తొలి మహిళా కమిషన్‌

ఆంగ్ల నూతన సంవత్సరం వేళ రాష్ట్ర మహిళాలోకానికి ఇది నిజంగా ఓ శుభవార్త. తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా కమిషన్‌ ఛైర్‌ పర్సన్‌ గా మాజీమంత్రి వాకిటి సునీతా లక్ష్మారెడ్డి నియమితులయ్యారు. రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత కూడా ఉమ్మడి కమిషనే మూడేళ్ళపాటు కొనసాగింది. తాజాగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర మొదటి కమిషన్‌ నియామకం జరిగింది.

తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం మహిళలకు రక్షణ, పూర్తి భద్రత కల్పించేందుకు దేశంలోనే తొలిసారిగా ఏర్పాటుచేసిన షీ టీమ్స్‌ వ్యవస్థ మహిళల ప్రశంసలందుకొంది. ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలచింది.ఇదేతరహాలో మహిళా సాధికారత సాధించడానికి, రాష్ట్రంలో ఏ ఒక్క మహిళా ఇబ్బందులకు గురికావద్దన్న లక్ష్యంతో రాష్ట్రప్రభుత్వం అనేక పథకాలకు శ్రీకారం చుట్టింది. కె.సి.ఆర్‌ కిట్టు, అంగన్‌ వాడీ కేంద్రాలు, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌, వితంతువులకు, ఒంటరి మహిళలకు, చేనేత కార్మికులకు, బీడీ కార్మికులకు పెన్షన్లు, బతుకమ్మచీరలు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆడపిల్ల పుట్టింది మొదలు వృద్ధాప్యం వరకూ దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు కాని అనేక సంక్షేమ పథకాలను మహిళల కోసం రాష్ట్రప్రభుత్వం విజయవంతంగా అమలుపరుస్తోంది.

సమాజంలో మహిళల స్థితిగతులను మెరుగుపరచడానికి, వారిపై ఏ విధమైన వేధింపులు, అక్రమాలు జరగకుండా, అటువంటి చర్యలను చట్టబద్ధంగా నిరోధించి, ఎదుర్కోవడానికి ఇప్పుడు ఏర్పాటుచేసిన రాష్ట్ర మహిళా కమిషన్‌ ఎంతో దోహదపడుతుంది. మహిళా సమానత్వం, వారిని గౌరవప్రదంగా చూసేందుకు సంబంధిత చట్టాలు అమలయ్యేలా చూడటం, ఉద్యోగ, ఉపాధిరంగాలలో మహిళలకు సమాన ప్రాతినిధ్యం కల్పించేలా చూడటం, మహిళా జైళ్ళు, వసతి గృహాలు, ఆశ్రమాలను పరిశీలించి అక్కడ మహిళలకు సరైన సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడటం, మహిళలనుంచి అందిన ఫిర్యాదులు, వారిపై జరుగుతున్న వేధింపులను పరిశీలించి, వారికి తగు న్యాయం జరిగేలా చూడంట ఈ మహిళా కమిషన్‌ ప్రధాన విధులు. గతంలో మూడు సార్లు శాసన సభ్యురాలిగా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖతో పాటు, పలుశాఖలకు మంత్రిగా వ్యవహరించిన సునీతా లక్ష్మారెడ్డిఇంతటి కీలకమైన పదవిలోరాణించ గలరనడంలో సందేహం లేదు. తొలి మహిళా కమిషన్‌ ఛైర్‌ పర్సన్‌ గా నియమితులవడం తన అదృష్టమని, ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌ తనపై నమ్మకంతో అప్పగించిన ఈ బాధ్యతలను సద్వినియోగం చేసుకొని, మహిళలకు సంపూర్ణ న్యాయం చేస్తానని సునీతా లక్ష్మారెడ్డి ప్రకటించారు. ఈమెతోపాటు కమిషన్‌ సభ్యులుగా మరికొంతమందిని కూడా ప్రభుత్వం నియమించింది. ఐదేళ్ళపాటు వీరు ఈ పదవులలో కొనసాగుతారు.

రాష్ట్ర మహిళా కమిషన్‌ నియామకంతో రాష్ట్రంలోని మహిళలందరికీ సంపూర్ణ న్యాయం చేకూరుతుందని ఆశిస్తూ, అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.