ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం

మౌలిక సదుపాయాల కల్పనకు ‘మన ఊరు` మన బడి’

రాష్ట్రంలోని విద్యారంగాన్ని మరింత మెరుగు పరచేందుకు అనేక కీలక నిర్ణయాలను రాష్ట్ర మంత్రి వర్గం తీసుకున్నది. ఎంతో ప్రాధాన్యతగల ఈ రంగంపై సుదీర్ఘంగా చర్చించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టాలని, పాఠశాలల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ‘మన ఊరు మన బడి’అనే వినూత్న కార్యక్రమం చేపట్టాలని మంత్రి వర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.

రాష్ట్రంలోని విద్యపై కేబినెట్‌ సుదీర్ఘంగా చర్చించింది. ఇప్పటికే తెలంగాణ గురుకులాలు అద్భుతమైన ఫలితాలను అందిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచిన నేపథ్యంలో, గ్రామస్థాయిల్లోంచి విద్యార్థులు గురుకులాల్లో చేరుతున్నారని కేబినెట్‌ అభిప్రాయపడింది. అదే సందర్భంలో రాష్ట్రంలో వ్యవసాయం తదితర అనుబంధ రంగాలు బలోపేతం కావడం, తద్వారా గ్రామీణ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడం, పల్లెల్లో తల్లిదండ్రుల్లో తమ పిల్లల విద్య, భవిష్యత్తు పట్ల ఆలోచన పెరిగిందని కేబినెట్‌ గుర్తించింది. ఈ నేపథ్యంలో గ్రామాల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధనకు డిమాండు పెరుగుతుండటంతో, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం అనివార్యత పెరిగిందని కేబినెట్‌ భావించింది.

వారి గ్రామాల్లో గనుక ప్రభుత్వమే ఇంగ్లీష్‌ మీడియంలో విద్యాబోధన చేపట్టినట్టయితే స్థానిక పాఠశాలల్లోనే తమ పిల్లలను చేర్పించేందుకు గ్రామాల్లోని తల్లిదండ్రులు సంసిద్ధంగా ఉన్నారని రాష్ట్ర మంత్రివర్గం కేబినెట్‌ భావించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని గ్రామాలల్లో ఇంగ్లీషు మీడియంలో విద్యాబోధన చేపట్టాలని, అందుకోసం కావలసిన అన్ని రకాల మౌలిక వసతులను కల్పించాలని కేబినెట్‌ నిర్ణయించింది. విద్యార్థులను ప్రాథమిక స్థాయిలో ఇంగ్లీష్‌ మీడియంలో బోధన కోసం టీచర్లకు తర్ఫీదునివ్వడం, విద్యార్థులకు ఆకర్షణీయంగా విద్యాలయాల పరిసరాలను తీర్చిదిద్దడం, వారిలో ఉత్సాహం కలిగించే విధంగా క్రీడా మైదానాలు తదితర వసతులను ఏర్పాటు చేయడం, పరిసరాలను పరి శుభ్రంగా ఉంచడం, వారికి మధ్యాహ్న భోజన వసతులను మరింతగా మెరుగుపరచడం వరకు కార్యాచరణ చేపట్టాలని కేబినెట్‌ నిర్ణయించింది.

నాణ్యమైన ఆంగ్ల విద్యను అందించడం ద్వారా ప్రయివేట్‌ కార్పోరేట్‌ విద్యకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దే దిశగా చర్యలు చేపట్టాలని ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని కేబినెట్‌ నిర్ణయించి. ఈ మేరకు విద్యా శాఖను ఆదేశించింది. ఇందులో భాగంగా ప్రణాళికలను రూపొందించాలని విద్యాశాఖను కేబినెట్‌ నిర్దేశించింది.

రాష్ట్రంలో ప్రయివేటు పాఠశాలలు, ప్రయివేట్‌ జూనియర్‌ కాలేజీలు డిగ్రీ కాలేజీల్లో ఫీజుల వసూళ్ళ పై సర్వత్రా వ్యతిరేకత వినవస్తున్నదనే విషయాన్ని కేబినెట్‌ చర్చించింది. ఫీజులను నియంత్రించడం ద్వారా పేదలకు, సామాన్య మధ్యతరగతికి విద్యను మరింతగా చేరువ చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఇందులో భాగంగా… ప్రయివేటు స్కూళ్ళు, జూనియర్‌, డిగ్రీ కాలేజీల్లో ఫీజులను నియంత్రించేందుకు నూతన చట్టాన్ని తేవాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఇందుకోసం పూర్తి స్థాయి అధ్యయనం చేసి విధి విధానాలను రూపకల్పన చేసేందుకు కేబినెట్‌ సబ్‌ కమిటీని నియమించింది.

