ప్రవర్తనా నియమావళి అమలుపై నిఘా నేత్రం

హైదరాబాద్‌లో ఎన్నికల ప్రవర్తన నియమావళి పటిష్ట అమలుకై రిటర్నింగ్‌ అధికారులు, పోలీసు, ఎక్సైజ్‌, ఇన్కమ్‌ ట్యాక్స్‌, రెవెన్యూ తదితర శాఖల ఉన్నతాధికారులతో హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఎం.దానకిషోర్‌ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి నగర పోలీస్‌ అడిషనల్‌ కమిషనర్‌ చౌహాన్‌, హైదరాబాద్‌ జాయింట్‌ కలెక్టర్‌ రవి, ఆదాయం పన్ను శాఖ అడిషనల్‌ కమిషనర్‌ సతీష్‌ కుమార్‌, కంటోన్మెంట్‌ సీ.ఇ.ఓ చంద్రశేఖర్‌, జీహెచ్‌ఎంసీ అడిషనల్‌ కమిషనర్లు శృతి ఓజా, కెనడి, 15 నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా దానకిషోర్‌ మాట్లాడుతూ, ఎన్నికల ప్రకటన వెలువడినందున ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిందని, ఈ నియమావళిని పటిష్టంగా అమలు చేయాల్సిన బాధ్యత ఉమ్మడిగా అన్ని విభాగాలపై ఉందని స్పష్టం చేశారు. నగరంలో ఇప్పటికే వివిధ పార్టీలు, అభ్యర్థులకు చెందిన ప్రచార సామాగ్రి, ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగ్‌లను తొలగించామని, ఈ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రైవేట్‌ భవనాలపై వివిధ పార్టీల ప్రకటనలను ఏర్పాటు చేస్తే ఆయా ఇళ్ల యజమానుల అనుమతి తప్పనిసరిగా పొందాలని పేర్కొన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం మూడు ఫ్లైయింగ్‌ స్క్వాడ్లు, మూడు స్టాటిక్‌ సర్వేలెన్స్‌ టీములను తక్షణమే ఏర్పాటు చేసి, ఈ బృందాలకు ఎగ్జిక్యూటివ్‌ మెజిస్ట్రేట్లను ఇంచార్జీలుగా నియమించాలని అన్నారు.

వివిధ పార్టీలు, పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులు నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాలను రికార్డింగ్‌ చేయాలని అన్నారు. ఎక్కడైతే అక్రమ డబ్బు చెలామణి, మద్యం సరఫరా, నిబంధనల అతిక్రమణలు ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో ఈ బృందాలను పంపించి వీడియో రికార్డింగ్‌ చేపట్టాలని సూచించారు. హైదరాబాద్‌ జిల్లాపై అన్ని రాజకీయ పార్టీలు, మీడియా, తటస్తులు ప్రత్యేక దృష్టి సారిస్తారని, ఈ నేపథ్యంలో ఎన్నికల నియమ నిబంధనలను స్పష్టంగా పాటించాలని అన్నారు.

హైదరాబాద్‌ జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి (ఎం.సి.సి) అమలు నోడల్‌ అధికారిగా హైదరాబాద్‌ జాయింట్‌ కలెక్టర్‌ రవిని నియమించినట్టు దానకిషోర్‌ తెలిపారు. ప్రవర్తన నియమావళికి సంబంధించిన 12 నివేదికలను ప్రతిరోజు జిల్లా ఎన్నికల అధికారికి సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.ఎన్నికల నిర్వహణలో స్వీయ నిర్ణయాలకు తావులేదని, ప్రతి అంశం లిఖిత పూర్వకంగా ఉన్న ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో ర్యాలీలు, సభలు నిర్వహించుకునే పార్టీలు, అభ్యర్థులు, నాయకులు సంబంధిత రిటర్నింగ్‌ అధికారికి అనుమతి నిమిత్తమై దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి పేర్కొన్నారు. ర్యాలీలు, సమావేశాల నిర్వహణకు వచ్చిన దరఖాస్తులను సంబంధిత పోలీసు అధికారులకు రిటర్నింగ్‌ ఆఫీసర్‌ పంపిస్తారని, శాంతి భద్రతల కోణంలో పరిశీలించి వాటికి తగు అనుమతులను రిటర్నింగ్‌ అధికారి జారీచేస్తారని వివరించారు.

అసెంబ్లీకి పోటీచేసే అభ్యర్థులకు 28లక్షల రూపాయలు గరిష్టంగా వ్యయ పరిమితిని ఎన్నికల సంఘం నిర్ధారించిందని దానకిషోర్‌ తెలిపారు. వివిధ పార్టీలు, అభ్యర్థులు నిర్వహించే ఎన్నికల ప్రచార సంబంధిత సమావేశాలను వీడియోగ్రఫీ చేయించనున్నట్టు తెలిపారు. సిటీ పోలీస్‌ అడిషనల్‌ కమిషనర్‌ చౌహాన్‌ మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో అక్రమ మద్యం, డబ్బు చెలామణిని నివారించాలని పేర్కొన్నారు. రిటర్నింగ్‌ అధికారులు తమ సంబంధిత కమిటీలతో సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో సున్నిత, సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి వాటిపై ప్రత్యేక నిఘా చేపట్టాలని సూచించారు.