తెలంగాణ ప్రాంతీయ సంఘానికి విస్తృతాధికారాలు

magaఆంధ్రపదేశ్‌ ప్రాంతీయ సంఘం ఉత్తరువు (1958)ను సవరిస్తూ మార్చి ఏడవ తేదీన రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వును ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి మార్చి 20న శాసనసభ ముందు ఉంచారు. తెలంగాణ ప్రాంతీయ సంఘం అధికారాలను ఈ ఉత్తర్వు విస్తృతం చేస్తున్నది. మార్చి 9, 1970 నుంచి అవి అమల్లోకి వచ్చాయి. పెద్ద మనుషుల ఒప్పందంలో 1956 ఫిబ్రవరి 20న అంగీకరించిన షరతులకు భిన్నంగా ప్రాంతీయ సంఘం ఉత్తర్వులున్నాయనీ, ఆ ఒప్పందాన్ని అమలు చేయడంలేదని తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన విషయం విదితమే. 1969లో ఉద్యమం తీవ్రరూపం దాల్చిన సందర్భంగా ప్రాంతీయ సంఘానికి విస్తృత అధికారాలు కల్పించాలనే ఆలోచనను ప్రధాని ఇందిర వ్యక్తపరిచింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం కన్నా విస్తృత అధికారాలు ఇవ్వడంవలన నష్టమేమీలేదని కొందరు ఆంధ్ర ప్రాంత నాయకులు కూడా భావించారు. దీని పర్యవసానమే ఈ విస్తృతాధికారాల ఉత్తర్వులు. ఈ ఉత్తర్వుల ప్రకారం:

తెలంగాణ ప్రాంతానికి, రాష్ట్రంలోని ఇతర ప్రాంతానికి సంబంధించిన ఆదాయ, వ్యయాల వివరాలను బడ్జెట్‌లో వేర్వేరుగా చూపాలని రాష్ట్రపతి ఉత్తర్వు నిర్దేశిస్తున్నది.

యూనివర్సిటీ విద్య, భారీ, మధ్య తరగతి పరిశ్రమలు కూడా తెలంగాణ ప్రాంతీయ సంఘం పరిధిలోకి తేబడినాయి.

ప్రభుత్వ సర్వీసులకు సంబంధించి… తెలంగాణ ప్రాంతానికి చెందిన వారికి, రాష్ట్ర ప్రభుత్వంలోనూ, ప్రభుత్వంచే నెలకొల్పబడిన సంస్థలలోనూ (అంటే బోర్డులు, కార్పొరేషన్లలోనూ), శాసనబద్ధమైన సంస్థలలోనూ, తెలంగాణ ప్రాంతంలోని కంపెనీలు, పరిశ్రమలు మొదలైన వాటిలోనూ తగిన ఉద్యోగావకాశాలను సంపాదించడంతోబాటు తెలంగాణ ప్రాంతం వారిని ప్రభుత్వ సర్వీసులో నియామకానికి అనుసరించవలసిన నియమ, నిబంధనలు కూడా ప్రాంతీయ సంఘం అధికారం కిందికి తేవాలని రాష్ట్రపతి ఉత్తర్వు ఆదేశిస్తున్నది.

సర్వీసుల విలీనీకరణపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల అమలును గురించి ప్రభుత్వం ప్రాంతీయ సంఘానికి నివేదికలను అందజేయాలని, ప్రాంతీయ సంఘం చేసిన వివిధ సిఫారసులపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరిస్తూ ప్రాంతీయ సంఘానికి ఆరు నెలలకు ఒకసారి నివేదికలను సమర్పించాలని రాష్ట్రపతి ఉత్తర్వు ఆదేశిస్తున్నది.

మంత్రివర్గానికి, ప్రాంతీయ సంఘానికి అభిప్రాయ భేదాలు ఏర్పడిన అంశాలను గవర్నర్‌కు నివేదించాలని రాష్ట్రపతి 1958లో జారీ చేసిన ఉత్తర్వులలో ఉన్నది.

అయితే ఇప్పుడు సవరించబడిన ఉత్తర్వు ప్రకారం ముఖ్యమంత్రి ముందుగా ప్రాంతీయ సంఘం అధ్యక్షునితో సంప్రదింపుల ద్వారా అభిప్రాయ భేదాలను పరిష్కరించుకోవలసి ఉంటుంది. సంప్రదింపుల తర్వాత కూడా ఏకాభిప్రాయం కుదరకపోతే అప్పుడు ఈ అంశం గవర్నర్‌కు నివేదించవలసి వుంటుంది.

రాష్ట్రపతి ఉత్తర్వులు చెల్లవన్న ఆంధ్ర నేతలు

రాష్ట్రపతి జారీ చేసిన ఈ సవరణ ఉత్తర్వు చెల్లనేరదని శాసనసభ్యులు టీవీఎస్‌ చలపతిరావు ఒక పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ తెచ్చారు. కేంద్ర కార్యాచరణ సంఘానికి జలీల్‌పాషా అధ్యక్షుడుగా, సుదర్శన్‌ కార్యదర్శిగా, రాజేంద్రసింగ్‌ సంయుక్త కార్యదర్శిగా ఎన్నుకోబడినారు. ఉన్నత పాఠశాలల విద్యార్థులు గత కొద్ది రోజులుగా నుండి పాఠశాలలను బహిష్కరిస్తున్నారు.

