సూర్యాపేట డాక్టర్‌

డా॥ శ్రీరంగాచార్య

శర్మ ఆనాటి కృష్ణా జిల్లా ఏలూరులో శంకర శాస్త్రి – మహాలక్ష్మమ్మ పుత్రుడుగా జన్మించినాడు. తండ్రి హనుమదుపాసకుడు. శివపూజాసక్తుడైన కారణంగా వీరికి హనుమద్విశ్వనాథ శర్మ అనే పేరుపెట్టుకున్నాడట. చిన్న వయస్సులోనే మాతా పితృలను కోల్పోపోయి, మేనమామ పెంపకంలో విజయవాడ చేరినాడు. అక్కడ నిలవలేక సూర్యాపేట చేరుకొని, దాన్నే అన్నిటికీ సొంతగడ్డగా మార్చుకున్నాడు. తాను శివభక్తుడు, ఆస్తికుడైనా, నాస్తిక సమాజం గోరాకి అభిమానియై వారి ప్రశంసను పొందిన శర్మ మచిలీపట్నం వాసియైన ‘లక్ష్మీకోకిల’ను వివాహ మాడినారు. వీరిది అన్యోన్య దాంపత్యం. రాంప్రసాద్‌, శ్యాంప్రసాద్‌, మురళీధరవరప్రసాదు అని ముగ్గురు పుత్రులు. అంజనీవిశాఖలక్ష్మీయనే అమ్మాయి వీరి సంతానం. శర్మ పిల్లలు చదువుల విషయంలో చాలా శ్రద్ధతో వుండేవారు. మొదటి యిద్దరు కుమారులు బ్యాంక్‌ ఆఫీసర్లుగను, చివరివాడు ఫార్మస్యూటికల్‌ రంగంలోను పేరుగాంచినారు.

డా॥ శర్మ అమృతహస్తుడైన వైద్యుడుగా పేరుగాంచినాడు. ఆనాడు ఎటూవెళ్లాలన్నా ఎద్దుల బండి లేదా గుర్రం సవారీలే శరణ్యం. నూజివీడు నుండి ఒక ఉత్తమ జాతి గుర్రాన్ని ఖరీదు చేసిన శర్మ ఎక్కడికైనా దానిపైనే వెళ్లేవారు. ఆ రోజుల్లోనే సూర్యాపేట సమీప గ్రామమైన ‘గట్టుసింగారం’లో వుండే దేశముఖ్‌ గాదెరామచంద్రరావు వ్రణబాధతో వుండి ఎందరి చేతనో వైద్యం చేయించినా తగ్గలేదు. డా॥ శర్మతో సంప్రదిస్తే వారు గుర్రంపై వెళ్ళి రామచంద్రరావు స్థితిని గమనించి వైద్యం చేసినారు. వీరి హస్తవాసివల్ల ఆ వ్రణం ఒక్క పక్షం రోజుల్లోనే నిర్మూలనమైతే రామచంద్రరావు జీవితాంతం సుఖ సంతోషాలతో వుంటూ డా॥శర్మ వైద్య చాతుర్యాన్ని ప్రశంసిస్తుండేవారు. ఈ విధమైన మొండి వ్యాధులెన్నిటినో బాగు చేసిన శర్మ, సూర్యాపేటలో డా॥ శర్మ అనే ఖ్యాతిని పొంది ప్రసిద్ధులైనారు. ఆనాటి స్థానిక రాజకీయాల్లోనూ ప్రముఖ పాత్ర వహించిన కాంగ్రెసు వ్యక్తి, తన జీవితంలో పార్టీ మారలేదు. ఖద్దరు వస్త్రధారణను విసర్జించలేదు. సిద్ధాంత బద్ధుడైన రాజకీయ వేత్త, వైద్యంలో కలిసివచ్చిన హస్తవాసి. రాజకీయాల్లో అంతకసిరాలేదు. అట్లే కాలం గడిపినారు.

