|

సాకారమవుతున్న జిల్లాకో వైద్య కళాశాల

ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పం సాకారమవుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో 5 వైద్య కళాశాలలు మాత్రమే ఉండగా, తెలంగాణ వచ్చాక ఏర్పడిన మొత్తం 33 జిల్లాలలో ఇప్పటికి 12 జిల్లాలలో కొత్తగా వైద్య కళాశాలల ఏర్పాటు జరిగింది. ఈ సంవత్సరంలో మరో 9 కళాశాలలు ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, ఖమ్మం, వికారాబాద్‌ మెడికల్‌ కాలేజీలకు ఎన్‌.ఎం.సి. అనుమతులు ఇచ్చింది. నిర్మల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, జనగామ, కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల జిల్లాల కాలేజీల అనుమతులు తుది దశలో ఉన్నాయి. ఇలా ఈ ఏడాది చివరకు 26 కళాశాలలు ఏర్పాటవుతున్నాయి. వచ్చే ఏడాది మరో 7 కళాశాలలు ఏర్పాటు కానున్నాయి. దీనితో అన్ని జిల్లాలలో వైద్య కళాశాలల ఏర్పాటు పూర్తవుతుంది. ఈ కళాశాలల ఏర్పాటుతో ప్రతి జిల్లా కేంద్రంలో ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటు జరిగి, ప్రజలకు సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల సేవలు అందుబాటులోకి రానున్నాయి.

పెరిగిన మెడికల్‌ సీట్లు

మెడికల్‌ కాలేజీల ఏర్పాటుతో రాష్ట్రంలో మెడికల్‌ సీట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో మెడికల్‌ సీట్లు 2014లో 850 ఉండగా, ఇప్పుడు 2022-23లో 2,790కి చేరింది. రాబోయే రోజుల్లో మరో 900 సీట్లు రానున్నాయి. దీనితో మొత్తం 3,690 సీట్లు అందుబాటులోకి వస్తాయి. ఈ సీట్ల పెరుగుదలను సమీక్షిస్తే 334 శాతం పెరుగుదల కనిపిస్తున్నది. వీటితో పాటు పీజీ సీట్లు డబుల్‌ అయ్యాయి. సూపర్‌ స్పెషాలిటీ సీట్లు 76 ఉండగా, 2022-23 నాటికి 152కు చేరుకున్నాయి. దీంతో రాష్ట్ర విద్యార్థులు వివిధ దేశాలకు వైద్యవిద్యను అభ్యసించడానికి వెళ్ళే దుస్థితి తప్పింది. స్థానికంగా చదువుకోవడానికి వీలు కలిగింది.

ఎన్నో ఇతర లాభాలు

మెడికల్‌ కాలేజీల ఏర్పాటుతో కేవలం విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించే విద్యా సంస్థలే కాకుండా వివిధ రకాలుగా ఇతరులకు కూడా ఉపాధి లభించనుంది. కాలేజీకి అనుబంధంగా ఆసుపత్రి ఏర్పాటు జరుగుతుంది. ఇందులో అటెండర్‌ల నుంచి మొదలు, నర్సులు, వార్డు బాయ్‌లు, దోభీలు ఇలా ఎన్నో ఉద్యోగాలు దొరుకుతాయి. దీనితో పాటు రవాణా సౌకర్యం కోసం ఆటోలు, టాక్సీలు, క్యాబ్‌లకు కూడా గిరాకి కలుగుతుంది.

ఇలా ఎన్నో విధాలుగా ఈ ఆసుపత్రులు, కళాశాలలు ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి.