చిరు ధాన్యాలకు జై !

By: శ్యాంమోహన్‌

వికారాబాద్‌ జిల్లా, ఎక్‌మామిడి గ్రామంలో, రైతులు వెంకటయ్య, అలివేలు మంగలకు రెండేసి ఎకరాల పొలం ఉంది. భూగర్భజలాలు పుష్కలంగా ఉన్నప్పటికీ వరి పండిరచ కుండా కూరగాయలు, చిరుధాన్యాలు పండిస్తున్నారు. దానికి కారణం భూసారం కాపాడుకోవడం అని చెబుతారీ రైతులు. అయినప్పటికీ వారి కష్టానికి తగిన ఆదాయం లేక నిరాశకు లోనయ్యారు. ఆ సమయంలో ‘రీడ్‌’ స్వచ్ఛంద సంస్ధ సభ్యులు వారికి కొన్ని సూచనలు చేశారు. ఫలితంగా వారి సాగు లో కలిగిన మార్పును వెంకటయ్య ఇలా వివరించాడు.

‘‘నేను గతంలో కాకర, సోరకాయలను నేలపైన సాగుచేస్తే, ఎకరాకు 3 నుండి 5 టన్నుల కాయలు మాత్రమే వచ్చేవి. ఇపుడు పందిర్లు వేసుకొని వాటి మీద పండిస్తున్నాను. దీనివల్ల 9 నుండి 11 టన్నుల వరకు దిగుబడి పెరిగింది. బీర, టమాటా, బంతి, చామంతి కూడా పండిస్తున్నాం. ఆదాయం పెరగడంతో మాతో పాటు నలుగురు కూలీలకు పని దొరికింది.’’

ఇది వెంకటయ్య అనుభవమే కాదు ఆ గ్రామంలో చాలా మంది రైతన్నలు వెంకటయ్యను అనుసరిస్తున్నారు. వికారాబాద్‌ జిల్లాలో వ్యవసాయం వర్షాధారమైనది. వరి పండిరచే రైతులకు కష్టానికి తగిన ఆదాయం రాక అప్పుల పాలవుతున్నారు.

ఈ నేపథ్యంలో కొత్త ఆలోచనలతో, నూతన సాగుపద్ధతుల ద్వారా మెరుగైన దిగుబడులు సాధించే దిశగా ఈ రైతులు అడుగులు వేస్తున్నారు.

వికారాబాద్‌ జిల్లా, నవాబ్‌ పేట్‌ మండలం, ఎక్‌మామిడిలో వర్షపాతం చాలా తక్కువ. తీవ్రమైన నీటి ఎద్దడిని రైతులు ఎదుర్కొంటూ, పంటల సాగులో నష్టపోయారు. దీనికి పరిష్కారం దిశగా, రీడ్‌ సంస్థ ఆధ్వర్యంలో నాబార్డ్‌, వాతావరణ పరిస్థితులకు అనువుగా వ్యవసాయం అనే పథకం అమలు చేసింది. ఇక్కడ 50 మంది రైతులను ఎంపిక చేసి, వరి సాగును తగ్గించి, ఇతర పంటల మీద అవగాహన కలిగించి, ఆధునిక పద్ధతిలో పందిరి కూరగాయలు, చిరుధాన్యాల సాగుతో అధిక దిగుబడి సాధించడానికి శిక్షణనిచ్చారు. వీరిలో విజయవంతంగా సాగు చేస్తున్న అలివేలు, వెంకటయ్యలు కూడా ఉన్నారు.

వాతావరణ మార్పులకు అనువుగా రైతులకు నష్టాలు రాకుండా దిగుబడి పెంచడమే ఈ కార్యక్రమం ఉద్దేశం. రైతులకు ఉద్యాన నిపుణులతో శిక్షణ ఇప్పించి, సేంద్రియ సాగు పై అవగాహన కల్గించారు. ప్రతి రైతు 10 గుంటల భూమిలో పందిరి కూరగాయలు, మిగతా భూమిలో టమాటా, మిర్చి, వంకాయ, బెండకాయ మొదలైనవి సాగుచేస్తున్నారు. 9 అడుగుల రాతి స్తంభాలతో పందిర్లు వేయించారు. కూరగాయల విత్తనాలు, మల్చింగ్‌ షీట్స్‌, వర్మీ కంపోస్ట్‌, వేప పిండిని కూడా రైతులకు అందించారు. ఇపుడు ఈ రైతులు ఒకే రకం పంటలు కాకుండా పంట మార్పిడి పద్ధతిని అనుసరిస్తున్నారు. దీనివల్ల నేల సారం కోల్పోకుండా ఉంటుంది. బహుళ పంటలు సాగు చేస్తున్నారు. ఒక పంట దెబ్బతిన్నా మరో పంటలో లాభం పొందుతున్నారు. ఇలా ఎక్కువ దిగుబడి సాధించి, స్వయం సమృద్ధి సాధించిన రైతులు ఏమంటారంటే …

వరి నుండి కూరగాయల సాగు వైపు…
‘‘గతంలో వరి, జొన్నలు వేశాను కానీ తగిన ఆదాయం రాలేదు. ఇపుడు మాకు పందిర్లకు, మల్చింగ్‌కి రీడ్‌ సంస్థ సాయం చేసి, సాగులో సూచనలు చేశారు. పందిర్ల మీద సాగు వల్ల గతంలో కంటే ఎక్కువ దిగుబడి వచ్చింది. పంటలకు తెగులు రాకుండా వేస్ట్‌ డీకంపోజ్‌ వాడుతున్నాం. ఇంగువ ద్రావణం, ఆవు మూత్రం, పిడకల బూడిద కలిపిన విత్తనాలు నాటితే తెగులు రాకుండా ఉంటుందని సేంద్రియ సేద్యం శిక్షణలో మాకు వివరించారు. ఇపుడు సేంద్రియ పద్ధతిలో కూరగాయలు పండిస్తూ, పూల సాగు చేస్తున్నాను. నెలకు రూ.20 నుండి 25 వేల ఆదాయం వస్తున్నది, పదిమందికి పని కూడా కల్పిస్తున్నాను.’’ అన్నారు వెంకటయ్య.

