డోలి నృత్యం
By:- డా. ద్యావనపల్లి సత్యనారాయణ

కోయ సంఘ వ్యవస్థను ఐదుగురు వ్యక్తులు నడిపిస్తారు. వారు: దొర, పటేల్, వడ్డె, అడితి బిడ్డ, తలపతి. దొర, పటేల్ అనుమతి మేరకు తలపతి ఆధ్వర్యంలో వడ్డె ఇలవేలుపు (దేవత) కొలుపును నిర్వహించగా అడివి బిడ్డ డోలి అనే వాయిద్యాన్ని వాయిస్తూ, పాటలు పాడుతూ పడిగె (చిత్రపటం) ఆధారంగా కోయల చారిత్రక గాథలను వల్లిస్తాడు. ఇలవేల్పును గుట్ట పై నుండి జాతర స్థలానికి ఎదుర్కోవడానికి, మళ్ళీ తిరిగి సాగనంపడానికి డోలి కోయలే ముందుండి వాయిస్తారు. ఈ సందర్భంగా వీరు పాటలు పాడుతూ వాద్య శబ్దానికి అనుగుణంగా వలయాకారంలో తిరుగుతూ నృత్యం కూడా చేస్తారు. 2020 సంవత్సరపు మేడారం జాతర నుండి డోలి కోయలది ఒక ప్రత్యేక నృత్యంగా పేరు సంపాదించుకుంది. ఇలాంటి డోలి కోయ కళాకారుడు సకినె రామచంద్రయ్యకి భారత ప్రభుత్వం 2022లో పద్మశ్రీ పురస్కారాన్నిచ్చి సత్కరించింది.
కొమ్ము నృత్యం:

కోయలు అడవి దున్నపోతు (గొర్రెపోతు) కొమ్ములతో తయారు చేసుకున్న ‘సింగ’ అను శిరస్త్రాణము (టోపి) ధరిస్తారు. తాటాకులతో తలపైన బోర్లించుకునే పరిమాణంతో సింగ తయారు చేస్తారు. దాని పై మధ్య భాగంలో జానెడు ఎత్తు ఉండేట్లు తుంచిన నెమలి ఈకలను చెక్కుతారు. సింగకు కుడి, ఎడమ వైపుల కొమ్ములను అమర్చుతారు. తాటాకులు కనపడకుండా ముదురు రంగు (పచ్చ లేదా ఎరుపు) చీరను (పెర్మ కోక) చుట్టుతారు. నెమలి పురికట్ట, కొమ్ముల చుట్టూ చుట్టగా మిగిలిన చీరను సింగ వెనుక వైపుకు వదులుతారు. ఇలా తయారైన సింగను నర్తకుడు ధరించినప్పుడు అతని తలపై నెమలి ఈకల కట్ట, కొమ్ముల జత, నర్తకుని వెనుక తల వెనుక వీపు మీదుగా కొంకులపై వేళ్ళాడుతున్న చీర మడత మాత్రమే కనిపిస్తాయి – అందంగా. ఇలా పెద్ద కోక ధరించిన నర్తకులు చేసే నర్తనం కాబట్టి దీనిని పెర్మ కోక ఆట అని కూడా పిలుస్తారేమో. ఈ నర్తకులు పూర్వ కాలంలో కేవలం ధోతిని మాత్రమే ధరించేవారనిపిస్తుంది. కాని గత రెండు, మూడు దశాబ్దాల కాలంలో వీరు చేతులు లేని బనియన్ లేదా టీ-షర్ట్, నడుము భాగం నుంచి కిందికేమో గీతల లంగాను ధరించడం అలవాటు చేసుకున్నారు. ప్రతీ పురుష నర్తకుడు తన ఎడమ భుజం మీదుగా కుడి కాలుపై వేలాడే విధంగా నాలుగు అడుగుల పొడవైన డోలకొయ్య (గండ్జ)ను ధరిస్తాడు.
గండ్జను గుమ్ముడు చెట్టు దుంగతో తయారు చేస్తారు. దుంగ మధ్యలో ఫీటు, ఫీటున్నర వ్యాసంతో బోలు చేసి, ఆ బోలును ఒక వైపు ఆవు తోలుతో, మరో వైపు హన్మబండ (అలబండ) తోలుతో మూస్తారు. ఆవు తోలుతో మూసిన వైపు అడుగు పొడవుండే చిర్ర (కట్టె) తో వాయిస్తారు, హన్మబండ తోలుతో మూసిన వైపు ఎడమ చేతితో వాయిస్తారు. చిర్ర మొదట్లో చిన్న రంధ్రం చేసి, దాని గుండా ఒక ఇనుప రింగును దూర్చి, దానికి మువ్వలు కూర్చుతారు – వాయిస్తున్నప్పుడు వినసొంపైన శబ్దం రావడానికి. అందరూ కాళ్ళకు అందెలు ధరిస్తారు. నర్తకుల మధ్యలో ప్రధాన పాటగాడు (మేస్త్రీ) ఉండి రేల పాటలు పాడుతూ నృత్యానికి నాయకత్వం వహిస్తాడు. పాటగాడు చిర్రతో బీటు మారిస్తే మిగతా నర్తకులు కూడా బీటు మార్చి, నృత్యాన్ని మారుస్తూ అనుసరిస్తారు. మధ్య మధ్య ముసారి కొమ్ము (తూత కొమ్ము /అడవిదున్న కొమ్ము) ను ఊదుతూ హుషారు గొలిపే శబ్దాలు చేస్తారు. నాట్యం చేసే సమయంలో ఈ ముసారి కొమ్మును భుజానికి తగిలించుకుంటారు. వారి నాట్యంలో భాగంగా అడవి దున్నపోతుల పోరాటం (పెర్మాం) ఆసక్తికరంగా ఉంటుంది. ప్రేక్షకులు భూమి మీద వేసిన రూపాయల నోట్లను లేదా కాగితపు ముక్కలను తాము ధరించిన అడవి దున్న కొమ్ము కొనలతో గుచ్చి పైకి తీయడం వంటి చిత్ర విచిత్రమైన కళలను ప్రదర్శిస్తారు.
ఇలాంటి నృత్యాలు పూర్వ కాలంలో మనుగడ సాగించినా మధ్యలో కోయిల ఆర్థిక స్థితి దిగజారిన కాలంలో కనుమరుగయ్యాయి. కాబట్టి ఇలాంటి నృత్యం తూర్పు గోదావరి జిల్లా గంగవరం మండలంలోని పండ్రపోల పంచాయితీలోని కోయదొర కులస్థులకు మాత్రమే వచ్చు అని 2016 లో మైపతి అరుణ్ కుమార్ రాశాడు. కాని ఆ తరువాత తెలంగాణలోని అశ్వాపురం మండలం కోయ రంగాపురం, ఏటూరునాగారం దగ్గరి చినబోయినపల్లి మొదలైన గ్రామాల కోయలు ఈ నృత్యాన్ని నేర్చుకున్నారు. ఇప్పుడు ఈ నృత్యాన్ని మేడారం జాతరతో పాటు గంగాలమ్మ, కొండరాజులు, పసరుబోలి, పప్పుకొత్త, పలకం, బడ్డి మొదలైన పండుగలు, వివాహాది శుభకార్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలలో ప్రదర్శిస్తున్నారు.
కుర్రె నృత్యం:


సందర్భాన్ని బట్టి 20 నుండి 30 మంది పురుషుల వరకు కుర్రె నృత్యంలో పాల్గొంటారు. రెండు సన్నాయిలు, మూడు మేళాలు ఈ నృత్యంలో ప్రధాన సంగీత వాయిద్యాలుగా ఉపయోగిస్తారు. పంచ, బనీను ధరించి తలకట్టు కట్టుకొని, చేతిలో తువ్వాలు పట్టుకొని కాళ్లకు గజ్జలు ధరించి వలయాకారంగా సంగీత వాద్య శబ్దాలు అనుగుణంగా నృత్యాలు చేస్తారు. ఒకరి భుజంపై మరొకరు చేతులు వేసి బృంద నాయకుని సైగలను అనుసరించి ఈ నృత్యాలు చేస్తారు.
కోలాటం:

గ్రామాలలో పురుషులు రెండు చేతుల్లో రెండు కోలలు ధరించి పరస్పరం ఒకరి కోలలను ఒకరు కొట్టుకుంటూ పాటలు పాడుతూ వలయా కారంలో నృత్యం చేసే కోలాటం ఆట కోయలలో కూడా ఉంది. అలాగే కోయ స్త్రీలు కూడా ఈ ఆటను ఆడుతుంటారు.