|

ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ రంగ విస్తరణ

By: ముడుంబై మాధవ్‌

(గత సంచిక తరువాయి)

భౌగోళిక, భూభౌతిక, వాతావరణ, చారిత్రక, సాంస్కృతిక కారణాలవల్ల ఐటీ రంగ సంస్థలకు అనువైన కేంద్రంగా హైదరాబాద్‌ నగరం ప్రపంచ స్థాయి గుర్తింపును పొందింది. సుమారు 1500 చిన్న, మధ్య తరహా, భారీ ఐటీ సంస్థలు తెలంగాణ రాజధానిలో నేడు తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. అయితే ఐటీ రంగం పూర్తిగా హైదరాబాద్‌, పరిసర జిల్లాలకే పరిమితమవ్వడం వల్ల దాని ఫలాలు మిగతా తెలంగాణ రాష్ట్రం పూర్తి స్థాయిలో చేరలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ రంగాన్ని విస్తరించడం ద్వారా ఉద్యోగ, ఉపాధి కల్పనతో పాటు సమతుల సామాజిక, ఆర్థిక ప్రగతిని సాధించాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం గత ఏడేండ్లుగా అనేక చర్యలు తీసుకున్నది. ముందే చెప్పినట్లుగా ఇందుకోసం రూరల్‌ టెక్‌ సెంటర్స్‌ పాలసీ వంటి ప్రత్యేకమైన విధానాల్ని ప్రభుత్వం తీసుకువచ్చింది.

ద్వితీయ శ్రేణి నగరాలలో జీవన వ్యయం, నిర్వహణ వ్యయం, పని ప్రదేశానికి ప్రయాణ సమయం తక్కువగా ఉండటం, తక్కువ జీతభత్యాలకే సాంకేతిక నిపుణుల లభ్యత వంటి కారణాల వల్ల మహానగరాలతో పోలిస్తే ఈ ప్రాంతాల్లో తమ సంస్థలను నెలకొల్పడం వల్ల వ్యాపార సంస్థలకు తమ ఖర్చులలో 30శాతం ఆదా అవుతుంది. దీనికి అదనంగా ప్రభుత్వం ఐటీ రంగ సంస్థలు ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించేందుకు అనువుగా అనేక ప్రోత్సాహకాలను ప్రకటించింది. వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌ నగర్‌, నిజామాబాద్‌, సిద్దిపేట, నల్గొండ, రామగుండంలలో ఐటీ భవనాలు, ఇంక్యూబేషన్‌ కేంద్రాల స్థాపనకు ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థకు (TSIIC) ఈ నిర్మాణాల బాధ్యతను అప్పగించింది.          

వరంగల్‌:

నగరంలోని మడికొండలో 2 ఎకరాల స్థలంలో 15,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 1400 మంది నిపుణులు పనిచేసేందుకు అనువుగా ఐటీ టవర్స్‌/ ఇంక్యూబేషన్‌ కేంద్రం 19 ఫిబ్రవరి, 2016 నాడు ప్రారంభమైనది. Cyient, Tech Mahindra వంటి సంస్థలు ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించాయి. రెండవ దశ ఐటీ ఇంక్యూబేషన్‌ కేంద్రం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రెండవ దశలో అభివృద్ధి చేస్తున్న కేంద్రాన్ని Tech Mahindra తమ సంస్థ కార్యకలాపాల విస్తరణకు వినియోగించుకోవడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది.   

కరీంనగర్‌:

రూ.25 కోట్ల పెట్టుబడితో 80,000 చ.అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన కరీంనగర్‌ ఐటీ భవనం 21 జులై, 2020 నాడు ప్రారంభమైంది. 18 కంపెనీలు ఈ కేంద్రం నుండి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. 556 మంది ఐటీ నిపుణులు ఇక్కడినుండి పనిచేసుకునే వసతులు ఉన్నాయి.   

ఖమ్మం:

రూ. 27 కోట్ల వ్యయంతో 42,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఖమ్మంలో నిర్మించిన ఐటీ భవన సముదాయాలు 7 డిసెంబర్‌, 2020నాడు ప్రారంభం అయ్యాయి. 19 ఐటీ రంగ సంస్థలకు వేదికైన ఈ కేంద్రం 430 మంది నిపుణులు పనిచేసుకునేలా నిర్మితమైంది. రెండవ దశ ఐటీ భవనంలో 31 కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఆసక్తి కనబరచగా 570 మంది నిపుణులు పనిచేసుకునేలా వసతులు కల్పిస్తారు.  

మహబూబ్‌నగర్‌ (60,000 చ.అ), నిజామాబాదు (50,000 చ.అ) పట్టణాలలో ఐటీ భవనాల నిర్మాణం తుది దశకు చేరుకున్నది. కాగా సిద్దిపేటలో సీఎం కే. చంద్రశేఖర రావు ఐటీ భవన నిర్మాణానికై 10 డిసెంబర్‌, 2020 నాడు శంకు స్థాపన చేశారు. అదేవిధంగా నల్గొండ (1,500 మంది) రామగుండం (200), వనపర్తిలలో (250) ఐటీ భవనాలు నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తున్నది.

అమెరికాకు చెందిన IT Serve అనే ఐటీ పరిశ్రమల సమాఖ్య సహకారంతో జరిపిన సంప్రదింపుల ఫలితంగా 128 ఐటీ సంస్థలు తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాలలో తమ కార్యకలాపాలు ప్రారంభించడానికి అంగీకారం తెలిపాయి.  

గ్రిడ్‌ పాలసీ

పశ్చిమ హైదరాబాద్‌కు వెలుపల ఐటీ రంగ సంస్థల స్థాపన, విస్తరణ ద్వారా వికేంద్రీకరణను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం Growth in Dispersion (GRID)  (GRID) విధానానికి రూపకల్పన చేసింది. ఈ దిశగా కొంపల్లి, కొల్లాపూర్‌, శంషాబాద్‌, ఉప్పల్‌, పోచారం లలో ఐటీ పార్కుల విస్తరణకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. రావిర్యాల, మహేశ్వరంలలో రెండు ఎలక్ట్రానిక్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్స్‌ అభివృద్ధి చేస్తున్నది.      

ప్రభుత్వం తూర్పు హైదరాబాద్‌ ప్రాంతంలో ఐటీ పార్కుల ఏర్పాటుకు అవసరమైన పాలనపరమైన అనుమతులను ఇచ్చింది. 25 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమౌతున్న ఈ ఐటీ పార్కులు 30,000 మంది ఐటీ నిపుణులకు ఉద్యోగ/ ఉపాధి అవకాశాలను కల్పించనున్నాయి.

ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌

2020 సంవత్సరాన్ని తెలంగాణ ప్రభుత్వం Year of Artificial Intelligence (AI)గా ప్రకటించింది. కృత్రిమ మేధకు సంబంధించి ఒక ఆచరణాత్మక విధానాన్ని (Framework) తీసుకువచ్చింది. NASSCOM భాగస్వామ్యంతో Telangana AI Mission (T-AIM)ను ప్రకటించింది. 

World Economic Forum మరియు Centre for Fourth Industrial Revolution (C4IR) భాగస్వాములుగా తెలంగాణ ప్రభుత్వం ‘కృత్రిమ మేధతో వ్యవసాయ ఆవిష్కరణలు’ (Artificial Intelligence for Agricultural Innovation – AI4AI)  అనే కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ఇందులో భాగంగా పత్తి పంటకు వచ్చే తెగులు, చీడల (Pests) నివారణకు కృత్రిమ మేధ ఆధారిత పరిష్కారాన్ని 6 జిల్లాలకు చెందిన 2,800 గ్రామాల్లో 2021 వానాకాలం (Kharif) కాపుకు అమలుచేశారు.

డ్రోన్‌ టెక్నాలజీని ఉపయోగించి ‘ఆకాశ మార్గంలో ఔషధాల’ను (Medicines from the Sky) చేరవేసే ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది. ఇందుకు అవసరమైన కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రత్యేక అనుమతులను పొందిన మొదటి రాష్ట్రం తెలంగాణ అయ్యింది.                

ఎలక్ట్రానిక్స్‌

గత ఏడాది తెలంగాణ రాష్ట్రం ఎలెక్ట్రిక్‌ వాహనాలు, ఇంధన నిల్వల విధానం 2020-30ని ఆవిష్కరించింది. దీనిలో భాగంగా దివిటిపల్లిలో ఇంధన నిల్వ పరికరాల తయారీకి ఉద్దేశించిన సంప్రదాయేతర ఇంధన వనరుల పార్క్‌ (New Energy Park), చందన్‌ వెల్లిలో ఎలెక్ట్రిక్‌ వాహనాల పార్కులను (Electric Vehicles Park) ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నది. ఎలక్ట్రానిక్స్‌, ఎలెక్ట్రిక్‌ వాహనాలు, ఇంధన నిల్వలు, సంప్రదాయేతర ఇంధన (Renewable Energy) రంగాలలో రూ.4000 కోట్లకు పైగా పెట్టుబడులను రాష్ట్రం గత ఏడాది ఆకర్షించింది. దీనివల్ల 15,000 ఉపాధి అవకాశాలు రానున్నాయి.      

మీసేవ – పౌర సేవలు

మీసేవ 100కు పైగా ప్రభుత్వ శాఖలు, సంస్థలకు చెందిన 600 పైచిలుకు పౌర సేవలను తమ 4,500 కేంద్రాలు, వెబ్‌సైట్‌, మొబైల్‌ ఆప్‌ ద్వారా అందిస్తున్నది. 2020-21 సంవత్సరంలో మీసేవ 2.86 కోట్ల మంది పౌరులకు సేవలను అందించింది. ప్రతి వెయ్యి మంది జనాభాకి సగటున అందించే డిజిటల్‌ పౌర సేవల సంఖ్య విషయంలో తెలంగాణ రాష్ట్రం 2020 వరకు భారతదేశంలో మొదటిస్థానంలో నిలిచింది.  

తెలంగాణ ప్రభుత్వ పౌర సేవల సమగ్ర మొబైల్‌ ఆప్‌ – T App Folio – 32 శాఖలకు చెందిన 270కి పైగా సేవలను అందిస్తున్నది. ఈ ఆప్‌ ని ఇప్పటివరకు 11.8 లక్షల మంది డౌన్లోడ్‌ చేసుకున్నారు.  

భారతదేశపు మొట్టమొదటి ప్రభుత్వ వాలెట్‌ (T-Wallet) ద్వారా 12,128 కోట్ల విలువైన 2.42 కోట్ల లావాదేవీలు జరిగాయి. సుమారు 12.3 లక్షల మంది పౌరులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు.  

Blockchain Protection of Strinidhi Transactions (B-POST) – బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ ద్వారా 1,50,000 స్వయం సహాయక బృంద సభ్యుల రుణాల వివరాలు నమోదు చేయడం జరిగింది. రెండు లక్షల లావాదేవీలు నమోదు చేసి 25,000 రుణ ఒప్పందాలు ఆన్‌లైన్‌ పద్ధతిలో పూర్తి చేయడం జరిగింది.   

Real-time Digital Authentication of Identity (RTDAI) – కాగితాలు, కార్యాలయ సందర్శన అవసరం లేకుండా ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ ఉపయోగించి పౌరుల పేరు, ఫోటో, గుర్తింపు (identity) ధృవీకరణ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖలు, విభాగాలకు పౌరసేవలు అందించే అత్యాధునిక వ్యవస్థ. సెల్ఫీ ద్వారా పెన్షనర్లు లైఫ్‌ సర్టిఫికేట్‌ ను దాఖలు చేసుకోగలిగే PLCS (Pensioner’s Life Certificate through Selfie), రవాణా శాఖకు చెందిన సులభతర సేవలు FEST (Friendly Electronic Services of Transport Dept.), డిగ్రీ కాలేజీలలో ప్రవేశాలకై DOST (Degree Online Services of Telangana) ధృవీకరణ RTDAI సాంకేతికతకు అనువర్తనాలు.   

నైపుణ్యాభివృద్ధి

తెలంగాణ అకాడెమీ ఆఫ్‌ నాలెడ్జ్‌ అండ్‌ స్కిల్స్‌ (TASK) 2020-21 సంవత్సరానికి 1,04,611 మంది విద్యార్థులకు, 1561 ఉపాధ్యాయ సభ్యులకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించింది. 2,600 మంది విద్యార్థులు ఉద్యోగాలు పొందడంలో తోడ్పాటు అందించింది.    

ఐటీ, విమానయాన, ఆతిథ్య, తయారీ, లాజిస్టిక్స్‌, ఫార్మా, వైద్య సాంకేతికత రంగాలలో నాలుగవ పారిశ్రామిక విప్లవం తెచ్చే అవకాశాలను అందిపుచ్చుకునేందుకు విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాలపై 20 వెబినార్లు నిర్వహించడం జరిగింది.

కరీంనగర్‌, ఖమ్మం పట్టణాలలో టాస్క్‌ ప్రాంతీయ కేంద్రాలను ప్రారంభించడం జరిగింది.

సాటిలైట్‌, డిజిటల్‌ మీడియా 

కోవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలు మూసివేయడంతో ఏర్పడ్డ వెలితిని T-SAT ఉపగ్రహ ఛానెల్స్‌, వెబ్‌సైట్‌, మొబైల్‌ ఆప్‌ మరియు యూట్యూబ్‌ ఛానెల్స్‌ భర్తీ  చేశాయి. మూడవ తరగతి నుండి పదవ తరగతి వరకు అన్ని సబ్జెక్టులలో రోజూ ఎనిమిది గంటలపాటు ఆన్లైన్‌ పాఠాలను T-SAT ప్రసారం చేసింది. సుమారు 2,350 వీడియోలను సిద్ధం చేసింది. పూర్వ పాఠశాల (Pre-school) చిన్నారులకు కూడా రోజూ ఒక గంట కార్యక్రమాలను ప్రసారం చేసింది. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ ఉపాధ్యాయులు, వర్కర్స్‌కి 252 ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాలు నిర్వహించింది.

ఇంటర్మీడియట్‌ విద్యార్థులకోసం ప్రతీ రోజూ 11 ఎపిసోడ్లు ప్రసారం చేసింది. 2040 వీడియోలను తయారు చేసింది. తెలంగాణ గురుకుల పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకై ప్రత్యేక కార్యక్రమాలు T-SAT ప్రసారం చేసింది.

రైతులకోసం వ్యవసాయ చట్టాలపై అవగాహన కోసం 30 ఎపిసోడ్లు, వ్యవసాయ విశ్వవిద్యాలయం సహకారంతో 138, పశు సంవర్ధక శాఖ సహకారంతో 45 ముఖాముఖీ కార్యక్రమాలు T-SAT నిర్వహించింది.

యూ ట్యూబ్‌లో T-SAT పాఠాలు, కార్యక్రమాలు బహుళ ప్రజాదరణ పొందాయి. 2020-21లో 7 కోట్ల ఙఱవషం ఉండగా, విద్యార్థులు,

ఉద్యోగార్థులు 68 లక్షల నిమిషాల పాటు T-SAT వీడియోలను చూశారు.        

తెలంగాణ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్లు, సామాజిక మధ్యమ (social media) ఖాతాలను నిర్వహించే డిజిటల్‌ మీడియా విభాగం అభివృద్ధి పరచిన కోవిడ్‌19 (https://covid19.telangana.gov.in), ఫాక్ట్‌ చెక్‌ (https://factcheck.telangana.gov.in) వెబ్‌సైట్లు, వాట్సప్‌ చాట్‌ బోట్‌ (https://wa.me/919000658658?text=Hi)లకు  భారత ప్రజా సంబంధాల సంస్థ (Public Relations Society of India), mBillionth, Social Media for Empowerment సంస్థల నుండి ప్రతిష్ఠాత్మక అవార్డులు లభించాయి.    

‘ప్రతీ వెయ్యి మంది జనాభాకు అనుచరుల సంఖ్య’ మితిలో తెలంగాణ సీఎంవో ట్విటర్‌ ఖాతా రాష్ట్రాల సీఎంవోల జాబితాలో మొదటి స్థానంలో

ఉంది. ఫేస్బుక్‌ ఖాతా ఇదే ప్రమాణంలో మూడవ స్థానంలో ఉంది.   

2020-21 వార్షిక  నివేదిక ముఖ్యాంశాలు

  • అంకుర పరిశ్రమలకు ప్రోత్సాహం – ఆవిష్కరణలకు ఊతం 

ఐటీ రంగానికి చెందిన అంకుర పరిశ్రమలు, ఆవిష్కరణల ప్రయత్నాలు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడానికి, మార్గనిర్దేశనం చేయడానికి ఏర్పాటుచేయబడ్డ టీ-హబ్‌ (T-Hub) ఐదు వసంతాలు పూర్తిచేసుకున్నది. ఒక ఇంక్యుబేటర్‌గా మొదలైన టీ-హబ్‌ నేడు ఆవిష్కరణల సంధానకర్తగా రూపాంతరం చెందింది. ఈ క్రమంలో టీ-హబ్‌ 2000 అంకుర పరిశ్రమలకు చేయూతను అందించింది. 28 అంకుర పరిశ్రమలకు 90 లక్షల ప్రోత్సాహకాలను టీ-హబ్‌ పోయిన ఏడాది కల్పించింది.         

మహిళలకోసం స్థాపించబడ్డ భారతదేశపు మొట్టమొదటి ప్రభుత్వ ఇంక్యుబేటర్‌ వి-హబ్‌ (WE Hub) గత సంవత్సర కాలంలో 4,500 మంది ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలకు తోడ్పాటు అందించింది. 53 కోట్ల నిధులను సమీకరించగలిగింది.  

ప్రభుత్వ శాఖలలో, సంస్థల్లో ఆవిష్కరణలకు తోడ్పాటు, విద్యార్థి దశ నుండే నూతన ఆవిష్కరణల సంస్కృతిని పాదుకొల్పేందుకు తెలంగాణ రాష్ట్ర ఆవిష్కరణల విభాగం (Telangana State Innovation Cell – TSIC) పనిచేస్తున్నది. 2020-21 సంవత్సరంలో 25,000కు పైగా విద్యార్థులు, 5,000కు పైగా ఉపాధ్యాయులకు ఆవిష్కరణల విషయమై అవగాహన కల్పించడం జరిగింది. రాష్ట్రంలో మొట్ట మొదటిసారిగా దివ్యాంగుల (Persons with Disabilities) ప్రయోజనార్థం Assistive Technology (AT)  సమ్మిట్‌ను TSIC నిర్వహించింది.