ఉద్యమంలో తొలి అడుగు

telangana1960-62 మధ్య కర్నూలు జిల్లాలోని దళిత కుటుంబానికి చెందిన దామోదరం సంజీవయ్యను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిని చేసినారు నీలం సంజీవరెడ్డి. నిజానికి తెలంగాణకు చెందిన సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు, హైదరాబాద్‌ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి, రెవిన్యూ మంత్రి అయిన కొండా వెంకట రంగారెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలనే సంకల్పంతో ప్రధాని నెహ్రూ గారు, నీలం సంజీవరెడ్డిని ఢిల్లీకి పిలిపించి జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు. కె.వి. రంగారెడ్డిని ఆంధ్రప్రదేశ్‌ రెండవ ముఖ్యమంత్రిగా నియమించాలని నీలంను నెహ్రూ ఆదేశించారు. కానీ హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత నీలం సంజీవరెడ్డి తెలంగాణకు చెందిన రంగారెడ్డిని సీఎంగా ప్రతిపాదించకుండా దళితుడైన దామోదరం సంజీవయ్యను ప్రతిపాదించారు. దళితుడు తొలిసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశానికి అడ్డుపడడం భావ్యం కాదని భావించి (ఒక వైపు ఢిల్లీ నుండి తనకు సీఎం బాధ్యతలు చేపట్టబోతున్నందుకు పలువురు కాంగ్రెస్‌ జాతీయనేతలు అభినందిస్తున్న తరుణంలో) కె.వి. రంగారెడ్డి గారు దామోదరం సంజీవయ్యను బలపరిచినారు. ఒకవేళ పోటీ జరిగినా ఆంధ్ర శాసనసభ్యులంతా సంజీవయ్యనే ఎన్నుకుంటారని నీలం సంజీవరెడ్డి ప్రచారం ప్రారంభించారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ నేతల గతి ఎలా ఉంటుందో ఈ సంఘటనతో వారికి అర్థమైంది. 1969 ఉద్యమ ప్రారంభంలో కె.వి. రంగారెడ్డి గారు ముందువరుసలో నిలిచారు. (కొద్ది రోజులకే ఆయన అమరులైనారు).

తెలంగాణ నేతలను తమ గుప్పిట్లో పెట్టుకోవడానికే హైదరాబాద్‌ కాంగ్రెస్‌ కమిటీని నీలం సంజీవరెడ్డి రద్దు చేసారు. సమితి ప్రెసిడెంట్‌ పదవి కావాలన్నా ఆంధ్రా నేతల అండదండలు కావాల్సి వచ్చింది తెలంగాణ నేతలకు! 1968 నాటికే ముల్కీ నిబంధనలను తుంగలో తొక్కి వేలాదిమంది ఆంధ్రా వారిని తెచ్చి తెలంగాణ ఉద్యోగాల్లో భర్తీ చేసారు. మరికొందరిని బదిలీ లేదా డిప్యుటేషన్‌పై తెలంగాణ పోస్టుల్లోకి తెచ్చారు. బహిరంగంగానే ముల్కీ నిబంధనలను మినహాయించాలని కోరుతూ ఐ.ఏ.ఎస్‌., ఐ.పి.ఎస్‌. అధికారులు తెలంగాణ మంత్రుల వద్దకే ఫైళ్ళు పంపేవారు. ఇలాంటి ఒక కేసు (ఎల్‌.డి.సి. బదిలీ)లో కొండా లక్ష్మణ్‌ బాపూజీ కార్మిక శాఖా మంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపాదన రాగా దీన్ని బాపూజీ వ్యతిరేకించారు. మంత్రిమండలి దృష్టికి తెచ్చిన పిదప ముఖ్యమంత్రి స్పందించి మూడు నెలల కాలంలో నాన్‌-ముల్కీ ఉద్యోగులను తొలగించాలని 1968 జూలై 10న మెమో ద్వారా వివిధ శాఖలను ఆదేశించారు. ఈ ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఆంధ్రలో అల్లర్లు చెలరేగడంతో ప్రభుత్వం వీటిని నిలిపివేసింది.

ఈ మాత్రం దానికే ఆంధ్ర శాసనసభ్యులు, మండలి సభ్యులు 1968 నవంబర్‌లో జరిగిన శాసనసభా, మండలి సమావేశాల్లో తీవ్ర విమర్శలు చేశారు. దీనితో ముఖ్యమంత్రి వివిధ రాజకీయ పక్షాల శాసనసభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి ఈ అంశంపై చర్చించారు. దీనిపై గౌతు లచ్చన్న మాట్లాడుతూ ”ఆంధ్ర ఉద్యోగులను తొలగించనక్కరలేకుండా ఆంధ్రప్రాంతంలో వారికి ఉద్యోగాలు కల్పించాలని అవసరమైతే ‘సూపర్‌ న్యూమరీ’ పోస్టులు సృష్టించాలని సూచించారు. ఈ సూచనను అందరూ ఆమోదించినా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి (ఆంధ్ర ప్రాంతీయుడు) దీన్ని గట్టిగా ప్రతిఘటించడంతో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే సమావేశం ముగిసింది.

తెలంగాణ అంతటా ఉద్యోగుల్లో, విద్యార్థుల్లో 1968 డిసెంబర్‌ నెలలో అసంతృప్తి పెరిగి ఆందోళనలు ప్రారంభమైనవి. ఖమ్మం జిల్లా పాల్వంచలోని థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలోని ఉద్యోగాలు ఆంధ్రప్రాంతం వారితో భర్తీ చేస్తున్నందుకు నిరసనగా 1968 డిసెంబర్‌లో ఉద్యోగులు నిరసన ర్యాలీలు నిర్వహించారు. జనవరి 6, 1969న ఖమ్మంలో రవీంద్రనాథ్‌ అనే విద్యార్థి (ఇటీవలె మరణించారు) తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించారు. మద్దతుగా తెలంగాణ అంతటా విద్యార్థులు, ఉద్యోగులు ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. ఈ ఉద్యమాన్ని అణచడానికి, ప్రక్కదారి పట్టించడానికి బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం ద్విముఖ వ్యూహాన్ని అనుసరించింది.

ఒకటి: పెద్దఎత్తున పోలీసులను మోహరించి విద్యార్థులను లాఠీలతో తీవ్రంగా కొట్టడం, నిర్భంధించడం, ఉద్యమాన్ని అణచివేయడం.

రెండవది: విద్యార్థుల్లో కొందరిని ప్రలోభాలకు గురిచేసి లోబర్చుకొని ఉద్యమాన్ని పక్కదారి పట్టించడం. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనూ సీఎం బ్రహ్మానందరెడ్డి కనుసన్నల్లో మెలిగే విద్యార్థుల బృందమొకటి తయారైంది. వీరు ఒక రోజు సీఎం ఆదేశాలతో ‘ఆంధ్రభూమి’, ‘దక్కన్‌ క్రానికల్‌’ కార్యాలయాలపై దాడిచేసి చీఫ్‌ సబ్‌ ఎడిటర్‌ రాయసం వీరభద్రశర్మపై భౌతికదాడి చేసి గాయపరిచినారు. శర్మ గుంటూరు జిల్లాకు చెందిన పాత్రికేయుడైనప్పటికీ తెలంగాణ ఉద్యమవార్తలను రాసేవాడు. ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నించేవాడు. దీన్ని సహించని బ్రహ్మానందరెడ్డి విద్యార్థులను శర్మపై ఉసిగొల్పి దాడి చేయించాడు. ఆంధ్ర పాత్రికేయ నేతల ఆధ్వర్యంలో వున్న ‘ఆం.ప్ర. వర్కింగ్‌ జర్నలిస్టుల యూనియన్‌’ శర్మపై జరిగిన దాడిని ఖండించలేదు. దీనికి నిరసనగా శర్మ సహచరులైన ఆదిరాజు, సంతపురి రఘువీర్‌రావు, ప్రతాప్‌ కిశోర్‌, మామిడి రమాకాంతరావు తదితర పాత్రికేయులు తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి పూనుకున్నారు. శర్మగారు సెలవుపెట్టి ఆంధ్ర జిల్లాల్లో పర్యటిస్తూ తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై సమావేశాలు పెట్టి విద్యార్థుల, మేధావుల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేశారు.