కులమతాలు, ప్రాంతీయతత్వాలు పట్టింపు లేని ఈయన సహజ రాజకీయాల కారణంగా రజాకార్ల ఉద్యమంలో చురుకుగా పనిచేసి తనయిల్లు, ఇల్లాలిని, బిడ్డను వదిలి తిరుగుతుంటే ఇంటి దగ్గర ఇద్దరు బిడ్డలస్తమించినా వెనుకకు తిరిగిరాక అనేక క్యాంపుల్లో రహస్య జీవిగా కాలం గడిపారు. ఆ కాలంలోనే ఈయననొక ఉద్యమ ప్రముఖునిగా గుర్తించిన నాటి నిజాం ప్రభుత్వం ‘నైజాం రాష్ట్ర బహిష్కార శిక్ష’ విధించటమే గాక కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులిచ్చి పత్రికలు, రేడియోల్లోను ప్రచారం చేసి గెజిట్‌ విడుదల చేసింది. ఐనా తన పట్టుదలను వీడకుండా రహస్య జీవిగా ఎన్నో పనులు చేసినాడు. సూర్యాపేటలో ఏర్పడిన పురపాలక సంఘానికి మొట్టమొదటి అధ్యక్షుడు కావాలన్న కోరిక తీరలేదు. అప్పటి రాజకీయాలు ఈయనను ఉపాధ్యక్షుని గాను, డా॥ కర్పూరం శ్రీనివాసస్వామిని అధ్యక్షునిగా చేసినాయి. ఉభయులూ ఆత్మీయులే. ఇద్దరూ డాక్టర్లే. వీరి జీవితకాలమంతా సూర్యాపేటలో స్వామి-శర్మ గ్రూపులుండేవికాని అవి ఎవరికీ అపకారం చేయలేదు. ఆనాడు సుశిక్షితులైన కార్యకర్త పద్ధతి అట్లా వుండేది.

హనుమద్విశ్వనాథశర్మ ఇంగ్లీషు, తెలుగు, సంస్కృతాల్లోనేగాక, హిందీ, ఉర్దూ, మరాఠీ, తమిళభాషల్లోను మంచి పట్టున్న వ్యక్తి. నిరంతరం పఠించటం, రాజకీయ చర్చలు ఆయనకు చాలా యిష్టమైనవి. అందుకే ఆ యిల్లు సాహిత్య, రాజకీయాల సందడిగా వుండేది. సూర్యాపేట ‘భానుపురసాహితీ సమితి’కి శర్మ దాదాపు 25 సంవత్సరాలు అధ్యక్షులుగా వుంటే ‘తేజోప్రభ’ పత్రికా సంపాదకులు దేవులపల్లి ప్రభాకరరావు కార్యదర్శిగా వుండి ఎన్నో కార్యక్రమాలను నిర్వహించి ప్రశంసాపాత్రులైనారు. దీనితో బాటు సూర్యాపేటలో నిర్వహించే త్యాగరాజ గానసభ వారోత్సవాలను ఘనంగా నిర్వహించిన సందర్భంగా, భువనవిజయాలు, హరికథలు, సాంఘికపౌరాణిక, పద్యనాటకాలు, సంగీత కచేరీలు, బుర్రకథలు ఏర్పాటు చేస్తే ఎందరో ప్రముఖులు పాల్గొన్న సన్నివేశాలను మేం చూచి ఆనందించాము. వీటిల్లో విశ్వనాథ, ఎన్‌.టి.ఆర్‌. భానుమతి, జగ్గయ్య, స్థానం నరసింహారావు, జమున వంటివారు పాల్గొంటే వీరిని మొట్టమొదటి పర్యాయం చూచిన ఆనందానికి అవధుల్లేకుండేవి. ఇప్పటి గాంధీ పార్కు ప్రాంతం ఆనాడు త్యాగరాయ గానసభా ప్రాంగణంగా రాణించేది. స్థానిక వ్యాపారులు, ధనవంతులు తమ ఔదార్యంతో ఈ కార్యక్రమ నిర్వహణమంతా శర్మకు అప్పగిస్తే ఒక పావలా పైసు కూడా వృధా వ్యయం కాకుండా చక్కని కార్యకర్త సహకారంతో ఈ ఉత్సవాలను నిర్వహించిన శర్మ సమయానుకూలంగా నటుడు, వక్త, వ్యాఖ్యాతగా వ్యవహరించటమేగాక స్థానిక పాఠశాల అధ్యాపక వర్గం ప్రాపకంతో ఇంగ్లీషు నాటకాలు వేసినారు. ఇది శర్మ బహుముఖీన ప్రతిభకొక తార్కాణం.

ఆనాడు ‘రేపా’లో కోదాటి వారు స్థాపించిన జనతా కళా మండలిలో ముఖ్యులై ఎన్నో నాటకాల్లో నటించినారు. రజాకార్‌ వ్యతిరేకోద్యమంలో సినీనటుడు టి.ఎల్‌. కాంతారావు, కె.యల్‌.యన్‌. రావుతో కలిసి ‘కొత్తగుడి’ నాటకంలో ప్రముఖ వేషం వేస్తూ ఊళ్ల వెంటతిరిగి ప్రజల్లో చైతన్యం కలిగించిన వీరు తరువాత జిల్లా గ్రంథాలయ సంస్థ ప్రథమ అధ్యక్షులై చాలా కృషి చేసిన విషయం కోదాటి నారాయణ రావు జీవిత చరిత్రలోనే గాక, మాదిరాజు రామకోటేశ్వర రావు మొదలైన పెద్ద వ్రాతల్లో చిరస్థాయియైనది.

