దాశరథి స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో ఉంది

దాశరథి-స్ఫూర్తి-ప్రతి-ఒక్కరిలో-ఉందితెలంగాణ సంస్కృతిని, ప్రాభవాన్ని చాటిచెప్పిన మహనీయుడు, అందరికీ ఆదర్శప్రాయమైన నిధి, కవి దాశరథి అని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ఘనంగా నివాళుర్పించారు. దివంగత డాక్టర్‌ దాశరథి కృష్ణమాచార్యుల 91వ జయంతిని, జులై 22న రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. దాశరథిపేరిట ఏర్పాటు చేసిన పురస్కారాన్ని ప్రముఖ కవి డాక్టర్‌ తిరుమల  శ్రీనివాసాచార్యకు ముఖ్యమంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు మాట్లాడుతూ… ‘‘దాశరథి స్ఫూర్తి తెలంగాణలో ప్రతి ఒక్కరిలో నిబిడీకృతమై వుంది. తెలంగాణ అస్తిత్వం గురించి ప్రజ స్థితిగతుల గురించి, ఇక్కడి రైతు గురించి తన పద్యాలు , కవితల ద్వారా ప్రపంచానికి చాటిచెప్పారు. ‘నా తల్లి తెలంగాణ’ అని ఖమ్మం జిల్లాకు చెందిన రావె వెంకట రామారావు 80 ఏండ్ల క్రింద తెలంగాణ ప్రాశస్త్యాన్ని చాటి చెప్పారని అన్నారు. ‘నా తల్లి తెంగాణ కంజాతవల్లి, నా తెంగాణ కోటి రతనాల  వీణ’ అని దాశరథి ఎంతో గొప్పగా చెప్పారు.

‘‘తెలంగాణ సమాజానికి వున్న సంస్కృతి, ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పవలసిన బాధ్యత మనపై వుంది. ఈ వివరాలన్నింటిని బయటకు తేవడానికి తెలుగు  యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌ర్‌ శివారెడ్డితో మాట్లాడి త్వరలో ప్రణాళిక రూపొందిస్తాం. మేమిద్దరం కలిసి డా॥ సినారె ఇంటికి వెళ్ళి కొన్ని గంటలపాటు చర్చించి ఓ నిర్ణయానికి వస్తాం. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా.. ఈనాడు దాశరథి ఉంటే, తెలంగాణపై జరుగుతున్న కుట్రపై మరో అగ్నిధార కురిపించేవారు. రుద్రవీణ చేత బూని ఖండించేవారు. సినారె అంత్యప్రాసకు, ఆది ప్రాసకు ఆయనకు ఆయనే సాటి. నేను సినారె అభిమానిని. సినారె గొప్ప ఆశుకవి. నా గురువు డాక్టర్‌ తిరుమల శ్రీనివాసాచార్య గారిని  దాశరథి అవార్డుతో సత్కరించడం నా పూర్వజన్మ సుకృతం’’ అని సిఎం అన్నారు.

దాశరథి పురస్కార గ్రహీత ప్రొఫెసర్‌ శ్రీనివాసాచార్య మాట్లాడుతూ.. దాశరథి పద్య  కవిత్వం తో  పాటు తెలంగాణపై చెరగని ముద్ర వేశారని అన్నారు. తెలంగాణను సాధించిన సారథి ముఖ్యమంత్రి కెసీఆర్‌ క్రమశిక్షణ భక్తిభావం గల వ్యక్తి అని ప్రశంసించారు. స్పీకర్‌ మధుసూదనాచారి మాట్లాడుతూ స్వరాష్ట్రంలో ‘‘దాశరథి, కాళోజీ, జయశంకర్‌, పీవీ నర్సింహారావు వంటి ప్రముఖుల జయంతులను పండుగలా జరుపుకుంటున్నాం’’అని అన్నారు. జ్ఞానపీఠ్‌ అవార్డ్‌ గ్రహీత సి. నారాయణ రెడ్డి మాట్లాడుతూ దాశరథి జయంతిని ప్రభుత్వపరంగా నిర్వహించడం గొప్ప విషయమని ముఖ్యమంత్రిని అభినందించారు.

ముఖ్యమంత్రి ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ తెలంగాణ తల్లిని సాహిత్యరంగంలోకి మొదట తీసుకువచ్చింది దాశరథి అని చెప్పారు. తెలుగు  వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ శివారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి విద్యుత్‌, నీటి విషయంలో తీసుకున్న కార్యక్రమాలను కొనియాడారు.