మహిళా యూనివర్సిటీ ఏర్పాటు

తెలంగాణ రాష్ట్రంలో ‘మహిళా యూనివర్సిటీ ఏర్పాటు’ కోసం విద్యాశాఖ మంత్రి చేసిన ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. తదుపరి కేబినెట్‌ సమావేశానికి పూర్తిస్థాయిలో ప్రతిపాదనలను సిద్ధం చేసుకుని రావాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శిని కేబినెట్‌ ఆదేశించింది.

ప్రైవేట్‌ స్కూళ్లు, జూనియర్‌ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో ఫీజుల నియంత్రణ కోసం కొత్త చట్టం రూపొందించాలని, వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియంలో విద్యా బోధనకై ప్రణాళికలు రూపొందించాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఈ రెండు అంశాలపై పూర్తి అధ్యయనం చేసి, సంబంధిత విధివిధానాలను రూపొందించేందుకు కేబినెట్‌ సబ్‌ కమిటీని ఈ సమావేశంలో ఏర్పాటు చేశారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, తలసాని శ్రీనివాస యాదవ్‌, నిరంజన్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, జగదీశ్‌ రెడ్డి, హరీశ్‌రావు, ప్రశాంత్‌ రెడ్డి, పువ్వాడ అజయ్‌ కుమార్‌, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, కేటీఆర్‌ ఈ సబ్‌ కమిటీలో సభ్యులుగా ఉంటారు. రానున్న శాసన సభా సమావేశాల్లో ఫీజుల నియంత్రణకు సంబంధించిన నూతన చట్టాన్ని తీసుకు రావాలని కేబినెట్‌ నిర్ణయించింది.

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఇందులో భాగంగా పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన, మెరుగైన మౌలిక వసతుల కల్పన కోసం రూ. 7289 కోట్లతో ‘‘మన ఊరు – మన బడి’’ ప్రణాళిక కోసం కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

మన ఊరు – మన బడి ప్రణాళిక:

ప్రభుత్వ పాఠశాలల సమగ్రాభివృద్ధి, పటిష్టమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం విద్యాశాఖలో ‘‘మన ఊరు – మన బడి’’ అనే వినూత్న కార్యక్రమానికి కేబినేట్‌ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని 26,065 ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న 19,84,167 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య, నమోదు, హాజరు, కొనసాగింపుతో పాటు దశలవారీగా డిజిటల్‌ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి, విద్యార్థుల అభ్యాస సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు మౌలిక వసతుల ఏర్పాటు కోసం ‘మన ఊరు – మన బడి’ ప్రణాళికను అమలు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికే ప్రకటించిన విధంగా రెండేండ్ల వ్యవధిలో రూ.4 వేల కోట్లతో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతుల కల్పనతో నాణ్యమైన విద్యను అందించే దిశగా రాష్ట్రంలోని పాఠశాలల సమగ్రాభివృద్ధి కోసం కార్యక్రమాలు చేపడు తారు. ఇందులో భాగంగా సాంకేతికత విజ్ఞాన ఆధారిత విద్యను అందించడం కోసం డిజిటల్‌ క్లాస్‌ రూంల ఏర్పాటు, వాటితో పాటు అదనపు తరగతి గదులు ఏర్పాటు, మరమ్మతులు, అవసరమైన మేరకు ఫర్నిచర్‌, మరుగుదొడ్లు, ఇతర వసతుల కల్పన ఈ ప్రణాళిక ఉద్దేశ్యం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశానుసారం.. ఈ కార్యక్రమ అమలు, విధివిధానాల రూపకల్పన కోసం మంత్రుల బృందం ఇప్పటికే మార్చి 2021, ఎప్రిల్‌, జూన్‌ 2021లలో మంత్రులు పి.సబితా ఇంద్రారెడ్డి, కేటీఆర్‌, హరీశ్‌ రావు, ఎర్రబెల్లి దయాకర్‌ రావులతో కూడిన మంత్రుల బృందం సమావేశమైంది.

