రాష్ట్రంలో ఎలక్ట్రిక్‌ వాహనాల పరిశ్రమ   

 తెలంగాణ రాష్ట్రంలో మరో అంతర్జాతీయ దిగ్గజ కంపెనీ భారీ పెట్టుబడితో పరిశ్రమను నెలకొల్పనుంది. విద్యుత్‌ వాహనాల  రంగంలో ప్రపంచంలో వున్న దిగ్గజ కంపెనీలకు పోటీ ఇస్తున్న అమెరికాకు చెందిన ట్రైటన్‌ ఈవీ కంపెనీ, తెలంగాణ ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. రాష్ట్రంలో సూమారు రూ. 2100 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు కంపెనీ తన సంసిద్ధతను వ్యక్తం చేసింది. ప్రగతి భవన్‌లో జరిగిన ఒక సమావేశంలో పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్‌తో సమావేశమై తమ పెట్టుబడి ప్రణాళికను వివరించింది. మంత్రి కేటిఆర్‌ సమక్షంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌, ట్రైటన్‌ భారత విభాగాధిపతి మహ్మద్‌ మన్సూర్‌ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.

ట్రైటన్‌ ఈవీ కంపెనీ భారతదేశంలో తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు చాలా కాలం నుండి ఎదురుచూస్తున్నది. కొత్తగా పెట్టుబడులు పెట్టే విషయంలో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అనుకూలతలను దృష్టిలో ఉంచు కుని ఇక్కడ 2100 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధపడి వచ్చామని  కంపెనీ తెలిపింది. ఈ విషయంలో కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులతో  చర్చలు జరిపిన పిదప తెలంగాణ రాష్ట్రం అత్యుత్తమ మైనదిగా నిర్ణయం తీసుకున్నట్టు చెప్పింది.రాష్ట్రప్రభుత్వం కల్పిస్తున్న రోడ్‌ టాక్స్‌, రిజిస్ట్రేషన్‌ ఫీజుల్లో మినహాయింపులు, టీఎస్‌ఐ పాస్‌ విధానాల పట్ల ఆకర్షితులై ఇక్కడే పరిశ్రమను నెలకొలపాలని నిర్ణయించుకున్నట్టు కంపెనీ తెలిపింది. అయితే ప్రభుత్వం సూచించిన మేరకు జహీరాబాద్‌ నిమ్జ్‌లో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు సుముఖంగా ఉన్నామని తెలిపింది. ఇంతకు ముందు వివిధ రాష్ట్రాల్లో ఉన్న అవకాశాలను పరిశీలించిన తర్వాతనే  తెలంగాణ కేంద్రంగా తమ కార్యకలాపాలను ముందుకు తీసుకుపోయేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కేటీఆర్‌ కి  ట్రైటన్‌ ఈవీ కంపెనీ తెలిపింది. భవిష్యత్తులో భారీగా డిమాండ్‌ ఉండే విద్యుత్‌ వాహనాల రంగంలో పెద్ద ఎత్తున విస్తరించేందుకు తమ కంపెనీ ఇప్పటికే ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నదని మంత్రి కేటీఆర్‌ కు  కంపెనీ సీఈఓ హిమాన్షు పటేల్‌ తెలిపారు. 

తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన ట్రైటన్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు మంత్రి కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. కంపెనీ ప్రతిపాది స్తున్న మ్యానుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ ద్వారా భారీ ఎత్తున ఎలక్ట్రిక్‌ వాహనాలను ఈ రాష్ట్రంలో ఉత్పత్తి చేసే అవ కాశం ఉంటుందని, కంపెనీ పేర్కొన్న ప్రణాళిక ప్రకారం తొలి ఐదు సంవత్సరాల్లో 50 వేలకు పైగా, సెడాన్లు, లగ్జరీ కార్లు, ఇతర ఎలక్ట్రిక్‌ వాహానాలను ఉత్పత్తి చేసే అవకాశం ఉందన్నారు. కంపెనీ ప్రతిపాదిస్తున్న సుమారు 2100 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో 25 వేల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన తెలంగాణ ఈవీ పాలసీ దేశంలోనే ఒక అత్యుత్తమ పాలసీ అన్నారు. టీఎస్‌-ఐపాస్‌లో మెగా ప్రాజెక్ట్‌కి లభించే అన్ని రకాల సహాయ సహకారాలను ప్రభుత్వం తరఫున అందిస్తామని మంత్రి కేటీఆర్‌ ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం క్రమంగా విద్యుత్‌ వాహనాల  రంగ పెట్టుబడులకు ఒక అత్యంత ఆకర్షణీయ ప్రాంతంగా మారుతుందన్న ఆశాభావాన్ని మంత్రి కేటీఆర్‌ ఈ సందర్భంగా వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌, కంపెనీ సీనియర్‌ ప్రతినిధి బృందం పాల్గొన్నది.