|

మిషన్‌ భగీరథతో తొలగిన తాగునీటి కష్టాలు

నీరు ప్రాణాధారం. నీరు లేనిదే మనిషి మనుగడనే లేదు. కానీ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పల్లెలు తాగునీటి కోసం అల్లాడాయి. నల్లగొండ జిల్లాను ఫ్లోరైడ్‌ భూతం పట్టి పీడించేది. చిన్న వయస్సులో నడుం వంకర పోవడం, బొక్కలు విరగడం, కాళ్లు వంకర్లు తిరగడం, వయస్సు పెరిగినా ఎత్తు పెరగకపోడం లాంటివి వెంటాడాయి. ఫ్లోరైడ్‌ నీటిని తాగడం వల్లే ఇటువంటి సమస్యలు వస్తున్నాయని నిపుణులు ఏనాడో చెప్పారు. ఉద్యమ సమయంలో మంచినీటి కష్టాలను కళ్ళారా చూసిన మన ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ రాగానే తాగునీటి ఎద్దడి నివారణకు యుద్ధ ప్రాతిపదికన కృషి చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించబడి, టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ప్రమాణస్వీకారం చేశారు. ఎప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారో అప్పటి నుంచే తెలంగాణలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రణాళికలు రచించడం ప్రారంభించారు. కేసీఆర్‌ మేధోమథనం నుంచి పుట్టిన పథకమే మిషన్‌ భగీరథ. ఈ పథకం ద్వారా ప్రతి పల్లెకు తాగునీరు నల్లాల ద్వారా అందించాలని సంకల్పించారు. నీటిని శుద్ధి కేంద్రాల ద్వారా స్వచ్ఛమైన తాగునీరుగా మార్చి పల్లెలు, పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా రాష్ట్రంలోని మారుమూల తండాల ప్రజలకు కూడా నల్లాల ద్వారా తాగునీరు అందించడానికి పథక రచన చేశారు. ఈ పథకం ప్రవేశపెట్టడం వల్ల సీఎం కేసీఆర్‌ పలువురి ప్రశంసలందుకుని, అపర భగీరథుడిగా పేరు తెచ్చుకున్నారు.

ఫ్లోరైడ్‌ సమస్యపై యుద్ధానికి, మిషన్‌ భగీరథను అమలుచేస్తున్న విషయానికి గుర్తుగా జూన్‌ 9వ తేదీ, 2015లో యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో మిషన్‌ భగీరథ పైలాన్‌ను ఆవిష్కరించారు. సుమారు 14 నెలల కాలంలో పూర్తి చేసి ఆగస్టు 7వ తేదీ, 2016లో ముఖ్యమంత్రి స్వంత నియోజకవర్గం గజ్వేల్‌ నియోజకవర్గంలోని కోమటిబండ వద్ద ప్రధాని నరేంద్రమోడీచే ప్రారంభోత్సవం చేయించారు. ప్రారంభ సమయంలో ప్రధాని మోదీ కేసీఆర్‌ను ఇంతటి పథకం చేపట్టినందుకు ఎంతో ప్రశంసించారు. ‘నీళ్ళే ఆయన జీవితానికి పెద్ద మిషన్‌’ అని పొగిడారు.

ఈ బృహత్తర పథకాన్ని 14 నెలల రికార్డు టైంలో పూర్తి చేయడమంటే మాటలు కాదు. ఇది ముఖ్యమంత్రి కేసీఆర్‌ పట్టుదల, నిరంతర పర్యవేక్షణకు నిదర్శనం. అప్పటి నుంచి గత ఆరు సంవత్సరాలుగా తెలంగాణలోని ప్రతి పల్లెకు, ప్రతి తండాకు స్వచ్ఛమైన తాగునీరు నల్లాల ద్వారా నిరంతరాయంగా అందుతున్నది. తెలంగాణలో  ఉన్న మొత్తం 54.06 లక్షల ఇండ్లకు తాగునీటి సరఫరా జరుగుతున్నది. దీనికి రూ. 36వేల కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. 23,890 గ్రామీణ ఆవాసాలకు కనెక్షన్‌ ఇవ్వబడింది. ప్రతి సంవత్సరం 68 టీఎంసీల నదీ జలాలను శుద్ధిచేసి ప్రజలకు అందిస్తున్నారు. దీనికై రోజుకు సుమారు 140 నుంచి 150 మెగావాట్ల విద్యుత్‌ను వినియోగిస్తున్నారు.

గోవా, హర్యాణా లాంటి రెండు చిన్న రాష్ట్రాలు మినహా మరే రాష్ట్రమూ ఇప్పటికీ ఇంటింటికీ నల్లా నీళ్లు ఇవ్వలేకపోతున్నది. ఇవాళ తెలంగాణలోని మారుమూల గ్రామీణ ప్రజలు సైతం తాగుతున్నవి ఒట్టి మంచినీళ్లు మాత్రమే కాదు- శుద్ధి చేసిన కృష్ణా, గోదావరి నదుల పవిత్ర జలాలు! ఇది తెలంగాణ సాధించిన గొప్ప విజయం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిబద్ధతకు నిదర్శనం. మహిళల కష్టాలు పారదోలేందుకు ఇంత పెద్ద మొత్తంలో వ్యయం చేసిన ఏకైక, తొలి రాష్ట్రం తెలంగాణ.

