|

దైవ ప్రవక్త(స) జీవితం.. విలువల వాచకం

godశ్రీ సూరి

ఎవరి నైతికత అత్యుత్తమంగా ఉంటుందో అతడు సృష్టికర్త అల్లాహ్‌కు అత్యంత ప్రియతముడు (బురాఖి) అని పలికిన దైవ ప్రవక్త(స) తన జీవితంలో అత్యుత్తమ నైతిక విలువలను ఆచరించి, స్థాపించి ప్రపంచానికి ఆదర్శ ప్రాయుడయ్యారు. అందుకే ఆయన (ప్రవక్త) జననం సర్వ మానవాళికి ‘శుభోదయం’ అయింది. ప్రవక్త జన్మదినో త్సవాన్ని ముస్లీం సోదరులు ‘మిలాద్‌ ఉన్‌ నబీ’ గా జరుపుకుంటారు. కేవలం బోధనల వల్ల నైతిక విలువలను సమాజంలో పాదుకొల్పడం సాధ్యం కాదు. బోధకుడు ఆ విలు వలను స్వయంగా ఆచరించి ఆ విలువల పునాదులపై సత్సమాజాన్ని సర్వోత్తమ వ్యవస్థ ను స్థాపించాలి. దాని పరిరక్షణకు, ప్రచారానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి. దైవ ప్రవక్త మహమ్మద్‌ (స) పై విషయాలన్నింటిని తన జీవిత కాలంలోనే సాధించారు.

తల్లిదండ్రుల సేవ..

తల్లిదండ్రులను గౌరవించడం, వారికి సేవ చేయడం, వారి ఆజ్ఞ్ఞలను శిరసావహించడం పిల్లల బాధ్యత. ప్రవక్త జన్మించక ముందే ఆయన తండ్రి అబ్దుల్లా పరమపదించారు. అలాగే ఆయన తల్లి హజ్రత్‌ అమీనా దైవ ప్రవక్త జన్మించిన ఆరు సంవత్సరాలకు ఇహలోకాన్ని వీడిపోయారు. అందువల్ల ప్రవక్త(స)కు వారి తల్లిదండ్రులకు సేవ చేసే భాగ్యం కలుగలేదు. అయితే దైవ ప్రవక్త (స) తల్లిదండ్రుల సేవ, వారి పట్ల సత్ప్రవర్తన కలిగి ఉడాలని హితవు పలికారు. దైవ ప్రవక్తకు పాలు పట్టిన తల్లి దాయీ హలిమాను తన సొంత తల్లిలా చూసుకున్నారు.

సంతానం పట్ల తల్లిదండ్రుల బాధ్యత

తమ పిల్లలను ప్రేమించడం, మంచి విద్యాబుద్దులు నేర్పించడం, సజ్జనులుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేయడం తల్లిదండ్రుల బాధ్యత. ప్రవక్త (స) తన కుమార్తె హజ్రత్‌ ఫాతిమాను ఎంతో అమితంగా ప్రేమించేవారు. ఆమెకు ఉన్నతమైన విద్యను అందించి ఉన్నతంగా తీర్చిదిద్దారు.

భర్తగా…

దైవ ప్రవక్త (స) తన ఇరవై ఐదవ ఏట తనకన్నా వయసులో పదిహేనేళ్లు పెద్దదైన, రెండోసారి వితంతువు అయిన ఖదిజాను వివాహమాడి స్త్రీ జనోద్దరణకు శ్రీకారం చుట్టారు. ఆమెతో అత్యంత సంతోష జీవితాన్ని గడిపారు. ఆమె మరణా నంతరం, ఇస్లామీయ ఉద్యమ అవసరాలు, అరబ్బు తెగల మధ్య ఐక్యత సాధించడానికి వేర్వేరు తెగల నుంచి వివాహాలు చేసుకున్నారు. అందులో అయేషా(ర) తప్ప మిగితా వారంత వితంతువులే. కుటుంబ జీవనం భార్యా భర్తల పవిత్ర బంధంతో ప్రారంభ మవుతుంది. భార్యాభర్తలిద్దరు సంసారిక జీవితం, దాని నియమాల్ని, బాధ్యతలను సరిగ్గా అర్థం చేసుకుని తదనుగునంగా నడుచుకుంటే , ఆ కుటుంబం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వికసిస్తుందని చెప్పారు.

మిత్రునిగా…

దైవ ప్రవక్త మహమ్మద్‌(స) తన సహచర మిత్రులను చాలా ప్రేమించారు. ఎప్పుడూ వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉండేవారు. సత్యం విషయంలో ఆయన అందరిని సమదృష్టితో చూసేవారు. ధనికులైనా, పేదవారైనా, స్వతంత్రు లైనా, బానిసలైనా ప్రతి ఒక్కరి ఆహ్వానాన్ని మన్నించేవారు. వ్యాధి గ్రస్తులు స్వంత వారైనా, పరాయి వారైనా వారి పరామర్శకు వెళ్లేవారు. ఇతరులను ఆ దిశగా ప్రోత్సహించేవారు.

