రైతుల కన్నీళ్ళు ఇంకెన్నాళ్ళు

By: వి.ప్రకాశ్‌ 

తెలంగాణలో రైతు రాజులా, ఏ రంది లేకుండా సంతోషంగా బ్రతకాలని ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రయత్నిస్తుంటే రైతుల చేతుల్లోని భూములను కార్పొరేట్‌ కంపెనీలకు ఎలా కట్ట బెట్టాలని, పంటలకు మద్దతు ధర ఇవ్వకుండా ఎలా తప్పించుకోవాలని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ఈ ప్రయత్నాల్లో భాగమే యాసంగిలో దొడ్డు వడ్లు కొనబొమనే కేంద్ర వ్యవసాయ మంత్రి ప్రకటన. 

3 నల్ల చట్టాల నేపథ్యం

గత సంవత్సరం సెప్టెంబర్‌ 27న మూడు వ్యవసాయ చట్టాలను రాష్ట్రపతి ఆమోదించారు. ఒక్కరోజు ముందే సెప్టెంబర్‌్‌ 26 న ఎన్డీఏ ప్రభుత్వం నుండి శిరోమణి అకాళీదళ్‌ పార్టీ తప్పుకుంది. నవంబర్‌ 25 న ఛల్లో ఢల్లీికి రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఆ మరునాడే ఢల్లీివైపు దూసుకొస్తున్న వేలాది రైతులపై ఢల్లీి పొలిమేరల్లో లాఠీ చార్జీ, భాష్పవాయు ప్రయోగాలు జరిపారు. ఏడాదిగా వేలాది రైతులు నిర్బంధాలనెదుర్కొంటూనే ఢల్లీి పొలిమేరల్లో 3 వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా తమ ఆందోళనను కొనసాగిస్తూ వచ్చారు. ఈ ఆందోళనల్లో దాదాపు ఏడు వందల మంది రైతులు మరణించారు. డిసెంబర్‌ 11న రైతు నాయకులు ఈ నల్లచట్టాలకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టును ఆశ్రయించగా జనవరి 12 న ఈ చట్టాల అమలును నిలిపి వేయాలని సుప్రీం కోర్టు ‘స్టే’ ఇస్తూ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.

కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ తన మంత్రివర్గ సహచరులతో, ఎం.ఎల్‌.ఏలు, ఎం.ఎల్‌.సి లు, స్థానిక సంస్థల ఛైర్మన్లు ఇతర ప్రజా ప్రతినిధులతో హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్‌ వద్ద 4 గంటల పాటు నవంబర్‌ 18న భారీ ధర్నా నిర్వహించారు. ‘‘మంత్రి పదవులు, కేంద్రమంత్రి పదవులు, ఎం.పి, ఎం.ఎల్‌.ఏ పదవులు ఎన్నిసార్లు తెలంగాణ కోసం పారేసినామో మీకు తెలుసు. అవసరం అనుకుంటే తెలంగాణ రాష్ట్ర సమితి భారత రైతాంగ సమస్యల కోసం తానే లీడర్‌ షిప్‌ తీసుకుంటుంది. ముందుకు పోతుంది. మీ మెడలు గ్యారంటీగా వంచుతది. మీ కుటిల నీతి, మీ దుర్మార్గమైన విధానాలు, మీ రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా చివరి రక్తపు బొట్టు దాకా పోరాటం చేస్తాం తప్ప మిమ్ములను వదిలిపెట్టం’’ అని కెసిఆర్‌ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

అవసరమైతే జాతీయ స్థాయిలో రైతు ఉద్యమానికి తానే నాయకత్వం వహిస్తానని కెసిఆర్‌ ప్రకటించడంతో ఆ మరునాడే ప్రధాని నరేంద్రమోడీ ఈ మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

ప్రధాని నరేంద్ర మోడీ రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలపై వెనక్కి తగ్గడానికి త్వరలో ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌ రాష్ట్రాల్లో జరిగే సాధారణ ఎన్నికలు కూడా మరో కారణం. ఈ రాష్ట్రాల్లో వచ్చే ఫలితాల ప్రభావం మరో రెండేళ్ళలో జరగనున్న పార్లమెంట్‌ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం వుంటుంది. ఇటీవల సుమారు 13 రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు బిజెపికి వ్యతిరేకంగా వచ్చాయి.

