జర్మనీ పరిశ్రమల క్లస్టర్ ఏర్పాటు
రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, 2 లక్షల ఎకరాల స్థలం పరిశ్రమల స్థాపనకు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని, పారిశ్రామికవేత్తలు పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలని పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో ఇండో జర్మన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జర్మనీ పెట్టుబడిదారుల సదస్సుకు భారత్‌లో జర్మనీ రాయబారి వాల్టర్ జె లిండ్‌నర్‌తో కలిసి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. జర్మనీ పెట్టుబడుల కోసం ప్రత్యేకంగా అన్ని మౌలిక వసతులతో కూడిన క్లస్టర్ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో పెట్టుబడులకు అనేక అనుకూలతలు ఉన్నాయని చెప్పారు. పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల గృహవసతి కోసం కూడా తాము కృషిచేస్తామన్నారు. తెలంగాణలో కేవలం ఇన్‌ఫర్‌మేషన్ టెక్నాలజీ రంగంలోనే కాకుండా ఇతర రంగాలలో అనేక అవకాశాలు ఉన్నాయని తెలిపారు. యంత్ర, ఎలక్ట్రానిక్ రంగాలలో ఇప్పటికే ఎన్నో పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినట్లు తెలిపారు.

జర్మనీ జీడీపీలో 80శాతానికి పైగా చిన్న, మధ్యతరహా పరిశ్రమల నుంచే సమకూరుతోందని, అదే తరహాలో తెలంగాణలోను చిన్న, మధ్యతరహా పరిశ్రమలతో పనిచేసేందుకు జర్మనీ పెట్టుబడిదారులు ముందుకు రావాలని కోరారు. జర్మనీ దేశంలో అమలులో ఉన్న డ్యూయల్ డిగ్రీ కోర్సులను రాష్ట్రంలోను ప్రవేశపెట్టే యోచనలో ఉన్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చెన్నైలో జర్మనీ కాన్సుల్ జనరల్ కెరిన్ స్టోల్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్ తదితరులు పాల్గొన్నారు.
జర్మనీకి చెందిన ప్రముఖ ఆటోమోటివ్ సంస్థ ‘లైట్ ఆటో’ జహీరాబాద్‌లో వంద ఎకరాల్లో 15వందల కోట్ల రూపాయల పెట్టుబడితో వాహన విడిభాగాలు, ముడి పదార్థాల ఉత్పత్తి పరిశ్రమ ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, లైట్ ఆటో ఎండి బాలానంద్ ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ పరిశ్రమ ద్వారా 9వేల మందికి ప్రత్యక్షంగా, మరో 18వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
కేటీఆర్‌కు జర్మనీకి ఆహ్వానం
జర్మనీకి చెందిన పారిశ్రామికవేత్తలు లిండ్నర్, కరీన్‌స్టోల్‌లు కేటీఆర్‌ను జర్మనీ సందర్శించాలని ఆహ్వానించారు. జనవరి 16 నుంచి 19వరకు దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు అనంతరం 20 తరువాత తమ ప్రభుత్వ బృందంతో కలిసి జర్మనీలో పర్యటిస్తామని కేటీఆర్ వారికి హామీ ఇచ్చారు.