వాడని, వీడని పరిమళాలు
తెలుగు సాహితీ లోకానికి ప్రత్యేక పరిచయం అక్కర లేని, తన నవలనే, ఇంటి పేరుగా వ్యవహరించబడే ‘‘అంపశయ్య నవీన్’’ (అసలు పేరు : దొంగరి మల్లయ్య) రచన ఇది. సంకలనంలో ‘దృక్కోణాలు’ అన్న నవల (పునర్ముద్రణ), సాహిత్య కబుర్లు అన్న పేరుతో ఆకాశవాణి వరంగల్లు వారు 2003లో ప్రసారం చేసిన 13గురు సాహితీ వేత్తల పరిచయాలు, తొమ్మండుగురు విశ్వవిఖ్యాత రచయితల రచనలు, వారి పరిచయాలున్నాయి. నాలుగవ భాగంగా, తన బాల్యమిత్రుడు సత్యనారాయణరెడ్డి (సత్తెన్న)కి 1961 నుండి 1980 వరకు రాసిన ఉత్తరాల్లో కొన్ని ఇవ్వబడ్డాయి.

ఒకటితో మరొకటి అదనంగా పొందగలిగితే, వినియోగదారుడి సంతోషం ఇనుమడిస్తుంది. ఒకటితో మరో మూడు అదనంగా పొందగలిగితే – పాఠకుడు పరమానందపడిపోతాడు. అలాంటి పరమానందాన్ని, అవధుల్లేని ఆనందాన్ని కలుగ చేసే 4ఇన్1 సంకలన సాహితీ ప్రక్రియ ఇది.
‘‘ఉత్తమమైన కథకి ఉండాల్సింది : శిల్పం వాస్తవి కత, ప్రయోజనం’’ అంటారు కొడవటిగంటి కుటుంబరావు. వాస్తవికత పాఠకుడిని మరింత ఉద్వేగ పరుస్తుంది. మమేకం చేస్తుంది. అయితే ఆ ‘వాస్తవి కత’ చెప్పేవాడి దృక్కోణంతో బాటు రూపాంతరం చెందుతుంది. చిలువలు పలువల, వలువలు తొడు క్కుంటుంది. రచయిత కరీంనగర్లో పని చేస్తున్నపుడు ఒక సంఘటన జరుగుతుంది. ఒక దంత వైద్యుడు పాలమ్ముకునే పేషెంటుపై అత్యాచార ప్రయత్నం చేస్తాడు. శోధన్ అనే ‘ఛీఫ్ రిపోర్టర్ (విలేకరి) బలా త్కార బాధితురాలుగా చెప్పబడే రాజమ్మ, నిందితుడు డా॥ సాంబమూర్తి, ఇన్స్పెకర్ అశోక్‌రావు, రాజమ్మతో బాటు క్లినిక్‌కు వెళ్లిన మరో వ్యక్తి పోచమ్మ, నిందితుడికి వ్యాపార పోటీదారు డా॥ వెంకటేశ్వరావు, స్త్రీ వాద అడ్వకేటు భారతీదేవి, రాజకీయ నాయకుడు సోమలింగం, ఈ ఎనమండుగురూ, ఎనిమిది రకాల వ్యాఖ్యానాలు వారి వారి దృక్పథ పరిధిలో చేస్తారు. ‘మౌలిక సత్యం ఒకటే అయినా, మనిషిని బట్టి నిందితుడిలో వారి పూర్వ పరిచయాల్ని బట్టి మారుతుంది’ అన్న సత్యాన్ని ఆసక్తికరంగా వివరించబడిరది.
