నాలుగు కలెక్టరేట్‌లను ప్రారంభించిన సీఎం కేసీఆర్

ప్రభుత్వ పరిపాలన అనేది ప్రజల కోసం జరిగేది, ఆ పరిపాలనను ప్రజలకు చేరువగా తీసుకెళ్లాలనే లక్ష్యంతోనే మునుపు పది జిల్లాలుగా వున్న మన రాష్ట్రంలోని జిల్లాలను మూడింతలకు పైగా పెంచి మొత్తంగా 33 జిల్లాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వంలో పనిచేసే అన్ని శాఖల అధికారులు ఒకేచోట ఉండేలా సీఎం కేసీఆర్‌ సమీకృత కలెక్టరేట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.నూతన భవనాలు ఉన్న హైదరాబాద్‌, నల్లగొండ, సంగారెడ్డి, కరీంనగర్‌ జిల్లాలు మినహా మిగతా 29 జిల్లా కేంద్రాల్లో నూతనంగా సమీకృత జిల్లా కలెక్టరేట్లు నిర్మించాలని అనుకోగా, ఈ పాటికే 15 జిల్లాల్లో కలెక్టరేట్ల నిర్మాణం పూర్తయింది. వాటిలో ఇప్పటికే 7 చోట్ల కార్యకలాపాలు కూడా ప్రారంభమయ్యాయి. ఆగస్ట్‌ నెలలో వికారాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, పెద్దపల్లి జిల్లాల కలెక్టరేట్లను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించారు. మరో రెండు కలెక్టరేట్లను ఈ నెల(సెప్టెంబర్‌)లో ప్రారంభించనున్నారు. ఇంకో 8 జిల్లాల కలెక్టరేట్ల నిర్మాణాలు చివరి దశకు చేరుకున్నాయి. మరో నాలుగు జిల్లాల్లో నిర్మాణ పనులు వివిధ కారణాల వల్ల ప్రారంభం కాలేదు. త్వరలోనే వీటి నిర్మాణ పనులను కూడా ప్రారంభించడానికి అధికారులు చర్యలు తీసుకొంటున్నారు.

పెద్దపల్లి జిల్లా…

దేశంలో బీజేపీ పాలనతో విసిగిపోయిన ప్రజలు తెలంగాణ పాలన దేశమంతా రావాలని కోరుకుంటున్నారని, 26 రాష్ట్రాల రైతులు తెలంగాణకు వచ్చి ఇక్కడి సంక్షేమ, అభివృద్ధి పథకాలు చూసి, వీటిని దేశమంతా అమలు పరచాలని, అది జరగాలంటే మీరు దేశానికి దిశానిర్దేశం చేసే వ్యక్తిగా నడుం బిగించాలని కోరుకుంటున్నారని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలిపారు. ఒక్క దగ్గరే 41 శాఖల కార్యాలయాలతో నిర్మించిన పెద్దపల్లి జిల్లా  కలెక్టరేట్‌ నూతన భవనాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. జాతీయ రాజకీయాలకు వెళదామా.. అని ప్రజలను ప్రశ్నించారు. దానికి ప్రజల నుంచి పెద్ద పెట్టున వెళదామనే సమాధానం వచ్చింది. 

గుజరాత్‌ మోడల్‌ పేరుతో మోదీ దేశప్రజలను మోసపుచ్చి అధికారంలోకి వచ్చారన్నారు. పేద ప్రజల సంక్షేమం పట్టించుకోకుండా, ఎన్‌పిఏల పేరుతో దోచిపెడుతున్నారని విమర్శించారు. తెలంగాణ వచ్చాక మనం ఎంతో అభివృద్ధి చేసుకున్నామన్నారు. అలాంటి అభివృద్ధి దేశమంతా జరగాలని సీఎం కోరుకున్నారు. ఇప్పుడు దేశంలో ఎంత గడ్డు పరిస్థితులు ఉన్నాయంటే గోధుమపిండి, నూకలకు కూడా కొరత ఏర్పడుతున్నదని, వీటిని దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి ఉందన్నారు. దేశంలో వ్యవసాయానికి అందించే విద్యుత్‌కు మీటర్లు పెట్టాలని కేంద్రం రాష్ట్రాలపై వత్తిడి తెస్తున్నదన్నారు. ఉచితాలు బంద్‌ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. కార్పోరేట్లకు దోచిపెట్టే బదులు ప్రజలకు ఉచితాలు ఇస్తే పోయేదేముందని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైన మేధావులు, బుద్దిజీవులు దేశంలో మతోన్మాద శక్తులు విజృంభించ కుండా, నెత్తుటి ధారలు పారకుండా అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. 

