ప్రతి పంచాయతీకి ట్రాక్టరు, ట్యాంకరు

By: బి. రాజమౌళి

సమైక్య రాష్ట్రంలో వివిధ కారణాలతో నిర్లక్ష్యం వల్లనో, స్థానిక సంస్థలు నిర్వీర్యం కావడం వల్ల తెలంగాణ పల్లెలను పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. గ్రామాలలో ఎటుచూసినా పేరుకుపోయిన చెత్తాచెదారం, కూలిపోయిన ఇండ్ల శిథిలాలు, పాడుబడిన బావులు, ప్లాస్టిక్‌ వ్యర్ధాలు కనిపించే దుస్థితి ఉండేది. వర్షాకాలం వస్తే పరిస్థితి మరీ అధ్వానంగా ఉండేది. గ్రామీణ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చేసి గ్రామాల్లో పారిశుధ్యం, పచ్చదనాన్ని పెంచాలని గ్రామానికి అవసరమైన అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ రావు నిర్ణయించారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి పల్లె ప్రగతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి విజయవంతంగా అమలు చేస్తున్నది. 

పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల ముఖ చిత్రం సమూలంగా మారింది

ప్రజల భాగస్వామ్యంతో పల్లె ప్రగతి కార్యక్రమం గ్రామాల ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేసింది. అందులో భాగంగా చెత్త సేకరణపై ప్రత్యేకమైన ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రతి గ్రామానికి చెత్త తరలింపు కు ఒక ట్రాక్టర్‌, ట్రాలీని, డంపింగ్‌ యార్డ్‌ ను ఏర్పాటు చేసింది. పచ్చదనం పెంచేందుకు నూతన పంచాయతీ రాజ్‌ చట్టం లో గ్రామ పంచాయితీ సర్పంచ్‌ లకు ప్రత్యేక విధులను, బాధ్యతలను పేర్కొన్నది. ప్రతి గ్రామంలో విరివిగా మొక్కల సంరక్షణ కోసం ప్రతి గ్రామానికి వాటర్‌ ట్యాంకర్‌ లను సమకూర్చింది. స్థానిక సంస్థల బడ్జెట్‌ కేటాయింపులలో 10 శాతం గ్రీన్‌ బడ్జెట్‌కు కేటాయించేలా చట్టంలో నిబంధన చేసింది. ఈ నిధులు వేరే పనులకు మళ్లించే వీలు లేదు 2020-2021 సంవత్సరంలో  రాష్ట్రంలో 369 కోట్ల రూపాయల గ్రీన్‌ బడ్జెట్‌ ఏర్పడిరది. దీనికి తోడుగా గ్రామాలలో పారిశుధ్యానికి రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామపంచాయతీల్లో రూ. 319 కోట్ల రూపాయల వ్యయంతో డంపింగ్‌ యార్డులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది.

రాష్ట్రంలోని అన్ని  గ్రామపంచాయతీలలో టాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్లు

రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చిన ట్రాక్టర్‌, ట్రాలీలో గ్రామపంచాయతీ పారిశుధ్య సిబ్బంది ప్రతిరోజు ఉదయం ఇండ్ల నుండి, వీధుల నుండి, ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, పాఠశాలలు కళాశాలల నుండి తడి, పొడి చెత్తను సేకరించి డంపింగ్‌ యార్డులకు తరలిస్తున్నారు. డంపింగ్‌ యార్డ్‌కు తరలించిన తడి పొడి చెత్తలను రైతు పొలాలలో సేంద్రియ ఎరువుగా వాడుతున్నారు. ప్లాస్టిక్‌ వస్తువులు, ఇనుప వస్తువులు, చెక్కముక్కలు వేరు చేసి స్క్రాప్‌ డీలర్‌లకు అమ్ముతున్నారు. 

