|

చదువుల తల్లికి ఆర్థిక సహాయం : మంత్రి కేటీఆర్‌ ఔదార్యం

ఆర్థిక స్థితి బాగోలేక డాక్టర్‌ చదువుకు దూరమయ్యే హైదరాబాద్‌లో నివాసముంటున్న గిరిజన విద్యార్థి అనూషకు ఆర్థిక సహాయం అందించి తిరిగి ఆమె డాక్టర్‌ కావడానికి దోహదపడ్డ మంత్రి కేటీఆర్‌ ఔదార్యాన్ని పలువురు ప్రశంసించారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 

నగరంలోని బోరబండ, మోతీనగర్‌కు చెందిన అనూష తమకు ప్రభుత్వం ద్వారా ఉపకార వేతనం అందుతుందనుకుని కిర్గిస్థాన్‌లో ఇంటర్‌నేషనల్‌ హయ్యర్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌లో ఎంబీబీఎస్‌ కోసం అడ్మిషన్‌ తీసుకుంది. కానీ ప్రభుత్వం ద్వారా సహాయం అందదని తెలియడంతో తమవద్ద కూడబెట్టుకున్న రూపాయలను మొదటి సంవత్సరం ఫీజు కింద చెల్లించింది. తల్లి, తండ్రి కూరగాయల వ్యాపారం చేసేవారు కావడంతో ఆమెకు పీజు చెల్లించే పరిస్థితులు లేకుండా పోయాయి. ఈ విద్యార్థిని ప్రతిభను చూసి ఆ కళాశాల యాజమాన్యం రెండు, మూడు సంవత్సరాలలో ఫీజు చెల్లించకున్నా అనుమతించింది. ఈ లోగా కరోనా విజృంభించడంతో ఆమె కిర్గిస్థాన్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చేసింది. ఈలోగా మొత్తం ఫీజు చెల్లిస్తేనే తాము పరీక్షలకు అనుమతిస్తామని కిర్గిస్థాన్‌ కళాశాల యాజమాన్యం తేల్చి చెప్పింది. ఫీజు చెల్లించలేక గిరిజన విద్యార్థిని డాక్టర్‌ చదువు ఆగిపోతున్న విషయం పత్రికల్లో రావడంతో అది మంత్రి కేటీఆర్‌ దృష్టికి వెళ్ళింది. 

వెంటనే స్పందించిన మంత్రి ఆ గిరిజన విద్యార్థిని అనుషను, వారి తల్లితండ్రులను పిలిపించి ఆమెకు రూ. 5లక్షల నగదు అందచేశారు. ఆమె చదువు కొనసాగడానికి అవసరమైన ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆమె వైద్యురాలిగా తిరిగి రావాలని మంత్రి ఆకాంక్షించారు. తమకు ఆర్థిక సహాయం చేసి తమ బిడ్డ చదువు కొనసాగేందుకు సహాయపడ్డ మంత్రి కేటీఆర్‌కు విద్యార్థిని అనూష, వారి తల్లితండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.