పెద్దపల్లి జిల్లాలో ఉన్న 266 గ్రామపంచాయతీలకు ఒక్కో గ్రామపంచా యతీకి రూ. 10 లక్షలు, మూడు మున్సిపాలిటీలకు, రామగుండం కార్పోరేషన్‌కు ఒక్కో కోటి రూపాయలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. పెద్దపల్లి ప్రాంతం ఎంతో చైతన్యవంతమైందని, ఇక్కడ ప్రజలు మనలను దగాచేసే దోపిడీ దొంగలను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. 

మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా..
ఉద్యమకాలంలో ఆశించింది – స్వరాష్ట్రంలో సాధించాం

మేడ్చల్‌ మల్కాజ్‌గిరి సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో కేసీఆర్‌ ప్రసంగించారు. ఈ మేడ్చల్‌, జిల్లా అవుతుందని  ఈ ప్రాంతంవాసులు ఎవరూ  కలలో కూడా ఊహించలేదు. అది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం  వల్లనే కలిగిన శుభ పరిణామం అంటూ ముఖ్యమంత్రి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. పరిపాలన అనేది ప్రజలకు ఎంతగా దగ్గరకు  వస్తే, పనులన్నీ అంత చక్కగా చేసుకునే అవకాశం వుంటుంది. ఈ మేడ్చల్‌ను జిల్లా చేసేటప్పుడు పెద్ద చర్చ జరిగింది,రంగారెడ్డి జిల్లాలో అంతర్భాగంగా ఉన్న మేడ్చల్‌ను ప్రజలకు పాలన చక్కగా సమకూరాలంటే, మేడ్చల్‌ జిల్లా ఏర్పాటు తప్పనిసరి అని చెప్పి ఈ నిర్ణయం తీసుకొన్నాం. దాంట్లో భాగంగానే తెలంగాణకు 33 జిల్లాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ రాష్ట్రంలో వున్న మొత్తం భూమిని లెక్కలోకి  తీసుకొని, దాన్నిక్లస్టర్‌లుగా విభజించి, ఒక్కో క్లస్టర్‌కు 5 వేల ఎకరాలు వుండేవిధంగా  ఏర్పాటు చేశాం. క్లస్టర్‌కొక వ్యవసాయాధికారిని నియమించు కున్నాం. రాష్ట్రంలోని రైతాంగం కోసం రైతు వేదికలను ఏర్పాటు చేయాలని భావించాం. అందుకనుగుణంగానే ఆరు నెలల లోపే స్థలాలను సేకరించి, 2,600 రైతు వేదికలను నిర్మించాం. ఇదంతా కూడా ప్రజలకు పరిపాలన చేరువ కావడం ద్వారానే సాధ్యమయ్యింది. అదే మాదిరిగా క్రీడా మైదానాలను ఏర్పాటుచేయాలని నిర్ణయించుకున్నాం కాబట్టి, 11 వేల మైదానాల ఏర్పాటు తుది దశకు వచ్చింది. ఇటువంటి అనేక సౌలభ్యాలు స్వరాష్ట్రం ఏర్పాటు వల్లనే  అందుబాటులోకి వచ్చాయి.

