ఈ నెల పండగల గలగల 

  • By డా॥ అట్టెం దత్తయ్య

పండుగలు పబ్బాలంటే మానవాళికి ఎంతో సంతోషం. ఆబాలగోపాలం వాటినెంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. శ్రీరామనవమి నుంచి శివరాత్రి వరకూ సంవత్సరం పొడుగునా పండుగలే. పండుగ అనగానే బంధుమిత్రాదులు కలుసుకుని విందులు, వినోదాలతో కాలక్షేపం చేయటమనే మన భావన. పైకి కనిపించే వ్యవహారం ఇదే అయినా ఆంతర్యంలో చాలా విశేషముంటుంది. ప్రతి పండుగ ఏదో ఒక దేవతకు సంబంధించే ఉంటుంది. దేవతలంటే వారు అమర్త్యులు. మనుషులు జన్మమృత్యు జరా వ్యాధులతో నిత్యం సతమతమయ్యే మర్త్యులు. వీటన్నిటినుండి తప్పించుకోవాలంటే అవేవీ లేని దేవతా మూర్తులను ఆరాధించాలి. యద్భావం తద్భవతి అన్నారు. దేనిని ఆరాధిస్తే దానితో తాదాత్మ్యం సిద్ధిస్తుంది. దేవతలను ఆరాధించడం వల్ల వారిలోని దివ్యగుణాలు మనిషిలో చోటు చేసుకుంటాయి. అదే మానవ జీవితానికి పరిపూర్ణత. ఇదే పండుగలలో ఉన్న పరమార్థం, పండగల వెనకున్న అంతరార్థం.

ఈ ఆగస్టు అంతా ప్రత్యేక పర్వదినాల నెల. విశేషించి శ్రావణ శుద్ధ చవితి నుంచి భాద్రపద శుద్ధ చవితివరకు ఉన్న రోజులన్నీ పవిత్రంగా భావించేవే. శ్రావణంలో సోమ, మంగళ, శుక్ర, శని వారాలు మాత్రం మాసాంత వ్రతాలు, నోములు, దీక్షలు మొదలగు పేర్లతో ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఈ నెలలోనే కులమతాలకతీతమైన జాతీయ పండుగ ‘స్వాతంత్య్ర దినోత్సవం’ కూడా ఉంది.. 

మరి ఈ నెలలో మనమందరం ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగలను గూర్చి స్థూలంగా తెలుసుకుందాం. 

నాగుల పంచమి  (ఆగస్టు 1)

శ్రావణశుద్ధ పంచమి సర్పపూజకు ఉచ్ఛిష్టమైంది. భారతీయులకు తరతరాలుగా నాగపూజ ఆచారంగా వస్తుంది. మట్టితో తయారు చేసిన పాము, లేదా గోడమీద పసుపుతో కాని, మంచి గంధంతో కాని పాము చిత్రాన్ని వేసుకుని పూజిస్తారు.  ఈ మధ్యకాలంలో ఎక్కువగా పుట్టల దగ్గరకు వెళ్ళి పాలుపోసి, పూజిస్తున్నారు. ఈ పంచమి రోజు నాగులను పూజించి, గోధుమలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. పగలంతా ఉపవాసం ఉండి, రాత్రికి ఆహారం తీసుకుంటారు. నాగ పంచమి రోజున నాగులను పూజించినవారికి విష బాధలు ఉండవు. పవిత్రమైన ఈ రోజున సర్పస్తోత్రాన్ని పారాయణం చేసిన వారికి ఇంద్రియాల వల్ల ఏర్పడే రోగాలు బాధించవు. సంతానం లేని దంపతులు నాగపూజ చేస్తే వంశాభివృద్ధి, కార్యసిద్ధి కలుగుతుంది. కాలసర్ప, నాగదోషాలు తొలగిపోతాయి అని విశ్వసిస్తారు. 

