతులను ప్రోత్సహించింది. దిగుబడితో పాటు అధిక ధర లభించడం మూలంగా దశాబ్దాలుగా రైతాంగం దొడ్డు వడ్ల సాగుకు మొగ్గుచూపింది.

పెరిగిన సాగు విస్తీర్ణం, దిగుబడులకు అనుగుణంగా పంటల సేకరణకు తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి సహకారం అందిస్తూ వస్తున్నది. క్షేత్రస్థాయిలో వివిధ పంటల సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ముందే బ్యాంకుల ద్వారా నిధులు సేకరించి, యంత్రాంగాన్ని సమాయాత్తం చేసి, మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. ధాన్యం సేకరణ అనంతరం ఆరు నెలల తర్వాత కేంద్రం రైతులకు నిధులు విడుదల చేస్తుంది. అదే సమయంలో కేంద్రంతో సంబంధం లేకుండా తెలంగాణ రాష్ట్రం ధాన్యం కొనుగోలు చేసిన పది రోజుల లోపు రైతుల ఖాతాలలో నిధులు జమచేస్తూ వడ్డీభారాన్ని కూడా మోస్తున్నది. కరోనా విపత్తు సమయంలోనూ తెలంగాణ ప్రభుత్వం గ్రామ గ్రామాన రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ చేసింది. ఎఫ్‌ సీ ఐకి గోదాముల సామర్ధ్యం లేకున్నా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ గోదాంలతో పాటు ఫంక్షన్‌ హాళ్లు, రైతు వేదికలు, రైస్‌ మిల్లులు, పత్తి మిల్లులు, స్కూళ్లు, కళాశాల భవనాలు తదితర స్థలాలను ధాన్యం నిల్వకు ఉపయోగించడం జరిగింది.

తెలంగాణ ధాన్యం కొనుగోలుకు కేంద్రం నిరాకరణ

అయితే ఉన్నఫళంగా కేంద్రప్రభుత్వం తెలంగాణలోని యాసంగి ధాన్యం కొనుగోలు చేయలేమని స్పష్టం చేసింది. గత ఆరు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నా స్పష్టత ఇవ్వడం లేదు. దేశంలోని వివిధ రాష్ట్రాలలో వానాకాలంలో మాత్రమే వరి పంట సాగుచేస్తారు. తెలుగు రాష్ట్రాలలో వానా కాలంతో పాటు యాసంగిలో వరి విస్తారంగా సాగు చేస్తారు. ముఖ్యంగా తెలంగాణలో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా యాసంగి వరి ధాన్యంలో ఎక్కువగా దొడ్డు రకాలే సాగుచేస్తారు. సన్న వడ్ల సాగులో పెట్టుబడి అధికంగా ఉండడంతో పాటు దిగుబడి తక్కువగా రావడం, మద్దతు ధర ఆశించినంతగా లేకపోవడం మూలంగా దొడ్డు రకాలను మాత్రమే సాగుచేస్తారు. దొడ్డు రకాలను బియ్యంగా మార్చినప్పుడు యాసంగి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా నూక శాతం ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో, నూక శాతం తగ్గించడానికి బాయిల్డ్‌ రైస్‌ రూపంలో ఎఫ్‌ సీ ఐ సేకరిస్తూ వస్తున్నది. అయితే ఈ ఏడాది యాసంగి నుండి తెలంగాణలో బాయిల్డ్‌ రైస్‌ సేకరించలేమని హఠాత్తుగా ప్రకటించి తెలంగాణ రైతాంగానికి షాక్‌ ఇచ్చింది. దేశంలో పారా బాయిల్డ్‌ రైస్‌ వినియోగం తగ్గిందని, బియ్యం నిల్వలు పెరిగి పోయాయన్నది కేంద్రప్రభుత్వ వాదన.