నవంబర్‌ 19న వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటాననే ప్రకటనను జాగ్రత్తగా పరిశీలిస్తే ఇది మోసపూరిత ఎత్తుగడే తప్ప నిజానికి ఈ రైతు వ్యతిరేక చట్టాలను శాశ్వత ప్రాతిపదికపై రద్దు చేసే యోచన నరేంద్ర మోడీకి లేదని స్పష్టమవుతుంది. ఆ ప్రకటనలో… ‘‘వ్యవసాయ చట్టాల ద్వారా రైతులకు కలిగే ప్రయోజనాల గురించి వారికి నచ్చచెప్పడంలో ప్రభుత్వం విఫలమైంది. ‘‘గురునానక్‌ జన్మదినమైన ఈరోజు రైతులపై నిందలు వేయడం సమంజసం కాద’’ని అన్నారు.

ఈ రైతు వ్యతిరేక చట్టాలనే రెండేళ్ళ తర్వాత కొన్ని సవరణలతో మరో రూపంలో తెచ్చే అవకాశం వుందని నరేంద్ర మోడీ ప్రకటన చెప్పకనే చెప్తున్నది. ప్రధాని రైతులకు చెప్పిన క్షమాపణలు ఎన్నికల ఎత్తుగడలో భాగమే. దీని వెనుక ఆర్‌ఎస్‌ఎస్‌ పాత్ర ఉంది.

ప్రధాని ప్రకటనపై స్పందించిన కెసిఆర్‌ ఇది రైతు ఉద్యమానికి లభించిన విజయంగా పేర్కొంటూ మద్దతు ధర కోసం ప్రత్యేక చట్టం తేవాలని, గత ఏడాది కాలంలో ఉద్యమంలో మరణించిన సుమారు 700 మంది రైతులకు ఒక్కోకుటుంబానికి 25 లక్షలు పరిహారం చెల్లించాలని ప్రధానిని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున ఒక్కో కుటుంబానికి రూ. 3 లక్షలు పరిహారం చెల్లిస్తానని ప్రకటించారు.

ప్రధాని ప్రకటన పై భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బికెయు) నేత రాకేష్‌ టికాయత్‌ స్పందించారు. ‘‘ఆందోళనను ఇప్పటికిప్పుడే విరమించబోము. చట్టాల రద్దు పై పార్లమెంట్‌లో రాజ్యాంగ ప్రక్రియ పూర్తయ్యే రోజు కోసం ఎదిరి చూస్తాం. ప్రధాని ఏకపక్షంగా చట్టాల ఉపసంహరణ ప్రకటన చేశారు. కనీస మద్దతు ధర, ఇతర రైతాంగ సమస్యల పైనా కేంద్ర ప్రభుత్వం రైతులతో చర్చించాల్సి వుంది. ఆందోళన చేస్తున్న రైతులు ఇప్పుడే ఇండ్లకు వెళ్ళరు’’ అని రాకేష్‌ టికాయత్‌ స్పష్టం చేశారు. 

వడ్లు కొంటారా, కొనరా? కేంద్రాన్ని ప్రశ్నించిన సిఎం కెసిఆర్‌

రాష్ట్ర ఆవిర్భావం నాటికి తెలంగాణలో వానాకాలం (ఖరీఫ్‌), యాసంగి (రబీ) కలిపి సుమారు 50 లక్షల ఎకరాల్లో వరి పంట పండిరచగా 2021 నాటికి ఇది రెట్టింపై కోటి ఎకరాలు దాటింది. స్వరాష్ట్రంలో స్వయం పాలన ఫలితమిది. తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమ సారథి కె.సి.ఆర్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వ్యవసాయం – సాగునీరు – విద్యుచ్ఛక్తి రంగాలకు అధిక ప్రాధాన్యత నిచ్చి అహర్నిశలు కష్టపడ్డారు.

