కొలువుల తెలంగాణం !

By: కేశవపంతుల వేంకటేశ్వర శర్మ

ప్రపంచ ఐటీ దిగ్గజ కంపెనీలు మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, అమెజాన్‌, ఫేస్‌బుక్‌, ఒరాకిల్‌ తమ ఆఫ్‌షోర్‌ సెంటర్లను అమెరికా అవతల భారతదేశంలోనే ఏరాష్ట్రంలో లేని విధంగా హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేశాయి. తెలంగాణ ప్రభుత్వంపై, హైదరాబాద్‌పై నమ్మకంతోనే దిగ్గజ కంపెనీలు కోట్ల రూపాయల పెట్టుబడులను ఇక్కడ పెట్టాయి. ఐటీ, ఐటీ అనుబంధ సంస్థలతో లక్షల మంది స్థానిక యువతకు ఉద్యోగాల కల్పన సాధ్యమవుతున్నది. – ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌

తెలంగాణ ఉద్యమ ట్యాగ్‌ లైన్‌ ‘నీళ్లు, నిధులు, నియామకాలు’. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత దూరదృష్టితో సీఎం కేసీఆర్‌ రాష్ట్ర అవసరాలను ప్రాధాన్యం ప్రకారం ఒక్కొక్క దానిపై దృష్టిపెడుతున్నారు. దీనిలో ప్రధానంగా నీటి వనరులపై దృష్టిపెట్టి రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా మార్చడంలో సఫలీకృతం అయ్యారు. ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా కాళేశ్వరం ప్రాజెక్టును శరవేగంగా పూర్తిచేసిన ఘనత కేసీఆర్‌దే. దీనితో లక్షలాది ఎకరాలకు నీళ్లు అందిస్తున్న విషయం మన కళ్ల ముందే కనిపిస్తోంది. ఇక నిధుల విషయంలో దేశంలో పెద్ద రాష్ట్రాల కంటే ఎక్కువ సంపదను సృష్టిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచేలా చేశారు సీఎం. అంతేకాకుండా దేశానికి ఎక్కువ ఆదాయాన్నిచ్చే టాప్‌ నాలుగు రాష్ట్రాలలో తెలంగాణ ఒకటిగా నిలవడం రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణం. సృష్టించిన సంపదతో దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయనన్ని సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న విషయం కనిపిస్తున్న నిజం.

ఇక మిగిలిన మూడో నినాదం నియామకాలు.. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కేవలం ప్రభుత్వ రంగంలోనే కాకుండా ప్రైవేట్‌ రంగంలో కూడా లక్షలాది ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. ఆ వివరాలను పరిశీలిస్తే..

రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత స్థానికులకే ఉద్యోగాలు రావాలని కొత్త జోనల్‌ వ్యవస్థను తీసుకువచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ జీవోతో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 95 శాతం ఉద్యోగాలను స్థానికులకే వచ్చేలా చేసింది. గతంలోని రెండు జోన్లను ఏడు జోన్లుగా మార్చింది.

రాష్ట్రం ఏర్పాటు తర్వాత తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఏర్పాటుచేసి వందలాది నోటిఫికేషన్లను విడుదల చేసింది. సుమారు 110 నోటిఫికేషన్లను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది అంటే ఆశ్చర్యం కలిగినా ఇది వందశాతం నిజం. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి 2014 నుంచి ఇప్పటి వరకు సుమారు లక్షా ముప్పై రెండువేలకు పైగా పోస్టులను భర్తీ చేసింది. మరో లక్ష పోస్టుల భర్తీకి సీఎం ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

ప్రభుత్వ శాఖలో భర్తీ చేసిన ఉద్యోగ వివరాలు పరిశీలిస్తే…

టీఎస్‌పీఎస్సీ                           –        35, 839

పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు           –        31,972

గురుకుల రిక్రూట్‌మెంట్‌ బోర్డు       –        3,263

పంచాయతీరాజ్‌ (సెక్రటరీ)            –        9,355

ఆయుష్‌ –        171

పీజేటీఎస్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ         –        179

ఎస్‌కేఎల్‌టీఎస్‌ హార్టికల్చర్‌ యూనివర్సిటీ     –        80

మైనార్టీ సంక్షేమం –        66

మొత్తంగా ప్రభుత్వ శాఖలు వాటి ఆధ్యర్యంలో భర్తీ అయిన పోస్టులు – 81,285

ప్రభుత్వ రంగ సంస్థల్లో 49,824 పోస్టులు. వీటిలో సింగరేణి కాలరీస్‌లో 13, 175 పోస్టులు, టీఎస్‌ ఆర్టీసీలో 5,568 పోస్టులు, ఇంధనశాఖలో 31,081 పోస్టులను భర్తీ అయ్యాయి.

వీటితోపాటు కొత్తగా 91,142 పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రకటనను రాష్ట్ర అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ మార్చి 9న ప్రకటించారు. వీటిలో 80,039 పోస్టులను డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే గ్రూప్‌-1, ఎస్‌ఐ, పోలీస్‌ కానిస్టేబుల్‌ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. అదేవిధంగా 11,103 కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులైజేషన్‌ ప్రక్రియపై కసరత్తు ప్రారంభమైంది.

ప్రభుత్వ ఉద్యోగాలలో 95 శాతం స్థానిక రిజర్వేషన్ల వల్ల ఆలస్యమైన ప్రక్రియ వల్ల ఎవరు ఇబ్బంది పడవద్దని రాష్ట్ర ప్రభుత్వం వయోపరిమితిలో సడలింపు ఇచ్చింది. యూనిఫాం పోస్టులకు సైతం వయోపరిమితిని సడలించింది. దీనివల్ల దాదాపు అన్ని కేటగిరీలకు సంబంధించిన అభ్యర్థులకు గరిష్ఠ లబ్ధి చేకూరనున్నది.

ఇప్పటికే భర్తీ చేసిన 1.32 లక్షల ఉద్యోగాలకు అదనంగా ప్రస్తుతం భర్తీ చేయనున్న 80 వేల పోస్టులతో సుమారు రెండు లక్షల మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగావకాశం రానున్నది.

2014-20 మధ్య ఆయా రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు భర్తీ చేసిన పోస్టుల సంఖ్యను పరిశీలిస్తే.. తెలంగాణలో 30,594 పోస్టులు భర్తీ చేయ్యగా, పశ్చిమ బెంగాల్‌లో 13,262 ఖాళీలు, ఒడిశాలో 9,591 ఖాళీలు, ఛత్తీస్‌గఢ్‌లో 7,553 ఖాళీలను మాత్రమే భర్తీ చేశారు. ఆయా రాష్ట్రాల పోస్టుల భర్తీ ప్రక్రియతో పోలిస్తే మన రాష్ట్రం రెండు వందల శాతం ఎక్కువ పోస్టులను టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేసిందని చెప్పవచ్చు.

ఏటా డిగ్రీ, పీజీ పూర్తిచేసేవాళ్ల సంఖ్య లక్షల్లో ఉంటుంది. వీరి సంఖ్యతో పోలిస్తే ప్రభుత్వ పరంగా ఖాళీ అయ్యే ఉద్యోగవకాశాలు పరిమితంగానే ఉంటాయి. రాష్ట్రంలోని నగరం, పట్టణం, గ్రామాల్లో యువతకు ఉపాధి కల్పించేందుకు సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి పెట్టారు. దీనికోసం పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ఆధ్వర్యంలో దేశంలోనే రోల్‌ మోడల్‌గా నిలిచేలా పరిశ్రమల ఏర్పాటుకు సింగిల్‌ విండో అనుమతులు ఇచ్చేలా టీఎస్‌ ఐపాస్‌ విధానాన్ని తెచ్చారు.

ఇలా వచ్చిన పరిశ్రమలలో స్థానికులకు ఉపాధి అవకాశం కోసం సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ద్విముఖ వ్యూహాన్ని రూపొందించారు.

గతేడాది ఆగస్టు 5న ఈ విధానానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీని ప్రకారం స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించింది. దీని ప్రకారం పరిశ్రమలను రెండు కేటగిరీలుగా విభజించారు. మొదటి కేటగిరీలో పాక్షిక నైపుణ్యత కలిగిన మానవ వనరుల్లో స్థానికులు 70 శాతం ఉండాలని, నైపుణ్యత కలిగిన మానవ వనరుల్లో స్థానికులు 50 శాతం ఉండాలని స్పష్టం చేసింది. రెండో కేటగిరీలో పాక్షిక నైపుణ్యం కలవారిని 80 శాతం ఉండాలని, నైపుణ్యత కలిగిన మానవ వనరుల్లో స్థానికులు 60 శాతం ఉండాలని నిబంధన పెట్టింది.

పరిశ్రమలతో ఉద్యోగావకాశాలు

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలతో రాష్ట్రం పరిశ్రమల ఏర్పాటులో ప్రపంచంలోనే కీలక గమ్యంగా మారింది. అనేక అంతర్జాతీయ, జాతీయ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి. ఇంకా వస్తున్నాయి. ఇప్పటికే ఫార్మా రంగంలో తెలంగాణ జాతీయ స్థూల ఉత్పత్తిలో 35 శాతం వాటా కలిగి ఉంది. టీఎస్‌ ఐపాస్‌ స్కీంతో 17,797 పరిశ్రమలకు అనుమతులను ఇచ్చింది ప్రభుత్వం. ప్రభుత్వ పనితీరుకు ఇది నిదర్శనంగా నిలుస్తుంది. సుమారు 2.21 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. ఈ పరిశ్రమలలో సుమారు 16 లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభించాయి.

ముఖ్యంగా ఐటీ కంపెనీలకు హైదరాబాద్‌ హబ్‌గా మారింది. ప్రపంచ స్థాయి ఐటీ కంపెనీల కార్యకలాపాలకు, డాటా భద్రతకు కేరాఫ్‌గా హైదరాబాద్‌ నిలిచింది అంటే అతిశయోక్తి కాదు. దీనికి నిదర్శనం ప్రపంచ ఐటీ దిగ్గజం గూగుల్‌ తన రెండో అతి పెద్ద క్యాంపస్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించడమే నిదర్శనం.

ఐటీ దిగ్గజ కంపెనీలు మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, ఐబీఎం, ఒరాకిల్‌, అమెజాన్‌ వంటి అనేక ఎంఎన్‌సీలు హైదరాబాద్‌లో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేసుకున్నాయి. 

రాష్ట్ర ప్రభుత్వం ఐటీ రంగాన్ని కేవలం హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా దీన్ని రాష్ట్రమంతా విస్తరించాలని తగు చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగంగా వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌, నల్లగొండ, తదితర నగరాలలో మౌలిక వసతులను కల్పించి ఐటీ హబ్‌లను ప్రారంభించింది. ఐటీ రంగంలో  ఇప్పటి వరకు మన రాష్ట్రంలో సుమారు 6 లక్షల మంది ఉద్యోగాలను పొందారు.

ప్రభుత్వం కేవలం ఐటీ రంగాన్నే కాకుండా ఫార్మా, ఏరోస్పేస్‌, డిఫెన్స్‌, టెక్స్‌టైల్స్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించి ఇక్కడ ఆయా సంస్థలను ఏర్పాటయ్యేలా చేసింది.

అన్ని వర్గాలకు చేయూత

బడుగు, బలహీన వర్గాల యువత పారిశ్రామికవేత్తలుగా మారడానికి ప్రభుత్వం టీ-ఐడియా, టీ ప్రైడ్‌ పేరుతో ప్రత్యేక ప్రోత్సాహకాలను అందిస్తుంది. మైనార్టీ యువతకు రకరకాల పథకాల ద్వారా చేయూతనిస్తుంది. టీహబ్‌, వీహబ్‌తో వేలాది మందికి భరోసా కల్పిస్తుంది ప్రభుత్వం. రాష్ట్రంలో 20 ఎంఎస్‌ఈ పారిశ్రామిక వాడలను అభివృద్ధి చేస్తుంది. టీఎస్‌ఐఐసీ ఆధ్వర్యంలో ఒక్కో పార్క్‌ను 50- 60 ఎకరాలలో ఏర్పాటు చేస్తుంది.

ఇవే కాకుండా ఆటోమొబైల్‌, రైల్‌ కోచ్‌ వంటి అనేక ప్రైవేట్‌ సంస్థల ఏర్పాటుకు ప్రభుత్వం సహకారం అందిస్తుంది. వీటివల్ల స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.

యువత కేవలం ప్రభుత్వ ఉద్యోగాల కోసమే కాకుండా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి. తమ తమ నైపుణ్యాలను పెంచుకోవాలి.  ప్రభుత్వం చేపడుతున్న ఆయా పథకాలను సద్వినియోగం చేసుకోవాలి. తమకు ఇష్టమైన రంగంలో రాణించి, ఇటు రాష్ట్రంలో తమతోటి వారికి ఉపాధి కల్పించడమే కాకుండా రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకోవాలి. పారిశ్రామికవేత్తలుగా, ఎంట్రపెన్యూర్స్‌గా ఎదగడం వల్ల రాష్ట్రానికి, దేశానికి కీర్తి లభించడమే కాకుండా ఆదాయం పెరుగుతుంది. అభివృద్ధి వైపు దూసుకుని పోగలం.