1,114 కోట్లతో ఎలక్ట్రికల్ త్రీవీలర్ ప్లాంట్
తెలంగాణ రాష్ట్రం విద్యుత్ ఆధారిత వాహనాల తయారీ పరిశ్రమలకు కేంద్రంగా మారుతున్నది. అమెరికాలోని కాలిఫోర్నియా ప్రధాన కేంద్రంగా నడుస్తున్న ఎలక్ట్రికల్ త్రీ వీలర్ తయారీ సంస్థ బిలిటీ తెలంగాణలో తన పరిశ్రమను స్థాపించడానికి నిర్ణయించింది. ప్రతి సంవత్సరం 2.5 లక్షల యూనిట్లను తయారుచేసే సామర్థ్యంతో 1,144 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో పరిశ్రమను ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఈ పరిశ్రమ స్థాపన వల్ల సుమారు 3వేల మంది నిరుద్యోగులకు ఉపాధి లభించనున్నది. ఈ మేరకు బిలిటీ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద త్రీవీలర్ ఉత్పాదక కేంద్రం కాబోతున్నది.

ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ పరిశ్రమలు, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ‘రెండేండ్ల క్రితం ఈవీ పాలసీని ప్రారంభించినప్పుడు విద్యుత్తు ఆధారిత వాహనాల తయారీకి తెలంగాణ ప్రధాన కేంద్రం కావాలని ఆకాంక్షించాం. నేడు అది వాస్తవరూపం దాల్చడాన్ని చూస్తున్నాం. చాలా సంతోషంగా ఉన్నది. ఇక్కడ బిలిటీ ప్రపంచంలోనే అతిపెద్ద త్రీవీలర్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నది. ఈ ఏడాది రాష్ట్రంలో ఈవీ తయారీ రంగంలో వచ్చిన భారీ పెట్టుబడి ఇది.’ అంటూ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ఐటీ, ఫార్మా కంపెనీలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయబడి దేశంలోనే వీటికి కేంద్రంగా రాష్ట్రం రూపు దిద్దుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో కూడా రాష్ట్రం ముందంజలో ఉండడం విశేషం.
బిలిటీ వ్యాపార కార్యకలాపాలు ప్రపంచవ్యాప్తంగా 15 దేశాల్లో కొనసాగుతున్నాయి.భారత్‌తోపాటు జపాన్, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, పోర్చుగల్, జర్మనీ, లెబనాన్, ఉగాండా, కెన్యా, సెనగల్, నేపాల్, బంగ్లాదేశ్, దుబాయ్ వంటి దేశాల్లో బిలిటీ వాహనాలను మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నది. తయారీ కేంద్రాలతోపాటు అమెరికా, పోర్చుగల్, కెన్యాల్లో బిలిటీకి అసెంబుల్ ప్లాంట్లూ ఉన్నాయి. అమెజాన్, ఐకియా, బిగ్‌బాస్కెట్, జొమాటో, ఫ్లిప్‌కార్ట్, గ్రోఫర్స్ వంటి ఎన్నో ఈ-కామర్స్ దిగ్గజ సంస్థలు బిలిటీ వాహనాలను వినియోగిస్తున్నాయి.
రెండు దశల్లో అభివృద్ధి ఈ ప్లాంట్‌ను రెండు దశల్లో అభివృద్ధి చేయనున్నారు. మొదటి దశ 13.5 ఎకరాల్లో నిర్మాణం కానున్నది. దీని వార్షిక సామర్థ్యం 18వేల యూనిట్లు. 2023 ఆరంభంకల్లా ఇది అందుబాటులోకి వస్తుందని అంచనా. అయితే 2024 నాటికి ఏటా 2.4 లక్షల పూర్తి సామర్థ్యాన్ని అందుకోనున్నది. ఈ మేరకు ప్లాంట్‌ను భారీగా విస్తరించనున్నారు. మొత్తం 200 ఎకరాల్లో ప్లాంటు ఏర్పాటుకానున్నది. ఇక ఇక్కడ కార్గో మోడల్ టాస్క్‌మన్, ప్యాసింజర్ వాహనం అర్బన్‌ను తయారు చేయనున్నారు. ఆయా దేశాలకు ఇక్కడి నుంచి వాహనాలు ఎగుమతులయ్యే అవకాశాలున్నాయి. ‘ప్రపంచవ్యాప్తంగా బిలిటీ రూపొందించిన 1.2 కోట్ల టాస్క్‌మన్ వాహనాలు తిరుగుతున్నాయి. మరిన్ని మార్కెట్‌లోకి రాబోతున్నాయి. మా బ్యాటరీలు ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయి. వినియోగదారులకు ఎన్నో రకాలుగా లాభిస్తాయి. ఆటో, మెరైన్, గిడ్డంగి, బ్యాకప్ పవర్ రంగాల్లో అత్యుత్తమ ఉత్పత్తుల తయారీ దిశగా వెళ్తున్నాం’ అని ఈ సందర్భంగా బిలిటీ ఎలక్ట్రిక్ సీఈవో రాహుల్ గయం అన్నారు.