అతిథుల హక్కులు…

ఎవరైతే అల్లాహ్‌ను, పరలోక దినాన్ని విశ్వసిస్తారో వార తమ అతిథిని ఆదరించి సత్కరించాలి అని దైవ ప్రవక్త(స) తెలిపారు. ఆతిథ్యం మూడు రోజుల వరకు ఉంటుంది. మొదటి రోజు విదు, సత్కరింపుల దినం. ఆరోజు అతిథికి వీలైనంత మంచి అన్న పానియాలు సమకూర్చాలి. రెండవ మూడవ రోజు శ్రమించవలసిన అవసరం లేదు. మూడు రోజుల తరువాత అతిథికి చేసే సేవలు సదకా(దానం)గా పరిగణించబడతాయి. ఇంటి వారిని కష్టపెట్టే వరకు బసచేయడం అతిథికి ధర్మ సమ్మతం కాదని ఉద్భోదించారు.

పొరుగువారి హక్కులు…

తల్లిదండ్రులు, బంధు మిత్రుల హక్కుల తరవాత ఇరుగు, పొరుగు వారితో మంచిగా ఉండాలని, వారితో సత్సంబంధాలు కలిగి ఉండి, మంచిగా ప్రవర్తించాలని ప్రవక్త(స) సూచించారు.

అనాథల హక్కులు…

అనాథలను ప్రేమించడం, పెంచడం, వారి అలనా, పాలనా చూడటం, మంచి విద్యాబుద్దులు నేర్పించడం సాటి మనుషులుగా మన బాధ్యత అని ప్రవక్త(స) తెలిపారు. అనాథలను ఆదుకొండి, ఆర్తులకు భోజనం పెట్టి దాహర్తులకు మంచినీరు అందివ్వాలని నొక్కి చెప్పారు.

న్యాయాధిపతిగా…

ప్రవక్త మహమ్మద్‌(స) ఒక న్యాయాధిపతిగా, ఆదర్శ ప్రాయుడిగా చరిత్రలో నిలిచిపోయారు. సమ న్యాయవ్యవస్థ, సామాజిక న్యాయ వ్యవస్థను స్థాపించారు. తద్వారా నల్లవారైనా, తెల్లవారైనా,అరబ్బైనా, అరబ్బేతరుడైనా, గొప్పవంశస్థుడైనా, బానిస అయినా, ప్రవక్త వారి వంశానికి చెందిన వారైనా, తెగల సర్ధారులైనా న్యాయం, చట్టం, శిక్షల ముందు సమానులైపోయారు.

పాలకునిగా…

ఒక పాలకునిగా ప్రవక్త(స) ప్రజలందరి కనీస అవసరాలు తీర్చడానికి అవసరమైన చర్యలన్నీ తీసుకున్నారు. ముస్లీమైనా, ముస్లీమేతర సోదరుడైనా, స్త్రీ అయినా, పురుషుడైనా జన్మరిత్యా అందరూ సమానులే అని పేర్కొన్నారు. పౌరులందరి ధన, మాన, ప్రాణ రక్షణకు భరోసా ప్రసాదించారు. వయోవృద్ధులకు పింఛన్‌లు, ప్రజల ధార్మిక, సాంస్కృతిక హక్కులకు, తూనికలు, కొలతలు, వ్యాపారాల్లో జరిగే మోసాలను నివారించి స్వచ్చ మైన వాణిజ్యాన్ని ప్రపంచానికి అందించారు. జూదం, మద్య పానం, వ్యభిచారం లేని ఒక సుందర సమాజనిర్మాణానికి అవ సరమైన చర్యలు చేపట్టారు. నీటి బావులు, రహదారుల నిర్మాణం, వైద్య శాలలు, పాఠశాలలు, అతిథి గృహాల నిర్మాణం చేశారు. జకాత్‌, ఫిత్రా, సదఖా లాంటి ఆర్థిక సంస్కరణల ద్వారా కేవలం 30 ఏళ్ల కాలంలో పేదరికాన్ని పారద్రోలి అద్భుతమైన ఆర్థిక మంత్ర దండాన్ని ప్రంచానికి అందించారు. పర్యావరణ పరిరక్షణ, నీటి సంరక్షణ, మానవ హక్కుల పరిరక్షణ, అన్నింటికంటే మించి మానవులను సృష్టికర్త అయిన దేవునికే అందించాలని తెలిపారు. కిరీటం లేని చక్రవర్తిగా, సంపద లేని మహరాజుగా, రాజమహలు ఎరుగని పాలకునిగా, హంసతూలికా తల్పం తెలియని మహా మనిషిగా, మరణించే రోజున దీపంలోనైనా నూనె సైతం లేని సామ్రాజ్యాధిపతిగా ప్రపంచ చరిత్రలో కనివిని ఎరుగని నభూతో నభవిష్యత్‌ లాంటి గొప్ప వ్యక్తిత్వం గల సంక్షేమ రాజ్య స్థాపకునిగా ప్రంచానికి ఆదర్శ ప్రాయుడయ్యారు.