|

విద్యార్థుల్లో ఆనందం నింపిన సన్నబియ్యం బువ్వ

విద్యార్థుల్లో-ఆనందం-నింపిన-సన్నబియ్యం-బువ్వ--ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో పౌరులందరికీ సామాజిక, ఆర్థిక న్యాయం అందించే లక్ష్యంతో కృషి చేస్తున్నది. ‘బంగారు తెలంగాణ’ సాధన కోసం మానవీయ కోణంలో పలు పథకాలను ప్రవేశపెడుతూ వాటి అమలుకు చిత్త శుద్ధితో కృషి చేస్తున్నది. అందరికీ సమాన విద్యావకాశాలు కల్పించేందుకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించే దిశలో అడుగులు వేస్తున్నది. సామాజిక అంతరాలను పాఠశాల స్థాయిలోనే తొలగించి, ప్రతి ఒక్కరికి ఆర్థిక న్యాయాన్ని అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ మానవీయ కోణంలో ఆలోచించి తీసుకున్న నిర్ణయమే మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు సన్న బియ్యంతో వంట చేసి పెట్టాలని.

రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాల పిల్లల అభివృద్ధి, సంక్షేమం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉన్న చిత్తశుద్ధి, నిబద్ధతకు ఇది దర్పణం పడుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం పెట్టాలని నిర్ణయం తీసుకోవడమే కాక, 2015, జనవరి 1వతేదీ నుంచి పాఠశాలల్లో పక్కాగా అమలు చేస్తుండంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది.

అంతరాలను తగ్గించి అందరికీ సమాన విద్య

దేశ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో ఎక్కువ మంది బడుగు, బలహీన వర్గాలకు చెందిన పిల్లలే ఉన్నారు. వీరిలో చాలా మంది తల్లి దండ్రుల పేదరికం కారణంగా ఒక పూట కూడా సరిగ్గా భోజనం చేయలేని దుస్థితిలో ఉన్న వారే. రెండు పూటల భోజనం చేయగిలిగే వారిలో కూడా తమ పేదరికం కారణంగా రోజు వారీ భోజనంలో సరిపోయే పోషకాహారం తీసుకునే వారి సంఖ్య నామ మాత్రమే. వీరంతా తమ ఆకలి తీర్చుకునేందుకు భోజనం చేసే దుస్థితిలో ఉన్నారే తప్ప, సరైన పోషకాహారం తీసుకునే పరిస్థితి లేదు. ఈ స్థితిలో అనారోగ్యానికి గురవుతూ చదువును కొనసాగించలేని పరిస్థితి వారిది.

ఈ దుస్థితిని గుర్తించిన పలు సర్వేలు విద్యార్థులు తమ చదువును మధ్యలో ఆపి వేయడానికి పోషకాహార లోపం ఒక కారణమని, సంపూర్ణ అక్షర్యాసత సాధనకు పోషకాహార లోపం ప్రధాన అడ్డంకిగా మారిందని, దీని ప్రభావం దేశాభివృద్ధిపై పడుతోందని ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని ప్రవేశ పెట్టాలని ఆయా కమిటీలు సూచించాయి. అయినా అప్పటి ప్రభుత్వాలు స్పందించక పోవడంతో చివరకు భారత అత్యున్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు జోక్యంతో పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని 13 సంవత్సరాలుగా అమలు చేస్తున్నారు.అయితే మధ్యాహ్న భోజన పథకం అమలులో దొడ్డు బియ్యం వాడడం వల్ల పలు సమస్యలు ఎదురయ్యాయి. ఉడికీ ఉడకని అన్నంతో విద్యార్థులు సమస్యలను ఎదుర్కొన్నారు.పలు చోట్ల ముక్కిన బియ్యం సరఫరా అయ్యేవి. కొంచెం ఆర్థికంగా ఉన్న తల్లిదండ్రుల పిల్లలు పాఠశాలల్లో భోజనం చేయక పోవడం వల్ల మిగిలిన పిల్లల్లో తాము పేదరికంలో ఉన్నామనే ఆత్మన్యూనతా భావం ఏర్పడేది. ఇది వారి విద్యార్జనపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ అంతరాలను తొలగించేందుకు సమైక్య రాష్ట్రంలోని ప్రభుత్వాలు చొరవ చూప లేదు. ఫలితంగా సంపూర్ణ అక్షరాస్యత సాధనలో సామాజిక, ఆర్థిక అంతరాల ప్రభావాన్ని గుర్తించడంలో అప్పటి ప్రభుత్వ విధానాలు విఫలమయ్యాయి.