ఉద్యమకాలంలో ఏవైతే ఆశించామో.. స్వరాష్ట్రంలో వాటన్నింటినీ సాధించుకొన్నామని.. యావత్‌ దేశమే నివ్వెరపోయేలా పురోగమిస్తున్నామని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు అన్నారు. మన వనరులు మనకు దక్కడంతోపాటు ఆర్థికంగా ఎదిగామని చెప్పారు. నీచ రాజకీయాల కోసం కులం, మతం, వర్గం పేరుతో దేశాన్ని విడదీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇటువంటి తరుణంలో అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.

ఇచ్చిన మాట నిలబెట్టు కొంటూ 46 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నాం. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులకు మధ్యవర్తులెవరూ లేకుండా నిర్ణీత గడువులోగానే అన్ని పింఛన్లు  అందుతున్నయి. రాబోయే పది రోజుల్లో రాష్ట్రంలో వున్న పింఛనుదారులందరికీ కొత్త కార్డులను, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు అందజేయాలని ఆదేశించారు.

ఈ రోజు  24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్తు సరఫరా జరుగుతున్నది. మనం యింకా ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంటే ఈ కరెంటు వచ్చేదా? ఈ సంక్షేమం వచ్చేదా? పింఛన్లు వచ్చేవా? బియ్యం దొరికేదా? మంచినీళ్లు వచ్చేవా? చాలా అవస్థల్లో  ఉండేవాళ్లం. గత 75 ఏండ్ల నుంచి సాగుతున్న పరిపాలన, అసమర్థమైన, అవివేకమైన, లోపభూయి ష్టమైన విధానాల వల్ల దేశ ప్రగతి కుంటుపడ్డది. ఆదిలాబాద్‌ గోండు గూడెంలో, వరంగల్‌ లంబాడా తండాలో, హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో ఎక్కడైనా 24 గంటలపాటు కరెంటు ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఇది ఆషామాషీగా రాలే. గత పాలకులు ఎందుకియ్యలేదు. ఇవాళ ఎట్ల్ల ఇవ్వగలుగుతున్నాం ? ప్రజలకు మేలు చేయాలనే తపన కడుపుల ఉంటే, హృదయంతో పనిచేస్తే ఇవన్నీ సాధ్యమైతయి అని ప్రజలను జాగృతం చేశారు.

ఇపుడు ఏర్పడ్డ మేడ్చల్‌ జిల్లాలో గ్రామాలు తక్కువ. ఎక్కువ భాగం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఉంటది. సమస్యలు అనేకరకాలుగా వుంటయి. అందరు ఎమ్మెల్యేలకు ఇచ్చిన విధంగా గతంలో రూ.5 కోట్లు ప్రభుత్వం ఇచ్చింది. ఆ నిధులు సరిపోవడం లేదని మేడ్చల్‌ ఎమ్మెల్యేలు చెప్పారు. మేడ్చల్‌ పరిధిలోని ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు ఇచ్చిన నిధులకు అదనంగా రూ.10 కోట్ల నిధులను మంజూరు చేస్తున్నా. రోడ్లు, ఇతరత్రా అవసరాలకు ఎమ్మెల్యేలు ఆ నిధులను మంత్రి నేతృత్వంలో వినియోగించుకోవాలి అన్నారు. 

తెలంగాణ ధనిక రాష్ట్రమని ఉద్యమంలోనే నేను చెప్పిన. మన తెలంగాణ మనకు కావడంతోనే ధనిక రాష్ట్రంగ ఉంటామని చెప్పిన. చాలామంది నమ్మలే.కొందరు మూర్ఖులు తెలివి లేక కారుకూతలు కూస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక సౌష్టవాన్ని తెలుసు కోవాలంటే కొన్ని ప్రమాణాలు ఉంటయి. తలసరి ఆదాయం ఒక గీటురాయి. 2014లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.లక్ష. ఈ రోజు రూ.2,78,500. అంటే ఎన్ని రెట్లు పెరిగినం? మనకంటే ముందుగా ఏండ్లుగా ఉన్న రాష్ట్రాలు కూడా ఈ ప్రగతిని సాధించలేదు. ఎంతో క్రమశిక్షణతో, అవినీతి రహితంగా, చెప్పింది చెప్పినట్టుగా, అనుకొన్నది అనుకొన్నట్టుగా చేయడం వల్లనే ఇది సాధ్యమైంది అని ప్రజలకు తెలియచెప్పారు.  

తెలంగాణ రాష్ట్రం ఇదంతా ఎట్లా చేస్తున్నదని!  దేశమే నివ్వెర పోతున్నది.. ఈ దేశంలో అత్యుత్తమ జీతాలు తీసుకొంటున్న ఉద్యోగులు తెలంగాణలనే ఉన్నరు. కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు, రేషన్‌ బియ్యం.. ఇలా ఒకటేమిటి అనేక సంక్షేమ పథకాలను అత్యద్భుతంగా అమలు చేసుకొంటున్నం. ఈ రోజు వృద్ధులు సంతోషంగా ఉన్నరు. అంతకుముందు వృద్ధులను ఇంట్ల నుంచి వెళ్లగొట్టిన సంఘటనలు అనేకం. ఇవ్వాళ ముసలి వాళ్ల దగ్గర కూడా రూ.30 నుంచి 40 వేల వరకు డబ్బులు ఉన్నయి. ఇయ్యాల అత్తలను కోడండ్లు గౌరవిస్తున్నరు. ఇట్ల ఏ రాష్ట్రంలో కూడా లేదు. మన వనరులు మనకు దక్కినవి కాబట్టే ఆర్థికంగా పెరిగినం. 2014లో మన జీఎస్డీపీ రూ.5 లక్షల కోట్లు. ఇవాళ రూ.11.50 లక్షల కోట్లు. చాలా గొప్పగా ఆర్థికంగా పటిష్టపడ్డాం. అధికారుల అంకితభావం. ప్రజా ప్రతినిధుల చిత్తశుద్ధి, ప్రభుత్వ లక్ష్యశుద్ధి వల్లనే ఈ పురోగతి సాధించాం అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజలకు కూలంకషంగా వివరించి చెప్పారు. 

మన కలెక్టరేట్ల తీరుగా ఎన్నో రాష్ట్రాల్లో సెక్రటేరియట్లు కూడా లేవు. పోలీసు భవనాలను కూడా తీసుకొస్తున్నాం. దేశంలోనే  రెసిడెన్షియల్‌ స్కూళ్లను అత్యధికంగా  కలిగి వున్న రాష్ట్రం తెలంగాణే. కరోనా రాకపోయి ఉంటే మరో 500 గురుకులాలను ఏర్పాటు చేసుకునేవాళ్లం. దళితులు, గిరిజనులు, ముస్లింలు, బీసీల పిల్లలు అందరూ చక్కగా చదువుకుంటూ దేశమే ఆశ్చర్యపోయేలా సీట్లు సాధిస్తున్నారు. ఇటీవలే బీసీ గురుకులాలను పెంచాం. రాబోయే రోజుల్లో గురుకులాలను యింకా విస్తరిస్తాం. నేడు రాష్ట్రంలో ఎవరూ ఆకలితో అల్లాడిపోయే పరిస్థితులు లేవు. నాడు వలస పోయిన తెలంగాణ గ్రామాలకే నేడు 20 రాష్ట్రాల నుంచి దాదాపు 30-40 లక్షల మంది కార్మికులు వలస వచ్చి ఇక్కడ బతుకుతున్నరు. అంత గొప్పగా ఎదిగాం. ఉద్యమకాలంలో ఏదయితే కావాలని కోరుకున్నామో అది సాధించుకున్నాం.

తెలంగాణలో అంతకుముందు లేని కరెంటు ఎక్కడి నుంచి వచ్చింది? మన పక్కన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లో రాలేదు. ఆఖరికి దేశ రాజధాని ఢిల్లీలో కూడా కరెంటు రాదు. మన తెలంగాణలో వస్తదెట్లా? ఢిల్లీలో రాదెట్ల? తెలంగాణలో మంచినీళ్లు ఉంటయి ఎట్లా? ఢిల్లీ లో ఉండవెట్లా? తెలంగాణలో జరిగేది బయట ఎందుకు జరుగతలేదు? ఎందుకు జరగకూడదు? ఇక్కడ సాధ్యం అయినప్పుడు అక్కడ ఎందుకు కాదు? మన దేశంలో అపారమైన నదులు ఉన్నయి. అపారమైన సంపద ఉన్నది. కానీ అదంతా మన దేశానికి చెందకపోవటం దురదృష్టం. మన జాతీయ రాజకీయాల్లో కూడా గుణాత్మక మార్పు రావాలి. ఇక్కడ నేను ఎవరినీ ఉద్దేశించి మాట్లాడటంలేదు. మీరందరూ అర్థం చేసుకోవాలని కోరుతున్న. అయితే  ఇక్కడ ఉన్నదాన్ని కూడా చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నరు కొందరు. మనం కష్టపడి చెమటోడ్చి అందరం ఒక్కమాట మీద ఉండి ఐకమత్యంతో సమకూర్చుకున్నదాన్ని, చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నరు. దీని గురించి మీరందరూ విచారం చేయాలె. ఒక్కసారి మోసపోతే గోసపడే ప్రమాదం ఉంటది.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలె. ప్రతి గ్రామంలో, ప్రతి బస్తీలో, ప్రతి వాడలో, ప్రతి ఇంటిలో చర్చ జరగాలె. నిజమేందో, అబద్ధం ఏందో తెలుసుకోవాలె. జాగ్రత్తగా ఉంటెనే మన సమాజాన్ని మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోగలుతం. మేడ్చల్‌ జిల్లా  బ్రహ్మాండమైన  చైతన్యం ఉన్న జిల్లా. వ్యవసాయం, కార్మికులు, ఫ్యాక్టరీలు కలగలిసి ఉన్న జిల్లా. అందరూ ఐకమత్యంతో ఉండి రాష్ట్ర ప్రగతికి దోహదపడుతున్నట్టే దేశ రాజకీయాల్లో కూడా ప్రభావం చూపే విధంగా ఐకమత్యంతో, చైతన్యంతో ముందుకు సాగాలె. ఎవడో వచ్చి ఏదో చెప్తడు. ఆ నిమిషానికి తమాషా అనిపిస్తది. కానీ ఫలితాలు దుర్మార్గంగా ఉంటయి. మనం ఏ మాత్రం పొరపాటు చేసినా చాలా గోస పడ్తం. ఇప్పటికే 58 ఏండ్లు దగా పడ్డం. ఇప్పుడిప్పుడే ఒక దరికి వస్తున్నం. ఈ శాంతిని, సుఖాన్ని కాపాడుకోవాలె. మన కరెంటు, మన నీళ్లు, మన ప్రాజెక్టులు, మన కాల్వలు అన్నీ మన ఆస్తులు. వీటిని రక్షించుకోవాలి. ఇంకా పెంపొందించుకోవాలె. భవిష్యత్తు తరాలకు అందించాలె. దేశంలోనే తెలంగాణ సముజ్వలంగా ముందుకు పోవాలె. మీరందరూ చైతన్యంతో ముందుకు పోవాలని, రాష్ట్ర ప్రగతికి దోహదపడాలని అందరినీ కోరుతున్నా అని ఆ జిల్లా వాసులనే కాదు యావత్‌ రాష్ట్రప్రజానికం తెలుసుకోవాలని ఉద్భోధించారు.

సమాజం చైతన్యవంతమైనదై వుంటే.. రాష్ట్రం, దేశం పురోగమిస్తది. లేకుంటే దెబ్బ తింటది. ఒక బంగ్లా కట్టాల్నంటే చాలా కష్టమైతది. కూలగొట్టాల్నంటే పటపటా జేసీబీలు పెట్టి కూలగొట్టొచ్చు. దేశాన్ని కుల మతాల పేరుమీద నీచ రాజకీయాల కోసం విడదీసే ప్రయత్నం జరుగుతావున్నది. ఇది ఏ రకంగా చూసినా మంచిది కాదు. ఎందరో త్యాగాలు చేసి తెచ్చిన స్వతంత్రాన్ని మనం అనుభవిస్తున్నాం. స్వతంత్ర ఫలాన్ని పూర్తిగా పొందాలంటే.. దేశంలో కుల, మత, వర్గ భేదాలు లేని భారతీయ ఐక్యత మనలో రావాలి. సమాజంలో విద్వేషం పెచ్చరిల్లిందంటే మళ్లా ఏకం కావడం అంత సులభం కాదు. కాబట్టి అవన్నీ పక్కన పెట్టి ఏ విధంగా చైనా, సింగపూర్‌, కొరియా దేశాలు పురోగమించాయో.. ఆ విధంగా భారతీయులందరం కుల, మత రహితంగా బ్రహ్మాండంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉన్నది అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజలకు చైతన్యవంతులుగా మెలగాలని చెప్పారు.

రంగారెడ్డి జిల్లా…
తెలంగాణలో భూములు బంగారం – కేసీఆర్‌

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని కొంగరకలాన్‌లో నిర్మించిన రంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టరేట్‌ సముదాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించారు. కొంగరకలాన్‌లోని సర్వే నంబర్‌ 300లో 44 ఎకరాల్లో రూ. 58 కోట్ల వ్యయంతో మూడు అంతస్తుల్లో, వందకు పైగా విశాలమైన గదులతో కలెక్టరేట్‌ సముదాయాన్ని నిర్మించారు. కలెక్టరేట్‌ ప్రారంభోత్సవం సందర్భంగా సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగసభలో సీఎం ప్రసంగించారు. 

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగితే భూముల ధరలు తగ్గిపోతాయని ఆంధ్రా పాలకులు భయపెట్టారని, ఇప్పుడు తెలంగాణ భూములు బంగారంగా మారాయని, ఎకరం ధర కోట్లకు పడగెత్తిందని, ఇందులో రంగారెడ్డి జిల్లా అగ్రస్థానంలో ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. ఇదంతా తెలంగాణ రాష్ట్రం రావడం వల్లనే జరిగిందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగి అభివృద్ధిలో దూసుకుపోతుంటె కొందరు ఓర్వలేక పోతున్నారన్నారు. అలాంటి వారి ఆటలు సాగనివ్వమని, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం కానివ్వనని ముఖ్యమంత్రి తేల్చిచెప్పారు. ఈ రాష్ట్రాన్ని కాపాడేందుకు సర్వశక్తులను ధారపోస్తాను. నా బలం, బలగం ప్రజలే. మీ అండదండలు, ఆశీర్వచనం ఉన్నంత వరకు తనకేం కాదని సీఎం కేసీఆర్‌ భరోసా వ్యక్తం చేశారు. 

ఒక ఇల్లు కట్టాలంటే చాలా సమయం ఏర్పడుతుందని, రాష్ట్రం ఏర్పడాలంటే చాలా సంవత్సరాలు పడుతుందని అన్నారు. ప్రాజెక్టు కట్టాలంటే ఎన్నో వ్యయ, ప్రయాసలకు ఓర్చి, శ్రమపడి కట్టాల్సి ఉంటుంది, కానీ వాటిని కూల్చాలంటే ఎంతో సమయం పట్టదు. మూఢనమ్మకాల పిచ్చితో, ఉన్మాదంతో అభివృద్ధిని, ప్రశాంతతను భగ్నం చేసుకోవద్దని ఆయన ప్రజలను హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండి ఇలాంటి సంఘ విద్రోహశక్తులను పారద్రోలాలన్నారు. బెంగళూరు సిటీ సిలికాన్‌ వ్యాలీ ఆఫ్‌ ఇండియాగా పేరొందింది. అక్కడి ప్రభుత్వాలు చాలా కష్టపడి ఒక వాతావరణాన్ని నిర్మాణం చేశారు. 30 లక్షల మందికి ఐటీలో ప్రత్యక్షంగా ఉద్యోగాలు దొరకుతున్నాయి. 

ఇలా మనకంటే కూడా ముందున్న బెంగుళూరులో ఈ సంవత్సరం మన కంటే తక్కువ ఉద్యోగాల కల్పన జరిగింది. తెలంగాణ ఒక లక్షా 55 వేల ఉద్యోగాలు ఇచ్చింది. కానీ బెంగళూరులో ఈ ఏడాది మనకంటే కూడా ఏడెనిమిది వేల ఉద్యోగాలు తగ్గిపోయాయన్నారు. అందుకు కారణం అక్కడ హిజాబ్‌ అని ఘర్షణలు జరిగి, శాంతిభద్రతలకు విఘాతం వాటిల్లిందన్నారు. అక్కడ వాతావరణాన్ని కలుషితం చేశారు. అలాంటి వాతావరణం తెలంగాణలో, హైదరాబాద్‌లో రావాలా? మన పిల్లలకు ఉద్యోగాలు రాకుండా పోవాలా? ఆలోచించాలని కేసీఆర్‌ ప్రజలను కోరారు. తెలంగాణ సమాజం ప్రశాంతంగా ఉంది. అద్భుతమైనటువంటి ప్రశాంత వాతావరణంలో అభివృద్ధి జరుగుతుంది. ఈ దుర్మార్గులు, చిల్లరగాళ్లు, మత పిచ్చిగాళ్ల మాయలో పడొద్దని కేసీఆర్‌ సూచించారు.. రంగారెడ్డి జిల్లా అభివృద్ధికి ఎమ్మెల్యేలకు అదనంగా నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. 

ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్‌ రెడ్డి, ఎంపీ రంజిత్‌ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, కలెక్టర్‌ అమయ్‌ కుమార్‌లతో పాటు మహేశ్వరం, కల్వకుర్తి, షాద్‌నగర్‌, రాజేంద్రనగర్‌, చేవెళ్ల, ఎల్బీనగర్‌ నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు నాయకులు పాల్గొన్నారు.

వికారాబాద్‌ జిల్లా…

వికారాబాద్‌లో రూ. 60.70 కోట్లతో కొత్తగా నిర్మించిన సమీకృత జిల్లా కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. జిల్లా సమీకృత కలెక్టరేట్‌ వద్దకు చేరుకున్న సీఎం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, కలెక్టరేట్‌ను ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్‌లో ప్రత్యేక పూజలుచేశారు. ఈ సందర్భంగా చాంబర్‌లోని కుర్చీలో కలెక్టర్‌ నిఖిలను కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వికారాబాద్‌కు మంజూరైన మెడికల్‌ కాలేజీ భవన నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత బహిరంగ సభా వేదికపైకి చేరుకున్న సీఎం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. 

వికారాబాద్‌ ప్రాంతానికి సాగునీరు అందించే పాలమూరు`రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్రం మోకాలడ్డుతున్నదని సీఎం విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తెలివి తక్కువతనం వల్ల, నిర్ణయం తీసుకోలేని నిష్క్రియాపరత్వం వల్ల వికారాబాద్‌కు కృష్ణా నీళ్లు రావడం ఆలస్యం అవుతున్నదన్నారు. కేంద్రం ఎన్ని అడ్డంకులు పెట్టినా నేను ధైర్యంగా ముందుకు వెళుతున్న. తప్పకుండా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కడతం. వికారాబాద్‌, తాండూరు, పరిగి, చేవెళ్ల నియోజకవర్గాల్లో నాలుగు లక్షల ఎకరాలకు నీళ్లు తెచ్చి మీకు అప్పగిస్త్త. ఇక్కడ పొలాల్లో కృష్ణా నది నీళ్లు పారించి చూపిస్త. నేను మాట ఇస్తున్నా అని కేసీఆర్‌..ప్రజలకు బరోసా ఇచ్చారు. 