వరలక్ష్మీ వ్రతం (ఆగస్టు 5)

ప్రతీ సంవత్సరం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో స్త్రీలు జరుపుకుంటారు. శ్రావణమాసమే సౌభాగ్య మాసం. అమ్మవారికి ప్రీతికరమైన మాసం అందులోను శుక్రవారాలు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించే వరలక్ష్మీ వ్రతం వల్ల స్త్రీలకు దీర్ఘ సుమంగళత్వం, సౌభాగ్యం, ఆరోగ్యం సిద్ధిస్తాయి. సాధారణంగా పెళ్లి అయిన సంవత్సరం నుండే ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. తెలుగు ప్రాంతాల్లో ఉన్న స్త్రీలు తమ పసుపు కుంకుమలు భద్రంగా ఉండాలని, కుటుంబసభ్యులందరూ సుఖంగా ఉండాలని ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.

మొహర్రం (ఆగస్టు 9)

మొహర్రం పండుగ ప్రత్యేకించి మన రాష్ట్ర గ్రామీణ ప్రాంతాలలో హిందూ ముస్లింలు ఐక్యతతో జరుపుకునే పండగ. దీనిని గురించి పల్లీయులు వీరగాథలు చెప్పుకుంటారు. హస్సెన్‌, హుస్సెన్‌ అనే ముస్లిం పేర్లను వీరి పాటల్లో, మాటల్లో ఆశన్న, హూశన్నగా మార్చి పాడుకుంటారు. ఈ పండుగకు పీరులు పేర్లతో తయారు చేయించిన లోహ ప్రతిమలను కొన్ని రోజులు శుభ్రం చేసిన చావడిలో నిలబెడ్తారు. వాటిని ప్రతినిత్యం ముస్లిం పద్ధతిలో ఊదు ఇత్యాదులను వెలిగించి పూజిస్తారు. హిందువులు ఆ పీర్లకు కుడకలు, బెల్లం నైవేద్యంగా సమర్పించి పంచుతారు. నిలబెట్టినన్ని రోజులు గ్రామీణులందరు కలిసి సాయంత్రం వారి వీరత్వాన్ని గుర్తు చేసే దులా పాటలు పాడుకుంటూ, ఆడుకుంటారు. కొన్ని ప్రాంతాలలో దూదితో చేసిన చాలా పొడవైన పీర్లను తయారు చేసి నిలబెడతారు. వీటిని లేపిన రోజునే మొహర్రం అంటారు. ఆ రోజు సాయంత్రం పూట ఆ వీరులను ఆవాహించుకుని సిగం ఊగుతూ ఊరేగిస్తారు. ఆటపాటల అనంతరం చెరువుకు వెళ్ళి నిమజ్జనం చేస్తారు. ఈ రోజు చేసే మలీద రొట్టెల ప్రసాదం ప్రత్యేకం. ఇది హిందూముస్లింల ఐక్యతను చాటే పండుగ సర్వమత సమానత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. 

రాఖీ పౌర్ణమి (ఆగస్టు 12)

శ్రావణమాస పూర్ణిమ చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉండే రోజు ఇది. దీనిని సోదర సోదరీమణుల అనురాగ బంధానికి ప్రతీక అయిన ‘రాఖీ పండగ’గా జరుపుకుంటాం. ఇది ఒకరికొకరు రక్ష అని దీక్ష పూనే పర్వదినం. ఈ పండుగ కుటుంబ సఖ్యతకు, సమాజ ఐక్యతకు ఎంతగానో సహకరిస్తుంది. ఎందుకంటే ‘నేను నీకు రక్ష, నువ్వు నాకు రక్ష, మనం దేశానికి రక్ష’ అని ప్రతిజ్ఞచేసే ఆచారం కూడా కొన్ని ప్రాంతాలలో ఉంది. పురాణోక్తం ప్రకారం ఒకనాడు శ్రీకృష్ణుడి చేతికి ఏర్పడ్డ గాయానికి ద్రౌపది చీరకొంగును చింపి కట్టు కట్టిందట. ఆ కట్టు రానురాను రక్షాబంధంగా మారిందని  చెప్తారు. రెండవది జంధ్యాన్ని ధరించే వారందరు ఈ రోజున కొత్త జంధ్యాన్ని మార్చుకుంటారు. ఇది అన్ని రకాలుగా అందరి పండగ. 