ఈ రంగాల అభివృద్ధికి అవసరమైన వేల కోట్ల రూపాయలను, వనరులను వివిధ ఆర్థిక సంస్థల నుండి సేకరించి ఖర్చు పెట్టారు. రాష్ట్ర బడ్జెట్‌ నుండి వేలకోట్ల రూపాయలను, రైతుల రుణమాఫీ, రైతు బంధు, రైతు బీమా, రైతు వేదికల నిర్మాణానికి ఖర్చు పెట్టారు. సమైక్య రాష్ట్రంలో ‘దండుగ’ అన్న వ్యవసాయమే నేడు ‘పండుగ’ అయ్యింది. మిషన్‌ కాకతీయ ప్రాజెక్టులో భాగంగా గొలుసు చెరువుల పునరుద్ధరణ జరిగింది. వీటిలో పూడిక తీయడంతో భూగర్భ జలాలు పెరిగాయి. కాళేశ్వరం,  దేవాదుల ఎత్తిపోతలు, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌ సాగర్‌ ప్రాజెక్టులను పూర్తి చేసి సాగునీరందించడంతో ఖరీఫ్‌, రబీల్లో కలిపి సుమారు కోటి ఎకరాల్లో రైతులు వరి పంట పండిస్తున్నారు. తెలంగాణలో యాసంగిలో కేవలం దొడ్డు వడ్లు పండిస్తారు. వానాకాలం సన్న వడ్లు , దొడ్డు వడ్లు కూడా పండిస్తారు. ఈ వడ్లను రైతుల నుండి రాష్ట్ర ప్రభుత్వం సేకరించి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఫుడ్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు అమ్ముతుంది. తెలంగాణ నుంచి యాసంగి వరిధాన్యం గతంలో తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు సుమారు 25 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు మనరాష్ట్రం నుండి ఎగుమతయ్యేవి. ఆ రాష్ట్రాలు ఉప్పుడు బియ్యం (బాయిల్డ్‌ రైస్‌) వినియోగిస్తాయి. ఎఫ్‌.సి.ఐ తెలంగాణలో కొన్న బియ్యాన్ని ఈ రాష్ట్రాలకు ఎగుమతి చేసేది. కానీ కొన్నేళ్ళుగా తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో వరి ధాన్యం ఉత్పత్తి బాగా పెరిగింది. వారు పండిరచే వరిధాన్యమే ఆయా రాష్ట్రాల ప్రజల అవసరాలకు సరిపోతున్నది. దీంతో తెలంగాణ, ఇతర రాష్ట్రాల నుండి ఎఫ్‌.సి.ఐ సేకరిస్తున్న ధాన్యాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సి ఉంది. తమ దగ్గర వరి ధాన్యపు నిల్వలు రాబోయే నాలుగైదేళ్ళకు సరిపడే విధంగా పేరుకు పోయినాయని కేంద్రం చెప్తున్నది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది.

దేశంలోని ఏ రాష్ట్రంలో ఏ పంటలు పండిస్తున్నారో, ఎంత ధాన్యం పండే అవకాశం ఉన్నదో ఏడాదికి ముందే కేంద్ర వ్యవసాయ శాఖ అంచనా వేస్తుంది. ఏడాది తర్వాత వచ్చే ధాన్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఎఫ్‌.సి.ఐలో పేరుకున్న ధాన్యపు నిల్వ లను (అవసరం మేరకు నిల్వ ఉంచి) విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేయాల్సింది, లేదా వరి ధాన్యం, బియ్యంను విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చి మన దేశపు లేదా విదేశీ మార్కెట్లలో అమ్మడానికి ఏర్పాటు చేయాలి. ఇతర దేశాలకు ఈ దేశంలో పండిన ధాన్యాన్ని, ఇతర ఉత్పత్తులను ఎగుమతి చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ అధికారాలు లేవు. ఉద్దేశ్య పూర్వకంగానే కేంద ప్రభుత్వం, ఈ దేశపు రైతులను నిర్లక్ష్యం చేస్తున్నది. వ్యవసాయ భూముల్లో సుమారు 85శాతం ఐదెకరాలలోపు కమతాలే, చిన్న రైతులే. ఎరువులపై సబ్సిడీ, మద్దతు ధరనివ్వడం, రైతుల సంక్షేమానికి చేసే ఖర్చు అన్నీ కలిపి కొన్ని లక్షల కోట్లు ప్రతి ఏటా ప్రభుత్వాలు ఖర్చు చేస్తున్నాయి. ఈ బాధ్యత నుండి కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాలను తప్పించ డానికి సాగునీటి ప్రాజెక్టులను, వ్యవసాయ భూములను కార్పొరేట్‌ కంపెనీలకప్పగిస్తే లక్షల కోట్లు ఆదా అవుతాయనే ప్రధాని మోడీ ఆలోచనలో భాగమే కేంద్రం ప్రవేశపెడుతున్న నీటి బిల్లులు, చేసిన వ్యవసాయ చట్టాలు. 

విదేశాలకు బియ్యాన్ని ఎగుమతి చేస్తున్న దేశాల్లో అగ్ర స్థానం భారత దేశానిదే. 2020-21లో మనదేశం 15.5 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల (ఒక కోటి యాభై లక్షల మెట్రిక్‌ టన్నులు) బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేయగా రెండో స్థానంలో (64 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం ఎగుమతి, వియత్నాం, మూడోస్థానంలో (62 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం ఎగుమతి) థాయిలాండ్‌ దేశాలున్నాయి. బ్రెజిల్‌లో మిగులు వరిధాన్యం నుండి ఇథనాల్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. బియ్యంలో స్టార్చ్‌ అధికంగా ఉండడంతో ఇథనాల్‌ ఉత్పత్తి సాధ్యమవు తుంది. ఇలాంటి వాటిపై పరిశోధనలు చేస్తూ ఈ దేశంలో పండే ధాన్యాన్నుండి విలువ ఆధారిత ఉత్పత్తులు తీయవచ్చు. వాటిని విదేశాలకు కూడా ఎగుమతి చేయవచ్చు. 

మనదేశం పామ్‌ ఆయిల్‌ను గత ఆర్థిక సంవత్సరం 83.21 లక్షల మెట్రిక్‌ టన్నులు దిగుమతి చేసుకున్నది. నూనె ఉత్పత్తుల దిగుమతుల్లో 65శాతం పామ్‌ ఆయిల్‌ దే. 28.66 లక్షల మెట్రిక్‌ టన్నుల సోయాబీన్‌ నూనెను, 18.94 లక్షల మెట్రిక్‌ టన్నుల సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ను విదేశాల నుండి 2020-21లో మన దేశం దిగుమతి చేసుకున్నది. ఈ దిగుమతులపై లక్షా పదిహేడు వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేసింది. సోయాబీన్‌, సన్‌ఫ్లవర్‌ పంటలను దేశంలో విరివిగా పండిరచవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం గత మూడు నాలుగేళ్ళుగా ఆయిల్‌ పామ్‌ సాగుకై ప్రోత్సాహాన్నిస్తున్నది. ఈ విషయంలో కేంద్రం తగిన సహకారాన్ని అందించడం లేదు. నూనెలను దిగుమతి చేసుకొనే దుస్థితి ఈ దేశానికి దాపురించడానికి కారణం మోడీ ప్రభుత్వానికి చిత్త శుద్ధి, రైతులపై ప్రేమ లేకపోవడమే.

తెలంగాణలో ఖరీఫ్‌ సీజన్‌ పూర్తయ్యింది. వడ్లు ప్రతి ఊళ్ళో రాశులుగా కుప్పలు పోసి రైతులు, కొనే వారికోసం ఎదురు చూస్తున్నారు. వానాకాలం ధాన్యం ఉత్పత్తుల్లో ఎంత మేరకు కొంటుందో ఎఫ్‌.సి.ఐ గానీ, కేంద్ర మంత్రి గాని స్పష్టం చేయడం లేదు. రాబోయే యాసంగిలో దొడ్డు వడ్లు కొనేది లేదని 23 నవంబర్‌ న ఢల్లీిలో తనను కలిసిన తెలంగాణ మంత్రులు, ఎం.పి లతో వ్యవసాయ మంత్రి తోమర్‌, పౌరసరఫరాల మంత్రి పీయూష్‌ గోయల్‌ స్పష్టం చేశారు. ఇతర ధాన్యం ఎంత కొంటారో అని చెప్పడం లేదు . మరో పక్క రాష్ట్ర బిజెపి నేతలు కళ్ళాల్లోని రైతుల దగ్గరికి పోతూ ‘‘వరి పంటే పండిరచాల’’ని ప్రోత్సహిస్తున్నారు. ఇదేమిటని కేంద్ర మంత్రిని ప్రశ్నిస్తే ‘‘మా పార్టీ అధ్యక్షుడు అలా మాట్లాడడం తప్పే’’నని ఒప్పుకున్నాడు. కానీ తమ పార్టీ నేతలను కట్టడి చేయడం లేదు.

తెలంగాణతో బాటు దేశ వ్యాప్త రైతాంగపు దుస్థితికి నరేంద్ర మోడీ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలే కారణం. భేషజాలకు పోకుండా ప్రధాని ముఖ్యమంత్రులతో, కెసిఆర్‌తో చర్చించి రైతులను ఆర్థిక ఇబ్బందుల నుండి శాశ్వతంగా విముక్తులను చేయాలి.

ఇవేమీ చేయకుండా రైతాంగ వ్యతిరేక విధానాలనే నరేంద్ర మోడీ ప్రభుత్వం కొనసాగిస్తే జాతీయ స్థాయిలో రైతు ఉద్యమానికి కెసిఆర్‌ నాయకత్వం వహించాల్సి వస్తుంది.

రానున్న రోజుల్లో తప్పకుండా దేశం కోసం కూడా పోరాటం చేస్తాం. ఈ దేశం ఎటుపోతా ఉన్నదో, ఏం జరుగుతా ఉన్నదో చెప్పాల్సిన బాధ్యత నాపై  ఉన్నది. దేశంలో నాలుగు లక్షల మెగావాట్ల కరెంటు అందుబాటులో ఉంటే… ఏ రోజు కూడా 2 లక్షల మెగావాట్లకు మించి వాడుకోవడం లేదు. మన రాష్ట్రాన్ని పక్కన పెడితే ఏ ఒక్క రాష్ట్రంలోనూ 24 గంటలు కరెంటు ఇవ్వడం లేదు. రైతులకు ఇవ్వరు. పరిశ్రమలకు ఇవ్వరు.. కమర్షియల్‌కి ఇవ్వరు…  దేనికీ ఇవ్వరు. దీనికి కారణం ఎవరు? ఎవరి చేతకానితనం? ఎవరి అసమర్ధత? ఎవరి విధానాల ఫలితం? ` 18, నవంబర్‌, మహాధర్నా, ఇందిరాపార్కు.

దేశంలో కోట్ల మంది రైతులున్నారు. 40 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. ప్రకృతి ప్రసాదించిన జీవనదులున్నాయి. అద్భుతమైన సైంటిస్టులు 

ఉన్నారు. 65 వేల టీఎంసీల నీళ్లు ఉన్నాయి. దేశంలోని సగం జనాభా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నది. అయినా భారత్‌ ఆకలిరాజ్యంగా మిగిలిపోతున్నది. వ్యవసాయాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? కేంద్రం పాలసీ ఏమిటి? ` 18, నవంబర్‌, మహాధర్నా, ఇందిరాపార్కు.

ఆకలి కేకలు.. సిగ్గు చేటు

గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ లోని 116 దేశాల్లో భారత్‌ స్థానం 101 ఉండటం సిగ్గుచేటు. పొరుగున ఉన్న – బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ కంటే కిందిస్థాయిలో ఉన్నం. దేశాన్ని పాలించిన పార్టీల వైఫల్యమే దీనికి కారణం. దేశంలో కోట్ల మంది రైతులున్నరు. 40 కోట్ల ఎకరాల వ్యవసాయ భూములున్నయి. ప్రకృతి ప్రసాదించిన జీవ నదులున్నయి. అద్భుతమైన సైంటిస్టులు ఉన్నరు. అయిప్పటికీ భారత్‌ ఆకలి రాజ్యంగా మిగిలిపోతున్నది. వ్యవసాయ రంగాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నరు? ఎవరి కోసం నిర్లక్ష్యం చేస్తున్నరు? అసలు కేంద్రం పాలసీ ఏమిటి? రైతులను బతకనిస్తరా? లేదా?