తెలంగాణ ఉద్యమం ‘రాజకీయ అసంతృప్తి నేతల సృష్టే’నని బ్రహ్మానందరెడ్డి పలుచన చేయాలని చూశారు. రోజు రోజుకూ తెలంగాణ ఉద్యమం తీవ్రమవుతుండడం చూసి కొందరు విద్యార్థులను చేరదీసి ‘తెలంగాణ ప్రయోజనకాల పరిరక్షణ’ (తెలంగాణా సేఫ్‌ గార్డ్స్‌) ఉద్యమాన్ని సీఎం ప్రారంభించారు. ఉస్మానియా విద్యార్థుల్లో సీఎం వర్గంవారు ”తెలంగాణ రక్షణలు” మరో ఐదేళ్ళు పొడిగించాలని కోరుతూ 16 జనవరి 1969 నుండి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. నిజానికి పెద్దమనుషుల ఒప్పందంలో ఇచ్చిన హామీలు, రక్షణలు ఏనాడూ అమలైంది లేదు. ఈ సందర్భంగా కొన్ని సంఘటనలు, ఆంధ్రనేతల ప్రవర్తన గురించి కొంత చెప్పాలి.

పెద్ద మనుషుల ఒప్పందంలో పేర్కొన్నట్లు ‘తెలంగాణా నుండి వచ్చే ఆదాయాన్ని, మిగులు నిధులను, తెలంగాణలోనే ఖర్చుచేయాలి. 1959నుండి ఆర్థికమంత్రిగా కొసాగిన కాసు బ్రహ్మానందరెడ్డి శాసనసభలో, బయటా పలుమార్లు ”ఆంధ్ర అభివృద్ధికోసం ఇకముందు తెలంగాణ నిధులను ఖర్చు పెట్టబోమని, ఈ ప్రాంత అభివృద్ధికే ఖర్చు చేస్తామని” ప్రకటించేవారు. మూడవ ప్రణాళిక ముగిసేనాటికి తెలంగాణకు చెందిన 12 కోట్ల సెక్యూరిటీలతో సహా తెలంగాణ మిగులు నిధుల మొత్తాన్ని, అంతాగాక అదనంగా 10-12 కోట్లు తెలంగాణ ప్రాంత అభివృద్ధిపై ఖర్చు పెడతామని ప్రభుత్వం ప్రకటించింది. ఆచరణలో మాత్రం ఇందుకు విరుద్ధంగా 1956నుండి 1968 దాకా ప్రతి ఏటా తెలంగాణ ఆదాయాన్ని ఆంధ్రకు మళ్ళిస్తూనే వచ్చారు. 1956 నాటికి తెలంగాణలో 4.49 కోట్ల మిగులు డబ్బు వుండగా ఆంధ్ర 2.29 కోట్ల లోటు బడ్జెట్‌ ఉన్నది. 1968 నాటికి సుమారు 63 కోట్లు తెలంగాణ మిగులు నిధులను ఆంధ్రకు మళ్లించినట్లు ఈ అంశంపై విచారించిన భార్గవ కమిటీ తేల్చింది. ఎకౌంటెంట్‌ జనరల్‌ లలిత్‌కుమార్‌ కమిటీ కూడా దాదాపు ఇంతే మొత్తం ఉన్నట్లు ధృవీకరించింది. ఇదే విషయమై ఒక శాసనసభ్యుడు శాసనసభలో బ్రహ్మానందరెడ్డిని ప్రశ్నించగా ”మీరడుగుతున్నది నా పాతకోట్ల గురించా? కొత్త కోట్ల గురించా? అని వెకిలిగా మాట్లాడడం తెలంగాణ ప్రాంత శాసనసభ్యులకు మంట పుట్టించింది.

సీఎం ఉస్మానియా విద్యార్థుల్లో కొందరితో ‘తెలంగాణ రక్షణల కొనసాగింపు’కై ఉద్యమాన్ని ప్రారంభించడం గమనించి మిగతా విద్యార్థులు ఇతర కాలేజీల విద్యార్థులను కూడగట్టి మల్లిఖార్జున్‌ సారథ్యంలో ‘యాక్షన్‌ కమిటీ’ని ఏర్పరచుకొని జనవరి 15, 1969నుండి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. ఆంధ్రానేతల పాలనలో ఏ రక్షణలూ తెలంగాణలో అమలు కావని ఈ విద్యార్థులకప్పటికే అర్థమైంది. రక్షణలు, హామీలపై భ్రమలు తొలగిపోయినందున తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో సమ్మె మొదలైంది.