‘‘మన ఊరు – మన బడి’’ అమలు కోసం మంత్రుల బృందం పలు అంశాలను పొందుపరిచి విధివిధానాలను రూపొందించింది.

ఇందులోని ముఖ్యాంశాలు:

 1. ‘‘మన ఊరు – మన బడి’’ కార్యక్రమాన్ని ప్రభుత్వ ఫ్లాగ్‌ షిప్‌ ప్రోగ్రాం గా చేపట్టి మూడు దశల్లో మూడు సంవత్సరాల వ్యవధిలో విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరచడం.
 2. 2021 – 22 విద్యా సంవత్సరం మొదటి దశలో, మండల కేంద్రాన్ని యూనిట్‌ గా తీసుకొని అన్ని రకాల (ప్రాథమిక పాఠశాల, మాధ్యమిక పాఠశాల, ఉన్నత పాఠశాలల్లో) అత్యధికంగా ఎన్‌ రొల్మెంట్‌ అయిన 9,123 (35శాతం స్కూళ్లలో 65శాతం విద్యార్థులను) ప్రభుత్వ మరియు స్థానిక సంస్థలకు చెందిన పాఠశాలల్లో ముందుగా కార్యక్రమం అమలు చేయాలి.
 3. ‘‘మన ఊరు – మన బడి’’ కార్యక్రమం క్రింద 12 రకాల విభాగాలను పటిష్టపరిచేందుకు ప్రతిపాదించడం జరిగింది.
  i) నీటి సౌకర్యంతో కూడిన టాయిలెట్లు
  ii) విద్యుదీకరణ
  iii) త్రాగు నీటి సరఫరా
  iv) విద్యార్థులు మరియు సిబ్బందికి సరిపడు ఫర్నిచర్‌
  v) పాఠశాల మొత్తం పెయింటింగ్‌ వేయడం
  vi) పెద్ద మరియు చిన్న మరమ్మత్తులు
  vii) గ్రీన్‌ చాక్‌ బోర్డులు
  viii) ప్రహరీ గోడలు
  ix) కిచెన్‌ షెడ్లు
  x) శిథిలమైన గదుల స్థానంలో కొత్త క్లాస్‌ రూంలు
  xi) ఉన్నత పాఠశాలల్లో డైనింగ్‌ హాల్స్‌
  xii) డిజిటల్‌ విద్య అమలు
 4. ‘‘మన ఊరు – మన బడి’’ కార్యక్రమంలో పేర్కొన్న 12 విభాగాల అనుబంధ అంచనాల ఆధారంగా మొత్తం బడ్జెట్‌ రూ.7,289.54 కోట్లు అవసరమవుతాయి. ఇందులో భాగంగా మొదటి దశలో 9,123 పాఠశాలలకు (35శాతం) అంచనా బడ్జెట్‌ రూ.3,497.62 కోట్లుగా ఉంది.
 5. ఎంపిక చేయబడిన ప్రతి పాఠశాలలో చేపట్టే కార్యక్రమ అమలు కోసం అన్ని పనులకు పరిపాలనా అనుమతిని జిల్లా కలెక్టర్లు ఇస్తారు. ‘ఒక మండలంలో కార్యక్రమాన్ని అమలుచేసే ఏజెన్సీ ఒకటే ఉండే విధంగా అందుబాటులో ఉన్న ఏజెన్సీల నుంచి తమ జిల్లాలో అమలు చేసే ఏజెన్సీని ఎంచుకోవచ్చు. అలాగే అమలు చేసే ఏజెన్సీ విభాగాల వారీగా సాంకేతిక అనుమతిని ఇస్తుంది.
 6. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల పటిష్టత : ‘‘మన ఊరు – మన బడి’’ కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో పారదర్శకంగా మరియు అన్ని పనులను వేగంగా అమలు చేయడం కోసం ‘పాఠశాల నిర్వహణ కమిటీ’ (ఎస్‌.ఎమ్‌.సి.)లకు బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది.
 7. ‘‘మన ఊరు – మన బడి’’ కార్యక్రమానికి నిధుల సమీకరణ కోసం ఆర్థిక శాఖ నోడల్‌ ఏజెన్సీగా పనిచేస్తుంది. ఇందుకు సంబంధించిన సాంకేతిక అంశాలను రాష్ట్ర ఐటి డిపార్ట్‌ మెంట్‌ పర్యవేక్షిస్తుంది.
 8. ‘పాఠశాల నిర్వహణ కమిటీ’లకు దశల వారీగా పారదర్శక పద్ధతిలో నిధులను విడుదల చేస్తారు.
 9. సామాజిక తనిఖీ: గ్రామీణాభివృద్ధి శాఖ కింద పనిచేస్తున్న ‘‘సోషల్‌ ఆడిట్‌ అకౌంటబిలిటీ అండ్‌ ట్రాన్సపరెన్సీ’’ (ఎస్‌.ఎ.ఎ.టి.) అనే సంస్థ చేత సామాజిక తనిఖీ నిర్వహిస్తారు.
 10. పూర్వ విద్యార్థుల సంఘం ఏర్పాటు : ప్రతి స్కూల్‌ లో పూర్వ విద్యార్థుల సంఘాలను ఏర్పాటు చేసి..ఇందులోని ఇద్దరు క్రియాశీలక సభ్యులను, సర్పంచ్‌, ఇద్దరు పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులు మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయుడితో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. దాతలు, సిఎస్‌ఆర్‌ నిధులు తదితర మార్గాల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి.
 11. ఆర్థికాంశాలు మరియు కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి నిర్దిష్ట కాలపరిమితితో కూడిన అంశాలవారీగా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను తయారుచేసుకోవాలి.