మార్కెట్‌లో డిమాండ్‌
‘‘చిరుధాన్య పంటలు ఏవైనా, వాటితో పాటు కచ్చితంగా అంతరపంటలు కూడా వేసుకోవాలి. ఆరికలో అంతర పంటలుగా కంది, జొన్న, అలసందలు సాగు చేసుకుంటే అదనపు ఆదాయం వస్తుంది. బహుళ పంటలు పండిరచడం వల్ల ఒక పంటలో నష్టం వచ్చినా మరో పంటలో లాభం వస్తుంది. విత్తనం నుండి ఎరువుల వరకు మేమే తయారు చేసుకుంటాం. దిగుబడి బాగుంది. గత నాలుగేళ్లుగా చిరుధాన్యాలు పండిస్తున్నాం. ఇప్పటి వరకు నష్టం అనేది రాలేదు.’’ అని అన్నారు పొలం పనులు చేస్తున్న అలివేలు. ఆమె భర్త శ్రీనివాస్‌ పంట దిగుబడులను స్థానిక మార్కెట్‌కి తరలించి దళారుల మీద ఆధారపడకుండా లాభాలు పొందుతున్నాడు.

15టన్నులకు పైగా దిగుబడి…
‘పందిర్ల పై తీగలు చిక్కగా అల్లుకుని నీడ ఏర్పడటం వల్ల, కలుపు పెరగలేదు. దీనివల్ల సాగు ఖర్చు తగ్గింది. నేల మీద కాకర పంట 120 రోజుల్లో పూర్తయితే.. అదే పందిరిపై ఆరు నెలల పంట కాలం ఉంటుంది. నేల పైన సాగు చేస్తే, ఎకరాకు 5 నుంచి 8 టన్నుల దిగుబడి వస్తే… పందిరిపై 15టన్నులకు పైగా దిగుబడి వస్తుంది. పండించే విధానంలో ఈ చిన్న మార్పు వల్ల బీర, కాకర, సోర ఇలా ప్రతి పంటలో అధిక దిగుబడి సాధ్యం అవుతోంది’ అన్నాడు వెంకటయ్య.

జల సంరక్షణతో…
‘‘ఒకపుడు తీవ్రమైన నీటి ఎద్దడి ఉన్న ప్రాంతం. వాటర్‌షెడ్‌ కార్యక్రమం ద్వారా, భూగర్భజలాలను పెంచాం. వరి పంటను తగ్గించి, నేల మీద కంటే పందిర్ల మీద తీగజాతి కాయగూరల సాగు, పూలు, చిరుధాన్యాల సాగుతో రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధిస్తున్నారు. అంతే కాక, నాణ్యమైన సేంద్రియ విధానంలో పండిరచడం వల్ల మార్కెట్లో గిట్టుబాటు ధరలు పొందుతూ, స్వయం సమృద్ధి సాధించారు’’ అన్నారు రీడ్‌ సంస్థ ప్రతినిధి నవీన్‌కుమార్‌.

ఇద్దరు రైతులు సాధించిన ఫలితాలు…

  1. గతంలో తీగజాతి కూరగాయలను నేల మీద సాగు చేయడం వల్ల గాలి, వెలుతురు సోకక, చీడ పీడల బెడద ఎక్కువై నాణ్యత లోపించేది. ఇపుడు పెండాల్స్‌ వల్ల ఆ సమస్యలు తగ్గి, నాణ్యమైన దిగుబడులు ఇవ్వడమే కాక రైతులకు శ్రమ,ఖర్చు తగ్గింది.
  2. పందిరిపై సాగు వల్ల పంట చిక్కగా అలుము కొని నీడ ఉండటం వల్ల, కలుపు పెరగదు. రైతులకు సాగు ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుంది.
  3. వరి కంటే చిరుధాన్యాల సాగు వల్ల ఎక్కువ ఆదాయం పొందుతున్నారు. మార్కెటింగ్‌ సమస్యలు లేవు.
  4. సజ్జలు, రాగులు, జొన్నలు వంటి బహుళ పంటలు పండిరచడం వల్ల నష్టాలు తగ్గాయి. గతంలో వరి వల్ల నష్టపోయిన వారు ఈ పద్ధతిని ఫాలో అవుతున్నారు.
  5. రసాయన ఎరువులకు స్వస్తి చెప్పి సేంద్రియ ఎరువులను, వాడుతూ, భూసారాన్ని కాపాడుతున్నారు. సాధారణ సాగుకు పందిరి కూరగాయల సాగు మధ్య గల తేడాను గ్రహించి, కూరగాయల ద్వారా వచ్చే ఆదాయంతో ఎక్కువ విస్తీర్ణంలో పందిరి కూరగాయల సాగు చేయడానికి రైతులు ఆసక్తిని కనబరుస్తున్నారు.
    బీడు భూముల్లో తక్కువ నీటితో ఎక్కువ ఆదాయం పొందడానికి, చిరుధాన్యాలు, కూరగాయల సాగుతో రైతులు ఆహార భద్రత, ఆర్థిక అభివృద్ధి సాధించి, సుస్థిర జీవనోపాధులు పొందుతున్నారు.