మరోవైపు పైన తెలిపిన పాత్రికేయులతోబాటు పి.ఎన్‌. స్వామి, దేవులపల్లి ప్రభాకర్‌రావు, డా|| గోపాలక్రిష్ణ, ఇ.వి. పద్మనాభం (కౌన్సిలర్‌), మునీర్‌ జమాల్‌, కెప్టెన్‌ అన్సారీ తదితరులు తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి కార్యాచరణ రూపొదించాలని గౌలిగూడ, హైదరాబాద్‌లోని ‘తెలంగాణ వతన్‌దార్ల సంఘం’ కార్యాలయంలో జమై మదన్‌మోహన్‌ కన్వీనర్‌గా ”తెలంగాణ పీపుల్స్‌ కన్వెన్షన్‌”ను ఏర్పాటు చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జనవరి మూడవ వారంలో ‘తెలంగాణ రాష్ట్రం’ డిమాండ్‌ చేస్తూ హైదరాబాద్‌ మేయర్‌ రామ్మూర్తి నాయుడు, కౌన్సిలర్‌గా వున్న ఇ.వి. పద్మనాభం విద్యార్థులనుద్ధేశించి ప్రసంగించారు.

ఉద్యమ తీవ్రతను గమనించిన సీఎం బ్రహ్మానందరెడ్డి జనవరి 15, 16 తేదీల్లో పోలీసులను నిజాం కళాశాల విద్యార్థులపైకి ఉసిగొల్పి ఎందరో విద్యార్థుల తలలు పగులకొట్టించారు. ఎందరో విద్యార్థుల కాళ్ళు, చేతులు విరిగిపోయినవి. అయినా మరింత ఉత్సాహంతో తెలంగాణ కోసం విద్యార్థులు వీధుల్లోకి రావడం చూసి జనవరి 19న ‘అఖిలపక్ష సమావేశం’ నిర్వహించారు సీఎం బ్రహ్మానందరెడ్డి. ఈ సమావేశంలో తెలంగాణలో భర్తీ అయిన ఆంధ్ర ఉద్యోగులను ఆంధ్రకు పంపించాలని తెలంగాణ రక్షణలు కొనసాగించాలని నిర్ణయించారు. అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న తెలంగాణ మంత్రులు, శాసనసభ్యులు బ్రహ్మానందరెడ్డికి భయపడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌ను ముందుకు తేలేకపోయారు. ఆగ్రహించిన విద్యార్థులకు భయపడి తెల్లవారి నుండి పోలీసు ఎస్కార్టును పెట్టుకున్నారు తెలంగాణ మంత్రులు, శాసనసభ్యులు.

తెలంగాణలోని సుమారు 14వేల విద్యాసంస్థల్లో జనవరి 15వ తేదీనుండి విద్యార్థుల సమ్మె ప్రారంభమై కొన్ని నెలలు కొనసాగింది. ఏ విద్యార్థీ ఆ ఏడు పరీక్షలు రాయలేదు. వీరంతా ఒక విద్యా సంవత్సరాన్ని తెలంగాణకై త్యాగం చేశారు. అఖిలపక్ష సమావేశం నిర్ణయం ప్రకారం జీ.వో.నెం. 36/1969 విడుదలైంది. తెలంగాణలో భర్తీ అయిన సుమారు 25వేల మందిని నాన్‌ ముల్కీ ఉద్యోగులను ఆంధ్రకు పంపించాలని ఈ ప్రక్రియను 35 రోజుల్లోగా పూర్తి చేయాలని ఈ జీ.ఓ. సారాంశం. ఒకవైపు ఉత్తర్వులిచ్చిన ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి మరోవైపు తనను కలిసి, ఆంధ్రనేతలను ‘కోర్టులో ఈ ఉత్తర్వుల (జీ.ఓ.నెం. 36/69)ను ప్రశ్నించాలని ప్రోత్సహించారు.

(సశేషం)