డాక్టర్‌గారి వ్యాసాలు, కథలు మొదలైనవన్నీ లిఖిత ప్రతులుగానే అంతరించినాయి. విశ్వనాథ వారి బద్దన్న సేనాని, కడిమి చెట్టు, వీరవ్లడు, నవలను ఆంగ్లీకరించి విశ్వనాథ వారి ప్రశంసను పొందినా అవీ లభించలేదు. ‘పరపతి సంఘం’ అనే వీరి హాస్య – వ్యంగ్య రచన ఆనాడు ‘తేజోప్రభ’ పత్రికలో వచ్చి గొప్ప సంచలనానికి కారణమైంది. ఇది తనను గూర్చి రాసిందే అని అప్పటి సూర్యాపేట ఎమ్మెల్యే అల్లరి చేస్తే, శర్మ దాన్ని ఏదో విధంగా సర్దిచెప్పి శాంతపరచినా, ఆ కథనానిక మాత్రం శర్మ ‘వ్యంగ్యరచన’ ప్రాముఖ్యాన్ని తెలిపింది.

వీరు త్యాగరాజ గానసభు నిర్వహించేటప్పుడు స్థానిక హైస్కూల్‌ (అప్పుడు ఇదొక్కటే స్కూలు) విద్యార్థులకు ఉపన్యాస పోటీలు పెడితే 9వ తరగతి విద్యార్థి ప్రప్రథమ స్థానంలో నెగ్గినాడు. ఆయన పొట్టిగా వున్నందు వల్ల శర్మ ఆ విద్యార్థిని మైకు దగ్గర పైకి లేపి ఈ విద్యార్థి ఎస్‌. లక్ష్మణమూర్తి 9వ తరగతి చదువుతున్నాడు. విగ్రహం చిన్నదిగాబట్టి పైకి ఎత్తి చూపినానని బహుమతి యిచ్చి ఎంతో ఆనందించిన శర్మ వీరి చేతనే తమ ప్రథమ పుత్రునికి అక్షరాభ్యాసం చేయించిన విద్వద్వరుడు. ఆనాటి ఆ విద్యార్థే ఇటీవల కాకతీయ విశ్వవిద్యాయంలో ఇంగ్లీషు ప్రొఫెసర్‌గా రిటైరయిన లక్ష్మణమూర్తి. వీరి 4-10 తరగతుల విద్య సూర్యాపేటలోనే కొనసాగింది.

డా॥ శర్మకు ఆనాడు రాజకీయాల్లో ప్రముఖులైన వారి ఆదరణ బాగా వుండేది. ఈయన మున్సిపల్‌ ఛైర్మన్‌ (ఇంఛార్జి)గా వున్నపుడు ఇందిరాగాంధీ స్థానిక గాంధీపార్కులో ఉపన్యసిస్తే ఈయన తెలుగు చేసినాడు. వీరి ప్రసంగం జనాకర్షకం కావటం ఆమెకెంతో ఆనందం కలిగించింది. ఐతే ఆమె ప్రసంగంలో ‘రైల్‌ గాడీ’ అనగానే అమ్మా! మా నల్లగొండ ప్రజలు రైల్‌గాడీ చూడాలంటే హైదరాబాదులో, విజయవాడో వెళ్లవలసిందే గాబట్టి మా జిల్లాకొక ‘రైల్‌గాడీ మార్గం’ వేయించండి అని కోరిన దాని ఫలం నేటి సికింద్రాబాదు-నడికుడి రైలు మార్గం. తరువాత యిది ఎన్నో రాజకీయ మాలుపులతో ఇట్లా కొనసాగుతున్నది. డాక్టర్‌ శర్మ స్వాతంత్య్ర సమరయోధులకిచ్చే పెన్షన్‌ స్వీకరించినారు. కాని భూమి వద్దని, దాన్ని వ్యవసాయదారులకీయండి అని తిరస్కరించినారు.