  • కెసిఆర్‌

నాటి నుంచి నేటిదాకా రైతు వెంటే.. రైతు ప్రేమే

ఈ గోలుగుండం గాళ్లకు, కరెంటు ఉన్నా వాడలేని అసమర్థులకు, దేశంలో నీళ్లున్నా ఇవ్వలేని అసమర్థులకు చరమగీతం పాడితేనే ఈ దేశానికి నిష్కృతి లభిస్తుంది. కచ్చితంగా జెండా లేవాల్సిందే, దేశ వ్యాప్తంగా ఉద్యమం రగలాల్సిందే. దీనికి తెలంగాణ నాయకత్వం వహించాల్సిందే. మరో పోరాటానికి తెలంగాణ సిద్ధం కావాల్సిందే.

నవంబర్‌ 18, మహాధర్నా…

సన్న వడ్లకు మద్దతు ధరకన్నా నూరో, యాభయ్యో ఎక్కువ ఇద్దామంటే కూడా కేంద్రం ఇయ్యనియ్యడం లేదు. ఒకవేళ ఎక్కువ ధర ఇస్తే మొత్తం వడ్లనే కొనడం బంద్‌ చేస్తామని చెప్పింది. ఎఫ్‌సిఐ దీనిపై రాష్ట్రానికి లేఖ రాసింది. కొన్ని దేశాలు రైతులకు సబ్సిడీలిస్తాయి. కానీ మన దేశంలో అవి కూడా లేవు. రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తానంటే కూడా కేంద్రం ఇవ్వనివ్వదు.

` అక్టోబరు 31, 2020, జనగామ జిల్లా కొడకండ్లలో రైతువేదిక ప్రారంభం సందర్భంగా…

రాష్ట్ర ప్రభుత్వాల మీద కేంద్రం ఎన్నో ఒత్తిళ్లు పెడుతున్నది. ప్రతి బాయికాడ కరెంటు మీటరు పెట్టాలని అంటున్నరు. వద్దని నేనే రెండేండ్ల నుంచి పోరాడుతున్న. రాష్ట్రానికి వచ్చే రుణాలను బంద్‌ చేస్తామని బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నరు. ఓపిక పట్టినం. ఇకపై కచ్చితంగా కేంద్రం ఎంబడి పడుతం. రైతులను మేము కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నం. మీ చిల్లర రాజకీయాల కోసం వాళ్ల బతుకులను ఆగం చేస్తమంటే ఒప్పుకోం. 

` నవంబర్‌ 8, 2021, 

ప్రగతి భవన్‌లో మీడియాతో…

ఈ దేశానికి ప్రకృతి ఇచ్చిన సంపద 65 వేల టీఎంసీల నీళ్ళు ఉన్నాయి. కానీ ఇందులో దేశం మొత్తం వాడుకొనేది 35వేల నుంచి 36వేల టీఎంసీలు కూడా లేవు. ఇంకో 30 టిఎంసీలు సముద్రం పాలవుతున్నాయి. చాట్లతవుడు పెట్టి కుక్కలకు కొట్లాట పెట్టినట్టు.. రాష్ట్రాల మధ్య తగవులు పెట్టి నీళ్ళు ఇవ్వకుండా మొత్తం దేశాన్ని, రైతాంగాన్ని అల్లల్లాడిస్తున్నారు. దేశంలో ఉండే వ్యవసాయ భూమి మొత్తం 40 కోట్ల ఎకరాలు. ప్రతి ఎకరానికి నీళ్లు ఇచ్చినా ఇంకా 25 వేల టీఎంసీలు మిగిలే ఉంటాయి. ఇది చేసే తెలివితేటలు లేవు. దీనికి పరిష్కార మార్గాలు చూపే సంస్కృతి, ఆలోచన, ఆ మేధావితనం కేంద్రానికి లేదు.

` 18 నవంబర్‌, మహాధర్నా, ఇందిరా పార్కు.