ఆదిలాబాద్‌ జిల్లాలోని ముఖ్రా (ఖ) గ్రామంలో ట్రాక్టర్‌ ద్వారా సేకరించిన తడి, పొడి చెత్త ద్వారా వర్మి కంపోస్టు రైతులకు అమ్మడం ద్వారా 3 లక్షల 50 వేల రూపాయలు ఆదాయం వచ్చింది. పెద్దపల్లి జిల్లా లోని సుల్తాన్‌పూర్‌ గ్రామంలో ట్రాక్టర్‌ ద్వారా డంపింగ్‌ యార్డ్‌లకు చేర్చిన తడి పొడి చెత్తను ప్రాసెస్‌ చేసిన పిదప గ్రామంలోని ఇళ్లల్లో కిచెన్‌ గార్డెన్‌ పెంచడానికి, డంపింగ్‌ యార్డ్‌ సమీపంలోని చెట్లకు హరితహారం భాగంలో నాటిన మొక్కలకు సేంద్రియ ఎరువుగా ఉపయోగిస్తున్నారు. 

సిరిసిల్ల జిల్లా మండేపల్లి గ్రామస్తులు ట్రాక్టర్‌ ద్వారా సేకరించిన తడి పొడి చెత్తను డంపింగ్‌ యార్డ్‌లకు తరలించిన పిదప రైతుల పొలాల్లో సేంద్రియ ఎరువుగా ఉపయోగిస్తున్నారు అదే విధంగా మిగిలిన ప్లాస్టిక్‌, ఇనుప వస్తువులను, స్క్రాప్‌ డీలర్లకు అమ్ముతున్నారు. రాష్ట్రంలోని దాదాపు అన్ని గ్రామాలలో డంపింగ్‌ యార్డులకు తరలించిన తడి, పొడి చెత్తను గ్రామంలో హరితహారంలో భాగంగా నాటిన మొక్కలకు సేంద్రియ ఎరువుగా వినియోగిస్తున్నారు. ట్రాక్టర్లు, ట్యాంకర్లను వినియోగించి హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలకు నీటి సరఫరాకు వాడుతున్నారు. అంతేకాకుండా గ్రామానికి ఏదైనా వస్తువులు అవసరమైతే రవాణా కొరకు ట్రాక్టర్లు, ట్రాలీలు ఉపయోగిస్తున్నారు. రాష్ట్రంలో గ్రామ పంచాయితీలు, ట్రాక్టర్ల ద్వారా హరితహారం మొక్కలకు నీరు పోయడం ద్వారా ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 166 కోట్ల రూపాయలు సంపాదించాయి 

పల్లె ప్రకృతి వనాలు-బృహత్‌ పల్లె ప్రకృతి వనాలు

గ్రామాల్లో పచ్చదనాన్ని పెంపోదించడంలో భాగంగా రాష్ట్రంలో రూ. 116 కోట్ల వ్యయంతో 82 వేల 657 ఎకరాల విస్తీర్ణంలో 19 వేల 472 పల్లె ప్రకృతి వనాల నిర్మాణాన్ని చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. పల్లె ప్రకృతి వనాల్లో చెట్ల పెంపకంతో పాటుగా ఓపెన్‌ జిమ్ములు, వాకింగ్‌ ట్రాకులు పిల్లల కొరకు ఆట స్థలాలు, పెద్దలు సేద తీరడానికి వీలుగా ఏర్పాట్లు చేయబడుతున్నాయి.  

పల్లె ప్రకృతి  వనాల ఏర్పాటు వల్ల గ్రామాల్లో మంచి స్పందన రావడంతో రాష్ట్రంలోని 545 గ్రామీణ మండలాల్లో ఒక్కొక్క మండలంలో 5 చొప్పున మొత్తం 2725 బృహత్‌ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మండల కేంద్రంలోగాని అదే మండలంలోని మేజర్‌ గ్రామ పంచాయతీలో గాని బృహత్‌ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయబడుతున్నాయి. ఒక్కొక్క బృహత్‌ పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేయడానికి 40 లక్షల రూపాయలు వ్యయం చేస్తారు. ఒక్కొక్క బృహత్‌ పల్లె ప్రకృతి వనంలో దాదాపు 31 వేల మొక్కల పెంపకం జరుగుతుంది. ఇందు నిమిత్తం 526 ప్రదేశాలల్లో 6 కోట్ల 96 లక్షల రూపాయల వ్యయంతో పనులు ప్రారంభించడం జరిగింది. అందులో 241 పల్లె బృహత్‌ ప్రకృతి వనాలు పూర్తి చేయడం జరిగింది. మిగతా  బృహత్‌ పల్లె ప్రకృతి వనాల నిర్మాణం పూర్తి చేయాడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించబడిరది. ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్లు, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాల ద్వారా గ్రామాల్లో పచ్చదనానికి, పారిశుధ్యానికి శాశ్వత పరిష్కారం లభించింది. 