కేంద్రంలో ఆనాడు దామోదరం సంజీవయ్య ఉన్నప్పుడు వీరిని రాజ్యసభకు ఎన్నిక చేయించవలెనని పట్టుబట్టి పి.వి. నరసింహారావు, దేవులపల్లి వేంకటేశ్వర రావు, రావి నారాయణరెడ్డి, బి.యన్‌. రెడ్డి మొదలైన వారు సమర్థించి వీరితో సంప్రదిస్తే అయ్యా ! అది పెద్దపదవి. బాధ్యత గలది కాబట్టి నేను మీ ప్రతిపాదనను అంగీకరించనని వాదించి నా జీవితం అంతా సూర్యాపేట మున్సిపాలిటీ స్థానిక విషయాలకే పరిమితం చేసినానన్నారు.

సర్దార్‌ వల్భాలబాయి పటేల్‌ హైదరాబాదుకు విచ్చేసినప్పుడు బూర్గుల వంటివారు పటేల్‌కు భాషా సమస్య రాకుండా వ్యవహరించగలిగే శర్మనే నియమించటం ఆనాడు ఒక సంచలనం. పి.వి. నరసింహరావు, ఈయన తాము చదివిన పుస్తకాలను పరస్పరం మార్చుకుంటూ విశేషాలను చర్చించే సమయం ఆహ్లాదకరంగా వుండేది. అప్పటి రాజకీయ రంగంలో ప్రముఖులైన హయగ్రీవాచారి, అక్కిరాజు వాసుదేవరావు, కొండా లక్ష్మణ్‌ బాపూజీలే గాక, కాళోజీ, కోదాటి వంటివారు జిల్లాలోని వివిధ పార్టీ నాయకులకు సూర్యాపేటలోని వారిల్లు మార్గమధ్యంలో వున్న ‘రహదారి బంగ్లా’గా వుండేది.

శర్మ ఇంగ్లీషు భాషా పటిమకు అందరూ ముగ్ధులై అభినందిస్తే, పి.వి. గారు ఒక సందర్భంలో ‘మా శర్మ ఇంగ్లీషు అద్భుతమైంది, ఎన్నో శబ్దాల అర్ధాలకొరకు అన్వేషించవలసిన అగత్యం ఏర్పడుతుంది’’ అది మావంటివారికి అసాధ్యం. ఆయన బహుభాషల్లోను అద్భుతమైన ధారా ధారణ కలవాడు’’ అని ప్రశంసించటం శర్మ సాహిత్య శక్తిని వ్యక్తపరుస్తున్నది.

మొదటి రోజుల్లో సూర్యాపేట యందు నాటి ప్రసిద్ధ గృహసముదాయమైన పెద్దోజి క్వార్టర్స్‌లో వున్నప్పుడు గో.రా.నేగాక, విశ్వనాథ, త్రిపురనేని గోపీచంద్‌, కాంతారావు, నాగభూషణం, ఈలపాట రఘురామయ్య, వేణుమాధవ్‌ వంటి సుప్రసిద్ధులు వీరి యింటికి తప్పక వచ్చేవారు. అన్ని సమయాల్లో అందరితో ‘ప్రజల మనిషి’గా మనుగడ సాగించిన శర్మ తమ స్నేహానికి గుర్తుగా సూర్యాపేట వేంకటేశ్వరాలయాన్ని పి.వి. సహాయంతో అభివృద్ధి చేసినాడు. సూర్యాపేట ప్రజల అవసరాలను మున్సిపాలిటీ ద్వారా కొన్నిటినైనా తీర్చి సంతృప్తి చెందిన వ్యక్తిత్వంగ హనుమత్‌ విశ్వనాథ శర్మ ఎందరో సాహిత్య జీవులకు రాజకీయ వ్యక్తులకు, సాంస్కృతికరంగ సారథులకు నిరంతరం కల్పతరుచ్ఛాయ వలె వున్నారు. ఆనాటి వారి జీవన సరళి, సాంఘిక కార్యక్రమాలు, ప్రజా సంబంధాలు, వివిధ పార్టీ రాజకీయ రణరంగాలు మొదలైనవి మనకీనాడు వింతగా అనిపిస్తాయి. సూర్యాపేట ‘భానుపురసాహితీ సమితి’ సభ్యుల గూర్చి ఊరె వెంకట నరసింహారావు చెప్పిన ‘సీసమాలిక’లో

