పేదల ఇంటికల సాకారానికి శ్రీకారం

పేదల ఇంటికల సాకారానికి శ్రీకారంsతెలంగాణలో పేదలకు రెండు పడకగదుల ఇళ్ళు నిర్మించాలనే ప్రభుత్వ సంకల్పం దసరా పండుగరోజు కార్యరూపానికి వచ్చింది. పర్వదినమైన విజయదశమి అందుకు వేదికగా మారింది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నల్లగొండ జిల్లా సూర్యాపేట, మెదక్‌జిల్లా ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలలో ఇళ్ళ నిర్మాణాలకు పునాదివేయగా, మిగతా అన్ని నియోజకవర్గాల్లోను మంత్రులు, ఎమ్మెల్యేలు రెండు పడకగదుల ఇళ్ళకు పునాదిరాళ్ళు వేశారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా రెండుపడకగదుల ఇళ్ళకు ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లు అయ్యింది.

2015-16 సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 60వేల ఇళ్ళను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. ఇందులో భాగంగా ఒక్కో నియోజకవర్గానికి 400 గృహాలు మంజూరు చేసింది. వచ్చే ఏడాది నుంచి వీటి సంఖ్య మరింత పెంచనుంది.

ఎర్రవల్లి గ్రామంలో…

దసరారోజు పునాదిరాయి వేయాలని సంకల్పించామని, దేవునిదయతో అది ఈరోజు నెరవేరిందని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అన్నారు. ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలలో రెండు పడకగదుల ఇళ్ళకు పునాదిరాళ్ళు వేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడుతూ, అయిదు నెలల్లో ఇళ్ళ నిర్మాణం పూర్తికావాలని ఇండ్లు నిర్మించే గుత్తేదారులను ఆదేశించారు. మంచి ముహూర్తం చూసి అందరం కలిసి కొత్త ఇళ్ళలోకి వెళ్ళాలని అన్నారు.

ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలలో వచ్చే రోహిణి కార్త్తెలోగా భూముల సర్వే పూర్తిచేసి మొత్తం సాగుభూమిలో బిందుసేద్యం ఏర్పాట్లు చేస్తామన్నారు. వచ్చే దసరా వరకు ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలు తెలంగాణకే కాంతులు చిమ్మే కేంద్రాలుగా తయారు కావాలన్నారు. ఈ గ్రామాలలో రైతులంతా అంకాపూర్‌ గ్రామంలో మాదిరిగా పొలాల వద్ద కుండీలు నిర్మించుకోవాలని సూచించారు. సంవత్సరంలోపు ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలు దేశంలోనే ఆదర్శగ్రామాలుగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ గ్రామాలను ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు దత్తత తీసుకున్నారు.

గజ్వేల్‌ నియోజకవర్గంలో సాగునీరు, తాగునీరుకు కొరత లేకుండా అన్ని చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఆరు మాసాలలోగా నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి నల్లానీరు అందిస్తామని తెలిపారు. అలాగే సాగునీటి విషయానికి వస్తే తడకపల్లి మల్లన్నసాగర్‌, పాములపర్తి కొండపోచమ్మ సాగర్‌లు పూర్తయితే నియోజకవర్గంలోనే కాకుండా భువనగిరి, ఆలేరు, మేడ్చల్‌ నియోజకవర్గాలకు కూడా సాగునీరు అందుతుందని తెలిపారు.

గజ్వేల్‌ నియోజకవర్గంలో సాగునీరు, తాగునీరు, గృహవసతిలో ముందుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గృహనిర్మాణ శాఖ కార్యదర్శి దానకిశోర్‌, కలెక్టర్‌ రోనాల్డ్‌రాస్‌, ఎస్పీ సుమతి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సూర్యాపేటలో..

తాము నిర్మించే ఇండ్లు నాణ్యతతో కూడి రెండు తరాల వరకు ఉపయోగపడే విధంగా ఉంటాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. దసరా సందర్భంగా అక్టోబరు 22న నల్లగొండ జిల్లా సూర్యాపేటలో పేదలకు నిర్మించే రెండు పడకగదుల ఇళ్ళకు ఆయన శంకుస్థాపన చేశారు.

అనంతరం మాట్లాడుతూ సూర్యాపేటలో 200 మంది పేదలకు ఇళ్ళు నిర్మించి ఇస్తామన్నారు. ఇది పేదల బతుకుల్లో స్వర్ణయుగంగా ఆయన అభివర్ణించారు. డిండి ఎత్తిపోతల పథకం ద్వారా మునుగోడు, దేవరకొండ, నల్లగొండ నియోజకవర్గాలకు పుష్కలంగా సాగు, తాగునీరు అందుతుందన్నారు. ఫ్లోరైడ్‌ బాధలు తప్పుతాయన్నారు.

మధ్యమానేరు ఆనకట్ట పనులు శరవేగంగా సాగుతున్నాయని, ఇది పూర్తయితే సూర్యాపేట, తుంగతుర్తి, మునగాల, నడిగూడెం ప్రాంతాలకు నీరందుతుందన్నారు. వాటర్‌గ్రిడ్‌ పథకం ద్వారా జిల్లాలోని ప్రతి ఇంటికి నీరందిస్తామన్నారు. ఇది ఒక రకంగా భగీరథ ప్రయత్నమే అన్నారు.

సూర్యాపేటను జిల్లా కేంద్రంగా చేస్తున్నందున వసతి కల్పనకు అధికారులు కసరత్తు చేస్తున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. మళ్ళీ సూర్యాపేటకు వచ్చి సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యుత్‌శాఖా మంత్రి జగదీశ్‌రెడ్డి, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌, శాసనమండలి ఉపసభాపతి విద్యాసాగర్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.