జనం నాలుకలపై నిలిచిన కవిత్వం
కవిత్వం రెక్కలు విప్పిన విహంగం. దాని స్వేచ్ఛకు ఆకాశమే సరిహద్దు. కవిత్వం ఒక సంకెలలు విడిపోయిన ఆత్మ. చుట్టూరా ఉన్న భౌతిక, అభౌతిక అనుభూతులకు ఆకారం కల్పించి రసిక హృదయాలను వెంట తీసుకుపోతుంది. వాగులు, వంకలు, పర్వతాలు, సముద్రాలు ఇవేవీ ఈ స్వేచ్ఛా విహంగానికి, ఈ సంకెలలు వీడిన ఆత్మను అడ్డుకోలేవు. ఫైజ్ ఆహ్మద్ ఫైజ్ (13-2-1922 – 20-11-1984) దేశ విభజనకు ముందు ఉన్న సియాల్‌కోట్‌లో ఒక సంపన్న కుటుంబంలో జన్మించాడు. తాత తండ్రులు సంపన్నులైనా, ఆయన ‘తామరాకు మీది నీటి బొట్టు’లా స్థిత ప్రజ్ఞతతో గడి పాడు. మహాత్మాగాంధీకున్నంత ఆదరణ ఈ కవికి, ఆనాడు ఉండేదంటే అతిశయోక్తి కాదు.
‘ఫైజ్’ అన్న పదానికి పార్సి భాషలో ‘వెలుగు / ప్రకాశం’ అని అర్థం. తన తల్లిదండ్రులు పెట్టిన పేరును సార్ధకం చేస్తూ, సామాజికానందాన్ని ఆలంబనం చేసుకున్న కవి ఫైజ్. పలు ప్రగతి శీల ఉద్యమాల్లో ముందుండే పత్రికా సంపాదకుడు. సుబహ్ – ఇ – ఆజాదీ, నక్ష్ – ఇ – ఫర్యాదీ, దస్త్ – ఇ – సలూ వీరి ప్రముఖ సంకలనాలు. స్వేచ్ఛా కవిత్వం గజల్ నజ్మ్ ప్రక్రియల్లో అందెవేసిన చేయి. ఆనాటి అందరు కవుల వలెనే ప్రేమ, అందం వీరి కవితా వస్తువులు. ఈ రెంటినీ సొగసుగా విషాదంతో సమ్మిశ్రితం చేస్తాడు.
వి.జి. కిర్నన్, నామి లజార్డ్, శివ్.కె. కుమార్, బరాన్ ఫరూఖీ ప్రభుతులు 5గురు ఇంగ్లీషులో అనువదించిన ఫైజ్ కవిత్వానికి తెలుగు అనుసృజన జలజం సత్యనారాయణ చేశారు. జలజం లోగడ ‘శిఖరం’ (వాజ్‌పాయి కవిత్వానికి తెలుగు అనువాదం) శృంగార బిల్హణీయం (కాశ్మీర కవి బిల్హణుడి కవిత్వానికి తెలుగు సేత) అను 2 అనువాద కవితా సంపుటులను ప్రకటించారు.
అనుకున్నదంతా వర్ణించటానికి వ్యక్తీకరించటానికి కుదరదు… మన ఆధీనంలో భావాల్ని ఉంచుకుని… కవిత్వం రాయలేం. అట్లా రాస్తే అది కవిత్వం కాకుండా పోతది’ (పే 20) అంటున్న జలజం సత్యనారాయణ ఈ అనుసృజన ఫైజ్ కవిత్వానికి ఒక గొప్ప నజరానా.
ఫైజ్ కవిత్వం తెలుగు అనుసృజన: జలజం సత్యనారాయణ ధ్వని ప్రచురణ వెల సాదా ప్రతి రూ. 200 బౌండ్ ప్రతి రూ. 250 కాపీలకు: ధ్వని ప్రచురణలు కవిజనాశ్రయం. మహబూబ్‌నగర్ ఫోన్: 984944494
