ఉపాధి పథకం ఇక విప్లవాత్మకం

kcrతెలంగాణ కల సాకారం అయిన తర్వాత ప్రభుత్వం అల్పసంఖ్యాక వర్గాల వారికి అమలు చేస్తున్న స్వయం ఉపాధి సంక్షేమ పథకాల్లో బడుగులకు ఇచ్చే రాయితీని భారీ స్థాయిలో పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

బడుగుల ఆర్థిక స్థోమత పెంపుకై రుణం తక్కువ.. రాయితీ ఎక్కువతో, బ్యాంకు కష్టాల నుండి లబ్ధిదారుల విముక్తి కోసం ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌. తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. దళిత, గిరిజన, బలహీన వర్గాల సంక్షేమ, రుణ, వయో, ఆదాయ పరిమితిని పెంచి బడుగు బలహీన వర్గాల్లో హర్షాతిరేకాలు, సంబరాల్లో మునిగే విధంగా నూతన విధానానికి నాంది పల్కడం కె.సి.ఆర్‌. గొప్పతనం.

ప్రభుత్వం ప్రత్యేకంగా 11 బి.సి. కులాల ఫెడరేషన్లలోని సొసైటీలకు ఊహించనంత స్థాయిలో సబ్సిడీ రుణాలు ఇవ్వడానికి సిద్ధమైంది. దీంతో దళిత, గిరిజన, బలహీన వర్గాల అభివృద్ధికై దేశంలోనే ప్రథమ స్థానంలో భారీ రాయితీ ఇచ్చిన ఘనత కె.సి.ఆర్‌. ప్రభుత్వానికే దక్కింది.

గత ప్రభుత్వాల కాలంలో రాయితీ తక్కువ.. రుణం ఎక్కువగా ఉండటంతో బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి పూచీకత్తు లేనిదే అంగీకరించలేదు. ఈ విధంగా ఉంటే లబ్ధిదారులకు రుణాలు అందటం కష్టమని భావించిన ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌. సంక్షేమ మంత్రుల బృందానికి బాధ్యతలు అప్పజెప్పారు. డిప్యూటి సి.ఎం. కడియం శ్రీహరి అధ్యక్షతన సంక్షేమ మంత్రులు అజ్మిరా చందూలాల్‌, జోగు రామన్నలు సంబంధిత అధికారులతో సమావేశమై సుదీర్ఘంగా చర్చించి ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించారు. వెంటనే కె.సి.ఆర్‌. గ్రీన్‌ సిగ్నల్‌తో రాష్ట్ర ఆర్థిక శాఖ ఆమోదం లభించింది. వెనువెంటనే రాష్ట్ర బి.సి. సంక్షేమ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డా|| శ్రీ టి.రాధా, ఐ.ఎ.ఎస్‌., జి.వో. నెం. 289తో 11 బి.సి. కులాల ఫెడరేషన్లలోని సొసైటీల అభివృద్ధి 30 లక్షల యూనిట్‌ కాస్టుతో 50 శాతం సబ్సిడీతో ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించారు.

ఒక లక్ష రూపాయల రుణానికి 80 శాతం సబ్సిడితో, 2 లక్షల రుణానికి 70 శాతం సబ్సిడితో, 3 లక్షల నుండి 5 లక్షల రుణానికి 60 శాతం సబ్సిడీని ఆ పైన 10 లక్షల యూనిట్‌ విలువతో కూడిన రుణానికి 5 లక్షల వరకు గరిష్ట పరిమితితో ప్రభుత్వం ఉత్తర్వులు రావడంతో రాష్ట్రంలోని దళిత, గిరిజన, బలహీన వర్గాల ప్రజల్లో హర్షాతిరేకాలు వెల్లువిరుస్తున్నాయి.

సబ్సిడీతో పాటు యూనిట్‌ విలువ పెంచడంతో రాష్ట్రంలో కె.సి.ఆర్‌.తోనే దళిత, గిరిజన, బలహీన వర్గాల అభివృద్ధి సాధ్యమనేది తేటతెల్లమైందని చెప్పవచ్చు. అందుకే ప్రభుత్వం ఎస్‌.సి, బి.సి. సంక్షేమ శాఖలకి 2015-16 సంవత్సరం బడ్జెట్‌లో 11,269 కోట్ల రూపాయలు కేటాయించిన ఘనత టి.ఆర్‌.ఎస్‌ ప్రభుత్వానికే దక్కింది.

అలాగే రాష్ట్రంలో 60 శాతం పైగా ఉన్న ఈ జనాభాను దృష్టిలో పెట్టుకొని ఉపాధి యంత్రాలు, పరికరాలు, పనిముట్ల కొనుగోలుకు అందించే రూపాయలను 10 లక్షల వరకు పెంచాలనే నిర్ణయం అల్పసంఖ్యక వర్గాల వారి ఆర్థిక స్థోమత పెంపుకు ఉపయోగపడింది. ఇట్టి ఘనత చరిత్రలో టి.ఆర్‌.ఎస్‌. ప్రభుత్వానికే దక్కింది.

లబ్ధిదారులకి వరం

లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ, గ్రౌండింగ్‌ అంతాకూడా 2016 మార్చి వరకు పూర్తికావల్సి ఉంది. దసరా పండుగ అనంతరం ఎంపికైన లబ్ధిదారుల రాయితీని ప్రభుత్వం నేరుగా బ్యాంకులకు పంపిస్తుంది.

బి.సి.లకు మరో వరం కళ్యాణ లక్ష్మి పథకం

రాష్ట్ర ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌. మరో సంచలన నిర్ణయం తీసుకోబూతున్నారన్న వార్త వినగానే బలహీన వర్గాల ప్రజల ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులకి కళ్యాణ లక్ష్మి పథకం, మైనార్టీలకు షాద్‌ ముబారక్‌ పథకం లాగా బి.సి.లకి కూడా కళ్యాణ లక్ష్మి పథకం ప్రవేశపెట్టి అమలు చేస్తే ఇంతకంటే ఎక్కువ కావాల్సిందేముందని ఆ వర్గాల ప్రజలు గంపెడాశతో ఎదురుచూస్తున్నారు.

ఈ పథమే గనుక బి.సి.లకు వర్తింపజేస్తే 2019 ఎన్నికల్లో బి.సి.ల సత్తా ఏంటో గులాభిదళంలో అగ్రగామిలై ప్రభుత్వానికి ప్రచార సారధులై ముందుండే అవకాశం ఎంతైనా ఉన్నది.