30 లక్షల మంది విద్యార్థులకు సన్న బువ్వ

రాష్ట్రంలో పాఠశాలలు ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, పాఠశాలలు
ప్రభుత్వ యాజమాన్యం కింద 4,494 ఉండగా, 6,06,499 మంది విద్యార్థులు, జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ యాజమాన్యాల కింద 24,706 పాఠశాలలు
ఉండగా 23,65,810 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ
మధ్యాహ్న భోజనం కింద సన్న బియ్యం బువ్వ అందుతుండడంతో
విద్యార్థుల్లో ఉత్సాహం, ఆనందం నెలకొంది.

తెలంగాణ ఆత్మగౌరవ పోరాటాన్ని ప్రారంభించిన కేసీఆర్‌ ఈ అంతరాల ప్రభావాన్ని ఉద్యమ ప్రస్థానంలోనే గుర్తించారు. ఉద్యమంలో భాగంగా విద్యార్థుల శిక్షణ శిబిరాలు నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఎలాంటి అంతరాలు లేని విద్యను విద్యార్థులందరికీ కేజీ నుంచి పీజీ వరకు అందించాలని నిర్ణయించారు. పల్లె నిద్ర, ఉద్యమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు విద్యార్థుల వసతి గృహాలలో నిద్రించడం, పాఠశాలలను సందర్శించడం వంటి కార్యక్రమాల ద్వారా వారు విద్యార్థుల బాధలపై సమర్పించిన నివేదికలను కేసీఆర్‌ అధ్యయనం చేశారు. అందులో భాగంగానే తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల ప్రణాళికలో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య హామీని ఇచ్చారు.

పేదలందరికీ కడుపు నిండా బువ్వ పెట్టాలనే లక్ష్యంతో ఆహార భద్రత కార్డులను ప్రవేశ పెట్టారు. ఇంతకు ముందు ఉన్న రేషన్‌ కార్డుల స్థానంలో ప్రవేశ పెట్టిన ఆహార భద్రతా కార్డుల ద్వారా ప్రతి వ్యక్తికి గతంలో ఇచ్చిన నాలుగు కిలోల బియ్యాన్ని ఆరు కిలోలకు పెంచారు. కుటుంబ సభ్యుల సంఖ్య అయిదుగురికి మించితే గతంలో గరిష్టంగా 20కిలోల బియ్యం మాత్రమే ఒక్క కార్డుపై ఇచ్చేవారు. దీని వల్ల పేద కుటుంబాలు ఇబ్బందులు పడేవి. మానవీయ కోణంలో ఆలోచించిన కేసీఆర్‌ ఎన్నికల్లో హామీ ఇవ్వక పోయినా ఒక వ్యక్తికి ఇచ్చే బియ్యాన్ని ఆరు కిలోలకు పెంచడమే కాక 20 కిలోల పరిమితిని ఎత్తి వేశారు.కుటుంబంలో ఎంత మంది ఉంటే అంత మందికి ఒక్కొక్కరికి ఆరు కిలోల బియ్యం చొప్పున ఆహార భద్రత కార్డుల కింద సరఫరా చేయాలని నిర్ణయించి ఆమేరకు పంపిణీనీ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మానవీయ కోణంలో స్పందించిన కేసీఆర్‌ చిన్నారులు చదివే పాఠశాలల్లో మధ్యాహ్నం పెట్టే బువ్వకు సన్న బియ్యం వినియోగించాలని నిర్ణయించారు. ఎన్నికల్లో ఈ హామీని ఇవ్వక పోయినా చిన్నారుల భవిష్యత్తుపై భరోసాను కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

schoolఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రాథమిక పాఠశాలల్లో ఒకటి నుంచి అయిదు తరగతుల విద్యార్థులకు ఒక్కొక్కరికి రోజుకు వంద గ్రాములు, ఆరు నుంచి పదో తరగతి వరకు ఒక్కొరికి 150గ్రాముల చొప్పున  రోజుకు 29,72,309 మంది విద్యార్థులకు 3,715.39 క్వింటాళ్ల బియ్యాన్ని కేటాయిస్తోంది. ఈ లెక్కన నెలకు (25రోజుల పని దినాలకు) 92,884.66క్వింటాళ్ల సన్న బియ్యంపై భారాన్ని ప్రభుత్వం భరిస్తోంది. అంతే కాక రాష్ట్రంలోని వివిధ రకాలైన సుమారు రెండువేల విద్యార్థి వసతి గృహాలలో కూడా సన్నబియ్యంతో మూడు పూటల బువ్వను వండి పెట్టడం తెలంగాణ ప్రభుత్వ మానవీయ కోణాన్ని ఆవిష్కరిస్తోంది.