ధాన్యం సేకరణ కేంద్ర ప్రభుత్వ విధి

దేశంలో రైతులు పండిరచే పంటలకు మద్దతుధర ప్రకటించడం, వాటిని సేకరించి, నిల్వ చేసి, కరువుకాటకాలు తలెత్తినప్పుడు కార్మికులు, సైనికులకు పంపిణీ చేయడమే కాకుండా సమాజంలో ఉన్న పేద బడుగు బలహీనవర్గాలకు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా నిరంతరం సరఫరా చేయడం కేంద్రప్రభుత్వ విధి. ఇది 1960 దశకం నుండి కొనసాగుతూ వస్తున్నది. కేంద్రం ప్రకటించిన మద్దతుధరకు వరి ధాన్యం కొనుగోలు చేయడం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎఫ్‌ సీ ఐ చేస్తుంది. 2015లో ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలోని కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసిన శాంత కుమార్‌ కమిటీ పంటల కొనుగోలు మాత్రమే కాకుండా ఎఫ్‌ సీ ఐ సంస్థ పంటల ఎగుమతుల మీద కూడా దృష్టిసారించాలని, నిల్వల సామర్ధ్యం పెంచుకోవాలని, పండిన పంటలన్నీ మద్దతుధరకు కొనుగోలు చేయాలని నివేదికలో సూచించింది. కానీ కేంద్రం ఆ దిశగా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం డబల్‌ గేమ్‌

తెలంగాణలో యాసంగి వరి ధాన్యం సేకరణ విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరి దూడను చీకమని, బర్రెను తన్నమని చెప్పినట్లుంది. తెలంగాణలో ఈ యాసంగి నుండి బాయిల్డ్‌ రైస్‌ సేకరణ ఉండబోదని కేంద్రం స్పష్టంగా ప్రకటించింది. ధాన్యం సేకరణ, వరి సాగు విషయంలో కేంద్ర మంత్రులు పీయూష్‌ గోయల్‌, నరేంద్ర సింగ్‌ తోమర్‌ భిన్న వాదనలతో తెలంగాణ రైతాంగాన్ని గందరగోళ పరుస్తున్నారు. గత ఏడాది కొనుగోలు చేసిన ధాన్యం నుండి తీసిన బియ్యం ఇక్కడి గోదాముల నుండి తరలించకుండా, ఆ నెపాన్ని తెలంగాణ రాష్ట్రం మీద నెట్టి రైతులను కేంద్రం తప్పుదారి పట్టిస్తున్నది. ఇంకో వైపు కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ అసలు వరి సాగు విషయంలో తాము తెలంగాణకు ఎలాంటి ఆంక్షలు విధించలేదని పార్లమెంటులో ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. బాయిల్డ్‌ రైస్‌ సేకరించలేమని ఒకవైపు, వరి సాగు మీద ఆంక్షలు లేవని ఇంకో వైపు ప్రకటించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వంద విధానాలు స్పష్టంగా అర్థమవుతున్నాయి. ఇప్పటికే తెలంగాణలో గత సీజన్‌లో సేకరించిన బియ్యం నిల్వలు ఖాళీ చేయకుండా సకాలంలో బియ్యం తరలింపుకు రైల్‌ ర్యాక్‌లు పంపకుండా ఎఫ్‌సీఐ వేధిస్తున్నది. కేంద్రం ప్రకటనలు ఈ విధంగా ఉంటే తెలంగాణ బీజేపీ నేతలు వరి సాగు మాత్రమే చేయాలని ప్రచారం చేస్తూ రైతాంగాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. తెలంగాణ రైతాంగం ఈ భిన్న వైఖరులను గమనించాలి. వాస్తవంగా దేశంలో కొరత ఉన్న పప్పుధాన్యాలు, నూనె గింజలను ఇతర దేశాల నుండి సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వం వెచ్చించే రూ.2 లక్షల కోట్లకు బదులు, శాంతాకుమార్‌ కమిటీ సూచన మేరకు దేశంలో వాటి సాగుకు, రాష్ట్రాల ద్వారా వాటిని సేకరించేందుకు కేంద్రం సహకారం అందించాలి. దేశంలో వివిధ రంగాలలో కార్పోరేట్‌ సంస్థలకు సుంకాలను తగ్గిస్తూ, లక్షల కోట్ల రుణాలను రద్దు చేస్తూ అండగా నిలుస్తోంది. కానీ ప్రపంచానికి అన్నం పెట్టే వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం అందించడం లేదు. ఈ విషయంలో కేంద్రం కార్పోరేట్లకు ఇస్తున్న సహకారం వ్యవసాయ రంగానికి అందిస్తే రైతులకు ఇబ్బందులు తొలుగుతాయి. ఆ దిశగా కేంద్రం ఆలోచించకపోవడం దురదృష్టకరం.

