ఎర్రవెల్లి గ్రామాన్ని కదిలించిన సి.ఎం.

గంగదేవిపల్లి అంకాపూర్ లాంటి గ్రామాలను చూస్తే ఎంతో సంతోషం కలుగుతున్నా.. రాష్ట్రంలోని చాలా గ్రామాల దుస్థితిని కళ్ళారా చూసినప్పుడు ధు:ఖం కలుగుతున్నాడాని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతా మన ఖర్మ అని సర్దుకుందామా? మార్పు కోసం యుద్దం చేద్దామా? అని ప్రజలు తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని అన్నారు.

గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవెల్లి గ్రామంలో ముఖ్యమంత్రి ఆగస్టు 20 న రెండు గంటల పాటు పాదయాత్ర నిర్వహించారు. ప్రతీ ఇంటిని పరిశీలించారు. ఎదురైన ప్రతీ ఒక్కరితో మాట్లాడారు. చాలా చోట్ల కూలిన గోడలు, వదిలేసి పడావు పడిన ఇండ్లు, కూలడానికి సిద్దంగా ఉన్న ఇండ్లలోనే పేదల కాపురాలు, మురికి పేరుకు పోయిన వీధులు, ఇండ్ల మధ్యన పిచ్చి చెట్లు, వీధుల వెంట గుట్టలుగా చెత్తాకుప్పలను చూసి ముఖ్యమంత్రి చలించిపోయారు. పాదయాత్ర మధ్యలో ప్రతాప రెడ్డి అనే రైతు ఇంట్లో కూర్చున్నారు. గ్రామ పెద్దలు గ్రామానికి చెందిన సర్పంచ్, ఎంపీటీసీ ఇతర నాయకులు, అధికారులతో మాట్లాడారు. గ్రామంలో పరిస్థితిని చూసిన తర్వాత చాలా బాధగా ఉందని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామం ఇలా ఉంటే ఎలా? అని ప్రశ్నించారు. గ్రామస్తులు ఎందుకు పట్టించుకోవట్లేదని ఆరా తీశారు. ఎవరికి వారుగా వ్యవహరిస్తున్నారు తప్ప గ్రామాన్ని మొత్తం బాగా చూసుకోవాలనే అవగాహన రాలేదని ముఖ్యమంత్రి అన్నారు.

“గంగదేవిపల్లి అంకాపూర్ లాంటి గ్రామాలను చూసినప్పుడు సంతోషం కలుగుతుంది. మిగతా గ్రామాల్లో పరిస్థితిని చూస్తే ధు:ఖం వస్తుంది. ఈ గ్రామం, ఆ గ్రామం అనే తేడానే లేదు. అన్నీ గ్రామాల్లో పరిస్థితి ఏమీ బాగా లేదు. ఏ విషయంలో కూడా సక్కదనం లేదు. మొన్న నేను దత్తత తీసుకున్న కరీంనగర్ జిల్లా చిన్న ముల్కనూర్ పోయి చూసి వచ్చిన. ఇవ్వాళ నేను వ్యవసాయం చేసుకుంటున్న ఎర్రవెల్లి గ్రామంలో తిరిగిన. రెండు గ్రామాల్లో పరిస్థితి బాగా లేదు. ఈ రెండు గ్రామాలే కాదు, రాష్ట్రంలో అన్నీ ఊర్ల పరిస్థితి ఇలాగే ఉంది. చెత్త సేకరణ సరిగ్గా జరగడం లేదు. సేకరించిన చెత్తను వేయడానికి డంపింగ్ యార్డులు లేవు. గ్రామంలోని మురికి కాల్వల నీరు ఎక్కడికి పోవాలో తెలియదు. ఎక్కడా సోర్ ట్యాంకులు లేవు. పనికొచ్చే చెట్లు లేవు. మురికి తుమ్మలు, జిల్లేడు చెట్లు మాత్రం బాగా పెరిగాయి. కూలిపోయిన ఇండ్ల శిధిలాలు ఏండ్ల తరబడి అట్లనే పడి ఉన్నాయి. వాటిని తొలగించడం లేదు. ఉద్యోగాల కోసమో, వ్యాపారం కోసమో, పని కోసమో గ్రామాలను వదిలి పట్టణాలకు వెళ్ళినవారి ఇండ్లు పడావు పడి ఉంటున్నాయి. అవి పాములు తెల్లకు నిలయాలవుతున్నాయి. గ్రామంలో తిరిగే పాములు, తేళ్ళు మనుషుల ప్రాణాలకు ముప్పుగా మారాయి. మురికి గుంటలు ఎక్కడ పడితే అక్కడున్నాయి. దోమలు పెరగడానికి కారణమవుతున్నాయి. వేసిన సీసీ రోడ్లు కూడా సక్కగా లేవు. వంకర టింకరగా వేశారు. ఇదేవ్ పద్దతి. మనుషులు జీవించే విధానమేనా ఇదీ” అని ముఖ్యమంత్రి ఆవేదన చెందారు.