స్థిరుగుండెపుడి శర్మ చిత్ర విచిత్రవాక్‌
చాతుర్యమయ కథా సంచయంబు ప్రత్యక్ష సత్యం
ఆనాడు మీలా సత్యనారాయణ (నేటి సుధాకర్‌ పైప్స్‌ యజమాని కీ.శే) టైపు సంస్థ కవిరాజ్‌, నెమిలికొండ రంగాచార్య, ఎస్‌.ఎల్‌.ఎన్‌. చారి, మరింగంటి పురుషోత్తమా చారి వంటి పెద్దలు మిక్కిలి సన్నిహితులే గాక డా॥ శ్రీనివాసస్వామికి వీరి మిత్రలు గావటం వల్ల ‘ఉభయ డాక్టర్ల ఆత్మీయులు’ అని శర్మ వీరిని శ్లాఘిస్తుండేవారు ఇది ఆనాటి వ్యక్తుల సాహిత్య రాజకీయ రంగ పరిణత రీతి. సూర్యాపేటలోని పూలమార్కెట్‌ (తర్వాత పి.యస్‌.ఆర్‌. సెంటర్‌) దగ్గర ఒక యిల్లును ఖరీదు చేసినారు. ఆ గృహం, ఆ వ్యక్తి ఠీవి, వచ్చిపోయే జనం. ఇదంతా గమనించిన ఒక పండితుడు ఈయనను ‘యోగేన చిత్తస్య, పదస్యవాచా, మంశరీరస్య చవైద్య కేనయోపాకరోత్‌…’ అని ప్రశంసించినాడంటే డా॥ శర్మ జీవన వైవిధ్యం ఎంతటిదో తెలుస్తుంది.

దాదాపు అరవై సంవత్సరాల పూర్వం నేటి జిల్లా కేంద్రమైన సూర్యాపేట ఒక విచిత్రమైన పల్లె, తాలూకా కేంద్రం. అరకొర వసతులు అన్నివిధాలా కరవు తాండవిస్తూ ‘పరమేశా గంగ విడుము పార్వతి చాలున్‌’ అనే విధంగా వున్నా ఆ వీధిలో వచ్చిపోయే జనంతో బండ్లు, జట్కాలు, గుర్రాలతో చాలా సందడిగా కన్పిస్తుండేవి. ఐనా వివిధ రాజకీయపార్టీల సంరంభజాగృతులు గ్రంథాలయోద్యమం, సాహిత్య సభలు – సాంస్కృతిక కార్యక్రమాలు మొదలైనవి సూర్యాపేటనే గాక పరిసర గ్రామాలను ఎంతో చైతన్యవంతం చేస్తుండేవి. దీనికంతా మరొక ముఖ్య కారణం సూర్యాపేట అటు బ్రిటిషాంధ్రకు ఇటు నిజాం రాష్ట్రానికి మధ్యన వంతెనగావుండటం వల్ల ‘ఆంధ్రా’ వాతావరణమే అధికమనిపించేది. ఈ కారణం వల్లనే ఎందరో – కృష్ణా, గుంటూరు జిల్లా వారు ఇక్కడ నివాసాలేర్పాటు చేసుకొని వివిధ రంగాల్లో ప్రఖ్యాతులైనారు. ఆ పరంపరలోనే డా॥ గుండేపూడి హనుమత్‌ విశ్వనాథ శర్మగారు (సూర్యాపేట శర్మ) 1939 ప్రాంతంలో సూర్యాపేటకు చేరుకున్నారు. అప్పటికే ఈయన మద్రాసులో ఎల్‌.ఈ.ఎం. (లైసెన్సియేటెడ్‌ ఇంటిగ్రేషన్‌ మెడిసన్‌) 5 సంవత్సరాల చదువు పూర్తి చేసినాడు. విద్యాభ్యాస నిమిత్తం మద్రాసులో వున్నపుడే, స్వాతంత్య్ర ఉద్యమ కార్యకర్తగా పాల్గొంటే ఈయనను అరెస్టు చేసి 6 నెలలు జైలులో శిక్షించటమే గాక కొరడా దెబ్బలు వేస్తే శర్మ జీవితాంతం దెబ్బ మరకలు వంటి నిండా కన్పించేవి. డాక్టర్‌ కోర్సు సర్టిఫికెటు తీసుకొని విజయవాడ లేదా బందరులోనో ప్రాక్టీసు పెడదామనే కోరికతో వుంటే నాటి పెద్దలు ముఖ్యంగా అయ్యదేవర కాళేశ్వర రావుగారి సలహా మేరకు సూర్యాపేట చేరినారు. అప్పటికి సూర్యాపేటలో అలోపతి డాక్టరు లేడు. అంతా నాటువైద్యం. ఆయుర్వేదం వ్యాప్తిలో వుండేది. శర్మ సూర్యాపేటలో అడుగుపెట్టిన వేళావిశేషం. అన్ని విధాలా కలిసివచ్చింది.