మిషన్‌ కాకతీయ మొదటి దశ జయప్రదం

mission-kakatiyaశ్రీ శ్రీధరరావు దేశ్‌పాండే
మిషన్‌ కాకతీయ చెరువు పునరుద్దరణ పనులను గత ఏడాది మార్చి 12న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నిజామాబాద్‌ జిల్లా సదాశివనగర్‌ పాత చెరువులో ప్రారంభించారు. మిషన్‌ కాకతీయ పనులను అయిదు దశల్లో ఏదాదికి 20 శాతం చెరువును ఎంపికచేసుకొని పునరుద్ధరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశ పనులు జయప్రదంగా పూర్తి అయ్యాయి. డిసెంబర్‌ నుంచి రెండవదశ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది.
తెలంగాణా గ్రామీణ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక వికాసానికి అనాది ఆధారాలుగా ఉన్న గొలుసుకట్టు చెరువుల  వ్యవస్థ ఉమ్మడి రాష్ట్ర పాలనలో నిర్లక్ష్యం కారణంగా విధ్వంసం అయిపోయిందని తెలంగాణ సాధన ఉద్యమం సందర్భంగా ఎన్నోసార్లు ప్రస్తావనకు వచ్చింది. దక్కన్‌ పీఠభూమిలో నెలకొని ఉన్నఎగుడు దిగుడు భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగానే కాకతీయు, వారి తర్వాత ఈ ప్రాంతాన్ని ఏలిన కుతుబ్‌ షాహీు, అసఫ్‌ జాహీు, సంస్థానాధీశులు, స్థానిక భూస్వాములు తెలంగాణా ప్రాంతంలో వేలాది చెరువులను నిర్మించి వ్యవసాయ విస్తరణకు తోడ్పాటును అందించారు. ఆ నిర్మాణాలు తెలంగాణా ఆర్ఠిక, సామాజిక , సాంస్కృతిక వికాసానికి దోహదం చేసినాయని చెప్పాలి. తెలంగాణాలో వేలాది చెరువుల నిర్మాణం జరిగినందువలన ఈ ప్రాంతంలో కరువు కాటకాలు అరుదుగా వచ్చేవి. తెలంగాణా గ్రామాలు స్వయంపోషక గ్రామాలుగా విసిల్లినాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఎర్పడిన నాటికి తెలంగాణాలో రెవెన్యూ రికార్డు ప్రకారం 33,000 కు పైగా చెరువులు, కుంటలు ఉన్నట్లు, వాటి కింద 12 లక్షల ఎకరాలకు పైగా భూమి సాగులో ఉన్నట్టు తెలుస్తున్నది. తెలంగాణాలో చెరువులేని గ్రామం లేదంటె అతిశయోక్తి కాదు. ఒకటి కంటే ఎక్కువ చెరువు ఉన్న గ్రామాలు అనేకం ఉన్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో ఒక వైపు చెరువు విధ్వంసం, మరోవైపు కొత్త ప్రాజెక్టుల కింద పారకం అభివృద్ది కాక పోవడంతో తెలంగాణాలో వ్యవసాయ సంక్షోభం తారాస్థాయికి చేరుకున్నది. ఒకప్పుడు స్వయంపోషకంగా ఉన్న తెలంగాణా గ్రామాలు రైతు ఆత్మహత్యలకు నిలయంగా మారినాయి. కరువు కాటకాలు దరిజేరని పరిస్థితి తారుమారై కరవు కరాళ నృత్యం చేయడం మొదయ్యింది.

తెలంగాణా ప్రభుత్వం ఎర్పడగానే చెరువుల పునరుద్ధరణ కార్యక్రమానికి సంబంధించి ముఖ్యమంత్రి కె సి ఆర్‌. మేధోమధనాన్ని ప్రారంభించినారు. రోజుల తరబడి చర్చ జరిగింది. జులై 2014 లో మొదట చెరువులను లెక్కగట్టె పని జరగాలని తలంచి మైనర్‌ ఇరిగేషన్‌ సెన్సెస్‌ జరపాలని ఆదేశించినారు. వారం రోజుల సెన్సెస్‌ అనంతరం 10 తెలంగాణా జిల్లాల్లో తేలిన చెరువుల సంఖ్య 46,351, వాటి కింద 24.50 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నట్టు తేలింది. ఇందులో 100 ఎకరాలకు పైబడి ఆయకట్టు ఉన్న చెరువులు 38,411 వాటి కింద 20.46 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నట్టు తేలింది. అత్యధికంగా చెరువున్న జిల్లాలు  మెదక్‌, మహబూబ్‌ నగర్‌.