“గ్రామాలకు ఏదో రూపంలో నిధులు వస్తూనే ఉన్నాయి.. గ్రామ పంచాయతీ జనరల్ ఫండ్ మొదలుకొని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చే గ్రాంట్ల వరకు డబ్బులు వస్తున్నాయి, ఖర్చవుతున్నాయి. ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులున్నారు. వార్డు సభ్యుడి నుండి సర్పంచ్, ఎంపీఏటీసీ, జెడ్పీటీసీ, ఎమెల్యే, ఎంపీ, మంత్రులు ఇలా చాలా మందే ఉన్నారు. గ్రామ స్థాయి ఉద్యోగి నుంచి రాష్ట్ర స్థాయి ఉద్యోగి వరకు అందరూ ఉన్నారు. ఇన్ని తీర్ల ఉండి కూడా గ్రామానికి ఏం కావాలో అది చేసుకోపోలేకపోతున్నారు. లోపమెక్కడుందో గ్రహించాలి. జనం సమస్యలతోనే సర్దుకుపోతున్నారు. మా ఖర్మ ఇంతే అని సరిపెట్టుకుంటున్నారు. రోగాలు రావడానికి పరిసరాలు బాగుండకపోవడమే కారణమని గ్రహించడం లేదు. అందరికీ అవగాహన ఉండకపోవచ్చు. కనీసం గ్రామంలో ప్రజా ప్రతినిధులు, తెలిసిన వారైనా ప్రజలను చైతన్యపరచాలి కదా? ప్రభుత్వం కావాల్సిన నిధులిస్తుంది తప్ప ప్రతి రోజు గ్రామంలో పరిస్థితిని చక్కదిద్దలేదు.” అని సీఎం అన్నారు. ఏ గ్రామాన్ని ఆ గ్రామస్తులే మంచిగా చూసుకోవాలి.. ఎక్కడో ఒక చోట ప్రయత్నం మొదలు కావాలి. గ్రామజ్యోతి ద్వారా అయినా ప్రజలు సంఘటితం అవుతారని నేను ఆశిస్తున్న.

రాష్ట్రంలో ప్రజలందరికీ ఏమి కావాలో ఆలోచించి ప్రభుత్వ పరంగా ఆ పనులు చేస్తున్నాం. వాటర్ గ్రిడ్ ద్వారా ఇంటింటికీ మంచినీళ్లు అందించే పని చేపట్టా0. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్దరణ చేస్తున్నాం. కోతల్లేని విద్యుత్ అందిస్తున్నాం. వచ్చే ఏడాది నుంచి రైతులకు పగతిపూటే తొమ్మిది గంటల కరెంటు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. తెలంగాణలోని వ్యవసాయ భూమి అంతటికీ సాగునీరు అందించడానికి ప్రాజెక్టులు కడుతున్నాం. ఇలాంటి పెద్ద పనులన్నీ ప్రభుత్వమే చేస్తున్నది. గ్రామాలకు వచ్చే నిధులు గ్రామాల అవసరాలు తీర్చడానికే ఉపయోగించుకోండి. గ్రామ పరిధిలోని ఎస్సీ వాడలు, ఎస్టీ తండాలు, గూడెల కోసం ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కూడా వాడుకునే అవకాశం ఉంది. నిధులు వస్తాయి. కానీ వాటిని అవసరానికి తగ్గట్లు వాడుకోవాడమే ఇప్పుడు కావలసింది. ప్రజలు సంఘటితమై ఎవరి ఊరును వారు బాగు చేసుకోవాలి. ఎవరిల్లును వారు శుభ్రం చేసుకున్నట్లే, గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకోవాలనే ఆలోచన రావాలి. సమైక్యంగా ఉండి సమస్యలు పరిష్కరించుకోవాలనే తెలివి రావాలి. అది రాకపోతే ప్రభుత్వం ఎన్ని నిధులిచ్చినా, ఏ కార్యక్రమం తెచ్చినా ప్రయోజనం ఉండదు.” అని కెసిఆర్ హితవు పలికారు.