రాష్ట్రంలో ఫారెస్ట్‌ యూనివర్సిటీ…

సిద్ధిపేట జిల్లా ములుగులోని ‘ఫారెస్ట్‌ కాలేజ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌’ (ఎఫ్‌.సి.ఆర్‌.ఐ)లో బి.ఎస్సీ ఫారెస్ట్రీ (హానర్స్‌) నాలుగేండ్ల డిగ్రీ కోర్సు ద్వారా అత్యున్నత ప్రమాణాలతో కూడిన క్వాలిఫైడ్‌ ఫారెస్ట్రీ గ్రాడ్యుయేట్స్‌ ను తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నది. ఎఫ్‌.సి.ఆర్‌.ఐ. లో విద్యనభ్యసించిన అర్హులైన విద్యార్థులకు ఫారెస్ట్‌ డిపార్ట్మెంట్‌ ఉద్యోగాల భర్తీలో డైరెక్ట్‌ రిక్రూట్‌ మెంట్‌ కోటా కింద పలు విభాగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కేబినేట్‌ నిర్ణయించింది. ఇందులో భాగంగా ‘అసిస్టెంట్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌’ (ఎ.సి.ఎఫ్‌.) విభాగంలోని ఉద్యోగాల్లో 25 శాతం రిజర్వేషన్లు, ‘ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌’ (ఎఫ్‌.ఆర్‌.ఒ.) విభాగానికి చెందిన ఉద్యోగాల్లో 50శాతం రిజర్వేషన్లు, ‘‘ఫారెస్టర్స్‌’’ విభాగానికి చెందిన ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేబినేట్‌ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్‌ సర్వీస్‌ రూల్స్‌ (1997) మరియు తెలంగాణ స్టేట్‌ ఫారెస్ట్‌ సబార్డినేట్‌ సర్వీస్‌ రూల్స్‌ (2000) లలో సవరణలు చేపట్టాలని కేబినేట్‌ నిర్ణయించింది. తెలంగాణలో ‘ఫారెస్ట్‌ యూనివర్సిటీ’ ఏర్పాటుకు కేబినెట్‌ అంగీకరించింది. అటవీశాఖ అధికా రులు ఈ దిశగా ప్రాథమిక సమాచారంతో కూడిన నివేదికను కేబినెట్‌ కు అందించగా, వచ్చే కేబినెట్‌ సమావేశం నాటికి పూర్తిస్థాయి నివేదికను సిద్ధం చేసుకొని రావాలని అటవీశాఖ అధికారులను కేబినెట్‌ ఆదేశించింది.