విచిత్రమైన విషయం ఏమిటంటే ఈ రెండు జిల్లాలు అత్యంత కరవు బారిన పడిన జిల్లాలు. 25 సెప్టెంబర్‌ 2014 న జె ఎన్‌ టి యూ ఆడిటోరియంలో దినమంతా ఇంజనీర్ల సదస్సు జరిగింది. ముఖ్యమంత్రి ఆ సదస్సులో స్వయంగా పాల్గొని ఇంజనీర్లకు దిశా నిర్దేశం చేసినారు. ఆ తర్వాత సాగునీటి మంత్రి హరీష్‌ రావు అధ్యక్షతన అరుగురు మంత్రులతో క్యాబినెట్‌ సబ్‌ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సబ్‌ కమిటీ తెలంగాణా మేధావులతో, సీనియర్‌ జర్నలిస్టులతో, సాగునీటి రంగ నిపుణులతో, పూడిక తీసివేత పనులపై అవగాహన ఉన్న ఫ్రీడమ్‌ సంస్థ , ఇతర ఎన్‌ జీ వో లను సంప్రదించింది. ఇక్రిసాట్‌ ప్రచురించిన పరిశోధనా పత్రాలను, ధన్‌ ఫౌండేషన్‌ వారు తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల అనుభవాలను రికార్డు చేసి ప్రచురించిన పాలసీ పత్రాలను అధ్యయనం చేసింది. అనంతరం ఒక సమగ్రమైన యాక్షన్‌ ప్లాన్‌ను సిద్ధం చేసి ముఖ్యమంత్రికి సమర్పించడం జరిగింది. సబ్‌ కమిటీ తయారు చేసిన యాక్షన్‌ ప్లాన్‌ కు ముఖ్యమంత్రి ఆమోద ముద్ర వేసినారు.

సబ్‌ కమిటీ సిఫారసు మేరకు మైనర్‌ ఇరిగేషన్‌ పాలనా వ్యవస్థను పటిష్టం చేసుకోవడం జరిగింది. కృష్ణా, గోదావరి బేసిన్‌ల కు ఇద్దరు చీఫ్‌ ఇంజనీర్‌ లను, 10 జిల్లాకు 10 సర్కిల్‌ (ఎస్‌ఇ) కార్యాలయాలను, 2 లేదా 3 అసెంబ్లీ నియోజక వర్గాలకు ఒక డివిజన్‌ (ఇ ఇ ) కార్యాలయాన్ని, ప్రతీ అసెంబ్లీ నియోజక వర్గానికి ఒక సబ్‌ డివిజన్‌ (డిఇఇ) కార్యాలయాన్ని , ప్రతీ మండలానికి ఒక సెక్షన్‌ (ఎఇఇ/ఎఇ) కార్యాలయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మైనర్‌ ఇరిగేషన్‌ లో అన్ని స్థాయిల్లో పేరుకుపోయిన ఖాళీల్లో ఇంజనీర్లను నియమించింది. అవసరమైనచోట అనుభవజ్ఞులైన రిటైర్డ్‌ ఇంజనీర్లను నియమించుకోవడానికి ప్రభుత్వం అనుమతించింది.
చీఫ్‌ ఇంజనీర్‌ స్థాయిలో ఉన్న అధికారులను జిల్లాకు ఒక నోడల్‌ అధికారిని పనుల పురోగతిని పర్యవేక్షించడానికి నియమించింది. మైనర్‌ ఇరిగేషన్‌ కోసం ప్రత్యేకంగా క్వాలిటీ కంట్రోల్‌ విభాగాన్ని ఏర్పాటు చేసింది. టెండర్ల ప్రక్రియలను సరళతరం చేసింది. రెండు నెలల కాలాన్ని 15 రోజులకు కుదించింది. స్థానిక కాంట్రాక్టర్లలకు అవకాశాలు కల్పించేందుకు వీలుగా క్లాస్‌ 5 కాంట్రాక్టర్ల అర్హతలను రు. 10 క్ష నుంచి రు. 50 క్షకు పెంచడం జరిగింది. ఇంజనీర్లకు సర్వే పరికరాలను, లాప్‌ టాప్‌లను సమకూర్చింది.

