|

‘డబుల్‌’ హ్యాపీ…

By: ఉప్పర వెంకటేశ్వర్లు, మహబూబ్‌నగర్‌

చుట్టూ కొండలు, దట్టమైన అడవిని తలపించేలా ఏపుగా పెరిగిన వృక్షాలు, ఎటు చూసినా పచ్చదనం, ఉషోదయాన కొండలపై నుండి వీచే చల్లని గాలి సాయంత్రం అయితే చాలు పక్షుల కిలకిలారావాలు, నెమళ్ల నాట్యాలు మనసుకు కనువిందు చేసే, ప్రకృతి పరవశింపజేసే ఎన్నో దృశ్యాలు. అలాంటి  కొండల మధ్యన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు. ఒక్కసారి చూస్తే ఈ దృశ్యం మరో ఊటిని, కూర్గ్‌ని  తలపిస్తుంది. అదే మహబూబ్‌నగర్‌  కేంద్రానికి అతి సమీపంలో ఉన్న వీరన్నపేట డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ళు. మహబూబ్‌ నగర్‌కు 3 కిలో మీటర్ల దూరంలో  31 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన 660 డబుల్‌ బెడ్‌ రూమ్‌ల కథ ఇది

మహబూబ్‌నగర్‌ పట్టణంలో వీరన్న పేట ప్రాంతం చాలా వెనుకబడిన  మురికి వాడ. ఇక్కడి ప్రజలు  సొంత ఇల్లు లేక, ఒకటే గదిలో తండ్రి, కొడుకులు, భార్య, పిల్లలు కలిసి జీవితం గడిపేవారు. అపరిశుభ్రమైన వాతావరణం, ఉన్న ఇళ్ళు కూడా  రేకుల షెడ్డును తలపించేలా, ఎండాకాలం వస్తే వేడిని తట్టుకోవడం, వర్షాకాలంలో పైకప్పులు సరిగా లేక వర్షపు నీటితో ఇల్లంతా బురదమయం ఇది పరిస్థితి.  ఇక్కడి ప్రజలు స్వంత ఇళ్లు కట్టుకోలేక ఎన్నో బాధలను ఎదుర్కొంటూ జీవనం గడుపుతున్న సమయంలో 2015 జనవరి 18న రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు మహబూబ్‌నగర్‌ సందర్శనలో భాగంగా వీరన్నపేటను సందర్శించి అక్కడి ప్రజల పరిస్థితులను చూసి చలించి ఇండ్లు లేని నిరుపేదలందరికి డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇస్తామని వాగ్దానం చేశారు. వారి వాగ్దానం మేరకు 2016 జూన్‌లో  660 డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఇందుకు గాను ప్రభుత్వం 40కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ ఇండ్లను నిర్మించడం జరిగింది.

ఈ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లలో ప్రతి మెయిన్‌ రోడ్డు 30 ఫీట్లు వెడల్పు ఉండేలా, ప్రతి ఇంటి నుండి బయటకు వచ్చే మురుగునీరు టాయిలెట్‌ పైపుల ద్వారా సెప్టిక్‌ ట్యాంక్‌కు చేరే విధంగా అధిక సామర్థ్యం తో కలిగిన 3 సెప్టిక్‌ ట్యాంకుల నిర్మాణంతో పాటు, డ్రైనేజీ నీరు బయటకు వెళ్ళే విధంగా డ్రయిన్ల నిర్మాణం, రోడ్లకు ఇరువైపులా హరితహారం మొక్కలు, విద్యుత్‌ సౌకర్యం, మిషన్‌ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి మంచినీటి సౌకర్యం కల్పించడం జరిగింది. వీరన్న పేట డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను గత జూలై 13న రాష్ట్ర ఐటిశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, జిల్లా మంత్రి డాక్టర్‌ వి. శ్రీనివాస్‌ గౌడ్‌ల ద్వారా ప్రారంభోత్సవం చేయడం జరిగింది.

వెనుకబడిన వీరన్నపేట లాంటి  ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి డాక్టర్‌ వి. శ్రీనివాస్‌గౌడ్‌ ఆలోచన ఆ ప్రాంతం రూపురేఖలను మార్చివేసింది. వీరన్నపేట ప్రాంతానికి 660 డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు మంజూరు అయిన వెంటనే అక్కడి వెళ్లేందుకు బి.టి రహదారితో పాటు, ఆ పక్కనే 100 కోట్ల రూపాయలతో రెసిడెన్షియల్‌ పాఠశాలల నిర్మాణం, బృహత్‌ పట్టణ ప్రకృతి వనం ఏర్పాటు వంటివి చకచకా జరిగిపోయాయి. 

ఇటీవల లక్నోలో ఏర్పాటు చేసిన ఇండ్ల నమూనా ప్రదర్శనకు  తెలంగాణ రాష్ట్రం నుంచి  వీరన్న పేట డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల నమూనా ఎంపికై ప్రదర్శించడం జరిగింది. ఈ ప్రదర్శనకు హాజరైన ప్రదర్శన ఇన్‌చార్జి, పట్టణ ప్రాంత గృహ నిర్మాణ సెంట్రల్‌ టీం ఇన్‌చార్జితో పాటు, పలువురు కేంద్ర అధికారులు వీరన్నపేట డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు నమూనాను ప్రశంసించడం జరిగింది. ముఖ్యంగా ఇంటి నిర్మాణంలో ఉపయోగించిన నూతన షేర్‌ వాల్‌ టెక్నాలజీ బాగుందని పలువురు ప్రశంసించారు. 