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు కేవలం 84 గ్రామపంచాయతీలకు మాత్రమే ట్రాక్టర్లు ఉండేవి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని మొత్తం 12,769 గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్‌, ట్రాలీ, ట్యాంకర్ల సౌకర్యం కల్పించడం జరిగింది. దేశంలో మరే రాష్ట్రం, ప్రతి గ్రామానికి ట్రాక్టర్‌ ఇచ్చిన దాఖలాలు లేవు. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి డంపింగ్‌ యార్డులు సమకూర్చాలనే సంకల్పంతో 319 కోట్ల రూపాయల వ్యయంతో 12,769 గ్రామపంచాయతీల్లో డంపింగ్‌ యార్డ్‌ల నిర్మాణం చేపట్టగా, ఇప్పటివరకు 12,740 డంపింగ్‌ యార్డ్‌ల నిర్మాణం పూర్తి చేసి అందు బాటులోకి తీసుకురావడం జరిగింది. వివిధ స్థాయిలలో నిర్మాణంలో ఉన్న మిగతా డంపింగ్‌ యార్డ్‌ ల నిర్మాణాలను వెంటనే పూర్తిచేయడానికి చర్యలు గైకొనడం జరిగింది. రాష్ట్రంలోని 12,678 డంపింగ్‌ యార్డులో సేకరించిన చెత్తతో కంపోస్టు ఎరువు తయారు చేస్తున్నారు. గ్రామాల్లో పచ్చదనం పెంచడానికి నాటిన మొక్కలకు ఈ ఎరువును ఉపయోగిస్తున్నారు. అదే విధంగా మిగిలిన  కంపోస్ట్‌ ఎరువు అమ్మకం ద్వారా గ్రామ పంచాయితీలు ఆదాయం పొందుతున్నాయి. అంతేకాకుండా సంపూర్ణంగా మరుగుదొడ్ల నిర్మాణం చేసి బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా, రాష్ట్రంలోని గ్రామాలను తీర్చిదిద్దడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందిస్తూ కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ అవార్డును ప్రకటించింది. 

గ్రామాలకు ట్రాక్టర్‌, ట్రాలీ, ట్యాంకర్లు, డంపింగ్‌ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు సమకూర్చడంతో పాటుగా సంపూర్ణంగా మరుగుదొడ్ల నిర్మాణం వల్ల రాష్ట్రంలోని అన్ని గ్రామాలు పారిశుధ్యంగా ఉన్నాయి. దీనివల్ల గ్రామాలలో వర్షాకాలంలో వచ్చే అంటు వ్యాధులు, మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్‌ లాంటి విషజ్వరాల ప్రభావం గణనీయంగా తగ్గింది. హరితహారం కార్యక్రమంలో భాగంగా ఇండ్లలో  నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలలో, ఖాళీ ప్రదేశాలలో రోడ్లకు ఇరువైపుల పెద్ద ఎత్తున మొక్కలు నాటడం వల్ల పచ్చదనం గణనీయంగా పెరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 4శాతం గ్రీన్‌ కవరేజి పెరిగిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం హరితహారం విజయానికి నిదర్శనంగా చెప్పవచ్చు. 

ప్రతి గ్రామంలో చెత్త సేకరణ, నాటిన మొక్కల పరిరక్షణ పారిశుధ్యం సమర్థవంతంగా జరుగుతున్నందు వల్ల తెలంగాణ గ్రామాలు దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా రూపొంది పచ్చగా, పరిశుభ్రంగా కళకలాడుతున్నాయి.  రాష్ట్ర ప్రభుత్వం కృషి వల్ల తెలంగాణ గ్రామాలు దేశంలోని ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి.