|

తొలి శతక కవయిత్రి శారదాంబ

By: పున్న అంజయ్య

తెలంగాణలో పూర్వం విద్యావ్యాసంగం లేనికారణంగా కొందరి సాహిత్యమంతా అజ్ఞాతంగానే అణగారిపోయింది. తెలుగు సాహిత్య చరిత్రలో విశేష పరిశ్రమ చేసి అజ్ఞాతంగా మరుగునపడిన కవులు, కవయిత్రులు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో  నేటి యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన బహుగ్రంథకర్త, ఆశుకవి ఏలె యల్లయ్య సిద్ధాంతి తర్వాత చెప్పుకోదగిన కవయిత్రి పున్న శారదాంబ. వీరికి ఏ విద్యాభ్యాసం లేకున్నా ఆశువుగా బతుకమ్మ పాటలు, మంగళ హారతులు, ఆధ్యాత్మిక కీర్తనలు, శతక పద్యాలు రాసి మరుగునపడిపోయారు.

చిన్ననాటి నుండి దైవభక్తి కలిగిన శారదాంబ ఎవరినుండైన ఆత్మ సంబంధమైన పద్యప్రబోధాలుగాని, పాటలుగాని విన్నచో అవి నేర్చుకొని పలువురికి వినిపించేవారు. రాగ రోగపీడితులైన వారికి మనశ్శాంతిని కలిగించే వారు. అలా ఆమె సన్నిధి కొందరు జిజ్ఞాసువులకు పెన్నిధిగా మారింది. ఈ విధంగా ఆమె మహిళా సమాజంలో ఆధ్యాత్మిక విద్యను బోధించేవారు. పురుషులతోపాటు సమానంగా స్త్రీ విద్య కొరవడిన నిజాం కాలంలోనే ఆమెలో సంస్కరణాభిలాష మొలకెత్తింది.

శారదాంబ జీవించినకాలం 1910 -1995. ఆమె తండ్రి రావీటి పరమేశ్వరశాస్త్రి విద్యావంతుడు. పంచాంగకర్త. వీరు ఎల్లంకిలో పరమేశ్వర గ్రంథమాలను స్థాపించి అనేక పుస్తకాలను ప్రచురించారు. వీరికి ‘కవితా విశారద’ అనే బిరుదు కూడా వుంది. వీరి కుమారులు రావీటి ఛండికేశ్వర సిద్ధాంతి, దత్త గణేశ్వర సిద్ధాంతి ఇద్దరూ ‘‘పద్మశాలి సోదరకవులు’’గా ప్రసిద్ధులు. పంచాంగకర్తలైన వీరు జ్యోతిష్యం, ఆశుకవితా రచనలో ప్రావీణ్యం కలిగినవారు. వీరు ఆనాటి ప్రధాన సమస్యలైన మద్యపానం, మిల్లు వస్త్రధారణ నిరోధించాలని కోరుతూ అనేక ప్రబోధ గేయాలు రాసి గుర్తింపు పొందారు.

శారదాంబ తన జీవితాన్ని బాల్యం నుండి ఆధ్యాత్మిక సేవకే అంకితం చేశారు, భాషాపటిమ తప్ప పాండిత్యం లేకపోయినా తన ఇష్టదేవతయైన ఆ శారదాదేవి కటాక్షంతో లభించిన కవితా ధోరణిలో తన పేరు మీద ‘శ్రీ శారద శతకం’ రచించి ధన్యులైనారు. అమ్మ వారి పేరు పెట్టుకున్న కవయిత్రి సార్థకనామధేయురాలు. ఆమె ఈ శతకం రచించి తన జన్మను చరితార్థం చేసుకున్నారు.

తెలుగు సాహిత్యంలో శతకం ఒక శక్తి వంతమైన సాహిత్య ప్రక్రియ. కవి తన భావాలను, అనుభవాలను ఛందోబద్ధంగా ప్రకటించే అలవాటును అలవర్చుకున్నప్పుడు తప్పని సరిగా శతకం రాయగలడు. శతక రచనలో ఉన్న స్వేచ్ఛ మరే ఇతర ప్రక్రియలలోనూ కవికి లేదు. ఆధ్యాత్మిక భావాలు వెళ్లి విరిసిన శారదాంబ భక్తి భావంతో ఈ శతక రచనకు పూనుకున్నారు. ఉత్పలమాల, చంపకమాల, మత్తేభ, శార్ధూల వృత్త పద్యాలు కలిగిన ఈ శతకంలో 106 పద్యాలు ‘శారదా’ అనే మకుటం కలిగివున్నాయి. ఇది ఒక భక్తి శతకం. శారదాంబ తన భక్తినీ ముక్తినీ, ఆత్మానుభూతిని, ఆవేదనను, భావనా వైవిద్యాన్ని ఈ శతకం ద్వారా వ్యక్తం చేశారు. ఇందులోని పద్యాలను శారదాస్తుతి రూపకాలుగా, అర్చన రూపంలో భావపూరితంగా పేర్కొనవచ్చును. అనర్గళమైన ధార, భక్తి భావం ప్రతి పద్యంలో కొట్టొచ్చినట్టు కన్పిస్తుంది, ఈ శతకాన్ని 1977లో శతావధాని సి.వి.సుబ్బన్న ఆవిష్కరించి కవయిత్రిని అభినందించారు. విశేషమేమంటే కవయిత్రి ఈ శతకాన్ని తన అరవై తొమ్మిదో ఏట రచించడం. అదే విషయాన్ని ఆమె తన 99వ పద్యంలో ఇలా చెప్పుకున్నారు.

