|

తెలంగాణ జాలరి చేతికి చిక్కిన ‘చేప’!

By: శ్రీ పిట్టల రవీందర్‌

‘‘ఆకలితో అలమటిస్తున్న వాళ్లకు చేపలుపట్టే విధానాన్ని నేర్పించడమే శాశ్వత పరిష్కారం’’ అనే సామెత చేపల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న చైనాదేశంలో బహుళ ప్రచారంలో ఉన్నది. స్వయం సమృద్ధిని సాధించే సందేశాన్నివ్వడానికి ప్రపంచవ్యాప్తంగా ఈ సామెతను విరివిగా వాడుతుంటారు. ఉమ్మడి రాష్ట్ర ఉనికి కాలంలో కనీసం ప్రస్తావనకు కూడా నోచుకోని తెలంగాణ మత్స్యరంగం కేవలం ఐదేళ్ల స్వల్పకాలవ్యవధిలోనే ఆ రంగానికి సంబంధించిన అనేక విషయాలలో అగ్రభాగానికి అధిరోహించగలగడం విమర్శకుల ఊహక్కూడా అంతుచిక్కని వాస్తవం!

‘‘ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం’’ సందర్భంగా ఒరిస్సా రాజధాని భువనేశ్వర్‌లో ‘జాతీయ మత్స్య అభివృద్ధి సంస్థ (ఎన్‌.ఎఫ్‌.డి.బి.) నిర్వహించిన ప్రత్యేక సమావేశం సందర్భంగా కేంద్రమత్స్యశాఖ మంత్రి నుండి తెలంగాణ మత్స్యశాఖ ఉన్నతాధికారులు సగర్వంగా అవార్డును స్వీకరించి భారతదేశ మత్స్యరంగంలో తెలంగాణ రాష్ట్ర విశిష్టతను చాటిచెప్పారు. దేశవ్యాప్తంగా ఉపరితల జలవనరులకు సంబంధించిన మంచినీటి చేపల ఉత్పత్తిలో అత్యున్నత ప్రమాణాలతో అత్యధికంగా చేపల ఉత్పత్తిని సాధించినందుకుగానూ కేంద్రప్రభుత్వం ఈ అవార్డును అందచేసింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు కాలంలో చేపల ఉత్పత్తిలో పదమూడవ స్థానంలో కొట్టుమిట్టాడిన మనప్రాంతం ఐదేళ్ల అనతికాలంలోనే దేశం మొత్తంలోనే అగ్రభాగానికి చేరుకోవడం ఆషామాషీ అంశం కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఏం ఒరిగిందంటు అకారణంగా ఈసడిరచుకునే అర్థజ్ఞానులకు తెలంగాణ మత్స్యరంగం సాధించిన ఫలితాలను పరిశీలిస్తే కనువిప్పు కలగకమానదు!

భారతదేశ మత్స్యరంగ చిత్రపటంలో కనీసం పేరు ప్రస్తావనకు కూడా నోచుకోని తెలంగాణ రాష్ట్రం గడచిన ఐదు సంవత్సరాల స్వల్పకాల వ్యవధిలోనే దాదాపు పది అంశాలలో ప్రథమస్థానంలో నిలిచి తన ప్రత్యేకతను నిరూపించు కున్నది. అందులో ముఖ్యంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు పరుస్తున్న ‘ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం’ దేశంలోని అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మానసపుత్రికగా 2016లో ప్రారంభించిన ఈ ‘ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం’ రాష్ట్రంలో మత్స్యరంగ అభివృద్ధికి వెన్నుముకగా నిలుస్తున్నది. ఈ పథకాన్ని అమలు పరచడం ద్వారా గడచిన ఐదు సంవత్సరాల కాలంలో సుమారు 15వేల కోట్ల రూపాయల విలువైన 14లక్షల టన్నుల అదనపు చేపలను ఉత్పత్తి చేయ గలిగారు. ఈ చేపలను వినియోగదారులకు అందించే క్రమంలో మరో 15వేల కోట్ల రూపాయల ఆదాయం చేపల విక్రయంలో సమకూరుతున్నది. అంటే… ‘ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం’ ద్వారా ఐదేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రంలోని మత్స్యకారకుటుంబాలకు 30వేల కోట్ల రూపాయల అదనపు ఆదాయం సమకూర్చగలగడం ఈ పథకం విశిష్టత.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న ‘ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం’ తోపాటుగా సుమారు వెయ్యికోట్ల భారీ రుణసేకరణతో అమలు పరిచిన ‘సమీకృత మత్స్య అభి వృద్ధి పథకం’ కూడా మత్స్య కారుల్లో విశ్వాసాన్ని, భరోసాను కల్పించగలిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయానికి మంచినీటి చేపల పెంపకానికి అనువుగా అందు బాటులో ఉన్న ఉపరితల జలవనరుల విస్తీర్ణంలో తెలంగాణ రాష్ట్రం దేశంలో మూడవ స్థానంలో నిలిచింది. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో ప్రతిష్టాత్మకంగా గోదావరి నదిపై నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులు, దానికి అనుబంధంగా అందుబాటు లోకి వచ్చిన జలాశయాలు, బ్యాక్‌ వాటర్స్‌, ‘మిషన్‌ కాకతీయ’ పథకం ద్వారా నిర్వహించిన చెరువుల పూడికతీత ఫలితంగా నీటినిలువ సామర్థ్యం పెరగడం, తదితర కార్యక్రమాల పర్యవసానంగా ఉపరితల జలవనరుల సామార్థ్యం విషయంలో మనరాష్ట్రం దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచింది. తెలంగాణ రాష్ట్ర సాధనకు పూర్వం చేపలపెంపకానికి అనువుగా 5.95 హెక్టార్లుగా ఉన్న నీటివిస్తీర్ణం ప్రస్తుతం 7,75,589 హెక్టార్లకు చేరుకున్నది. చేపలపెంపకానికి అనువుగా నీటివిస్తీర్ణం పెరగిన పర్యవసానంగా రాష్ట్రంలో చేపల ఉత్పత్తి సైతం గణనీయంగా పెరిగింది. దాదాపు 58సంవత్సరాల ఉమ్మడి రాష్ట్ర ఉనికికాలంలో తెలంగాణ లో గరిష్టంగా సంవత్సరానికి 2.64 లక్షల టన్నుల చేపలను ఉత్పత్తి చేయగలిగితే, రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కేవలం ఐదు సంవత్సరాల కాలంలోనే మన రాష్ట్రంలో 3,37 లక్షల మెట్రిక్‌ టన్నుల చేపలను ఉత్పత్తి చేయగలిగే స్థాయికి చేరుకున్నాము. ఫలితంగా మంచినీటి జలవనరుల చేపల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానాన్ని అధిగమించింది.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చర్యల ఫలితంగా రాష్ట్రంలో చేపల ఉత్పత్తి పెరుగుతుండటం, ఏడాది పొడవునా నీటిలభ్యత సౌలభ్యంగా ఉండటం, నీటి విస్తీర్ణం గణనీయంగా పెరగడం తదితర కారణాల ఫలితంగా రాష్ట్రంలో మత్స్యరంగం మీద ఆధారపడిన మత్స్యకార కుటుంబాల ఆదాయాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ఈ కారణంగా దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మత్స్యసహకార సొసైటీలలో సభ్యత్వం కోసం డిమాండు రోజురోజుకూ పెరుగుతున్నది. మత్స్యకారులకు ఐదులక్షల జీవితబీమా, ఉపాధి అవకాశాలను కల్పించగలిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అమలుపరుస్తున్న అనేక సబ్సిడీపథకాలు, తదితర కారణాలవల్ల యువతరంలో ఈ రంగంపట్ల మనరాష్ట్రంలో ఆసక్తి పెరుగుతున్నది. అందువల్ల మత్స్యసహకార సంఘాలలో సభ్యుల సంఖ్య గడచిన ఐదు సంవత్సరాల కాలంలో మనరాష్ట్రంలో విపరీతంగా పెరిగింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావకాలానికి 3,564 మత్స్యసహకార సొసైటీలు, 2,56,400 మంది సభ్యులుగా ఉన్న మత్స్యసహకార సంఘాల సంఖ్య గడచిన ఆర్థిక సంవత్సరాంతానికి 4,639 సొసైటీలుగా, 3,39,465 మంది సభ్యులకు చేరుకున్నది. సొసైటీలలో సభ్యులుగా ఉన్న ప్రతిఒక్కరికీ ఐదులక్షల బీమా సౌకర్యాన్ని ప్రభుత్వం అమలు పరుస్తున్నది. అందువల్ల మత్స్యసహకార సంఘాల విషయంలోనూ, వాటిల్లో సభ్యుల సంఖ్యలోనూ, మత్స్యకారులకు బీమా సౌకర్యం కలుగజేసే విషయాలన్నింటిలోనూ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలుస్తున్నది.