 శ్రీకృష్ణాష్టమి (ఆగస్టు 17)

శ్రావణ మాసం బహుళాష్టమినాడు శ్రీకృష్ణ జన్మాష్టమిగా జరుపుకుంటాం. ఈ పండుగ గృహాల్లో జరపుకోవడం కంటే సాయం సమయాల్లో దేవాలయ ప్రాంగణాల్లోనో, బహిరంగ ప్రదేశాల్లోనో నిర్వహిస్తారు. అధికశాతం పెరుగు / వెన్నకుండ ఉన్న ఉట్టి కట్టి, ఆ ఉట్టిని కొట్టే కార్యక్రమం ఆట రూపంలో జరుపుకుంటారు. శ్రీకృష్ణుడు ఎన్నో లీలలు, మహిమలు చూపించినప్పటికి ఈ పండుగనాడు ఆయన బాల్యాన్ని దృష్టిలో పెట్టుకుని చిన్ని కృష్ణుడి వేషధారణలో పాలు, పెరుగు, వెన్నలతో అనుబంధంగా ఉన్న అలంకరణలు, ఆటలు మొదలగునవి జరుపుతారు. ఈ పండుగ కూడా సమాజానికి ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఈ గోకులాష్టమి రోజున కొన్ని ప్రాంతాలలో చేసే ప్రసాదాన్ని ‘కాయం’ అంటారు. ఇది వర్షకాలంలో వచ్చే పండుగ. వర్షాలతో ప్రజలకు జలుబు, దగ్గువంటి అనారోగ్యాలు వచ్చే అవకాశం ఎక్కువ. వాటికి విరుగుడే ఈ కాయం ప్రసాదం. దీనిని మిరియాలు, లవంగాలు, యాలకులు, ధనియాలు, వాము, జీలకర్ర మొదలగు పదార్థాలతో దంచి పొడిచేసి పాతబెల్లంతో కలిపి కొంత నెయ్యిపోసి చిన్న చిన్న ఉండలుగా చేస్తారు. అది తినడం వల్ల ఈ కాలంలో వచ్చే వ్యాధులను అరికట్టవచ్చు. ఆరోగ్యకరం కూడ.

పోలాల అమావాస్య (ఆగస్టు 27)

శ్రావణ అమావాస్యను తెలుగు ప్రాంతాలలో పోలాల అమావాస్య అని అంటారు. ఈ అమావాస్యను మన భారతదేశంలో వేరు వేరు ప్రాంతాలలో వేరు వేరు పేర్లతో పిలుస్తారు. పంచాంగాలలో పోలాంబవ్రతం చెప్పబడింది. వాడుకలో రానురాను పోలాంబ పోలెమ్మ/పోలేరమ్మగా మారింది. కాని ఈ పదం మరో అర్థాన్ని కూడా అందిస్తుంది. ‘పోల’ అంటే కడుపునిండా తింటూ తిరుగుతున్న ఎద్దు. అంటే ఎద్దులను బాగా మేపుతున్న అమావాస్యగా చెప్తారు. తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా దీనిని పశువుల పండగగానే పరిగణిస్తారు. దీనికి సమయం, సందర్భం కూడా ఉంది. ఈ అమావాస్య నాటికి వ్యవసాయదారులందరు అన్ని రకాల వర్షాకాల పంటలను విత్తుతారు. ఎద్దులు అప్పటివరకు పనికి బక్క చిక్కిపోతాయి. ఈ అలసిపోయిన ఎద్దులకు వివిధ పానకాలు పోసి, నూనెలతో మర్దన చేసి స్వేచ్ఛగా పొద్దంతా మేత కోసం వదులుతారు. వ్యవసాయదారులకు ఎద్దులు, ఆవులే పూజనీయమైనవి. ఈ రోజున కొన్ని ప్రాంతాలలో చేసే తినే పదార్థాన్ని ‘పోలెలు’ అని వ్యవహరిస్తారు. వాటిని బెల్లం, పిండిలతో చేస్తారు. ఇవి మనుషులు తినడంతో పాటు పశువులకు కూడా తినిపిస్తారు.  