గ్రామస్థుల శపధం

ముఖ్యమంత్రి ఈ మాటలను చాలా భాదతో చెప్పడం, గ్రామాల పరిస్థితిని వివరిస్తున్నపుడు గొంతు జీరపోవడంతో అక్కడున్నవారంతా చలించిపోయారు. ముఖ్యమంత్రి మాటలు విన్న తర్వాత ఒక్కతాటిపైకి వచ్చారు. గ్రామాన్ని మేము బాగుచేసుకుంటామని మాటిచ్చారు. గ్రామంలో చెత్త లేకుండా, మురికి లేకుండా చూసుకుంటామని, శ్రమదానంతోనే అన్నీ బాగుచేసుకుంటామని శపధం చేశారు. రేపే గ్రామస్తులంతా ఊరి రూపురేఖలు మారుస్తామని చెప్పారు. గ్రామంలోని ప్రతి వ్యక్తీ కదులుతామని, చెత్తను తొలగిస్తామని, మురికి కాల్వలు సాఫ్ చేస్తామని, శిధిలాలు లేకుండా చూస్తామని, పిచ్చి చెట్లు నరికేస్తామని చెప్పారు.

గ్రామం నుంచి వెళ్ళిపోయిన వారిని కూడా గ్రామానికి రప్పించి వారి పాత ఇండ్లను తొలగించుకోమని చెబుతామని అన్నారు. వారిలో వచ్చిన స్పందనను చూసి ముఖ్యమంత్రి కూడా సంతోషించారు. అక్కడి నుంచి నేరుగా గ్రామ మధ్యలోని చింతచెట్టు వద్దకు వచ్చి అక్కడ గద్దెపై కూర్చొని గ్రామస్థులతో మాట్లాడారు. అంతా కలిసి గ్రామాన్ని మార్చుకుంటామని గ్రామస్తులు ముక్తకంఠంతో చెప్పారు. గ్రామంలో జరిగే శ్రమ దానంలో తాను కూడా పాల్గొంటానని సీఎం వారికి హామీ ఇచ్చారు.

పారపట్టి.. తట్ట ఎత్తి..

గజ్వేల్ లో వుంటున్నవారు ఉదయం గ్రామానికి చేరుకున్నారు. వారందరితోనూ ముఖ్యమంత్రి కెసిఆర్ గ్రామంలో సమావేశమయ్యారు. పడావు పడిన తమ ఇండ్లను తొలగించడంతో పాటు ఇండ్ల స్థలాలను గ్రామానికి విరాళంగా ఇవ్వాలని అభ్యర్ధించారు. విరాళంగా ఇచ్చిన స్థలంలో వారి పూర్వీకుల పేరుతో గ్రామస్తులందరికీ ఉపయోగపడే విధంగా కమ్యూనిటీ హాల్, ఇతర నిర్మాణాలు చేపడుతామని సీఎం చెప్పారు. అమెరికాలో ఉంటున్న గ్రామానికి చెందిన సుధాకర్ రెడ్డితో కూడా ముఖ్యమంత్రి ఫోన్ లో మాట్లాడారు. హైదరాబాదులో దంత వైద్యశాల నడుపుతున్న డా. రుక్కన్నగారి సునీల్ రెడ్డి తల్లిదండ్రులతోపాటు గ్రామానికి వచ్చి తమ ఇంటిని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. మిట్టపల్లి యాది రెడ్డి, పల్లెమీది రాజి రెడ్డి, బంగ్లా రాంరెడ్డి, ఆర్. సుధాకర్ రెడ్డి, ఆర్. వెంకటేశం, ఆర్. రవీందర్ రెడ్డి, ఏ. అశోక్ రెడ్డి, చంద్రా రెడ్డి, మహిపాల్ రెడ్డి, బంజర నర్సా గౌడ్, శివలక్ష్మి, వై. సంపత్ రావు, వై. రఘు మోహన్ రావు, వై. శ్రీధర్ రావు, వై. శ్రీనాథ్ తదితరులు దాదాపు ఆరు ఎకరాల విస్తీర్ణం కలిగిన ఇండ్ల స్థలాలను విరాళంగా అందించారు. హెడ్ మాస్టర్ గా పనిచేసి రిటైరైన రుక్కన్నగారి బలరాం రెడ్డి తన ఇంటి స్థలాన్ని విరాళంగా ఇస్తానని, గ్రామంలో రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయాలని కేసీఆర్ ను కోరారు. దీనికి కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. గ్రామంలో ప్రజలంతా ఐకమత్యంగా ఉండడంతో పాటు గ్రామం వదిలి వెళ్ళిన వారు కూడా గ్రామం పట్ల తమ ప్రేమను చూపడం ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి అన్నారు. ఎర్రవెల్లి గ్రామ రైతుగా ఈ గ్రామ రుణం తీర్చుకునే అవకాశం తనకు వచ్చిందని కూడా సీఎం అన్నారు. దాతలను ఘనంగా సన్మానించారు. శ్రమదానం సంధర్భంగా గ్రామస్తులందరితో కలిసి కొనసాగిస్తామని గ్రామస్తులు ముఖ్యమంత్రికి మాటిచ్చారు. గ్రామంలో రైతులందరికి డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు అందిస్తామని, వ్యవసాయరంగాన్ని అభివృద్ది చేస్తామని సీఎం చెప్పారు.