రొయ్యల పెంపకం విషయంలో ఇంతకాలంగా సాధారణ ప్రజల్లో నెలకొని ఉన్న అపార్థాలను తొలగించేరీతిలో తెలంగాణ ప్రభుత్వం మన రాష్ట్రంలో మంచినీటి రొయ్యల పెంపకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టి, విజయవంతంగా నిర్వహించింది. 2017-18 సంవత్సరంలో ప్రయోగాత్మకం గా కేవలం 11 రిజర్వాయర్లలో చేపట్టిన మంచినీటి రొయ్యల పెంపకం ఈ సంవత్సరం 200 నీటివనరులకు విస్తరించుకున్నది. 2021-22 సంవత్సరానికి గాను 25 కోట్ల రూపాయల ఖర్చుతో 10కోట్ల రొయ్యపిల్లలను రాష్ట్రంలో ఎంపికచేసిన నీటివనరుల్లో వదలడం ద్వారా సుమారు వెయ్యికోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చగలిగే ‘నీలకంఠ’ రొయ్యలను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా రొయ్యల పెంపకం ‘ఆక్వా కల్చర్‌’ పేరిట ఒక లాభసాటి వ్యాపారంగా పరిణమించిన ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే రొయ్యల పెంపకాన్ని సాంప్రదాయ మత్స్యకారులకు ఉచిత ఆదాయ వనరుగా తీర్చిదిద్దడం అనితరసాధ్యమే!

వ్యవసాయరంగంలాగానే మత్స్యరంగంలోనూ మహిళల పాత్ర చాలా కీలకమైనదనే వాస్తవాన్ని గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రంగంలో మహిళా సాధికారికతను సాధించే లక్ష్యంతో ప్రత్యేకంగా పలు కార్యక్రమాలను రూపొందించి అమలు పరుస్తున్నది. దేశంలోనే మొట్టమొదటిసారిగా 150 ‘ఫిష్‌ ఔట్‌లెట్‌’ లను ప్రత్యేకించి మహిళలకోసం కేటాయించారు. సుమారు 10లక్షల రూపాయల ఖర్చుకాగల ఈ పథకానికి గరిష్టంగా 60శాతం సబ్సిడీని అందిస్తూ కేపలం నాలుగు లక్షల రూపాయలను లబ్ధిదారులైన మహిళలు చెల్లిస్తే, మిగిలిన ఆరు లక్షల రూపాయలను ప్రభుత్వమే భరిస్తున్నది. ఈ పద్ధతిలో ఇప్పటికే 150 ప్రత్యేక వాహనాలను మహిళలకు ప్రత్యేకించి కేటాయించారు. మత్స్యరంగంమీద ఆధారపడి పనిచేస్తున్న మహిళా గ్రూపులకు సైతం రాష్ట్ర ప్రభుత్వం అమలుపరుస్తున్న ‘సమీకృత మత్స్య అభివృద్ధి పథకం’లో భాగంగా రెండులక్షల రూపాయల ‘రివాల్వింగ్‌ ఫండ్‌’ను 100 శాతం సబ్సిడీతో అందజేస్తున్నారు. మనదేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలుచేయని పద్ధతిలో మత్స్యరంగంలో మహిళల సాధికారికతను సాధించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాంటి ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టి అమలుపరుస్తున్నది.