తెలంగాణ రాష్ట్రంలోనే పట్టణ ప్రాంతంలో ఆత్యధిక ఇండ్లు మహబూబ్‌నగర్‌లో కట్టడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి అనుమతితో 4,350 ఇళ్లకు అనుమతి తీసుకొని వాటిని నిర్మించడం జరిగింది.  దాదాపు అన్ని పూర్తయ్యాయి. లక్నోలో నిర్వ హించిన గృహ నమూనా ప్రదర్శనలో  వీరన్నపేట్‌ టైప్‌ డిజైన్‌ చాలా బాగుందని కేంద్ర స్థాయి అధికారులు అభినందించడం జరిగింది. ఇళ్లంటే  ఒక రూమ్‌ ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు. రెండు బెడ్‌ రూములు, కిచెన్‌, హాలు, ఇంటి బయట ముందు ఖాళీ స్థలం ఉండేలా  ఒక పేదవాడు కూడా ధనికుడి లాగా ఇంట్లో ఉండడానికి ఉద్దేశించి ఇండ్ల నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు కట్టిస్తున్నది. లక్నో ప్రదర్శనలో మహబూబ్‌ నగర్‌ వీరన్నపేట నమూనా ప్రదర్శన ప్రశంసలు పొందినందుకుగాను ఇందుకు కృషి చేసిన జిల్లా కలెక్టర్‌ ఎస్‌. వెంకట రావు, గృహ నిర్మాణశాఖ ఈఈ వైద్యం భాస్కర్‌ని, సిబ్బందిని అభినందిస్తున్నాను.

ఇక డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను పొందిన నిరుపేదల ఆనందానికి అవధులు లేవు…

నా పేరు భాస్కర్‌. నేను డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరును. వీరన్నపేట్‌లో 31.75 ఎకరాల్లో 660 ఇండ్లు చేపట్టడం జరిగింది. నాలుగిండ్లు ప్యాటర్న్‌ లో నిర్మించాము. ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పించాము. సాంకేతికంగా మరో ఫ్లోర్‌ నిర్మించుకునేల ఇండ్ల నిర్మాణం చేపట్టాము. విశాలమైన రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్తు, సెప్టిక్‌ ట్యాంక్‌ నిర్మాణం మంచి నాణ్యతతో నిర్మించాము. ఒక్కో ఇంటికి 5.34 లక్షలు ఖర్చయ్యింది. ఇక్కడ చుట్టూ కొండల మధ్యలో డబుల్‌ బెడ్రూమ్‌ ఇండ్లు ఉండడం చాలా ఆహ్లాదకరంగా ఉంది.

నా పేరు సావిత్రి. నాకు భర్త లేడు. ఇద్దరూ ఆడపిల్లలే. నాకు సొంత ఇల్లు లేదు . వీరన్న పేటలో కిరాయి ఇంట్లో ఉంటూ 35 సంవత్సరాలుగా రెంటు కడుతూ వచ్చాను. జన్మలో నేను సొంత ఇల్లు నిర్మించుకునే స్తోమత నాకు లేదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడిలా రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు ఇల్లు మంజూరు చేయగా జిల్లా మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ పుణ్యాన రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కే.టి రామారావు  నాకు ఇంటి పట్టా అందజేయడం జరిగింది .ఈ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇంట్లో  ప్రస్తుతం నేను ఆనందంగా గడుపుతున్నాను. నా కూతురు పెళ్లి కూడా  ఈ ఇంట్లోనే చేశాను. నా జీవితం ఈ ఇంట్లోనే. ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఎలాంటి ఇబ్బంది లేదు.  

నా పేరు లావణ్య. నేను గత 25 సంవత్సరాలుగా వీరన్నపేటలో అద్దె  ఇంట్లో ఉండేదానిని. కూలి చేసుకుని బతికే వాళ్ళం. నా భర్త మేస్త్రి పని చేస్తాడు. వీరన్నపేట లో 21 సంవత్సరాల నుండి 200 నుండి మొదలుకొని 2000  వరకు రెంట్‌ కడుతూ వచ్చాము. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ నాకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు మంజూరు చేయడంతో ప్రస్తుతం మేము ఇక్కడే నివాసం ఉంటున్నాము. నా భర్త  మేస్త్రి పని చేస్తుంటాడు.  నేను ఇక్కడే కిరాణా షాపు నడుపుకుంటున్నాను. అంతే కాక ఖాళీ స్థలంలో పెరటి తోట పెంచుకుంటున్నాను. నా కొడుకు ఆటో నడుపుతాడు. ఇప్పుడు మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నాము. మేము డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్లు వచ్చిన తర్వాత డబుల్‌  హ్యాపీగా ఉన్నాము.

నా పేరు లక్ష్మి. మా ఆయన పేరు రాములు. మాకు ఇద్దరు పిల్లలు. మేము పదేళ్ల నుండి వీరన్న పేట పాత గేటు వద్ద కిరాయి ఉండే వాళ్ళము. ఒకే రూమ్‌లో ఇద్దరు పిల్లలతో  కష్టంగ గడిపాము. నా భర్త వికలాంగుడు. అయితే ప్రభుత్వం ద్వారా మాకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్లు వచ్చింది. ఈ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇంటిలోనే చిన్న కిరాణా షాపు నిర్వహిస్తున్నాం. అంతేకాక కూరగాయలు కూడా అమ్ముతున్న. జిల్లా మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ద్వారా మాకు ఈ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు రావడం చాలా ఆనందంగా ఉంది. మేము ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా మాకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్లు వచ్చింది. ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. రోడ్లు, డ్రైనేజీ, మిషన్‌ భగీరథ నీరు, విద్యుత్తు అన్నీ ఉన్నాయి ఈ ప్రభుత్వానికి మేము ఎన్నటికీ రుణపడి ఉంటాము.