బాలానగర్‌ వంతెనతో ట్రాఫిక్‌ సమస్యకు విముక్తి

హైదరాబాద్‌లోని బాలానగర్‌లో నిర్మించిన ఆరు వరసల ఫ్లైఓవర్‌ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. దీంతో 40 యేళ్ళ ట్రాఫిక్‌ సమస్యకు విముక్తి లభించినట్లయింది. ఈ వంతెన నిర్మాణంలో రెండేళ్ళుగా పాలుపంచు కున్న వనపర్తి జిల్లా మణిగల గ్రామానికి చెందిన శివమ్మ అనే కార్మికురాలి చేతులమీదుగా ఈ ఫ్లై ఓవర్‌ ను ప్రారంభింపచేయడం ఓ విశేషం.

ఈ సందర్భంగా రాష్ట్ర ఐ.టి, పురపాలక శాఖల మంత్రి కె.టి.రామారావు మాట్లాడుతూ, తాజ్‌ మహల్‌ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెందరో అన్నట్టు, ఏ నిర్మాణం జరిగినా అందులో కూలీల శ్రమ ఎంతో ఉంటుందని, కానీ, దానిని ఎవరూ పట్టించుకోకుండా నేతలు మాత్రమే ప్రారంభోత్సవాలు చేస్తుంటారని  అన్నారు. కార్మికులను గౌరవిస్తే మనకూ గౌరవం దక్కుతుందని అన్నారు. అందుకే ఈ వంతెన నిర్మాణంలో పాలుపంచుకున్న ఓ కార్మికురాలితో వంతెన ప్రారంభించుకోవడం ఆనందంగా ఉన్నదన్నారు. బాబూ జగ్జీవన్‌ రామ్‌ వర్ధంతిని పురస్కరించుకొని ఈ బాలానగర్‌ ఫ్లై ఓవర్‌కు ఆయన పేరు పెడుతున్నట్టు కె.టి.ఆర్‌ ప్రకటించారు. ఈ వంతెన నిర్మాణానికి 385 కోట్ల రూపాయలు కేటాయించినప్పటికీ, 275 కోట్లతోనే పూర్తయిందని మంత్రి చెప్పారు. ఈ సందర్భంగా  హెచ్‌.ఎం.డి.ఎ చీఫ్‌ ఇంజనీరు బి.ఎల్‌.ఎన్‌.రెడ్డిని మంత్రి కె.టి.ఆర్‌ సన్మానించారు.

హైదరాబాద్‌ అభివృద్ధికి కేంద్రం మోకాలడ్డుతోందని, కేంద్ర సహాయ నిరాకరణ వల్ల నాలుగేళ్ళుగా నగరంలో స్కైవేల నిర్మాణం పూర్తి కావడం లేదని కె.టి.ఆర్‌ చెప్పారు.ప్యాట్నీ నుంచి సుచిత్రా వరకూ, జూబ్లీ బస్టాండ్‌ నుంచి తుర్కపల్లి వరకూ రెండు స్కైవేలను నాలుగేళ్ళ క్రితమే ప్రతిపాదించి 4,000 కోట్ల వరకూ నిధులను సమకూర్చడం జరిగిందని, మధ్యలో కొన్ని రక్షణ రంగ భూములున్నాయని కేంద్రప్రభుత్వం అనుమతినివ్వనందున వాటి నిర్మాణంలో జాప్యం జరుగుతోందని అన్నారు. 30 వేల కోట్ల రూపాయలతో హైదరాబాద్‌లో రోడ్ల విస్తరణ, స్కైవేలు, వంతెనలు నిర్మాణం వంటి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని మంత్రి కె.టి.ఆర్‌ వివరించారు. మొదటి విడతలో 6,000 కోట్ల రూపాయల వ్యయంతో అండర్‌ పాస్‌లు, వంతెనల నిర్మాణాలు జరుగుతున్నాయని, విశ్వనగరం దిశగా హైదరాబాద్‌ ను ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. బాలానగర్‌ ప్లై ఓవర్‌ నిర్మాణంతో గత 40 ఏళ్ళుగా ఉన్న ట్రాఫిక్‌ సమస్య పరిష్కారమయిందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్‌, మల్లారెడ్డి, మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, శాసన సభ్యుడు మాధవరం కృష్ణారావు, వివేకానంద, ఎమ్మెల్సీలు నవీన్‌ రావు, సురభి వాణీదేవి, శంభీపూర్‌ రాజు, తదితరులు పాల్గొన్నారు.