సత్యాగ్రహుల నిర్బంధం

తెలంగాణ ప్రాంతీయ సంఘానికి విస్తృతాధికారాలు కల్పించిన తర్వాత కూడా ఉద్యమకారులు సత్యాగ్రహాలు ఆపలేదు. మార్చి 20న కూడా కొనసాగినవి. చిక్కడపల్లిలో సత్యాగ్రహం చేస్తున్న తొమ్మిదిమందిని పోలీసులు నిర్భందించారు. వీరిలో మునిసిపల్‌ కౌన్సిలర్‌ ఎం.పి. మల్లయ్య కూడా ఉన్నారు.

ఆంధ్ర-తెలంగాణ పద్దులను వేర్వేరుగా చూపనందున టీయూఎఫ్‌ సభ్యుల వాకౌట్‌

రాష్ట్ర శాసనసభలో ఆర్థికమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి 1969-70 సంవత్సరం అనుబంధ పద్దులను మార్చి 24న ప్రవేశపెట్టబోతుండగా ఎస్‌.ఎస్‌.పి. సభ్యుడు బద్రీ విశాల్‌ పిట్టీ పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ తెచ్చి తెలంగాణ-ఆంధ్ర ప్రాంత అంచనాలను వేర్వేరుగా చూపాలని ఇటీవల రాష్ట్రపతి ప్రాంతీయ సంఘాన్ని ఆదేశించినందున ప్రస్తుత అనుబంధ అంచనాలను మంత్రి యథాతథంగా సమర్పించరాదన్నారు.

తెలంగాణ యునైటెడ్‌ ఫ్రంట్‌కు చెందిన కొండా లక్ష్మణ్‌ బాపూజీ కూడా పిట్టీ వాదనను బలపరుచుతూ రాజ్యాంగబద్ధంకాని ఏ పద్దులనూ పరిశీలించరాదు. రాష్ట్రపతి రాజ్యాంగంలో 371వ నిబంధన క్రింద ప్రాంతీయ సంఘం ఉత్తర్వు జారీచేసినందున అనుబంధ పద్దులను ఆంధ్ర-తెలంగాణ ప్రాంతాలకు విడదీయకుండా సమర్పించడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు.

డాక్టర్‌ టి.వి.ఎస్‌. చలపతిరావుకూడా పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ తెచ్చి… రాష్ట్రపతి 1958లో మొదట ప్రాంతీయ సంఘంపై ఇచ్చిన ఆదేశాన్ని సవరించే వీలులేదని, అందువలన ఇటీవలి ఉత్తర్వు న్యాయబద్దం కాదన్నారు.

ప్రగడ కోటయ్య మాట్లాడుతూ… రాష్ట్రపతి ఉత్తర్వు 1970 మార్చి 9నుంచే అమల్లోకి వచ్చిందని, అనుబంధ అంచనాలను ప్రస్తుత రూపంలో సమర్పించబోవడం తీవ్రమైన విషయమని, దీనిపై తాము కోర్టుకు కూడా ఎక్కవలసి వుంటుందని అన్నారు.

ఈ సమస్యపై అడ్వకేట్ జనరల్‌ సలహా తీసుకోవలసిందని కొండా లక్ష్మణ్‌ స్పీకర్‌కు చెప్పారు.

రాష్ట్రపతి ఉత్తర్వు ప్రకారం బడ్జెట్‌ను పరిశీలించే అధికారం (1970) మార్చి 9నుంచే ప్రాంతీయ సంఘానికి వచ్చిందని కొండా లక్ష్మణ్‌ అన్నారు. స్పీకర్‌ను ప్రశ్నిస్తూ ఈ సంవత్సరం బడ్జెట్‌ను ప్రాంతీయ సంఘం పరిశీలించరాదని మీ ఉద్దేశమా? దీనిపై మీ రూలింగ్‌ కోరుతున్నాను అని అన్నారు కొండా లక్ష్మణ్‌. ఫ్రంట్‌నేత రామచంద్రారెడ్డి, చొక్కారావు తదితరులు మాట్లాడారు.

తెలంగాణ శాసనసభ్యులు అభ్యంతరాలను ఏమాత్రం పట్టించుకోకుండా స్పీకర్‌ అనుబంధ అంచనాలను ప్రవేశపెట్టవలసిందని ఆర్థికమంత్రిని కోరారు. అందుకు నిరసన తెలుపుతూ కొండా లక్ష్మణ్‌ శాసనసభ అధ్యక్షుడు తెలంగాణ హక్కులను రక్షించడంలేదంటూ సభనుంచి వాకౌట్‌ చేశారు. ఆయన వెనుకనే యునైటెడ్‌ ఫ్రంట్‌లోని మిగతా సభ్యులు, ఈశ్వరీభాయి (రిపబ్లికన్‌పార్టీ), బద్రీ విశాల్‌ పిట్టీ (యస్‌.యస్‌.పి.) కూడా వాకౌట్‌ చేశారు.

(1969-70 బడ్జెట్‌పై హైకోర్టులో కొండా లక్ష్మణ్‌, పిట్టీల రిట్‌-వచ్చే సంచికలో)

వి.ప్రకాశ్‌