‘సాహిత్యకబుర్ల’లో
కాళోజీ, బాపిరాజు, శ్రీశ్రీ, విశ్వనాధ, చలం, సినారె, కరుణశ్రీ, దాశరథి, విమర్శకుడు రా.రా (రాచమల్లు రాము చందారెడ్డి) గురజాడ, బుచ్చిబాబు లాంటి ప్రముఖులు వివరించబడ్డారు. కాళోజీ, కరుణశ్రీ, రాయప్రోలు, శ్రీశ్రీ, సినారె గారలతో రచయిత ప్రత్యక్ష అనుభవాల్లోంచి వివరించిన సంఘటనలు ఆసక్తిదాయకంగా నాడు శ్రోతలకు, నేడు పాఠకులకు వివరించబడ్డాయి. ఈ కబుర్లు కాకరకాయల్లా కాకుండా, మొర మొరాల్లా టూకీగా ఇవ్వటం. రచయిత ప్రత్యేకత. బుచ్చిబాబు రచనల్లో ముఖ్యంగా ‘చివరకు మిగిలేది’ నవలపై ఇచ్చిన మనో వైజ్ఞానిక వివరాలతో నవీన్ తనలో గాప్ప విమర్శకుడున్నాడని నిరూపించుకోవటం బాగుంది. సహస్రాబ్ది మేటి రచయితలుగా విలియం షేక్స్పియర్ సెర్వాంటేజ్, డోస్టవిస్కీ, టాల్‌స్టాయ్, గోర్కి, షా, జేమ్స్, జాయిస్ ప్రభృతులను పేర్కొంటూ, వారి రచనలు, ప్రజాభిప్రాయాలు తన వివరణలు ఆకట్టుకుంటాయి. షేక్స్పియర్ను ‘మనిషి లోతులు చూసిన మహాకవి’ అని సెర్వాంటేజ్ (డాన్క్విక్జాట్)ను ‘విషాదం నుండి వినోదం పిండిన రచయిత’ అని చార్లెస్ డికెన్సును పరిచయం చేస్తూ ‘హాస్య జలపాతాలూ… దుఃఖ సముద్రాలూ…’ అనటం చాలా సముచితంగా ఉంది.
ఆప్తులకు రాసే ఉత్తరాల్లో మనిషి తన మనసును విప్పుకుంటాడు. అంతర్జాల మహిమతో అవి నేడు కరువయ్యాయిగాని డెబ్బయవ దశకం వరకు పోస్ట్‌మేన్ తెచ్చే ఉత్తరాలకు వేయికళ్ళ’తో ఎదిరి చూసే కాలం అది. రచయిత తన మిత్రుడు సత్యనారాయణరెడ్డికి రాసిన ఉత్తరాల్లో కొన్నింటిని అలాగే ప్రముఖ రచయిత చలంకి తాను రాసిన ఒక ఉత్తరం ఇవ్వబడింది. ‘జీవిత రథ చక్రాల కింద నలిగి బాధపడితేగాని మీ (చలం) కలంలో నుండి నెత్తురు వొలికింది’ ‘మీ నిరంతర సౌందర్యాన్వేషణలో, మీ సౌందర్య సృష్టిలో, మీ కలల్లో మీ బాధలో, మీ చిరు నవ్వుల్లో, మీ ప్రేమలో మీతోపాటు పాలు పంచుకన్న జీవి’ అని చదువుతోంటే-ఒక సౌందర్యోపాసకుడిని మాత్రమే మరో సౌందర్యోపాసకుడు తెలుసుకో గలడనిపిస్తుంది.
‘జీవితంలో కన్నీళ్ళ విలువ తెలుసుకోలేని వాడు పశువుకంటే హీనుడు’. నిరంతరం రాయటంలో మునిగి పోయేంత మెటీరియల్ నా దగ్గర ఉంది’’ ‘ఎదిరి చూడటంలో, డిసప్పాయింట్ కావటంలో, విరహంతో తపించి పోవటంలో, ఎంత అందం ఉంటుందో… ఎంత సొగసు ఉంటుందో…. రసహృదయులైన పాఠకులకు కూడా అనుభవమే!
‘ఒక పుస్తకం చదివినప్పుడు నువ్వు ఎట్లా ఫీల్ అయ్యావు? ఆ ఫీలింగ్ యొక్క విలువేమిటి? అని తేల్చుకుని ఆ పుస్తకం గొప్పతనాన్ని నిర్ణయించుకోవాలి’ అని సత్తెన్నకు రాస్నోన్న నవీన్ ‘దృక్కోణాలు’ ఒక గొప్ప పుస్తకం.
దృక్కోణాలు
రచన: అంపశయ్య నవీన్
వెల:రూ. 300/
ప్రతులకు:అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు,
రచయిత దగ్గర లభిస్తాయి,
వరంగల్లు.
ఫోన్ : 0870-2456458