వరికి బదులుగా ఇతర పంటల సాగు మేలు

తెలంగాణ నేలలు అన్నిరకాల పంటల సాగుకు అనుకూలం. దీనిని గమనించే ముఖ్యమంత్రి కేసీఆర్‌ సాగునీటి రంగానికి ప్రాధాన్యతనిచ్చి స్వల్పకాలంలో సాగునీరు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఏ పంటకైనా సాగునీటి వసతి అనివార్యం. వరి సాగుకు మాత్రమే అనుకూలంగా ఉండే కొన్ని భూములను వదిలేస్తే మిగిలిన భూములలో వైవిధ్యమయిన పంటలను పండిరచవచ్చు. అందుకు తగిన వాతావరణ పరిస్థితులు ప్రపంచంలో కొన్ని ప్రాంతాలకు మాత్రమే సొంతం. అందులో తెలంగాణ ప్రాంతం ఒకటి. గతంలో బోర్ల కింద భిన్నపంటలు సాగుచేసిన అనుభవం తెలంగాణ రైతాంగానికి ఉంది.

ప్రస్తుతం ఉన్న వసతులను సద్వినియోగం చేసుకుని మార్కెట్లో డిమాండ్‌ ఉన్న వివిధ రకాల ఇతర పంటలను సాగు చేయాల్సిన అవసరం ఉంది. దీనికి గాను తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే తొలిసారి మార్కెట్‌ రీసెర్చ్‌ అనాలసిస్‌ వింగ్‌ ను ఏర్పాటు చేసి ప్రతి సీజన్‌ కు ముందే ప్రభుత్వ బాధ్యతగా ఏ రకమైన పంటలు సాగు చేయాలి ? రైతులకు ఎలాంటి లాభం ఉంటుందో దానికి అనుగుణంగా సూచనలు చేస్తున్నది. రైతు వేదికల ద్వారా క్షేత్రస్థాయిలో వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులకు ఇతర పంటల వైపు మళ్లాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ వస్తున్నారు. వరి సాగు సుళువుగా ఉండడం, ఇతర పంటల సాగులో కూలీల సమస్య ప్రధానంగా రైతులను వేధిస్తున్నది. అయితే ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని ఆరేళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా వారి వైఖరిలో ఎటువంటి చలనం లేదు.

కేంద్ర ప్రభుత్వ మోసపూరిత విధానాలను పసిగట్టిన తెలంగాణ ప్రభుత్వం గత కొంతకాలంగా తెలంగాణ రైతాంగాన్ని అప్రమత్తం చేస్తూ ఆరుతడి పంటల వైపు మళ్లించే ప్రయత్నాలను చేస్తూ వస్తున్నది. అరవై ఏండ్లు నష్టపోయిన తెలంగాణ రైతాంగం సంతోషంగా పంటలు పండిరచుకుని ఆర్థికంగా స్థిరత్వం సాధించాలని తెలంగాణ ప్రభుత్వం సాగునీరు, ఉచిత కరంటు, రైతుబంధు, రైతుబీమా పథకాలను ప్రవేశ పెట్టింది. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ, రైతు వ్యతిరేక విధానాలను అర్ధం చేసుకుని తెలంగాణ రైతాంగం ఈ యాసంగిలో వరికి బదులుగా ఇతర పంటలు మాత్రమే సాగు చేయాలని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం ఇచ్చే, మార్కెట్లో డిమాండ్‌ ఉండే పప్పు గింజలు, నూనెగింజలు వంటి పంటలను సాగు చేసి అధిక ఆదాయం పొందాలని ఆకాంక్షిస్తున్నది.

ఇట్లు

సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి
రాష్ట్ర వ్యవసాయ శాఖామాత్యులు