కేవలం ఇండ్లకే కాదు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సైతం నల్లా కనెక్షన్లు ఇచ్చి, శుద్ధి చేసిన నదీ జలాలను సరఫరా చేస్తున్న ఘనత కూడా తెలంగాణదే. అందుకే రాష్ట్ర ప్రభుత్వం సాగించిన కృషిని నీతి ఆయోగ్‌ ప్రశంసించింది. ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్న రాష్ట్రానికి రూ.19,2 05 కోట్లు ఇవ్వండని కేంద్రానికి సిఫారసు చేసింది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ హడ్కో రెండు సార్లు 2016, 2017లో అవార్డులు అందజేసింది. నేషనల్‌ వాటర్‌ మిషన్‌ అవార్డు కూడా లభించింది. కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ఈ పథకం సాధించిన విజయాలను అనేకసార్లు కొనియాడారు.

అన్ని రాష్ట్రాలు తెలంగాణను ఆదర్శంగా తీసుకోవాలని ఉద్భోధించారు. ఏకంగా 13 రాష్ట్రాల అధికారులు, ప్రజాప్రతినిధులు మన రాష్ట్రానికి వచ్చి, క్షేత్రస్థాయిలో మిషన్‌ భగీరథ పథకం అమలు తీరుతెన్నులను పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నయా పైసా సాయం పొందకుండానే తెలంగాణ ప్రభుత్వం సాధించిన అద్భుత విజయమిది. ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లోని ఒక్కొక్కరికి సగటున వంద లీటర్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఏడాదికి 68 టీఎంసీల నదీ జలాలను శుద్ధి చేసి సరఫరా చేస్తుండటం విశేషం. ప్రతి ఇంటికి సురక్షితమైన నీళ్లు సరఫరా అవుతుండటంతో రాష్ట్రంలో వాంతులు, విరోచనాలు లాంటి నీటి ద్వారా వ్యాపించే వ్యాధులు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం అమలు కోసం వేలకోట్లు ఖర్చు చేస్తున్నా కూడా ప్రజల మీద నయా పైసా భారం మోపడం లేదు. ప్రజల దాహార్తిని తీర్చడంలో సీఎం కేసీఆర్‌ అంకితభావానికి ఇది నిదర్శనం.

పార్లమెంటులో ప్రశంస

మిషన్‌ భగీరథను కేంద్రం ప్రభుత్వం అనేకసార్లు ప్రశంసించింది. తెలంగాణ అనుసరిస్తున్న విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్ర జల్‌శక్తి శాఖ రాష్ట్రాలకు లేఖ రాసింది. కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ఎప్పుడు సమీక్ష నిర్వహించినా, ఏ రాష్ట్రానికి వెళ్లినా తెలంగాణను ప్రశంసిస్తున్నారు. పార్లమెంటులో సైతం ఈ పథకం సాధించిన విజయాలను వివరించారు. ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేయాలని సూచిస్తున్నారు.

13 రాష్ట్రాల అధ్యయనం

మిషన్‌ భగీరథ అమలవుతున్న తీరును 13 రాష్ట్రాలకు చెందిన మంత్రులు, అధికారులు స్వయంగా చూసి వెళ్లారు. కొన్ని రాష్ట్రాలు తాము కూడా ఈ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించాయి. కొన్ని రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు మిషన్‌ భగీరథ తరహాలో ఇంటింటికీ నల్లా నీటిని అందిస్తామంటూ ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చాయి. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, బీహార్‌, ఒడిశా, జార్ఖండ్‌ తదితర రాష్ట్రాల అధికారులు ఈ ప్రాజెక్టును పరిశీలించారు.

నిర్వహణ తీరు ప్రశంసనీయం

మిషన్‌ భగీరథ పథకం పూర్తయినా కూడా నిర్వహణ సరిగా ఉన్నప్పుడే ప్రజలకు మేలు జరుగుతుంది. అందుకై ప్రభుత్వం ఎంతో శ్రద్ధ కనబరుస్తున్నది. ప్రతి పల్లె, గ్రామంపై కూడా దృష్టి కేంద్రీకరించి నీటి సరఫరా సరిగా జరుగుతున్నదో లేదో పరిశీలిస్తున్నది. ఈ పథకం నిర్వహణ గురించి మిషన్‌ భగీరథ ఈఎన్సీ కృపాకర్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రతి గ్రామానికి నీళ్లు అందుతున్నాయా ఎన్ని నీళ్లు సరఫరా చేశారు అనే అంశాలను వేకువజాము నుంచే పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఇందుకు ఆన్‌లైన్‌ వ్యవస్థను అమలు చేస్తున్నామన్నారు. గ్రామాలకు నీరు సరఫరా చేస్తున్నారని సర్పంచ్‌, గ్రామ కార్యదర్శి, వాటర్‌మెన్‌ నుంచి అధికారులు సంతకాలు తీసుకుంటారని, ఒకవేళ నీరు సరఫరా చేయలేకపోతే వాళ్లు సంతకాలు పెట్టరని తెలిపారు. దీని ద్వారా ఆరోపణలకు, అపోహలకు ఆస్కారం ఉండకుండా చూస్తున్నామన్నారు. మిషన్‌ భగీరథ నీటిని తాగడంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. అనుమానాలు, అపోహలు ఉంటే శాస్త్రీయంగా నివృత్తి చేస్తున్నామని వివరించారు. మిషన్‌ భగీరథ ద్వారా ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు చేకూరాయన్నారు. ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్‌ ఇవ్వడంతో మహిళలకు నీటి కష్టాలు తొలగిపోయాయని, నీళ్ల బాధలు తప్పడంతో మహిళలకు, ఇతర కుటుంబసభ్యులకు నీటి ఇబ్బందులు తప్పాయన్నారు. కలుషిత నీటి కారణంగా ప్రబలే అతిసారం, టైఫాయిడ్‌ వంటి వ్యాధులు గణనీయంగా తగ్గాయని పేర్కొన్నారు.