రాష్ట్రంలో తొలి ప్రోటోటైప్‌ ఫైటర్‌ వింగ్‌

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆదిభట్లలో, యుద్ధ విమాన రెక్కల (ఫైటర్‌ వింగ్స్‌) తయారీ సంస్థ, టాటా లాక్‌హీడ్‌ మార్టిన్‌ ఏరోస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ (టీఎల్‌ఎంఏఎల్‌) దేశీయంగా తొలి ప్రోటోటైప్‌ ఫైటర్‌ వింగ్‌ షిప్‌సెట్‌ను విజయవంతంగా తయారు చేసింది. అత్యాధునిక టెక్నాలజీతో రూపొందిన ఈ ఫైటర్‌ వింగ్‌ను ఆదిభట్లలోని టీఎల్‌ఎంఏఎల్‌ కార్యాలయంలో ఇటీవల ప్రదర్శించింది.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటి, సమాచార సాంకేతిక శాఖ మంత్రి కె.తారక రామారావు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విమానయాన

ఉత్పత్తిలో తెలంగాణలోని ఏరోస్పేస్‌ సంస్థ అగ్రగామిగా నిలుస్తోందని అన్నారు. వైమానిక రక్షణ రంగ సంస్థలకు తెలంగాణ నిలయంగా మారుతోందని అన్నారు. హైదరాబాద్‌లో తయారైన 150వ సీ130జే విమానం తోక భాగాన్ని (ఎంపన్నేజ్‌ను) ఇటీవలే డెలివరీ చేసిన టీఎల్‌ఎంఏఎల్‌ తాజాగా ఫైటర్‌ వింగ్‌ను విజయ వంతంగా సర్టిఫై చేసి విడుదల చేయడం ఆ సంస్థ సామర్థ్యానికి నిదర్శనమని ప్రశంసించారు.

ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ రంగాల్లో తెలంగాణ గత ఐదేండ్లలో ఎంతో అభివృద్ధిని సాధించిందనడానికి ఇదే నిదర్శనమని చెప్పారు. ఈ ఫైటర్‌ వింగ్‌లో 70 శాతం దేశీయ పరికరాలనే ఉపయోగించారని, వాటిలో 16 హైదరాబాద్‌లో తయారైనవేనని తెలిపారు. రాష్ట్రంలోని పారిశ్రామిక అనుకూల విధానాలు, ఇక్కడ కల్పిస్తున్న మౌలిక సదుపాయాలే ఇలాంటి గొప్ప విజయాలకు దోహదపడు తున్నాయని చెప్పారు. టిఎల్‌ఎంఏఎల్‌తో లాక్‌హీడ్‌ మార్టీన్‌ భాగస్వామ్యం విజయవంతంగా ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు.

బ్రిటన్‌, అమెరికా, ఇజ్రాయెల్‌, ఫ్రాన్స్‌ తదితర దేశాలకు చెందిన ఒరిజినల్‌ ఎక్విప్‌మెంట్‌ మాన్యుఫ్యాక్చరర్లు తమ ఇంజినీరింగ్‌, తయారీ, శిక్షణ, ఇన్నోవేషన్‌ కేంద్రాల స్థాపనకు తెలంగాణను ఎంచుకోవడం ఇక్కడ ఎకోసిస్టం అభివృద్ధికి మరో కారణమని అన్నారు. ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ రంగాలకు అవసరమైన పరికరాలను సరఫరాచేసే వెయ్యికి  పైగా చిన్నతరహా పరిశ్రమలు తెలంగాణలో కొనసాగుతున్నాయని తెలిపారు. 2018, 2020లో పౌర విమానయానశాఖ మోస్ట్‌ ప్రోగ్రెసివ్‌ ఔట్‌లుక్‌ ఇన్‌ ఏరోస్పేస్‌ సెక్టార్‌ కింద తెలంగాణను బెస్ట్‌ స్టేట్‌ అవార్డ్‌తో సత్కరించిందని, 2020-21లో ఫైనాన్షియల్‌ టైమ్స్‌ కాస్ట్‌ ఎఫెక్టివ్‌నెస్‌ ర్యాంకింగ్స్‌లో తెలంగాణకు మొదటి ర్యాంకు లభించిందని మంత్రి కేటీఆర్‌ గుర్తుచేశారు.

లాక్‌హీడ్‌ మార్టిన్‌ వైస్‌ప్రెసిడెంట్‌ అమీ బర్నెట్‌  మాట్లాడుతూ, టీఎల్‌ఎంఏఎల్‌ త్వరలో ఫ్యూయల్‌ క్యారీయింగ్‌ 9జీ, 12,000 హోవర్‌ను తయారు చేయ బోతోందని, సాంకేతికంగా ఇవి అత్యంత సంక్లిష్టమైన ఏరోస్ట్రక్చర్లని అన్నారు. సీ-130జే ఎంపెన్నేజ్‌ అసెంబ్లీలకు ఏకైక అంతర్జాతీయ సోర్స్‌గా తమ సంస్థ సేవలు అందించనున్నదని, ఈ ఎంపెన్నేజ్‌లను అన్ని నూతన సూపర్‌ హెర్క్యులస్‌ విమానాల్లో అమరుస్తారని  వివరించారు. ఆ తర్వాత లాక్‌హీడ్‌ మార్టీన్‌ ఇంటిగ్రేటెడ్‌ ఫైటర్‌ గ్రూప్‌ స్ట్రాటజీ అండ్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అమీ బ్రూనైట్‌ మాట్లాడుతూ, టిఎల్‌ఎంఎఎల్‌ లాక్‌హీడ్‌ మార్టిన్‌ భాగస్వామ్యంతో సాంకేతికంగా అత్యంత క్లిష్టతరమైన ఏరోస్ట్రక్చర్స్‌ అయిన ఫ్యూయల్‌ క్యారీయింగ్‌ 9జి, 12000 హవర్‌, ఇంటర్‌ చేంజబుల్‌, రీప్లేసబుల్‌ ఫైటర్‌వింగ్‌ను నిర్మించే దిశగా అడుగులు  వేస్తున్నామని అన్నారు.

టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుకరణ్‌సింగ్‌ మాట్లాడుతూ.. ఫైటర్‌ వింగ్‌ షిప్‌సెట్‌ ప్రోటోటైప్‌ ప్రాజెక్టును పూర్తి చేయడాన్ని లాక్‌హీడ్‌ మార్టిన్‌, టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్‌ భాగస్వామ్యంలో కీలక మైలురాయిగా అభివర్ణించారు. హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ జనరల్‌ జోయల్‌ రీఫ్మాన్‌, ఎల్‌ఎం ఇండియా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ విలియం బ్లెయిర్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.