మొదటి దశలో 8212 చెరువులకు ప్రభుత్వం రూ.2500 కోట్లకు పరిపాలనా అనుమతులు  మంజూరుచేసింది. ఇందులో 7816 చెరువులకు సుమారు రూ.1400 కోట్లకు కాంట్రాక్టర్లతో పనుల ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది. 7350 చెరువుల్లో పనులను ప్రారంభించడం జరిగింది. చెరువు మట్టి కట్టలను వెడల్పు చేసి బలోపేతం చేయడం, చెరువుకట్టల మీద, చెరువుల లోపల పెరిగిన తుమ్మ చెట్లను, లొట్టపీసు చెట్లను, గుర్రపు డెక్క తదితర పిచ్చి చెట్లను తొగించడం, తూము, అలుగులను మరమ్మతు చేయడం, అవసరమైన చోట పునర్నిర్మాణం చేయడం, చెరువులకు నీటిని మోసుక వచ్చే కట్టు కాలువలను (ఫీడర్‌ చానల్స్‌)ను పునరుద్ధరించడం, పంట కాలువలను పునరుద్ధరించడం, చెరువు శిఖంను గుర్తించి రాళ్ళు పాతడం, చెరువు వద్ద హరిత హారంలో భాగంగా వేలాది ఈత, స్విర్‌ ఓక్‌, తదితర చెట్లను నాటడం జరిగింది.

చెరువు పునరుద్ధరణలో అత్యంత కీకమైన పని పూడిక తొగింపు కార్యక్రమం. ఇది రైతు భాగస్వామ్యంతో అద్భుతంగా జరిగింది. 2 కోట్ల 52 లక్షల 14 వేల ట్రాక్టర్‌ ట్రిప్పులతో పూడిక మట్టిని రైతు స్వచ్ఛందంగా తమ పొలాల్లోకి తరలించుకపోవడం జరిగింది. ఇది 6కోట్ల 53 లక్షల  37 వేల క్యూబిక్‌ మీటర్లతో సమానం. రైతు చాలా చోట్ల తమకు సరిపడినంత పూడిక మట్టి లభించలేదని షికాయతు చేసిన సంధర్భాలు, వారు పోరాడి అదనంగా పూడిక మట్టిని తరలించుకపోయినట్టు ఇంజనీర్లు సమాచారమిచ్చినారు.మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పూడిక మట్టిని తరలించుకపోవడానికి రైతు సుమారు 300 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టినట్టు అంచనా. ఇది నిజంగా అపూర్వం. ప్రజల భాగస్వామ్యంతోనే మిషన్‌ కాకతీయ కొనసాగిందనడానికి ఇది ప్రబలమైన దాఖలా.

ప్రభుత్వం ఆగస్ట్‌ నెలలో ప్రింట్‌, టివీ పాత్రికేయులను , సెప్టెంబరులో తెలంగాణా రచయితలు, కవులను మిషన్‌ కాకతీయ పనుల పరిశీలన కోసం కరీంనగర్‌, వరంగల్‌ , ఖమ్మం జిల్లాల పర్యటనకు తీసుకపోవడం జరిగింది. వారితోపాటు నేను కూడ పర్యటనలో ఉన్నాను. వారు స్థానిక ప్రజలతో, రైతులతో, సర్పంచులు ఇతర ప్రజా ప్రతినిధులతో మాట్లాడినారు. వారందరు చెరువుల పునరుద్ధరణ అద్భుతంగా సాగిందని, పూడిక మట్టిని తరలించుకున్న తమ పొలాల్లో పంట ఏపుగా పెరిగిందని, ఎరువు వాడకం తగ్గిందని, మత్స్యకారులు చేపల పెంపకం చేపట్టినారని, రజకులు బట్టలు ఉతకడానికి గ్రామంలో సౌకర్యం ఏర్పడిందని, గొర్లు మేకలకు, పశువులకు తాగునీటి సౌకర్యం ఏర్పడిందని, భూగర్భ జలాలు పైకి వచ్చినాయని, తమ అనుభవాలను వెల్లడించినారు. భూగర్భ శాఖ వారు కూడ ఈ విషయాన్ని ధృవీకరించినారు. తమ అధ్యయనంలో సరాసరి 1.5 మీ నుంచి 2 మీ దాకా భూగర్భ జలాలు  పైకి వచ్చినాయని వారు తెలియజేసినారు.

సెప్టెంబరు నెలలో రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షాలకు చెరువుల్లోకి నీరుచేరిందని సాగునీటి అధికారులు ప్రభుత్వానికి నివేదించినారు. ఇందులో పునరుద్ధరణకు నోచుకున్న చెరువులు కూడా ఉన్నాయి. పూడిక తీసిన చెరువుల్లో మునుపటికంటె నీటి నిలువ పెరిగినట్టుగా సమాచారం. నల్లగొండ జిల్లా నకిరేకల్‌ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పనులు ప్రారంభించిన చందుపట్ల పెద్ద చెరువులోకి చాలా ఏండ్ల తర్వాత నీరు చేరడంతో రైతు, గ్రామస్తులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేసెందుకు కూడా చెరువు పునరుద్ధరణ దోహదం చేస్తుందని సామాజికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.