ఆయుర్ధాయము చాలగాగడచె నర్వై తొమ్మిదిన్‌వత్సరాల్‌
చేయంగా గలదేమియున్నదిక నీచింతే గదా నిక్కమౌ
నీ యధ్యాత్మ విచారముందెలియగా నేతెంచు భక్తాళికిం
బాయం జేసెద కల్మషాధులన్‌ నీ మంత్రంబుచే శారదా.

నాణానికి రెండు వైపులా బొమ్మా బొరుసుల్లాగ శారదాంబ అటు ఆధ్యాత్మిక వేత్తగా, ఇటు సాహితీ వేత్తగా మనకు కన్పిస్తారు. ఆమె శారదా దేవి నామాన్ని జపిస్తూ నిత్యం స్తుతిస్తూ, భక్తితో పద్యాలు రాసి ఆ దేవి అనుగ్రహానికి పాత్రురాలైన ధన్యజీవి.

తాను ఏ ప్రబంధ కావ్యాలను చదవలేదని, వాక్చాతుర్యం లేదని, పాండిత్యం శూన్యమని, కవిత్వం చెప్పడానికి తగిన మార్గం లేదని క్రింది పద్యంలో ఎంతో నిజాయితీగా చెప్పుకున్నారు.

చదువన్‌ లేదు ప్రబంధ కావ్యములు వాక్చాతుర్యమా లేదుయే
పదజాలంబులు నోట బట్టవు యికన్‌ పాండిత్యమా శూన్యమిం
కెది మార్గంబు కవిత్వమున్‌ నుడువ నాకెట్లబ్బునో సాహసం
బదియే యొక్కటి నీ మహామహిమ నాపై జూపుటన్‌ శారదా!

ధర్మము దూరమై, అధర్మము అంతటా విస్తరించిందని, ఇనుప గజ్జెల తల్లి ఇంటింటా తిష్ట వేసిందని యదార్థ, వ్యధాభరిత దృశ్యాన్ని కొన్ని పద్యాలలో చక్కగా చిత్రీకరిస్తారు.

సమాజంలో ఎంతో మంది తనను పిచ్చిది అని గేలిచేసినా, అపహాస్యం చేసినప్పటికీ భయపడలేదని, భక్తిని వీడలేదని, తనలోని శక్తిని మేల్కొల్పాలని శారదా దేనిని కోరుకుంటారు.

ఈ లోకంలో కూటికి, గుడ్డకు ప్రాకులాడుతూ, తమో రజోగుణ సంబంధమైన మాటలతో ఏ మార్గము తెలియక వృధాగా కాలమంతా గడిపి చివరికి కాటికి సిద్ధమైన అజ్ఞానులను 23వ పద్యంలో హెచ్చరిస్తారు కవయిత్రి.

చావు పుట్టుకలు లేని జ్ఞానాన్ని పెద్దలైన వారి సన్నిధిని చేరి ఎప్పుడో ఒకప్పుడు పోవు జన్మ ఫలాన్ని తాను కనుగొన్నానని ఎంతో దిటవుగా, ధీమాగా చెప్పుకుంటారీ పద్యంలో.

నీదయ చేతనీ భువిని నేనొక మానవ జన్మమెత్తితిన్‌

నీదయ నిట్టి జన్మముననే యిక పుట్టుక చావులేని సం

పాదనగోరి పెద్దలగు వారల సన్నిథి జేరి యెప్పుడో

పోదగు యిట్టి జన్మ ఫల పూర్తిని నేగనుగొంటి శారదా!!

మొత్తం మీద ఈ శతకం లోని ఒక్కొక్క పద్యం ఒక్కో విశేషాన్ని కలిగివుంటుంది. గురుభక్తికి, దైవ భక్తికి, కవితాశక్తికి ఈ శతకం ఒక చక్కని నిదర్శనమని చెప్పవచ్చును. ఈ శతకం ద్వారా శారదాంబ తెలంగాణలోనే ఒక గొప్ప శతక కవయిత్రిగా నిలిచి పోయింది.