వినాయక చవితి (ఆగస్టు 31)

ఏ పని మొదలు పెట్టాలన్నా మొదటి పూజ వినాయకుడిదే. ఎటువంటి విఘ్నాలు రాకుండా చూస్తాడు కనుక ఆయనను ‘విఘ్నేశ్వరుడు’ అంటారు. దేవగణాలకు అధిపతిగా ‘గణపతి’ అయ్యాడు. ఈ వినాయకుడి జన్మదినాన్నే ప్రజలు వినాయక చవితిగా జరుపుకుంటారు. అది భాద్రపదమాసం శుద్ధ చవితిన. ఈ పండుగను ఇండ్లలో మాత్రమే కాకుండా బహిరంగ ప్రదేశాల్లో కూడా విగ్రహాలను నెలకొల్పి పూజలు చేస్తారు. ఇది నవరాత్రుల ఉత్సవం. ఈ పండుగ సందర్భంగా ప్రతిసారి లోకమాన్య బాల గంగాధర్‌ తిలక్‌కి ఒక నమస్కారం పెట్టుకోవల్సిందే. ఎందుకంటే ఈ పండుగను బహిరంగ ఉత్సవంగా మార్చి, ప్రేరేపించింది వారే. అప్పటి సందర్భం ఏదైనా కావచ్చు. ఇప్పటికీ అదొక ఐకమత్యానికి ప్రతీకగా నిలిచింది. హిందూ ధర్మప్రేరణ ఈ విధంగానైనా కొనసాగి ఊరేగుతుంది.

పౌరాణిక కథల ప్రకారం పార్వతీదేవి అభ్యంగన స్నానం చేయడానికి నలుగుపిండి సిద్ధం చేసుకొని ఎవరూ లోపలికి రాకుండా ఎవరైనా కాపలా ఉండాలనే తలంపుతో నలుగుపిండితో ఒక బొమ్మను చేసి దానికి ప్రాణం పోసింది. ప్రాణం పోసుకున్న ఆ బాలుడే వినాయకుడిగా రూపొందాడు. ఇందులో ఒక అంతరార్థం ఉంది. పార్వతిదేవి అనగా భూగోళంలో ఐక్యమైవున్న శక్తి స్వరూపానికి అధిదేవత. ఆమె శరీరంపై నలుగుపిండి అంటే ఇక్కడ ‘మట్టి’. కాబట్టి మట్టితోనే గణపతి తయారు చేయబడి ప్రాణం పోసుకున్నాడు. అందువల్ల పచ్చిమట్టితోనే వినాయకుడిని తయారు చేయడం పుణ్యప్రదం.  

ఈ పండుగ వెనక ఉన్న సమాజోపయోగకరమైన, ఆరోగ్యకరమైన విషయాలను గుర్తు చేసుకోవాలి. ఇంతకుముందు చెరువుల్లో మట్టిని తీసుకువచ్చి, ఆ మట్టిని పిసికి విగ్రహాలు తయారు చేసేవారు. అది ఆరోగ్యదాయకమైన మట్టి.  ఆ తయారు చేసిన విగ్రహాన్ని తొమ్మిది రోజులు పూజించి నదులలో వదిలి నిమజ్జనం చేస్తారు. నదులలో పారే నీటికి ఈ మట్టిద్వారా ఉపయోగకరం. అంతేకాదు తొమ్మిది రోజులపాటు 21 రకాల ఆకులతో పూజిస్తాం. ఆ ఆకులన్నీ ఔషధగుణాలు కలిగినవే. వర్షాకాలంలో వచ్చే అనారోగ్యాలను ఈ ఔషధగుణాలు గల ఆకులు దూరం చేస్తాయి. పూజించిన ఆకులన్నీ చివరకు వినాయకుడితో పాటు నదులలో, చెరువులలో వేయడం ద్వారా నీరు శుద్ధి కాబడుతుంది.

 మన భారతీయ సంప్రదాయంలో ఉన్న పండుగల పరమార్థం అంతా సూక్ష్మంగా పరిశీలిస్తే ప్రకృతితో అనుబంధం, కాలానుగుణంగా పాటించే ఆహార నియమాలు, శుద్ధి చేసుకునే దిశగానే ఉంటాయి. సమాజంలో అందరినీ కలుపుకుంటూ లోకక్షేమం కోసం జరుపుకునే ఉత్సవాలు మన జాతి ఔన్నత్యాన్ని నిలుపుతున్నాయి.