ప్రాణదాతలకు సత్కారం

విధి­ నిర్వహణలో అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ ఆపదలో ఉన్నవారికి ప్రాణాలకు తెగించి, ప్రాణదానం చేసిన ఇద్దరు కానిస్టేబుళ్ళ అంకితభావం ఇది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ ఫారూఖ్‌ హుస్సేన్‌ సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు వెళ్ళి సదరు కానిస్టేబుళ్ళను ఘనంగా సత్కరించి శాలువాలు, నగదు పురస్కారాలు అందజేశారు.

మన్మాడ్‌ వెళ్ళే రైలు కదులుతుండగా ఒక మహిళ హడావుడిగా రైలెక్కబోతూ ప్రమాదవశాత్తు జారిపడబోయింది. ఈ పరిణామాన్ని గ్రహించిన దినేష్‌ సింగ్‌ అనే ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌, రెప్పపాటులో ఆ మహిళను పట్టుకుని ప్లాట్‌ఫారమ్‌ పైకి లాగి ఆమె ప్రాణాలు కాపాడాడు.

అదేవిధంగా నర్సాపూర్‌ వెళ్ళే రైలు కదులుతుండగా ఎక్కబోతూ ప్రమాదవశాత్తూ కాలుజారిపడబోయిన ఓ ప్రయాణీకుడిని జీఆర్‌పికి చెందిన డేవిడ్‌ రాజ్‌ అనే కానిస్టేబుల్‌ కాపాడి ప్రాణదానం చేశాడు. ఈ రెండు ఘటనల్లో రెప్పపాటులో ప్రాణాలకు సైతం తెగించి ప్రయాణీకులను కాపాడిన, దినేశ్‌ సింగ్‌, డేవిడ్‌ రాజ్‌ల సేవలకు సముచితంగా సత్కారం లభించింది.

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లోని సిసి కెమెరాల కార్యాలయంలో ఎమ్మెల్సీ ఫారూఖ్‌ హుస్సేన్‌ మాట్లాడుతూ, ప్రాణాలకు తెగించిన ప్రాణదాతలైన ఆ ఇద్దరు కానిస్టేబుళ్ళను సత్కరించి, ప్రోత్సహించడం మన కర్తవ్యమని అన్నారు. ఈ రకమైన సంస్కారాన్ని సత్కరించడం ద్వారా వారి నుంచి మరి ఎంతో మంది స్ఫూర్తి పొందుతారని ఆయన అభిప్రాయపడ్డారు. అవయవ మార్పిడి శస్త్ర చికిత్స కోసం క్షణాల్లో గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటు చేసి, సకాలంలో ఆపరేషన్‌లు జరిపించేలా పోలీసు సిబ్బంది కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారని ఫారూఖ్‌ హుసేన్‌ ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ డైరెక్టర్‌ జయరామ్‌, ఆర్పీఎఫ్‌, జీఆర్పీ ఇనస్పెక్టర్లు బెనయ్య, శ్రీనివాస్‌, మోండా డివిజన్‌ టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు ఆకుల హరికృష్ణ పాల్గొన్నారు.