రాష్ట్రంలో మనం ఎంత బాగున్నా, కేంద్ర ప్రభుత్వం బాగాలేకపోతే ఆశించిన అభివృద్ధి కాదు. కేంద్రంలో రాష్ట్రాల హక్కులను గౌరవించే, ప్రజల సంక్షేమాన్ని చూసే ఉత్తమమైన ప్రభుత్వం రావాలి. ఆ దిశగా మనం సిద్ధం కావాలి. మనందరం ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపి, మంచి ప్రజల ప్రభుత్వాన్ని తెచ్చే క్రతువులో భాగస్వాములం కావాలని పిలుపునిచ్చారు. కేంద్రం కల్లబొల్లి కథలు చెప్పడం తప్ప చేసిందేమీ లేదన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలో కొంత సంక్షేమానికి చర్యలు తీసుకొంటుంటే అడ్డు పడుతున్నరు. వ్యవసాయ స్థిరీకరణ కోసం రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు పెడితే.. ఇవి ఉచిత పథకాలంటూ రద్దు చేయాలని సన్నాయి నొక్కులు నొక్కుతున్నరు. కరెంటు మీటర్లు పెట్టి రైతుల మెడమీద కత్తి పెట్టి బిల్లులు వసూలు చేయాలని చెప్తున్నరని కేంద్ర ప్రభుత్వ తీరును ఆయన దుయ్యబట్టారు.

పాలమూరును ఆపిందెవరు?

‘అయ్యా మేం కరువులో ఉన్నం. బాధలో ఉన్నం. మాకు ఎన్ని నీళ్లు ఇస్తరో చెప్పండి.. దాని ప్రకారం ప్రాజెక్టులు కట్టుకొంటమని ప్రధానిని అడిగితే కాలికి పెడితే మెడకు.. మెడకు పెడితే కాలికి అన్నట్టు చేస్తున్రు.  పాలమూరు`రంగారెడ్డి ప్రాజెక్టును కేంద్రం ఆపుతున్నది. దీనిపైన మనమంతా నిలదీయాలి. వికారాబాద్‌ జిల్లా బీజేపీ అధ్యక్షుడిని, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని నేను అడుగుతున్న.. దమ్ముంటే ఢిల్లీకి పోయి ‘కృష్ణా నదిలో నీళ్ల వాటా తేల్చండని అన్నారు. కేంద్రం వల్లనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఆలస్యం అవుతున్నది. వికారాబాద్‌ జిల్లాకు నీళ్లు వస్తలేవు. ఆ విషయం త్వరగా తేల్చండి’ అని రాష్ట్ర బీజెపి నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. రాష్ట్ర హక్కుల కోసం పోరాడాలని ఆయన బీజేపి నాయకులకు పిలుపునిచ్చారు. 

ఈ కార్యక్రమాల్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్‌రెడ్డి, పీవీ వాణీదేవి, కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, బొగ్గారపు దయానంద్‌, జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ పట్నం సునితారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, వికారాబాద్‌, పరిగి, తాండూరు, కొడంగల్‌, చేవెళ్ల ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్‌, కొప్పుల మహేశ్‌రెడ్డి, పైలట్‌ రోహిత్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, కాలె యాదయ్య, సీఎంవో కార్యదర్శి స్మితా సభర్వాల్‌, బీసీ కమిషన్‌ సభ్యుడు శుభప్రద పటేల్‌, డీసీసీబీ చైర్మన్‌ బుయ్యని మనోహర్‌రెడ్డి, పర్యాటక అభివఅద్ధి సంస్థ ఛైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌గుప్త, జడ్పీ వైస్‌ ఛైర్మన్‌ బీ. విజయ్‌కుమార్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ మురళీకఅష్ణ, డీసీఎంఎస్‌ ఛైర్మన్‌  కృష్ణారెడ్డి, వికారాబాద్‌, తాండూరు మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌లు మంజుల, స్వప్న పరిమళ్‌, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.