ఒకవైపు సాంప్రదాయ మత్స్యరంగాన్ని, ఆ రంగం మీద ఆధారపడిన లక్షలాది మంది మత్స్యకార కుటుంబాలకు స్థిరమైన జీవనోపాధిని, ఆదాయ వనరులను అందుబాటులోకి శాశ్వతప్రాతిపదికన సమకూర్చే ప్రయత్నాలను ముమ్మరంగా నిర్వహిస్తూనే, మరోవైపున ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తున్న శాస్త్ర, సాంకేతిక, ఆధునిక విధానాలను సైతం తెలంగాణ జలసేద్యంలో అమలుపరిచేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలను చేస్తున్నది. గతంలో కేవలం మత్స్యసహకార సంఘాలకు, జలాశయాలలో గుర్తింపు పొందిన మత్స్యకార సమూహాలకు మాత్రమే అమలుపరిచిన ‘కేజ్‌కల్చర్‌’ విధానాన్ని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సైతం దేశంలోనే మొట్టమొదటి సారిగా 50శాతం సబ్సిడీని అందించి మన రాష్ట్రంలోని పలు జలాశయాలలో అమలుపరిచారు. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకువేస్తూ దేశంలోనే మొట్టమొదటిసారిగా సమీకృతపద్ధతిలో సుమారు 500 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో 600 కేజ్‌కల్చర్‌ యూనిట్లను ఏర్పాటు చేసే భారీ ప్రాజెక్టును తెలంగాణ రాష్ట్రంలో చేపట్టనున్నారు. ‘ఫిష్‌ ఇన్‌ ఇండియా’ అనే ప్రైవేటు కంపెనీ నిర్వహణలో రాజన్న` సిరిసిల్ల జిల్లాలోని మధ్య మానేరు జలాశయంలో ఏర్పాటు చేస్తున్న ఈ భారీ ప్రాజెక్టు ద్వారా యేటా 80వేల మెట్రిక్‌ టన్నుల చేపలను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. పూర్తిగా ప్రైవేటు భాగస్వామ్యంలో దేశంలోనే అతిపెద్దదిగా ఏర్పాటు చేసే ఈ భారీ ప్రాజెక్టులో భాగంగా చేపల దాణా ఉత్పత్తి కేంద్రం, చేప విత్తనాల ఉత్పత్తి నర్సరీలు, ఫిష్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను కూడా ఏర్పాటు చేయనున్నారు.

దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో చేపల పెంపకానికి అనువుగా ఉన్న సుమారు 28వేల చెరువులు, జలాశయాలు, ఇతర నీటివనరులను ‘జియో ట్యాగింగ్‌’ విధానం ద్వారా శాటిలైట్‌తో అనుసంధానం చేసే ప్రక్రియను తెలంగాణ రాష్ట్ర మత్స్యశాఖ పూర్తిచేసింది. ఈ విధానం ఫలితంగా ఆయా నీటివనరుల్లో నీటి నిలువ పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తదనుగుణంగా చర్యలు తీసుకోవడానికి వీలుకలుగు తుంది. ఇప్పటి వరకూ గ్రామ పంచాయతీ ఆధీనంలో ఉన్న సుమారు 25వేల చెరువుల్లో చేపల పెంపకానికి సంబంధించిన యాజమాన్య హక్కులను తెలంగాణ ప్రభుత్వం మత్స్య శాఖకు దఖలు పరచడంవల్ల గ్రామస్థాయిలో చెరువుల కేటాయింపుల విషయంలో రాజకీయ జోక్యానికి తెరపడి నట్టయ్యింది. ఇట్లాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న రాష్ట్రం తెలంగాణ మినహా ఈ దేశంలో మరొకటిలేదు. ప్రపంచ వ్యాప్తంగా సముద్రజలాలనుండి జరిగే చేపల ఉత్పత్తి పూర్తిగా తగ్గిపోయి, ఉపరితల జలవనరుల్లో చేపల పెంపకానికి సంబంధించిన ప్రాధాన్యత పెరుగుతున్న ప్రస్తుత కీలక సమయంలో నీటివిస్తీర్ణంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తున్న తెలంగాణ రాష్ట్రంలో మత్స్య రంగానికి సంబంధించిన భవిష్యత్తు దేదీప్యమానంగా వెలుగు తుందనే విశ్వాసాన్ని ఈ పరిణామాలు ప్రస్ఫుటం చేస్తున్నాయి. అందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అను సరిస్తున్న విధివిధానాలు దోహదం చేస్తున్నాయనడంలో సందేహం లేదు!

(వ్యాస రచయిత ‘తెలంగాణ ఫిషరీస్‌ సొసైటీ’ వ్యవస్థాపక అధ్యక్షులు, ‘దక్షిణ భారత మత్స్యకార కులాల ఐక్యవేదిక’ వ్యవస్థాపక కన్వీనర్‌. ‘వరల్డ్‌ అక్వా కల్చర్‌ సొసైటీ’ మరియు ‘ఏషియన్‌ ఫిషరీస్‌ సొసైటీ’లలో సభ్యులు…)